Saturday, March 23, 2024

పాదాభివందనం - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ -24 మార్చ్ 2024

గౌరవాన్ని ప్రదర్శించడంలో చాలా పద్ధతులున్నాయి. ఒక చెయ్యి మాత్రం ఎత్తి (కుడిదే) అభివాదం చేయడం. ఆ వేళను బట్టి గుడ్ మార్నింగ్‍లు, గుడ్ ఆఫ్టర్‌నూన్‌లు, గుడ్ నైట్‌లు చెప్పుకోవడం. 'శుభోదయం' అన్న, అలాంటి పద బంధాలు, నాకు తెలిసి, భారతీయ సంస్కృతిలో లేవు. సామాజిక మాధ్యమాలు వచ్చింతర్వాత, ఈ గ్రీటింగ్‍లు శృతిమించాయి. 'శుభ బుధవారం!' అని పోస్టు పెడతాడొకాయన, "వెధవా! బుధవార మెన్నడురా?" అని నా చిన్నపుడు జోక్! పొద్దున్న కలిస్తే గుడ్ మార్నింగు, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్‌నూన్. రాత్రి కలిస్తే మాత్రం, ఎంత రాత్రయినా గుడ్ ఈవెనింగే! గుడ్ నైట్ అనేది రాత్రి విడిపోయేటపుడే అనాలని హైస్కూల్లో మా ఇంగ్లీషు సారు శంకరయ్య గారు చెప్పారు. అంతేగాని రోజులో మొట్ట మొదట కలిస్తే "గుడ్మార్నింగ్" అనడం తప్పురా! అనేవారాయన.
కాళ్ళు మొక్కడం అనేది అవతల వ్యక్తి మీద ఎంతో భక్తి ప్రపత్తులు ఉంటే గాని జరగదు. "కాల్మొక" అన్నది ఒక ప్రాంతంలో, బానిసత్వానికి చిహ్నంగా వాడేవారు. ఇప్పుడా దొరతనాలూ లేవు, ఆ న్యూనతలూ లేవు. 'పాద ధూళి శిరసున ధరించడం' అనేది పాదాభివందనానికి సూపర్ లేటివ్ డిగ్రీ! నార్త్ ఇండియాలో, పెద్ద వారికి, రైల్వే, బస్ స్టేషన్లలో అయినా, వంగి పాదాలను తాకుతారు. మనసులో గౌరవం ఉండాలి గాని, ప్లేస్ దేముంది?
కొందరు, గుడిలో, మూలవిరాట్టు దగ్గరే, పూజారికి దక్షిణ ఇచ్చి, కాళ్ళకు మొక్కుతారు. అది తప్పని, పరమాత్మను అది కించపరిచినట్లు అని సద్గురు శివానంద మూర్తి గారు ఒకసారి చెప్పారు. ఇక రాజకీయాల్లో, సినీరంగంలో, పాదాభివందనాలు జోరుగా సాగుతాయి. 'ఫలానా నాయకుడు ఫలానా కేంద్ర నాయకునికి' పాదాభివందనం చేశాడు. ఫలానా ఇంకో నాయకునికి చేయ లేదు అని గౌరవాన్ని దాటి వేరే అంశాల వరకు విమర్శలు వెళుతుంటాయి. సినిమాల సక్సెస్ మీట్లలో, ప్రీలాంచ్ వేడుకల్లో, వేదిక మీదే పెద్ద హీరోల కాళ్ళకు మొక్కుతుంటారు. వివిధ శాఖల టెక్నీషియన్లు, వెండితెర వేల్పులు పొందే గౌరవం అది.
అదేదో సినిమాలో, “నాకు నమస్కారం పెట్టావా? నాకు విష్ చేయలేదెందుకు?” అని అడిగి పెట్టించుకుంటూ ఉంటుందొక హాస్య పాత్ర. అయ్యా! గౌరవం అనేది ఇస్తే తీసుకోవచ్చు గానీ, అడిగి తీసుకోవడం హాస్యాస్పదం అని ఆ పాత్ర ద్వారా చెప్పాడా దర్శకుడు.
'ప్రేమాభిషేకం' సినిమాలో 'వందనం! అభివందనం' అన్న సూపర్ హిట్ సాంగ్ మనందరికీ తెలుసు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దానిని రాస్తే, బాలు గారు పాడగా, అక్కినేని గారు అభినయించిన అద్భుత పాట! చక్రవర్తి గారి కంపోజిషన్. అందులో, "నిన్నకు నేటికి సంధిగ నిలిచిన సుందరీ! పాదాభివందనం!" అని వస్తుంది. ప్రియురాలికి పాదాభివందనం చేయడం ప్రేమకు పరాకాష్ట. కానీ అక్కడ ఉన్నది ఒక ప్రాస్టిట్యూట్. ఆమె నిన్నకు నేటికి సంధిగా ఎలా నిలిచిందో నాకెంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్థం కాదు. మీకేమయినా తెలిస్తే చెబుదురూ? ఒకసారి, ముళ్ళపూడి వారి జోక్. ఇద్దరు కవి పండిత రచయితలు రిక్షాలో వెళుతూ దేవదాసు సినిమాలో సీనియర్ సముద్రాల వ్రాసిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అన్న పాటను గురించి తర్కించుకుంటున్నారట. దాని అర్థం ఇదనీ, అదనీ, అది కాదనీ, ఇదేననీ, అలా. వింటూన్న రిక్షావాడు "తాగుబోతోని మాటలకు అర్తం ఏటుంటాది బాబూ!" అని ఒక్క ముక్కలో తేల్చేశాడట. దాసరి గారి 'నిన్నకు నేటికి సంధిగ నిలిచిన' అనే ప్రయోగాన్ని కూడా అలా సరిపెట్టుకుంటే పోలా? ఇంకా లోతైన అర్ధం ఉంటే నాకు ఫోన్ చేయండి.

 



పాదాభివందనం చేయడాన్ని కూడ ఆత్మాభిమానంతో ముడిపెట్టిన మహానుభావులు తిరుపతి వేంకట కవులు. కవులకు మీసాలెందుకు అని ఎవరో అధిక్షేపిస్తే, తమ పాండితీ ప్రకర్షను ఇలా చెబుతూ, మమ్మల్ని సంస్కృతాంధ్రాలలో ఎవరైనా గెలిస్తే, వారికి పాదాభివందనం చేస్తామని సవాలు చేశారు.
ఉ.
దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మముగెల్వుడు గెల్చిరేని ఈ
మీసము దీసి మీ పదసమీపములన్ తలలుంచి మ్రొక్కమే
~
శోభనం గదిలో భార్య భర్తకు పాదాభివందనం చేస్తుంది. అది అనాదిగా వస్తున్న ఆచారం. "మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి చాలు!" అని పతివ్రతలు భర్తలను దీనంగా, పాత సినిమాల్లో వేడుకొంటుంటారు. వాటి మీద ఫెమినిస్టులు రగిలిపోతుంటారు. ముత్యాల సుబ్బయ్య గారు 'పవిత్రబంధం' అనే గొప్ప సినిమా తీశారు. వివాహం యొక్క విశిష్టతను చాటిన చిత్రమది. అందులో ఫస్ట్ నైట్ నాడు సౌందర్య వెంకటేశ్ కాళ్ళకు మొక్కితే అతడు కూడ ఆమె పాదాలకు నమస్కరించబోతే, ఆమె వారిస్తే, అతడు "వై నాట్?" అంటాడు. దటీజ్ ద స్పిరిట్!
ఇప్పుడు పెళ్ళిళ్ళ తీరు మారింది. వధూవరులు సింహాసనాల్లాంటి కుర్చీల్లో ఆసీనులై ఉంటే, ఆహుతులు క్యూలో నిలబడి, వారికి శుభాకాంక్షలు చెప్పి, గిఫ్ట్‌లు ఇచ్చి, వెళ్ళిపోతారు. గుడ్ ఓల్డ్ డేస్, మాంగల్య ధారణ తర్వాత, వధూవరులు క్రిందికి వచ్చి, పెద్దవారికి అందరికీ పాదాభివందనాలు (వంగి) చేసేవారు. యూత్ కాబట్టి వారికి నడుము నొప్పి వచ్చేది కాదు. పైగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం విధాయకం.
ఒకసారి (1986) బర్కత్‌పురాలోని డా॥ దివాకర్ల వేంకటావధాని గారింటికి, మా రెండేళ్ళ బాబును తీసుకొని వెళ్ళాం నేను, నా భార్య. వారు మా నాన్నగారికి ఆత్మీయ స్నేహితులు. నేనంటే వారికి వాత్సల్యం. వచ్చేటప్పుడు మేమిద్దరం ఆ మహనీయునికి పాదాభివందనం చేసి మా చంటోడిని
కూడ మొక్కమన్నాం. వాడు నిష్కర్షగా "నేను మొక్కను!" అని ప్రకటించాడు. మేము వాడిని కోప్పడుతూంటే, దివాకర్లవారిలా అన్నారు నవ్వుతూ - "వీడికి నమస్కారార్హత లేదని వాడికి తెలిసిపోయింది! వద్దు లేరా నాన్నా!!". విద్యాదదాతి వినయం! అదన్నమాట!

No comments:

Post a Comment