ఈ మధ్య జనాలకు ఆరోగ్యం మీద అవగాహన పెరిగి, శ్రద్ధ కూడా రెండింతలు పెరిగిందట! సగటు ఆయుర్దాయం 80 సం॥ అయిందని సీనియర్ సిటిజన్స్ తెగ సంబరపడిపోతున్నారట. రామ్‌దేవ్ బాబా గారేమని సెలవిచ్చారంటే... మితంగా భుజిస్తూ, యోగాసనాలు వేస్తూ, బాడీ ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటే 150 నుండి 200 సం॥ వీజీగా బతికెయ్యవచ్చునని.
లివర్‌పూల్ విశ్వవిద్యాలయాచార్యులు ‘జొయావో పెడ్రో డి మాగల్తీస్’ (João Pedro de Magalhães) గారు వేల్స్ (సొరచేపల) మీద పరిశోధనలు చేసి అవి 210 సం॥ వరకు హాయిగా బతికేస్తాయని తెల్చారు. అంత దీర్ఘ జీవితంలో కూడా, ఏజింగ్ (వయసు మీదపడటం) కు సంబంధించిన రుగ్మతలు గాని, శారీరిక మానసిక సమస్యలు గాని వాటికి ఉండవట. కానీ మనకు అలా కాదే! సవాలక్ష సమస్యలు. ‘మంచాన పడకుండా మరో యాభైయేళ్లు బతకమ’ని దీవించిందట వెనకటికో బామ్మగారు. పరాధీనం కాకుండా, తన పోషణకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే, బ్రతకొచ్చు! కానీ, ఇందులో అయితేలూ, కానీలు (ఇఫ్స్ అండ్ బట్స్) చాలా ఉన్నాయి.
‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న నానుడి ఇక్కడా వర్తిస్తుందంటాను నేను. ఈ శ్లోకం ‘నరసింహ సుభాషితం’ లోని 85వ శ్లోకం. దాని పూర్తి పాఠం - “అతి దానాత్ హతః కర్ణః, అతి లోభాత్ సుయోధనః, అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్ర వర్జయేత్!”. ‘అత్యాయుః అనర్థకమ్’ అని యాడ్ చేద్దామా?
‘మోనోటనీ’ అని ఇంగ్లీషులో ఒక పదముంది. ‘విసుగు రావడం’ అని దానర్థం. ఒక దశలో, జీవితం మీద విసుగు వస్తుంది. మరీ వందేళ్లు బతికుంటే... నీ కళ్ల ముందే నీకంటే చిన్నవారు, నీ స్నేహితులు చాలామంది మరణిస్తూంటారు. నీవు మాత్రం ఉంటావు. ఒక దశలో నీకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అది నీ చేతిలో లేదే! ఆ మధ్య డోన్‌లో మా చిన్నాన్న (మా నాన్నగారి కజిన్) ను చూడడానికి వెళ్లాము. ఆయనకు 93 సం॥. కళ్ళు సరిగ్గా కనబడవు, ఏదైనా బిగ్గరగా ఆయన చెవి దగ్గర చెప్పాలి. క్షేమ సమాచారాల తర్వాత, ఆయన “ఏమిటో రా! నా పెన్షన్ ఇది వరకులా పెరగడం లేదు. డి.ఎ.లు ఇవ్వడం లేదు. మొన్నటి పి.ఆర్.సి.లో ఇంటెరిమ్ రిలీఫ్ కంటే ఫిట్మెంట్ తక్కువుంది!” అన్నాడు. నేను సరదాగా “చిన్నాయనా! ఇంకా ఏడేళ్లు ఉంటే సెంచరీ చేస్తావు. అప్పుడు నీ క్వాంటమ్ పెన్షన్ వందశాతం పెరుగుతుంది కదా!” అన్నాను. “ఏదో ఉన్నాగాని, నాకు విసుగ్గా ఉందిరా! ఈ వయసులో ఎంత వస్తే ఏమిటి? త్వరగా ఆ పరాత్పరుడు తీసుకుపోతే మేలు!” అన్నాడాయన.
‘స్టీఫెన్ లీ కాక్’ అనే రచయిత ‘హౌ టు లివ్ టు బి 200’ అన్న కథ లాంటి వ్యాసం వ్రాశాడు. ఆయన వ్యంగ్య వైభవ నిపుణుడు. ఆయనకు తెలిసిన ‘జిగ్గిన్స్’ అనే ఆయన, పొద్దుపొద్దున్నే చన్నీటి స్నానం చేస్తాడు. చర్మరంధ్రాలు దానివల్ల బాగా తెరుచుకుంటాయట. తర్వాత వేడి స్పాంజ్ ముక్కతో తుడుచుకుంటాడు. అలా చేస్తే అవి మూసుకుంటాయి. తెరచిన కిటికీ వద్ద నిలబడి ఊపిరి పీల్చి వదుల్తాడు. తర్వాత శాండో ఎక్సర్‍సైజ్. అవి కుక్కలు చేస్తాయట. ఇక సాయంత్రం డంబెల్స్. పళ్లతో బరువులు పట్టుకొని ఎత్తడం. అర్ధరాత్రి వరకు స్లింగ్ షాట్లు. ఎందుకు స్వామి ఇదంతా? అంటే 200 సం॥ బ్రతకడానికని చెప్పాడు. కానీ ‘జిగ్గిన్స్’ చచ్చిపోయాడంటాడు లీ కాక్. ఇలాంటి వాళ్ళకు ఆయన ‘హెల్త్ మానియాక్స్’ అని పేరు పెట్టాడు. వారు తెల్లవారే లేచి చెప్పులు లేకుండా వాక్‌కి వెళతారట. అరిపాదాలకు మంచు తగలాలని. నైట్రోజన్ ఎక్కువని మాంసం తినరట. కొళాయి నీరు తాగరట, క్యాన్డ్ సార్డైన్‌లు తినరు. గ్లాసుతో పాలు తాగరు. ‘మందు’ ముట్టరు. కానీ అందరిలాగా మామూలుగానే చచ్చిపోతారట.
“నీకు నచ్చింది తిను. హాయిగా ఉన్నన్నాళ్లు లైఫ్ ఎంజాయ్ చెయ్” అంటాడు లీ కాక్. నీ తిండిలో స్టార్చ్ ఉందా, ఆల్బమైన్ ఉందా, గ్లూటిన్ ఉందా, నైట్రోజన్ ఉందా అని బుర్ర బద్దలు కొట్టుకోవద్దంటాడు. నా మటుకు నాకు సాయంత్రం బైట, మిర్చి బజ్జీలు, పునుగులు వేడివేడిగా తినకపోతే ఏదోలా ఉంటుంది.
ఆ మధ్య దలైలామా గారి బర్త్‌డే జరిగింది. ఆయన టిబెటన్ బుద్ధిజంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త. మన దేశంలోనే ఉంటాడు. ఆయనకు 90 ఏళ్ళు. ఆయన జన్మదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆయనను శాంతిదూతగా గౌరవిస్తారు. ఆయన లాంటి మహానీయులు ఎంత కాలం బ్రతికినా మంచిదేనంటాను నేను. “కాకిలా కలకాలం బ్రతకడం ఎందుకు?” అంటే కాకుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వాటి సుగుణాలు వాటికున్నాయి. అవి పిండం ముట్టకపోతే? అదే ‘బలగం’ సినిమా! సూపర్ హిట్.
మైకేల్ జాక్సన్ ప్రసిద్ధ పాప్ సింగర్. ఆయన గొప్ప ధనవంతుడు. ఆయిన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి, ఎందరో డాక్టర్లు. కాని ఆయన గుండె ఆగి మరణించాడు తన 51వ సం॥ లో! మరింతమంది డాక్టర్లు?
పునీత్ రాజ్ కుమార్, గొప్పనటుడు. కోట్లాది అభిమానులు. జిమ్‍లో వ్యాయామం చేస్తూ, తన 46వ ఏట, గుండెపోటుతో మరణించాడు. వివేకానంద స్వామి 39 సంవత్సరాలే జీవించారు. ఆదిశంకరులు 32 ఏళ్ళు. జగజ్జేత అలెగ్జాండర్ 33 సంవత్సరాలు. అయినా వారు అమరులు. ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారు. అమర గాయకుడు ఘంటసాల 52 సంవత్సరాలు బ్రతికారు. కానీ సంగీతంతో సజీవుడు. సో, ఎన్నేళ్ళు బతికామన్నది కాదు సోదరా, ఎంత బాగా బతికామన్నది ముఖ్యం! బలుసాకు తినైనా బతకాలని ఏం లేదు. మంచితనం మిగల్చకుండా సెంచరీ కొడితే ఏం లాభం? అదన్నమాట!
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
Tuesday, August 12, 2025
వందేళ్ళా? బాబోయ్! -దత్తవాక్కు- ఆంధ్రప్రభ
Monday, August 11, 2025
ఇమౌజీలతో ఎమోషన్లు! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ
ఆదిమ మానవులకు భాషెక్కడిది పాపం? అరుపులు, సైగలతోనే వాళ్ల కమ్యూనికేషనంతా. వోకల్ కార్డ్స్ మొదటి నుంచీ ఉన్నాయి గాని, దంతములు (డెంటల్స్), తాలవ్యములు (palates), ముక్కుతో పలికేవి (nasals) ఇలా ఫొనెటిక్స్ అప్పటికి లేవు. క్రమంగా ఆ అరుపులు, నోటి నుండి వెలువడే ధ్వనులు ఒక క్రమపద్ధతిని సంతరించుకోసాగాయి. అవి పదాలుగా, చిన్న చిన్న వాక్యాలుగా రూపాంతరం చెందాయి. అలా కొన్ని వేల సంవత్సరాలకు భాషకు ఒక రూపం ఏర్పడింది. తర్వాత ఎవరో మేధావి బయలుదేరాడు. ఈ భాషను బాగా స్టడీ చేసి, ఏ నియమాల ద్వారా ఇది ఏర్పడుతూందో గమనించి, దాని సూత్రాలను వ్రాశాడు. అదే వ్యాకరణం. “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్?” అని మాయాబజార్ సినిమాలో ఘటోత్కచులవారన్నట్లు, ఎవరూ కనిపెట్టకుండా సూత్రాలెలా వస్తాయ్?
భాష, సాహిత్యం, కవిత్వం, దినదిన ప్రవర్థమానాలుగా వెలుగొందుతూ, వార్తాపత్రికలు, వార, పక్ష, మాస, త్రైమాసిక.. అబ్బా! ఎన్ని పత్రికలు? ఇవన్నీ చక్కగా భాషా సేవ చేస్తూ ఉన్నాయి. (ఉండేవి?) కాని, భాషతో పనిలేని చోద్యపు కాలం ఒకటి దాపురించింది మహాశయా! అది సోషల్ మీడియాలో మాత్రమే దర్శనమిస్తుంది. నాలుగు మాటలు టైపు చేయడానికి బద్ధకమో, లేదా లైఫ్‌ను సింప్లిఫై చేసుకునే ఒక క్రమంలో భాగమో, మళ్లీ ఆదిమ మానవుల కాలంలోకి వెళ్లాం. ఇమౌజీలని దాపురించాయి. మొదట్లో అందరూ వాటిని ఎమోజీలు అంటూంటే, కాబోలు! అనుకునే వాడిని. కాని దాన్ని ‘ఇమౌజీ’ అని పలకాలట.
ఈ పిక్టోగ్రాములనన్నింటినీ తెలుగులో వ్రాద్దామని జుట్టు పీక్కున్నా. పిల్లి అంటే మార్జాలము అన్న చందంగా తయారవుతుంటే ఊరుకున్నా. టైప్ చేసే సంభాషణల్లో, ఎమోషన్స్ వ్యక్తపరచే పదాల (తోచకపోతే?)ను వాడకుండా, ఈ ఇమౌజీలను వాడతారన్నమాట.
సరే, బాగుందబ్బాయ్! కానీ, ‘పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండ’న్నట్లు, ‘మనవాళ్ళొట్టి మేధావులోయ్!’. కదా! పెళ్లికీ పిడుక్కీ ఒకే మంత్రం చందాన, ఇమౌజీలను ఎడాపెడా వాడేయడం మొదలెట్టారు.
2010 తర్వాత ఇవి మరింత పాపులర్ అయ్యాయి, ‘యూనికోడ్’ వీటిని ‘యూనికోడ్ స్టాండర్డ్’ లోకి మార్చినప్పటినుంచి. ఇమౌజీలు వాడడం నాగరికుల సంస్కృతిలో ఒక భాగమైంది. “నాగరీకుల భోజనంలో గోంగూర లేకుండా ఎలా? గోంగూర లేనిదే ప్రభువులు ముద్దముట్టరు” అని వంగర గారన్నట్లు, అవి లేని సంస్కృతిని మనం ఊహించలేం సుమండీ!
ఇమౌజీలను పాజిటివ్ కమ్యూనికేషన్ కోసమే ఉపయోగించాలని శాస్త్రం ఘోషిస్తోంది! వాటికంటూ ఒక సొంత అర్థముండదు. కానీ అవి Paralanguage క్రిందికి వస్తాయి. Text కు clarity ని, క్రెడిబిలిటీని ఇస్తాయి. అంతే గానీ అసలు text అన్నదే లేకుండా వీటితోనే పని కానిచ్చేస్తేమంటే ఎలాగండి మాస్టారు?
మనలో మన మాట, మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఇమౌజీ లను ఎక్కువగా ఉపయోగిస్తారని, ఒక సర్వేలో తేలిందట.
ఇమౌజీలను మిసండర్‌స్టాండ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది ఆర్యా! పంపినవాడి మెదడులో ఏ ఆలోచనలున్నాయో, అవే ఆలోచనలు రిసీవ్ చేసుకునేవాడికి ఉండాలనేముంది? కొన్ని దేశాలతో, బెదిరించడానికి రివాల్వర్లు, కత్తులు ఇమౌజీలుగా పెడతారట.
ఫేస్‌బుక్కోడు ఎంత తెలివైనవాడంటే, పోస్ట్ నచ్చితే ‘లైక్’ సింబల్ కొట్టొచ్చు. అంతే! కాని నచ్చకపోతే, ‘డిస్‌లైక్’ సింబల్ పెట్టలేదు, చూశారా! కామెంట్‌లో చెప్పవచ్చు కదా, అంటారేమో! “ఆయనే ఉంటే...” అన్నట్లు, అంత ఓపికే ఉంటే...
మణికట్టు వరకు కట్ చేసి బొటనవేలు పైకి లేపి ఉంచిన ‘మొండిచెయ్యి’ ఇమౌజీని చాలామంది ఉపయోగిస్తుంటారు. పంపినవాడికి పద్మభూషణ్ వచ్చిందని తెలిసినా అదే మొండి చెయ్యి చూపుతారు. తెలుగులో ‘మొండి చెయ్యి చూపడం’ అంటే వేరే అర్థం ఉంది!
వెకిలినవ్వులు, పడీపడీ నవ్వడం, నోటి మీద చేయి వేసుకొని విస్తుబోవడం, మాడుమొహం, భేషుగ్గా ఉందని బొటన వేలిని చూపుడువేలిని గుండ్రంగా తగిలించి, మిగతా మూడు వేళ్లు పైకెత్తడం, నాలుక బయటపెట్టి వెక్కిరించడం, గులాబీపువ్వు, రెండు చేతులూ జోడించి పైకెత్తడం (దీంట్లో అయ్యా! మీకో నమస్కారం! ఇక ఆపండి! అనే అర్థం కూడా రావచ్చు!), రెండు కళ్లనుండి ధారాపాతంగా కన్నీరు కార్చడం, పళ్లన్నీ కనిపించేలా ఇకిలించడం... అబ్బ! ఎన్నని చెప్పను?
గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు, రెడీమేడ్ వీడియోలు వచ్చేశాయి. అన్ని సందర్భాలకు అవి తయారు చేసిపెట్టారు. ఎవరనుకున్నారు? ‘గూగుల్ కిచెన్’ వారు.
ఆలీని, బ్రహ్మనందాన్ని, రవితేజను ఈ వీడియోలలో, ఆయా సినిమాలలో వారు చూపిన విచిత్ర, చిత్ర భావాలను, సందర్భ శుద్ధితో పెడతారు. పాపం, వారికి రెమ్యూనరేషన్ ఏమయినా ఉంటుందో, లేదా ఉచిత పథకాలో, మరి!
‘రిప్’ అని ఒకటుంది. అది ఇమౌజీ కాదు కాని, సూక్ష్మంగా మోక్షం చూపిస్తూంది. ఒకాయనకు జ్వరం వచ్చిందని ఎఫ్.బి. లో పోస్ట్ పెడితే, ఆయన ఫ్రెండ్ (ముఖపుస్తక నేస్తం) ‘రిప్’ అని పెట్టాడట. అదీమిట్రా బాబూ అని అడిగితే, “తప్పేముంది? రెస్ట్ ఇన్ పీస్! ‘ప్రశాంతంగా రెస్టు తీసుకో’ అన్నాను” అన్నాడట! అతి తెలివి!
చక్కని భాష ఉండగా, దాన్ని సింప్లిఫై చేయడం కాదు, దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం కాదా ఇది! అదన్నమాట!
Monday, July 28, 2025
అంతా నేనే చేశాను! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులతో దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. పాక్ కాళ్లబేరానికి వచ్చి “నీవే తప్ప నితః పరం బెరుగ మన్నింపందగన్ దీనునిన్, రావే ఈశ్వర, కావవే వరద, సంరంక్షించు భద్రాత్మకా!” అని గజేంద్రమోక్షంలో ఏనుగు శ్రీహరిని వేడుకున్న చందంగా, మన దేశాన్ని వేడుకుంది. అంతం కాదిది ఆరంభం అని మరీ స్పష్టం చేసి భారత్ ఊరుకుంది.
తనను తాను ఆమ్నిపొటెంట్ అని, ఆమ్నిసైంట్ అని, అదేనండీ, సర్వసమర్థుడిననీ, సర్వజ్ఞుడిననీ భావించుకుని, అదే భ్రమలో ఉండే ట్రంపు, ప్రారంభించాడు - “ఇండియా పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా!” అని డంబాలు కుంభాలతో పోయడం మొదలెట్టాడు. “మధ్యన నీ బోడి పెత్తనమేమిటోయ్!” అని మోడీ స్పష్టం చేశాడు. ఐనా వినడే! “ట్రంపు గారి సొంపు ఇంతింత గాదయా” అని, “పాడిన పాటే పాడకురా, పాచిపళ్ల వాడా!” అని గడ్డి పెడితే, చివరకు ఒప్పుకున్నాడు! తాను కాదని! అందుకే బద్దెన గారన్నారు “వెనుకటి గుణ మేల మాను, వినరా సుమతీ!” అని. పూర్తి పద్యం ఈయనకు రాదా? కొంపతీసి! అనుకుంటున్నారా? వచ్చు. కాని పూర్తిగా రాస్తే, ట్రంప్ అభిమానులు, ముఖ్యంగా మన దేశంలో, బాధపడతారని మానేశాను. “స్వభావో దురతిక్రమః” అన్నాడు రావణాసురుడు, తన మాతామహుడు, మంత్రి ఐన మాల్యవంతునితో. ఇక్కడ పూర్తి శ్లోకం వ్రాస్తాను.
ద్విధా భజ్యేయమాప్యేవం న నమేయం తు కస్యచిత్।
ఏష మే సహజో దోషః స్వభావో దురతిక్రమః॥ (యుద్ధకాండ 36.11)
“నాయనా! రామునితో యుద్ధం వద్దు, నా మాట వినురా!” అని మాల్యవంతుడు చెబితే, రావణుడు, “అబ్బే! వీల్లేదు. గ్రాండ్ పా! నన్ను రెండు ముక్కలుగా కోసినా, నేనెవరికి లొంగను. ఇది నాలోని సహజ దోషం!” అన్నాడు (అందుకే దుర్యోధనున్నీ, రావణున్నీ తెలిసిన మూరులన్నారండోయ్). చివర్లో తన బలహీనతను జనరలైజ్ చేశాడు (చేసింది వాల్మీకి సార్!) “స్వభావాన్ని అధిగమించడం కుదరదు కదా మరి!”.
ఇది ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో కూడ బయటపడింది. ఇరాన్‌ను బెదిరించాడు. గడ్డపాయన, పెద్దాయన, ఆయతొల్లా ఖొమైనీ, “ఐ కేర్ ఎ పిన్” అన్నాడు. “పో బే!” అన్నాడు కూడా! ట్రంప్ ఇరాన్‌పై క్షిపణులు ప్రయోగించినా ఇరాన్ బెదరలేదు. పైగా అమెరికా మీదే ప్రతిదాడులు చేసింది.
ఇక కె.ఎ. పాల్ గారు ఉండనే ఉన్నారు. తానే ఇండో- పాక్ యుద్ధాన్ని ఆపానని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంతకుముందు కూడా చాలా యుద్ధాలను ఇలాగే ఆపాడట. ఆయన ప్రజ్ఞలు వింటే ఉత్తరకుమారుడు కూడా తల దించుకోవలసిందే.

గొప్ప గొప్ప కార్యాలు సాధించిన వారు కూడా తామే కర్తలమని చెప్పుకోరు. అది వారి వినయశీలం. మన భారతీయ వేదాంతంలో అదొక ఉదాత్త భావన! ‘అహంకారం’ నుండి విముక్తుడయితే తప్ప, మనిషి మహనీయుడు కాలేడు.
టి.టి.డి. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ పి. వి. ఆర్. కె. పసాద్ గారు వెంకటేశ్వరస్వామి సేవలలో తాను సాధించిన విజయాలను, పొందిన అనుభవాలను, వినమ్రంగా, ‘నాహం కర్తా, హరిః కర్తా’ అనే శీర్షికతో ‘సర్వ సంభవమ్’ పుస్తకంలో వ్రాసుకున్నారు.
శ్రీనాధకవి “చిన్నారి పొన్నారి చిరుత కూకటనాడు రచియించితి మరుత్తరాట్ చరిత్ర” అని ప్రారంభించి గొప్పలు చెప్పుకున్నారు. చివరికేమయింది?
మాకు వరుసకు పెదనాన్నగారు, పాణ్యం భైరవ శర్మగారు. ఆయన ట్రంప్ కంటే నాలుగాకులు ఎక్కువ చదివినవాడు. ఆయన ధోరణి ఇలా ఉంది. “ఒరేయ్ దత్తుడూ (అంటే నేనన్నమాట!) ఢిల్లీకి వెళ్లాను కదా ఆ మధ్య! ఇందిరాగాంధీని ఎడాపెడా దులిపేసి వచ్చాను. ‘ఏమిటమ్మాయ్? ఎమర్జెన్సీ ఇంకా ఎన్నాళ్లు పెడతావు? ఎత్తెయ్యి! అర్ఘ్యాల్లోకి పిండాల్లోకి లేకుండా పోతావు జాగ్రత్త!’ అని తిట్టానురా. కిక్కురుమంటే ఒట్టు”. నేను అనుమానంగా చూస్తూంటే, “ఒరేయ్, నీకబద్ధం నాకు నిజం” అనేవాడు. ఆయన మద్రాసుకు వెళితే దిగేది ఎక్కడో తెలుసా మీకు? కరుణానిధి గారింట్లోనే! లేకపోతే ఆయన ఒప్పుకోడు మరి! ఈ టైపు గొప్పల వల్ల, పెద్దగా ప్రమాదం లేదు లెండి.
ఇంతకూ, ట్రంప్ అంత సీన్ నాకు లేదుగానీ, ఈ బనకచర్ల డ్యాం వివాదాన్ని మీరే పరిష్కరించాలని అటు చంద్రబాబు గారు, ఇటు రేవంత్ రెడ్డి నన్ను బ్రతిమాలుతున్నారండీ బాబు! నవ్వుతున్నారెందుకు? అదన్నమాట!
Thursday, July 24, 2025
సర్వదేవ నమస్కారః - దత్తవాక్కు- ఆంధ్రప్రభ
“అన్ని మతముల సారంబు యవని యొకటె” అని ఆర్యోక్తి. ఆ సారాన్నే ఆయా మతాల్లోని బోధకులు విభిన్నంగా వివరిస్తారు. కానీ ‘Ultimate Truth’ మాత్రం ఒక్కటే. “ఏకం సత్ విప్రాః బహుధావదన్తి” అని మన భారతీయ సనాతన ధర్మం చెబుతుంది. ఇక్కడ ‘విప్రాః’ అన్న పదానికి ‘పండితులు’ అని అర్థం.
‘Literary Parallel’ అంటే ప్రపంచ సాహిత్యాలలో ఉన్న సామ్యం గల విషయాలు. అలాగే ‘రెలిజియస్ ప్యారెల్లల్’ కూడా ఉంది. హిందూమతంలో, ప్రయాణం చేసేవారికి వీడ్కోలు చెప్పేటప్పుడు “శివాస్తే పంథానః” అంటారు. అంటే, “నీ మార్గములు శుభకరములగు గాక!” అని అర్థం. “విష్ యు హ్యాహీ జర్నీ” అనేది పాపులర్ వీడ్కోలు. విదేశాలకు వెళ్లి వారికి మాత్రం అలా చెప్పకూడదని, “బాన్ వాయేజ్” అని చెప్పాలని మీవంటి వారు చెప్పారు సుమండీ! బైబిల్‌లో “యెహావా నీ మార్గమును సుగమము చేయుగాక” అన్న అర్థాన్నిచ్చే సూక్తి ఉంది.
వేదాలు ‘అపౌరుషేయములు’ అంటారు. అంటే మానవులు రాసినవి కాదు. అట్లే పవిత్ర ఖుర్-ఆన్ కూడా. భగవంతుడు మౌఖికంగా, మహమ్మదు ప్రవక్తకు చెప్పినది అంటారు. ఆ గ్రంథం క్లాసికల్ అరబిక్ భాషలో ఉంది. ‘ఖుర్-ఆన్’ అన్న పదం, ఆ గ్రంథంలో 70 సార్లు వస్తుంది. ప్రవక్త కేవలం గుర్తుపెట్టుకుని, తన శిష్యులకు చెబితే, వారు దాన్ని గ్రంథస్థం చేశారు. వారినే scribes అంటారు. అన్నిమత గ్రంథాలకు లాగే ఖుర్-ఆన్‌కు కూడా ప్రక్షిప్తాలు, చేరికలు ఉన్నాయి. మనకు తాళపత్రాలు (తాటాకులు) కూడా లేని కాలంలో కూడ సాహిత్యం, మత వాఙ్మయం ఉన్నాయి. ఇప్పుడు రకరకాల బాల్, జెల్ పెన్నులు, నాణ్యమైన తెల్ల కాగితాలు ఉన్నా, మనం రాన్రాను ‘రాయని భాస్కరులం’ అవుతున్నాం. అంతా సిస్టమ్‌లో టైప్ చేయడమే. ‘కాగిత రహిత’ (Paperless) సమాజం కోసం ఎదురుచూస్తున్నాం. “అవ్వ పేరే ముసలమ్మ” అన్నట్లు, టైప్ చేయడం కూడా ఒక విధంగా రాయడమేనంటాను. కాదంటారా? ‘రాయడం’ అనకూడదు, ‘వ్రాయడం’ అనాలి, అంటున్నారా? సరే! బైబిల్, ఖుర్-ఆన్, గీత-వేదములు, ఆదిగ్రంథం (సిక్కులది) ఇవన్నీ మతగ్రంథాలయినా, వాటిలో సాహిత్య విలువలు పరిమళిస్తుంటాయి. వ్యక్తిత్వ వికాసానికి కావలసిన బోలెడు విషయాలుంటాయి. మనమేమో బోలెడు డబ్బు తగలేసి ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ క్లాసులకు వెళతాం.
కావ్యప్రబంధాల కాలంలో ‘వ్రాయసకాండ్రు’ (వ్రాసే సిబ్బంది) అని ఉండేవారు. వారు తాళపత్రాల నుండి, కొత్తవాటిపై వివిధ గ్రంథాలను ‘కాపీ’ చేసేవారు. ఆ ఉద్యోగాన్ని తక్కువగా చూసేవారట. ఎందుకంటే సృజనాత్మకత లేని పని అని! కవిపండితులంతా ఓరల్ గానే సాహిత్యాన్ని సృష్టించేవారట. అంతెందుకు? విశ్వనాథ వారు ‘వేయి పడగలు’ నవలను ఆశువుగా చెబుతుండగా, వారి సోదరుడు వెంకటేశ్వర్లుగారు వ్రాశారని మనకు తెలిసిన విషయమే. 999 అరఠావులు వచ్చిందట. 29 రోజులు పట్టిందట. అంటే సగటున రోజుకు 35 పేజీలు. వ్యాస భారతాన్ని వినాయకులవారు రాశారని ప్రసిద్ధం. తిక్కన భారతాన్ని గురునాథుడనే ఆయన శిష్యుడు, ఆయన చెబుతుంటే రాశాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో భారత యుద్ధాన్ని వివరిస్తున్నపుడు, తిక్కన కాసేపు ఆగాడట; భావం తోచక! అప్పుడు “ఏమి సెప్పుదును గురునాథ!” అన్నాడట దృతసంధి ప్రకారం, ‘కురునాథ’ కూడా అవుతుంది. శిష్యుడితో అన్నా, కురురాజుకు కూడా వర్తించి, ఔచిత్యం భంగం కాలేదు. బహుశా మహమ్మదు ప్రవక్త కూడ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటాడు.
బైబిల్ ‘ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్’ అంటుంది. హిందూమతం ‘సర్వస్యశరణాగతి’ అంటుంది. “అగోచరాల తాళంచెవులు అల్లాహ్ వద్దనే ఉన్నాయి” అంటుంది ఖుర్-ఆన్. ‘అగోచరం’ అంటే abstract, కంటికి కనబడనిది. అంటే ఆధ్యాత్మికానుభూతి. మనం భగవంతుని నిరాకారుడిగానే భావిస్తాము. విగ్రహారాధన కేవలం మనకు ఆయనపై ఏకాగ్రత కుదరటం కోసమే. “కొంచెమైనను తగపంచి కుడుట మేలు” అన్నా,” లవ్ థై నైబర్ యాజ్ థైసెల్ఫ్” అన్నా, “పొరుగువారు పస్తులుంటే తాను మాత్రం తినేవాడు విశ్వాసి (ముస్లిం) కాలేడు” అన్నా, అన్నిటి పరమార్గం ఒకటే.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే, మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. Secularism (లౌకికవాదం) మనకు శ్రీరామరక్ష! అన్ని మతాల్లో చెడ్డవారు, మంచివారు ఉంటారు. మనుషులు మంచివాళ్ళు కాకపోయినా మతం ఏదైనా మంచిదే అయి ఉంటుంది. మంచినే బోధిస్తుంది. “సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి”. “దేవుడనే వాడుంటే లోకంలో ఇంత అన్యాయం ఎందుకుంది?” అనేవారూ ఉన్నారు. మతం, దేవుడు అనే భావన, ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణను, పాపభీతిని కలిగిస్తుంది. ఏ మతం ఏమి చెప్పినా, అది మానవాళి బాగు కోసమే! అదన్నమాట!
Wednesday, July 16, 2025
నానా అటాచ్‌మెంట్స్!- దత్తవాక్కు- ఆంధ్రప్రభ
నాన్-అటాచ్‌మెంట్ ఉంది, డిటాచ్‌మెంట్ ఉంది. మరి ఇదేమిటి? అని అనుకుంటున్నారా? ‘నానా’ అంటే ‘రకరకాల’ అని అర్థం. నాన్‌స్టాప్ బస్ సర్వీసుకు పల్లెవెలుగు బస్ సర్వీస్‍కు తేడా అదే. రెండవది ‘నానా స్టాప్’ అన్నమాట.
‘నాన్-అటాచ్‌మెంట్’ అన్న మాటలో ఆధ్యాత్మిక సుగంధాలున్నాయి. దాన్ని ‘నిస్సంగత్వం’ అని తర్జుమా చేయవచ్చు. అది చాలా గొప్ప సుగుణం. ఆచరించడానికి గహనం కూడా. ఆదిశంకరాచార్యుల వారు తమ ‘భజగోవిందం’ స్తోత్రంలో దీన్ని ఎలా సాధించాలో చెప్పారు.
‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం,
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః
భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం మూఢమతే!’
అన్నాణా పరివ్రాజక శ్రేష్ఠుడు.
సంబోధనను గమనించండి. ‘ఓ మూఢమతే!’ అని. ‘నాన్-అటాచ్‌మెంట్’ ను సాధించడం ఎలాగో ఒక క్రమానుగతశ్రేణిని శంకరులు బోధిస్తున్నారు. సత్పురుషుల సహవాసం చేస్తే నిస్సంగత్వం లభిస్తుంది, దాని వల్ల మోహం నశిస్తుంది. మోహం ఎప్పుడయితే దూరం అవుతుందో అప్పుడు నిశ్చలతత్తం అలవడుతుంది. అది జీవన్ముక్తికి దారి తీస్తుంది.
‘డిటాచ్‌మెంట్’ అనేది వైరాగ్యానికి సమానార్థకం కాదు అని నా అభిప్రాయం. ఒక రకంగా అది నెగెటివ్ టర్మ్. రోమ్ నగరం తగలడిపోతుంటే ఆయనెవరో, నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడని... అంటారు. దీన్ని డిటాచ్‌మెంట్ అందామా? నాన్ అటాచ్‌మెంట్ అయితే కాదు.
మన జీవితంలో ‘నానా’ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. అవి మనల్ని వదలవు. మనమే వదిలించుకోవాలి. అలాగని అన్నింటినీ త్యజించి సన్యాసం తీసుకోకూడదు. అలా బలవంతంగా సన్యాసం తీసుకొంటే ఏమవుతుందో, ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలో, రేలంగి పాత్ర ద్వారా 1959 లోనే చూపించారు చక్కగా. ఆ పాటను పింగళి వారు వ్రాయగా, (ర)సాలూరు రాజేశ్వర రావుగారు స్వరపరిచారు. ఘంటసాల మాస్టారు పాడారు. బైటికి హస్యం అనే చక్కెర అద్దినా, అంతర్లీనంగా నిజమైన నాన్-అటాచ్‌మెంట్‌ను పింగళి పలికించారు, రేలంగి “కాశీకి పోయాను, గంగతీర్థమ్ము తెచ్చాను” అంటే, గిరిజ “కాశీకి పోలేదు, అవి ఊరి కాల్వలో నీళ్లండి” అంటుంది. అలా అతని ప్రతి మాటకూ ఆమె ఇచ్చే రిటార్టులో ఎంతో అర్థముంది. కుహనా సన్యాసత్వం ఎంత హాస్యాస్పదమో తెలుస్తుంది.
“టు బి యాన్ ఐడియల్ హౌస్ హోల్డర్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దేన్ టు బి ఎ సన్యాసి” అన్నారు స్వామి వివేకానంద. అందుకే మహర్షుల్లో చాలా మంది గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తూనే, నిస్సంగత్వం పొందగలిగారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దీనికి చక్కని ఉదాహరణ.

కుటుంబంలో ఉంటూ, బాధ్యతలు నెరవేరుస్తూనే, వాటికి అతీతంగా ఉండాలి. సుఖదుఃఖాలను సమదృష్టితో స్వీకరించాలి. శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాములవారు తమ అనుగ్రహ భాషణంలో ఒక కథ చెప్పారు. ఒక ఊర్లో ఒక సన్యాసి సత్రంలో మకాం. ఆ ఊరి భూస్వామి కొడుకు, ఒక పేద అమ్మాయిని నమ్మించి, గర్భవతిని చేశాడు. తన పేరు చెబితే ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించాడు. భయపడి, తల్లిదండ్రులకు, తన ఈ స్థితికి కారణం సత్రంలోని సన్యాసి అని చెప్పింది! అందరూ వెళ్లి ఆ సన్యాసిని చితక్కొట్టారు. దుర్భాషలాడారు. ఆ అమ్మాయిని ఆయన వద్దే వదిలేశారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆమెను తీసుకొని వేరే ఊరికి వెళ్లి, భిక్షాటన చేసి, ఆ అమ్మాయిని పోషిస్తూ కంటికి రెప్పలా చూసుకొంటున్నాడట. ఆమె పశ్చాత్తాపపడి, వెళ్లి, తన వారికి నిజం చెప్పింది. వాళ్లంతా వచ్చి, సన్యాసి కాళ్ల మీద పడి, పూలు పండ్లు సమర్పించి, క్షమించమన్నారు. అప్పుడూ ఆయనేం మాట్లాడలేదట. అదే అసలు సిసలు నాన్-అటాచ్‌మెంట్! ఆ స్థాయికి మనం చేరలేకపోయినా, ప్రతిదానికీ అతిగా స్పందించకపోతే బెటర్. దీన్ని కృష్ణపరమాత్మ “దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః” అని స్థితప్రజ్ఞులను నిర్వచించాడు. ‘తామరాకుపై నీటి బొట్టు’ దీనికి మంచి పోలిక. తామరాకుపై నీటిబొట్టు నిలవదు. ముత్యంలా జారిపోతుంది. ఆకుకి తడి అంటదు. వివేకానంద కూడా దీన్ని ఉదహరించారు.
సచిన్ టెండూల్కర్ చూడండి. సెంచరీ చేసినా, నాలుగైదు రన్స్ చేసినా, డక్ ఔట్ ఐనా ఒకేలా ఉండేవాడు. అబ్దుల్ కలామ్ గారిని, “మీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయింతర్వాత ఏం చేస్తారు?” అని అడిగితే “పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను!” అన్నారట. పరిణతి చెందిన రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అదే సంయమనంతో ఉంటారు. “పలికించెడివాడు రామభద్రుండట” అని పోతన, “నాహం కర్తా, హరిః కర్తా” అని మధ్వాచార్యులవారు తమ నిస్సంగత్వం చాటారు. దట్సాల్ యువరానర్!
Monday, July 7, 2025
భావ దారిద్ర్యం - దత్తవాక్కు- ఆంధ్రప్రభ
పూర్వం నిద్రాదరిద్రుడనే ఒక కవిగారుండేవారు. ఆయన రాసింది ఒకే శ్లోకం. కాని దానికి చాలా పేరొచ్చిందట. ఆ శ్లోకం ఇది..
“ధనహీనమపి జీవితం తు సవ్యమ్/గుణహీనమపి జీవితం తు భావ్యమ్/నిశాంతునిద్రా దరిద్రోహం నిత్యం/ఏతత్ దుస్సహం మమ దుర్భరం చ.”
జీవితంలో డబ్బులు లేకపోయినా సహించవచ్చు. గుణం లేని జీవితం కూడా ఉండచ్చు. కాని, రోజూ రాత్రి నాకు నిద్రా దరిద్య్రం పట్టింది. అది చాలా దుస్సహం, దుర్భరం. నిజమే సుమండీ! నిద్ర పట్టకపోవడం ఒక జబ్బు. దాన్ని ఇంగ్లీషులో ‘ఇన్‌సోమ్నియా’ అంటారని మీకు తెలుసు. ఇంట్లో అందరూ గాఢంగా నిద్దరోతూంటే, మనం మాత్రం గుడ్లగూబలా కళ్ళు తెరుచుకొని మేలుకొని ఉంటే, అది నరకం కాక మరేంటి? కొందరు లక్కీ భాస్కర్లుంటారు. బస్సు లేదా రైలు లేదా విమానం, ఏదెక్కినా, కదిలిన మరుక్షణం నిద్రలోకి జారుకుంటారు. వారికి నా లేజీ సలామ్!
ఎక్కడికో... వెళ్లిపోయాననుకుంటున్నారు కదూ! వస్తున్నా వస్తున్నా! మీ జేబు లోంచి పది రూపాయలు మిమ్మల్ని అడక్కుండా నేను తీసుకున్నా పర్లేదండి. కాని మీ భావాన్ని నేను నాదని చెప్పుకుంటే మటుకు అది చాలా పెద్ద తప్పు. దీన్ని భావ చౌర్యం అంటారు. ప్లాజియరిజమ్ అన్న మాట. ‘గ్రామర్‌లీ’ అని ఒక భావ చౌర్య పత్తేదారు వచ్చిందట. అదేనండీ బాబూ, ప్లాజియరిజమ్ చెకర్! అది కృత్రిమ మేధతో పని చేస్తుందట. ఏడ్చినట్లుంది!
మనం తరచుగా చూస్తూంటాం - “ఫలానా సినిమా కథ నాది, నాకు తెలియకుండా దాన్ని సినిమా తీశారు” అని రచయిత/త్రులు కోర్టుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవలను దాసరిగారు ‘గోరింటాకు’ సినిమాగా తీసినప్పుడు ఇదే వివాదం. ఇటీవల ‘శ్రీమంతుడు’ సినిమా కథ కూడ తనదేనని శరత్‌చంద్ర గారు కోర్టుకెళ్లారు. సాహసికులు భావచోరులను కోర్టుకీడుస్తారు. అంత సీన్ లేనోళ్ళు గమ్మునుంటారు! అయినా నాకు తెలిసే అడుగుతానండీ, అన్నన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి తగలేసే సదరు నిర్మాతలకు, దర్శకులకు ఏం రోగం? రచయిత ఎవరో తెర మీద వేసి, ఆయనకు సముచితమైన పారితోషికం ఇస్తే మర్యాదగా ఉంటుంది కదా! ఆయనేమైనా ‘హీరో’ కిచ్చినంతమ్మని అడగడు కదా! సృజనశీలురెప్పుడూ అల్ప సంతోషులేనండోయ్!
ముఖపుస్తకంలో భావచోరులు చెలరేగిపోతున్నారట. “‘నా గోడ’ మీద (అదేనండి ఎఫ్.బి. వాల్) నేను పెట్టిన పోస్టును (అది చక్కని కోట్ కావచ్చు. కవిత కావచ్చు. ఇంకోటి కావచ్చు) ఇంకోడెవడో తన పేరు మీద వాడి గోడ మీద పెట్టేసుకున్నాడు” అని కొందరు వాపోతుంటారు. అదేం ఖర్మమో? ‘కాపీయింగ్’ అంత సులభమైపోయింది సాంకేతికత వల్ల! ఆ మధ్య ప్రముఖ రచయిత, సంపాదకులు, శ్రీ జగన్నాథశర్మ గారంతటి వారే, “నా కధలను నన్నడక్కుండా షార్ట్ ఫిల్ములు తీసేసుకుంటున్నారు, నా పేరు లేకుండా నా కథలను, వ్యాసాలను షేర్ చేస్తున్నారు. దీని వల్ల నా కథలపై పరిశోధన చేసే రీసెర్చి స్కాలర్లు అయోమయానికి గురవుతారు. ఇది చట్టరీత్యా నేరం. వారిపై నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను” అని ముఖపుస్తకంలోనే హెచ్చరించారంటే, భావ దారిద్ర్యం, చౌర్యంగా ఎంత దారుణంగా మారిందో అర్థం కావడం లేదూ!

కొందరు తమ కథలకు నవలలకు పేర్లు పెడుతూంటారు. వారి రచనలు, వాళ్లిష్టం అనుకోండి! కాని ఆ పేర్లు సినిమా పాటలలోని పల్లవులలో ఒక భాగం లేదా, ప్రసిద్ధ సినిమా డైలాగులోని ఒక ముక్క అయిఉంటాయి. అంత చక్కని రచన చేసి, దానికి సొంతంగా పేరు పెట్టలేరా? నాకెందుకో అలాంటి పేర్లు చూస్తే, మనస్సు చివుక్కుమంటుందండి! నన్ను సమీక్షా ప్రసంగానికి పిలిస్తే, ఈ విషయాన్ని చెబుతుంటా. సినిమా పేర్లు, సీరియళ్ల పేర్లు కూడ అలాగే, ఏదో పాట లోని ముక్కలు! అది తప్పనను కాని, భావదారిద్ర్యం క్రిందికి వస్తుందేమో మరి!
దాదాపు 30 సంవత్సరాల క్రిందటి సంగతి. నేను అప్పుడు పలాసలో ఇంగ్లీష్ లెక్చరర్‌ని. నేను, మరో లెక్చరర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెల్) లో, పి.జి.టి.టి.యి చేస్తున్నాం, డిస్టన్స్ మోడ్‍లో! మాకు కొన్ని అసైన్‌మెంట్స్ ఇచ్చేవారు. అవి పూర్తి చేసి సీఫెల్‌కి పంపాలి. వాటికి గ్రేడ్స్ ఇస్తారు. ఒకసారి ‘క్రిటికల్ ఇంటర్‌ప్రిటేషన్’ (విమర్శనాత్మక వివరణ) లో ‘రాయ్ క్యాంప్‌బెల్’ అన్నకవి వ్రాసిన ‘ది జులు గర్ల్’ అన్న పద్యాన్నిచ్చారు. అద్భుతమైన కవిత అది. అందులో ఒక పేద అమ్మాయి, బాలింత, ఎర్రటి ఎండలో పని చేస్తుంటాంది. తన నెలల పిల్లవాడిని ఒక చెట్టు నీడన, గుడ్డ ఉయ్యాలలో పడుకోబెడుతుంది. పిల్లవాడు లేచి ఏడుస్తాడు. ఆమె వాడికి తన స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, పాలుండవు. ఆమెకు తిండి ఉంటే కదా! ఈ నేపథ్యం దక్షిణాఫ్రికాది. ఆమె కన్నీరు కారుస్తుంది. ఇంకా చాలా ఉంది కాని, పద్యంలోని ఇమేజరీ (భావసామగ్రి), మెటఫర్ (రూపకం) ఇవన్నీ వివరిస్తూ అసైన్‌మెంట్ వ్రాసి పెట్టుకున్నా.
ఎప్పుడు చూసాడో, నా కొలీగ్, దాన్ని యథాతథంగా కాపీ చేసి, తన పేరున అసైన్‌మ్ంట్ సీఫెల్‌కు పంపేశాడు! తర్వాత కొన్ని రోజులకు నేను పంపాను. అతనికి ‘ఎక్సలెంట్!’ అని, ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఇచ్చారు. నాకు ‘E’ గ్రేడ్ ఇచ్చి, “రీ డూ” (మళ్లీ చెయ్యి రా వెధవా!) అని రాశారు. అది చాలక, “నీవు నీ అసైన్‌మెంట్ వేరే అభ్యర్థి దాన్లోంచి కాపీ కొట్టినట్లుంది. ఈసారి జరిగితే ఖబడ్దార్!” అని మార్జిన్‌లో హెచ్చరిక! “ఏంటి బాబూ ఇలా చేశావు?” అని మావాడినడిగితే, “సారీ, బ్రదర్” అని ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయాడు! భావచోర్!
నా మటుకు నేను అన్ని జోనర్ లతో రచనలు చేస్తుంటా. వివిధ విషయాలను ఉటంకిస్తూ ఉంటా. కాని అవి ఎవరు చెప్పారో, రాశారో తప్పనిసరిగా చెబుతా! మనది కాని దాన్ని మనదిగా చెప్పుకోవడం ఆత్మహత్యా సదృశం అంటా నేను! “నాకు రాదు, నీవు రాసియ్యి!” అంటే కొంత నయం! భావదరిద్రులకు నా శత కోటి మొట్టికాయలు! అదన్నమాట!
Monday, May 19, 2025
బెదిరింపు రాయబారం! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ దినపత్రిక
సహజంగా ‘రాయబారం’ అంటే కాంప్రమైజ్ చేసి, ఇరుపక్షాల మధ్య ఘర్షణ లేకుండా చూసేది కదా! కానీ, మనకు తెలిసిన రాయబారాలన్నీ ఘర్షణ పెంచి, యుద్ధాలు తప్పనిసరిగా జరిగేలా చేశాయి! అత్యంత ప్రసిద్ధి గాంచిన శ్రీకృష్ణ రాయబారమే తీసుకొందాం. మొదట్నించీ పరమాత్మకు పాండవులు, కౌరవుల మధ్య సయోధ్య ఇష్టం లేదు. వెళ్లే ముందు, పాండవులు కొంచెం మెత్తబడి, సంధికి మొగ్గు చూపితే, వాళ్లను రెచ్చగొట్టాడు! ఇక కౌరవ సభలో, ఆయన “మా భీముడి గద అంటే ఏమనుకున్నారు? మా అర్జునుని గాండీవం ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?” అని వారిని బెదిరించాడు. తాను ‘దండంబున్ గొని దోలు స్యందనము మీదన్’ సారథిగా ఉంటానన్నాడు. “ఒక్క దుర్యోధనుని అసూయ కోసం మీరంతా చావకండి” అన్నాడు.
శా.:
“ఈ దుర్యోధనుడింత గర్వియగునే యీ యున్నవారెల్ల, నా
చే దైన్యంబున. బొందు టొప్పదని చర్చింపండ; యీ భంగికిన్
లేదే యొండు దెఱంగు సత్కులము బాలింపంగ వర్ణింప, రా
దే దుష్టాత్మకు నీచునొక్కరుని, బోదే భేదమీ జాతికిన్?”
రాయచారం ముగిసింది. ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుంటున్నాడు. ఈయన బెదిరింపులకు వారు బెదరలేదు. పైగా ఆయన్నే బంధించాలని చూశారు! ఆయనకు కావలసిందీ అదే. వీడ్కోలు మాటలు చూడండి.
ఉ.
“రోషము నాపయిం గలిగి క్రూరత గౌరవు లింతసేత సం
తోషమ, నీవు ప్రాభవముతో తగ నాకు ననుజ్ఞ యిమ్ము; ని
ర్దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయులైన వారి వి
ద్వేషము జక్కం బెట్టి, జగతీవర! యింతకు పోయి వచ్చెదన్”
యుద్ధం జరిగితే కృష్ణునికేం ప్రయోజనం? దుష్టశిక్షణ. ధర్మరక్షణ. అదే కదా కృష్ణావతార పరమార్ధం.
ద్రుపద పురోహితుని రాయబారం కూడా విభిన్నం. ఆ విప్రుడు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ఆయనను భీష్ముడిలా పొగిడాడు -
కం.
“నీ వాక్యము విప్రస్వా/భావికమై యిట్లు శృతికి బరుషంబయినన్
భావింప గార్యమున యం/దే విధమున సభకు నింత నిష్టంబగునే!”
ఇక సంజయ రాయబారం. ఆయన ప్రాజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. ధృతరాష్ట్రుని పట్ల మొక్కవోని రాజభక్తి గలవాడు. ‘రాజ్యభాగం లేకుండా, మంచి మాటలతో సంధి చేసుకు రమ్మ’ని గుడ్డిరాజు చెప్పడంలో ఆయన కుటిల స్వభావం అర్థమవుతుంది. తిరిగి వచ్చి, రాజుతో ఇలా చెబుతున్నాడు.
ఉ.:
మానుషశక్తి యొల్లడు సమంచిత దైవమ యూదియుండు నీ
పైన నతండు పుణ్యమును పాపము బెట్టిన వాడు నీవు నీ
సూను వశంబ కాని యొక చొప్పు దలంపవు కర్ణ సౌబలా
ధీనము కార్య నిశ్చయము దెల్లము నీమత మొప్పదేమియున్.
సంధి పొసగేది కాదని, నిజం నిష్ఠూరమైనా చెప్పేశాడు సంజయుడు.
ఆంజనేయస్వామి, అంగదుడు, రావణాసురుని వద్దకు రాయబారం వెళ్లినపుడు కూడా, బెదిరింపులే తప్ప, నచ్చచెప్పినట్లుగా కనబడదు. స్వయంగా బల ప్రదర్శన కూడా చేసి వచ్చాడు అంగదుడు.
రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల మద్దతు కూడగట్టడం కోసం, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, రాయబారిగా వచ్చాడు. ఆయన సాంప్రదాయకంగా, వామపక్ష లేబర్ పార్టీకి చెందినవాడు. భారత స్వపరిపాలనకు అనుకూలుడు. కాని, భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి పూర్తిగా విముఖుడైన చర్చిల్ నాయకత్వంలోని సంకీర్ణ యుద్ధ క్యాబినెట్ సభ్యుడు. “యుద్ధంలో మాకు మద్దతిస్తే, తర్వాత మీకు మేం ఫ్రీడం ఇస్తాం” అని బేరం పెట్టాడు క్రిప్స్. కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ ఒప్పుకోలేదు. రాయబారం ఫెయిలయ్యింది.
‘బుగ్గానిపల్లె పంచాయితీ’ అని మా కర్నూలు జిల్లాలో ఒకటుంది లెండి. డోన్-నంద్యాల రైలు మార్గంలో బేతంచెర్ల తర్వాత ‘సిమెంట్‍నగర్’ స్టేషన్ వస్తుంది. ఆ ఊరి పేరే బుగ్గానిపల్లె. అక్కడి పెద్దమనుష్యులు ఇరు పక్షాలకు సంధి కుదర్చకుండా, జాగ్రత్తగా పంచాయితీ చేస్తారు. ఇరువర్గాలూ నష్టపోయి, సంధి కుదిర్చేవారికే బెనిఫిట్! ఇదో రకం. వీళ్ళు రెండు వైపులా ఉన్నట్లు ఉంటారు. జోసెఫ్ అడిసన్, “మచ్ మైట్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్” అని సర్ రోగర్ డి కావర్లీ తో ఒక చోట ‘స్పెక్టేటర్’ వ్యాసాలలో చెప్పిస్తారు. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలకు అదే ప్రేరణ అని చెబుతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసే రాయబారం ఇది. ఇది చాలా ప్రమాదకరం!

భార్యాభర్తలు గొడవ పడితే, వారి మధ్య సయోధ్య కుదర్చడానికి రాయబారం చేయటమంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. ఎందుకంటే, ఎంతగా పోట్లాడుకున్నా, వాళ్లిద్దరూ ఎప్పటికైనా ఒకటే.
ఇంగ్లీషులో రాయబారిని ‘అంబాసడర్’ అంటారు. అప్పట్లో ఒక కార్ల కంపెనీ తమ కారుకు ఆ పేరును పెట్టింది. అప్పుడు కారంటే అంబాసడర్ కారే. రాయబారి ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉన్నతస్థాయి దౌత్యవేత్త. ఆయనను ‘ఎన్వాయ్’ అని కూడా అంటారు. తాను రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తాడు. రెండు దేశాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తాడు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్) అధికారులతో రాయబారులుగా పంపుతారు. కామన్‌వెల్త్ దేశాలలోని రాయబారులను ‘హైకమిషనర్’ అంటారని మీకు తెలుసు. వీళ్లు కాక, బ్రాండ్ అంబాసిడర్స్ అని ఉన్నారు. విరాట్ కోహ్లి, అమితాబ్, షారుక్ ఖాన్ లాంటి వారు. వీరితో పేచీ లేదు.
రాయబారి సహనశీలుడు, స్థితప్రజ్ఞుడు, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నిష్ణాతుడూ అయి ఉండాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాకూడదు. అన్నట్లు, మీకెవరితోనైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను మీడియేషన్ చేస్తా! వద్దంటున్నారా? సరే సరే! అదన్నమాట!
Wednesday, April 9, 2025
అధిక ప్రసంగం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక
‘ప్రసంగం’ అంటే ‘ఉపన్యాసం’ మాత్రమే కాదు, మామూలుగా మాట్లాడడం కూడా నండి. అధికంగా మాట్లాడడం, అవసరానికి మించి చెప్పడం, ఎదుటవాడికి విసుగును కలిగిస్తుంది. కొండొకచో కోపాన్ని కూడా. అధిక ప్రసంగం రెండు రకాలని మనవి చేస్తున్నా. ఒకటి స్వీయ పాండిత్య ప్రదర్శన కోసం చేసేది. రెండు కేవలం అజ్ఞానంతో చేసేది. రెండింటినీ భరించడం కష్టమే.
అష్టావధానాల్లో ఎనిమిది మంది పృచ్ఛకులుంటారు. అది మీకూ తెలుసు. వారిలో ఒకరు ‘అప్రస్తుత ప్రశంస’ చేస్తుంటారు. వీరిని ‘అధిక ప్రసంగులు’ అనవచ్చు. సందర్భ శుద్ధి లేకుండా, ఏదో ఒకటి అవధానిని అడిగి, ఆయన ఏకాగ్రతను మళ్లించడమే వారి పని. వీరు కూడా పండితులై ఉంటారు. వీరి మాటలు హస్యస్ఫోరకంగా ఉండి, సమకాలీన సమస్యలను వ్యంగ్యంగా ఎత్తి చూపుతాయి. పృచ్ఛకులలో వీరు కీలకం సుమండీ! అవధానంలో అప్రస్తుత ప్రశంస చేయడం అంత వీజీ కాదు మాస్టారు!
ఈ పేరున ఒక అలంకారం కూడా ఉంది సాహిత్యంలో. దాని లక్షణం, ‘ప్రస్తుతాన్ని ఆశ్రయించి, అప్రస్తుతాన్ని తలచుకోవడం’. దీంతో మనకు పేచీ లేదు. నేను చెబుతున్నది ‘అధిక ప్రసంగం’. ఇది అలంకారం కాదు మహాశయా! ఇదొక జబ్బు. ‘ఎక్స్‌ట్రా వాగుడు’ అని దీనిని తెలుగులోకి అనువాదం చేయవచ్చు.
శ్రీ రామానుజాచార్యుల వారు ‘భక్తి’ తత్త్వమును ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంతం, మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఎదుర్కుని నిలిచింది. దీనికీ, అధిక ప్రసంగానికీ సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? లేక ఇది నా అధిక ప్రసంగం అనుకుంటున్నారా? కాదు బాబోయ్! ఆ మధ్య ఒకాయన, రామానుజాచార్యుల వారి మీద సినిమా తీస్తానన్నాడు. ఆయనే ఆ పాత్రలో నటిస్తాడట. ఆయన డబ్బులు, ఆయనిష్టం. కానీ ఆయన ఏమని సెలవిచ్చారంటే, “రామానుజులు సాక్షాత్ వేంకటేశ్వర స్వామికే గురువు!” అని. ఇదీ అధిక ప్రసంగం అంటే! అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు, ఏడు కొండల వెంకన్న బాబు - పరమాత్మ! ఆయనకు గురువేంటండీ బాబూ! ఇంకా తీయని సినిమా కోసం, దాన్ని ఇలా ప్రమోట్ చేసుకోవచ్చా? వికటించిందంటే డబ్బాలు రెండో రోజే తిరిగొస్తాయి! జాగ్రత్త! అన్నట్లు ఇప్పుడు బాక్స్‌లు ఎక్కడివి? శాటిలైట్ నుంచి తెర మీదికి డవిరెక్ట్‌గా ఎలిపొస్తుంటేను!
సోషియల్ మీడియా పరిఢవిల్లుతూన్న కొద్దీ (పదం బాగుందని వాడాను లెండి) అధిక ప్రసంగాలు ఎక్కువైపోతున్నాయి. రామేశ్వరంలో శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించనే లేదంటాడొకాయన. లంక నుంచి డైరెక్ట ఫ్లయిట్లో భరద్వాజాశ్రమానికి వెళ్ళిపోయాడంటాడు. అలా కాదు కామ్రేడ్, వారధి కట్టేముందే శివలింగ ప్రతిష్ఠ జరిగిందంటే వినడే! ససేమిరా అంటుంటే! అసలు విషయం, శివుడంటే ఆయనకు గిట్టదు! అయినా, నాకు తెలియక అడుగుతానండీ, శివకేశవులకు అభేదమన్న సత్యం తెలియని వాడూ జ్ఞానేనా? అదీ నా డౌటానుమానం!

‘ఇంట్లో దీపం ఎవరు వెలిగిస్తే ఎక్కువ మంచి జరుగుతుంది?’ అని క్యాప్షన్! దాని గురించి అధిక ప్రసంగం. దీపం వెలిగించడం ముఖ్యం కాని, ఎవరు వెలిగిస్తేనేం, వాడి పిచ్చి గాని. రాజకీయాల్లో అధిక ప్రసంగాలకు లాజిక్కులుండవు. ఏదైనా పెద్ద కంపెనీ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందనుకోండి. ఎగస్పార్టీ ఆయన, “అవును, మూడేళ్ళ క్రిందట, మేం పవర్లో ఉన్నపుడు మాట్లాడేశాం! దాని ఫలితమే ఇది!” అని చెబుతాడు గొప్పగా. మరి అప్పుడే ఎందుకు రాలేదు బంగారూ?
‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమా చూశారు కదా! కళాఖండమది. అందులో చివరి సీనులో శిశుపాలుడు, శ్రీకృష్ణపరమాత్మకు అగ్రస్థానం ఎందుకు ఇవ్యాలని సుదీర్ఘ అధిక ప్రసంగం చేస్తాడు. చక్రాయుధంతో చస్తాడు. ఆ పాత్రను ‘రాజనాల’ గారు అద్భుతంగా పోషించారు. ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఉచ్చారణ, సింప్లీ సుపర్బ్! ఇలా చెప్పగలిగిన వారిప్పుడేరి? నంగిరి నంగిరిగా మాట్లాడేవారే ఇప్పుడు మహానటులు! సీను ముగిసిన తర్వాత యన్టీఆర్ రాజనాలను కౌగిలించుకోని, “మామా! నీవు తప్ప ఈ పాత్రను ఇంత గొప్పగా వేరెవరూ పోషించలేరు” అని ప్రశంసించారట. దటీజ్ ది స్పిరిట్.
“ఎప్పటి కెయ్యది ప్రస్తుత/మప్పటికా మాటలాడి అన్యుల మనముల్/ నొప్పింపక తానొవ్వక/తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!” అన్నారు బద్దెన అని పిలువబడే భద్ర భూపాలుడు. అంటే “అధిక ప్రసంగం చేయకండిరా!” అని మొత్తుకున్నాడు పాపం! కానీ వినరే! “అధికస్య అధికం ఫలం” అన్నారు మన పెద్దలు. “ఎక్కువైతే మరీ మంచిది”. సరే. కానీ అతివాగుడికిది వర్తించదు సోదరా!
శూద్రకుని ‘మృచ్ఛకటికం’లో శకారుడు, ‘పాతాళభైరవి’ సినిమాలో రాణీ గారి తమ్ముడు రేలంగి, షేక్స్‌స్పియర్ హెన్రీ ఫోర్ నాటకంతో ఫాల్స్ స్టాఫ్, ఉత్తర కుమారుడు - వీళ్ళంతా అధిక ప్రసంగానికి బ్రాండ్ అంబాసడర్స్. ఈ మధ్య ‘స్టాండప్ కమెడియన్స్’ అని కొందరు తయారైనారు. వారి హస్య ప్రదర్శనల్లో వివాదాస్పద విషయాలు వాగి చిక్కుల్లో పడుతుంటారు. ‘కునాల్ కమ్రా’ అనే నిలబడే కేతిగాడు, ఆ మధ్య, ‘హమ్ హోంగే కంగల్’ అన్న పాటను పేరడీ చేస్తూ పాడాడు. అది భారతదేశాన్ని, ప్రధానిని, సుప్రీంకోర్టును కించపరచేలా ఉందని, ఆయన మీద కేసులు పెట్టారు. హాస్యమైనా శ్రుతి మించితే, అధికమైతే..! అదన్నమాట!
Friday, April 4, 2025
సంధ్యావందనమ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక
“సంధ్యకు సిద్ధంకా నాయనా!” అని 37 ఏళ్ల పెళ్లి కొడుకును, పెళ్లికి ఒక రోజుకు ముందు ఉపనయనం మొక్కుబడిగా చేసుకొన్నవాడిని, అడిగితే “సంధ్యా? ఎవరా అమ్మాయి!” అని అడిగాడట.
ఈమధ్య చాలా మంది వీకెండ్స్ ప్రసిద్ధ దేవస్థానాలకు విపరీతంగా వెళుతున్నారు. కార్ పార్కింగ్ కూడా దొరకడం లేదు! భక్తి కార్పొరేట్ అయిపోయింది! ఇక సంధ్యావందనం చేసేవారెవరు? ఆమధ్య, బెంగుళూరులో, మా మేనకోడలు కొడుక్కు ‘వడుగు’ చేశారు. వాడి పేరు ధరణీరామ్! నిండా పదేళ్లు కూడ ఉండవు. పంచశిఖలతో, దండము, ముంజి ధరించి, హోమంలో సమిధలు వ్రేలుస్తూ, సాక్షాత్తు వామనుడిలా ఆ బుజ్జి వటువు ప్రకాశిస్తుంటే, నాకు ఎంత ముచ్చచేసిందో! ఆ సందర్భంగా, బలిచక్రవర్తి యాగానికి సాక్షాత్త్ విష్ణువైన వామనస్వామి వచ్చిన ఘట్టాన్ని, పద్యప్రసంగం చేసి, బాల వటువును ఆశీర్వదించాను.
‘ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి’ అని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు వేడుకలన్నీ లేటే! ఉపనయనం, పెండ్లి, కలిపి చేస్తారు. పిల్లో, పిల్లాడో పుడితే, ఎన్ని నెలలైనా నామకరణం చెయ్యరు. ఏం పేరు పెట్టాలో, గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. తీరా అతి సృజనాత్మకంగా ఆలోచించి పేరు పెడితే, అవి అర్థంపర్థం లేకుండా అఘోరిస్తాయి!
సంధ్యావందనం, ‘సంధి యందు చేయతగినది’. దాన్ని చేయకుండా ఇతర కర్మలను నిర్వహించరాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సూర్యునికి అర్ఘ్యం, గాయత్రీ మంత్రజపం, యశస్సును, తేజస్సును, బుద్ధిని, ప్రజ్ఞను, శ్రేయస్సును, బలాన్ని ప్రసాదిస్తాయి. మూడు సార్లు (త్రికాల) సంధ్య వార్చాలి. వృత్తి ఉద్యోగాల వల్ల సాధ్యం కాకపోతే, ‘మానసిక సంధ్య’ కూడ చేసుకోవచ్చు. నాలుగు వేదాల సంప్రదాయాలను బట్టి సంధ్యావందనాలుంటాయి. చివర్లో, ‘కరోమి యద్యత్ సకలం నారాయణేతి సమర్పయామి!’ అని వస్తుంది. దానితో పాటు ‘అగ్నికార్యం’ అని మరొక కర్మ ఉంది. ఇది యజుర్వేదీయం. మోదుగ పుల్లలను సమిధలుగా వ్రేలుస్తూ అగ్నిని ఆరాధించాలి. ‘ఓం అగ్నయే నమః’, ‘ఓం హుతవహాయ నమః’, ‘ఓం సప్తజిహ్వాయ నమః’ అంటూ హోమ భస్మాన్ని నుదుట ధరించాలి. కనీసం ఇవి ఉన్నాయని కొందరయినా తెలుసుకొంటారని నా ఆశ. నాకు మా నాన్నగారు 8వ ఏటనే ఉపనయనం చేశారు. నా వడుగు అలంపురం క్షేత్రంలో జరిగింది. సంధ్యావందనంతో బాటు, అగ్నికార్యం కూడ ఐదారేండ్లు చేసుకున్నానని సవినయంగా మనవి చేస్తున్నా. మా తండ్రిగారి దయ వల్ల, దేవతార్చన, నమక చమకాలు, పురుషసూక్త, శ్రీసూక్తాలు. మహన్యాసం అన్నీ వచ్చాయి. ‘తండ్రి, హరి జేరుమనియెడు తండ్రి, తండ్రి!’ అని భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాదుడన్నట్లు, అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టం.
వెనకటికి ఒకాయన, కొడుక్కు వడుగు చేశాడట. వాడు మర్నాటి నుండీ సంధ్య వార్చడం మానేశాడు. ఆయన ఇల్లాలు “ఏమండీ! వాడిని కూర్చోబెట్టి సంధ్య వార్పించకూడదూ!” అంటే ఆ మహానుభావుడు. “నిన్నగాక మొన్న వడుగయిన వాడికే సంధ్యావందనం గుర్తు లేకపోతే, ఎప్పడో ముఫై ఏళ్ల కింద చేసుకొన్న నాకు గుర్తుండి ఛస్తుందా!” అన్నాడట. యథా పితా, తథా సుతా! సరిపోయింది.
ఒకసారి ఒక ఆధునిక మేధో సంపన్నుడు, “నాకు ఉపనయనం అయింది. కానీ ఎప్పుడూ సంధ్యావందనం చేయను! కాని ఏమయింది? నా జీవితం సూపర్‌గా ఉంది కదా!” అని సంబరపడిపోయాడట. దానికి, నడిచే దేవుడు, కంచి మహాపెరియవ పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యస్వామి వారు ఇచ్చిన సమాధానం!
“ఒక సైకిలిస్టు కొంత సేపు వేగంగా పెడల్ తొక్కిన తర్వాత, తొక్కడం ఆపినా, సైకిలు పరుగు తీస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఊపును సంతరించుకుంటుంది (gains momentum). మన పూర్వీకులు, బ్రహ్మతేజోసంపన్నులు, మన సనాతన ధర్మం అనే సైకిల్‌ను బాగా తొక్కి వదిలారు. ఇది యింకా నడుస్తూనే ఉంది. నీవు సంధ్యావందనం చేయకపోయినా, బాగున్నావంటే, వారి వారసత్వం, వారి పుణ్యం, నిన్ను నడిపిస్తున్నాయని తెలుసుకో”.
క్రమంగా ఆ ప్రభావం తగ్గుతూ వస్తుంది. యువతరానికి ఎన్నో వ్యామోహాలు! మన సంస్కృతి, సంప్రదాయం అంటే ఏమిటో తెలియదు. జంధ్యం తీసి ఎప్పుడో ‘చిలక్కొయ్య’ (అది ఇప్పుడుందా!) కు తగిలించేశారు. యజ్ఞోపవీతాన్ని ధరించడానికి, పాతది తీసేయడానికి వేర్వేరు మంత్రాలున్నాయి. యజ్ఞోపవీతం లోని మూడు సూత్రాలు, గాయత్రి (అలోచన) సరస్వతీ (పదం), సావిత్రి (కర్మ). మధ్య లోని ముడి అనంతమైన బ్రహ్మపదార్థం.
“జంధ్యం యొక్క ప్రాశస్త్యం ఏమిరా?” అని గురువుగారు అడిగితే, “వీపు దురద పెట్టినపుడు గోక్కోవడానికి భేషుగ్గా ఉంటుంది!” అన్నాడట ఒక శిష్యుడు. ‘సాక్షి’ ప్రసంగాలలో పానుగంటి వారు జంఘాలశాస్త్రితో ఒక చోట ఇలా చెప్పిస్తారు: “భారతీయులకు, బ్రిటీష్ వారిలాగా ఇంగ్లీషు పలకడం రాదు - అన్నది నేనంగీకరించను. నా సవాలు ఏమిటంటే మన మాధ్యాహ్మిక సంధ్యావందనం లోని అర్ఘ్యప్రదాన మంత్రాన్ని వాళ్లను సుస్వరంగా పలకమనండి. వందేళ్లు టైం ఇచ్చినా పలకలేరు.”
ఆ మంత్రం ఇది. “హగ్ం సస్యుచిషత్, వసురంతరిక్షసత్, హోతా వేదిషత్, అతిథిర్ధురోణ సత్, బుష ద్వర, సద్వృత, సద్వ్యోమ, సదబ్జా,..” ఇలా సాగుతుంది. అంత మహోజ్జ్వలమైనది మన వైదిక ధర్మం.
రోజుకో ఐదు సార్లు, ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నా వారి దైవాన్ని ప్రార్థన చేసేవారిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటే, అదే మనల్ను రక్షిస్తుంది. సర్వేజనాః సుఖినోభవన్తు! అదన్నమాట!
Wednesday, March 26, 2025
అతి గోప్యం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక
ఆ మధ్య మా దగ్గర బంధువు ఒకాయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి, రెండు స్టెంట్స్ వేయించుకున్నాడట. కానీ ఆ విషయం బంధువులెవ్వరికీ తెలియకుండా వాళ్ళు జాగ్రత్తపడ్డారు. ఎందుకో మరి? ‘సంసారం గుట్టు, వ్యాధి రట్టు’ అని కదండీ మన పెద్దలు చెప్పింది? ఈమధ్య మానవ సంబంధాలు తూతూ మంత్రంగా తయారైనాయి. దీనికి తోడు అతి గోప్యాలు! మా పరిచయస్థులొకరు మా యింటికి వచ్చారొక రోజు. ఆయనకు కాఫీ ఇవ్వాలి కదా! మా శ్రీమతి, “సార్, మీకు చక్కెర వేయచ్చునా.. లేక..” అన్నది. భారత్ మధుమేహ రాజధాని గదా! అందుకాయన. “అబ్బే! నాకు షుగర్ అస్సలు లేదమ్మా! కాని పంచదార వేయకండి” అన్నాడు. ‘ఇదేదో విరోధాభాసాలంకారంలా ఉందే?’ అని అనుకున్నాను. లేక ముందుజాగ్రత్తేమో! తర్వాత ఎవరో చెప్పారు, ఆయన ‘వెరీ వెరీ స్వీట్ బోయ్’ అని, ఇన్సులిన్ కూడా తీసుకుంటాడని! ఎందుకీ గోప్యాలు!
ప్రఖ్యాత వ్యాసరచయిత ఫ్రాన్సిస్ బేకన్, ‘ఆఫ్ సిమ్యులేషన్ అండ్ డిస్‌సిమ్యులేషన్’ అనీ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. ‘దాపరికం, బహిర్గతం’ అన్న మాట! కాని లోతుగా వెళితే, డిస్సిమ్యులేషన్ అంటే మన ఆలోచనలను, విషయాలను దాచి ఉంచడం. సిమ్యులేషన్ అంటే ఇతరులను మోసగించడం కోసం, ఒక కపటచిత్రాన్ని ఆవిష్కరించడం.
తెనాలి రామకృష్ణుడు మహాకవి. కాని ఆయనను ‘వికటకవి’గా ముద్ర వేశారు. ఆయన హస్యచతురతను రకరకాల కథలుగా సృష్టించారు. కల్పితాలయినా అవి బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్! ఆయన పాండిత్యం కంటే ఇవే చాలామందికి తెలుసు, మధ్యలో తెనాలాయన ఎందుకు? కొంపదీసి మీది తెనాలా? అనుకుంటున్నారా? కొంపతీయకున్నా, మాది తెనాలి కాదండోయ్! దాచమని అత్యంత గోప్యంగా చెప్పిన విషయాన్ని ఆయన సోషియల్ మీడియాలో ఎంత విస్తృతంగా ప్రచారం చేశాడో చూడండి! “అప్పుడు సోషియల్ మీడియా ఎక్కడుంది? పోదురూ! బడాయి!” అంటున్నారా! అది ఎప్పుడూ ఉంది: ఏమంటే రూపం వేరు!
తెనాలివారు ఒకసారి రాణీగారి మందిరానికి వెళ్లాడు. ఆయనకు రాజకుటుంబంతో క్లోజ్ రిలేషన్స్ ఉండేవి! నేరుగా లోపలికి వెళ్లగలిగే చనువు, చొరవ ఉన్నాయి. సరిగ్గా అప్పుడు, రాణీగారు మోచేతుల మీద విపరీతంగా గోక్కుంటున్నారు. రాణీగారయితే గొప్పా ఏం? దురదలకు అవన్నీ తెలియవు. ఆమె తెనాలి వారితో “స్వామీ! ఈ దురదలతో చచ్చే చావయింది. దయచేసి ఈ విషయం ఎక్కడా అనకండి!” అన్నది. “మహారాణి!
మీరంతగా చెప్పాలా?” అన్నాడు. తర్వాత ఆమె దేవాలయానికి బయలుదేరుతూ, ఈయననూ రమ్మంది. సింగిల్ గుర్రం పూన్చిన చిన్నవాహనంలో ఆమె వస్తుండగా, పరిజనులు, సైనికులు, ముందూ వెనుకా! ఇంతలో వికటకవిగారు గుర్రం మూతికి తన అంగోస్త్రం కట్టారు. బండికి పరదాలు! ఒక రాజ సేవకుడు అడిగాడు, “స్వామీ! ఎందుకలా కట్టారు?” అని. వికటకవి అతని చెవిలో రహస్యంగా చెప్పాడు “రాణిగారికి దురదలు! ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. గుర్రం ఏమయినా పొరపాటున ఎవరికైనా చెబుతుందేమో అని ఈ జాగ్రత్త! నీవు కూడా ఎవ్వరితో అనకు” అన్నాడు. ఆయన ఇదే మాట ఇంకొకాయనతో అన్నాడు. ఇలా మొత్తం అందరికీ తెలిసిపోయింది. సోషియల్ మీడియా చాలా పవర్‌ఫుల్.
ప్రాన్సిస్ బేకన్ గారు దాపరికాన్ని రకరకాలుగా పేర్కొన్నారు. మొదటిది ‘సీక్రెసీ’. తన భావాలు ఎవరికీ చెప్పడు. ఇది అంత హానికరం కాదట. ఇది కొన్నిసార్లు అవసరం కూడానట. రెండవది ‘హిపోక్రసి’. అంటే తనను ఇంకో రకంగా (మోసపూరితంగా) చూపించుకోవడం. మరీ ఎక్కువ దాపరికం మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తుందట.

‘ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు’ అని నానుడి. పాపం ప్రతీదానికి వాళ్లనెందుకండీ ఆడిపోసుకుంటారు? ఎందుకు నానదంటే నానే లోపు దాన్ని ఇతరులకు చేరవేస్తారనేమో! అది వారి బోళాతనాన్ని, దాపరికం లేని గుణాన్ని చూపిస్తుందంటా నేను! నేనసలే స్త్రీ జన పక్షపాతినని మీకు ఇదివరకే మనవి చేసి ఉన్నా! సెల్‌ఫోన్లు వచ్చింతర్వాత, ఆడవారి ‘విషయ బహిర్గత ప్రావీణ్యం’ నాలుగు రెట్లు పెరిగింది. అయినా వారికీ కాలక్షేపం కావాలి కదా! తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు ‘షేర్’ (సోషయల్ మీడియా భాషండోయ్!) చేస్తే తప్పులేదు. కాని, ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’ అన్నట్లుగా తమ సృజనాత్మకతను జోడించి, విషయానికి మసాలా దట్టించి వదలకూడదు. ఒకావిడ ఒక బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది. అమ్మాయి పేరును బట్టి అది కులాంతర వివాహం అని అర్థమైంది. ఇక ఈవిడ తన ‘కిత్ అండ్ కిన్’ అందరికే ఒకటే కాల్సు! దాన్ని మతాంతర వివాహంగా మార్చింది. దానికి ముందు ఉభయ కుటుంబాల్లో ఎన్ని గొడవలైనాయో (ఏ గొడవలూ అవలేదు, శుభ్రంగా ప్రేమించుకున్నారు, ఉభయులూ అంగీకరించారు) వివరించింది. నువ్వుగింజ నానకపోగా, బాగా ఉబ్బిందన్నమాట!
ఒక్కటి మాత్రం నిజం మాస్టారు. సత్యం ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లాంటిది. దాన్ని ఎంత దాచాలనుకున్నా దాని సువాసన దాన్ని పట్టిస్తుంది. అబద్ధం అతి త్వరగా వ్యాపిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో హిపోక్రసీ లేకుండా జీవించడం కష్టం. ఒక సూపర్ హిట్ సినిమాను, అది ఎంత చెత్తగా ఉన్నా, బాగులేదని చెప్పలేం. అలా ఉంది పరిస్థితి. సాధ్యమైనంత వరకు ఓపెన్ మైండ్‌తో ఉందాం! పదిమందికి తెలిస్తే మనకు మంచి జరుగుతుందంటే చెబుదాం! అతి గోప్యం హానికరం! అదన్నమాట!
Thursday, March 20, 2025
మైట్యూబ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక
నాకెందుకో, యూట్యూబ్‌కు మైట్యూబ్ అని పేరు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మిత్రమా! ఎందుకంటే ఎవరయినా సరే, ఒక ఛానెల్ పెట్టి, తమకు తెలిసింది. తెలియనిదీ చెప్పి, ఊదరకొట్టేయొచ్చు. నాకు కొంతమంది, “మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేయొచ్చు కదా!” అని ఒక అయాచిత, ఉచిత సలహా పారేస్తుంటారు. ఉచితాలు మంచివి కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టే హితవు చెప్పినా వాళ్లు వినరే! ఖర్చు లేని పని గదా! అప్పుడు, ఎవరో పంపిన ఒక జోక్ నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు, “పెద్దయ్యాక, నీవేమవుతావురా?” అని అడిగితే, “ఇంజనీరు అవుతా, లేదా డాక్టర్‌ను అవుతా, లేదా కలెక్టర్‌ను అవుతా” అని చెప్పేవాడట. తీరా పెద్దయ్యక “వెల్‍కమ్ టు మై యూట్యూబ్ ఛానెల్ ‘ఊకదంపుడు!’ లైక్! కామెంట్! అండ్ సబ్‌స్క్రైబ్!” అంటూ తయారయ్యాడట!
ఈమధ్య సొంతంగా యాట్యూబ్ ఛానెల్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. పవన్ అన్న చెప్పినట్లు, ‘ట్రెండ్ సృష్టించడమే గాని, ఫాలో అవను’ అన్నది ఈ సోకాల్డ్ యూట్యూబర్లకు వర్తించదు. ‘బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్!’ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది లెండి. అంటే ఎవడి తప్పెట (డబ్బా!) వాడు మోగించుకోవడం. మైట్యూబర్లు, సారీ. యూట్యూబర్లు చెప్పేదానికి, చూపేదానికి ఫలానా ప్రమాణం అంటూ ఏవీ ఉండనవసరం లేదు సోదరా! మనకు వచ్చింది, నచ్చింది, చెప్పేయవచ్చు.
యూట్యూబర్‍లలో చాలామంది వాడే ఊతపదం ‘ఐతే’. ప్రతి వాక్యంలో కనీసం నాలుగైదు ఐతేలు ఉంటేగాని వారికి నోరు పెగలదు మరి. మా ఉద్యోగ పెన్షనర్ల ఛానెల్స్ బోలెడు. ‘ఐ.ఆర్, డి.ఎ.లపై సంచలన ప్రకటన! ఉద్యోగ పెన్షనర్లు సంబురాలు!’ అని పైన ఉంటుంది. ఓపన్ చేస్తే, దాన్ని ప్రకటించింది. యూనియన్ వాళ్లు! విసుగొచ్చి మావాళ్లు అవి చూడడం మానేశారంటే నమ్మండి!
‘పద్యవీణ’ అని చానెల్ పెడతాడొక శాల్తీ. ఆయనకు పద్యం రాగయుక్తంగా చదవడం రాదు. వివరణ ఎంత ఘోరంగా ఉంటుందంటే, “ఆకాశవాణి! అల్లాటప్పా కేంద్రం! వార్తలు చదువుతున్నది వెంగళప్ప!” లెవెల్లో సాగుతుంది. ఇంకో ఆయన తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రముఖ నటులు ఉన్న సన్నివేశాన్ని చూపుతూ, సౌండ్ మ్యూట్ చేసి, ఈయన ఆ పద్యాలను పాడుతుంటాడు. ఎంత స్ట్రాటజీయో చూడండి! యన్టీఆర్‌ను, యస్వీఆర్‌ను చూడ్డం ఎవరికైనా ఇష్టమే కదా! కాని అక్కడ పాడుతున్నది ఘంటసాలవారు కాదు, మైట్యూబర్!
ఇంకొకాయన, మార్కర్ పెన్‌తో డిస్ ప్లే బోర్డు మీద రాస్తూ, కొట్టేస్తూ, తుడుపుతూ నానా పాట్లు పడుతుంటాడు వివరిస్తూ! పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్నమాట! దాంట్లో పవరూ ఉండదు, పాయింటూ ఉండదు! నీరస నిస్సార ప్రెజెంటేషన్ మాత్రం ఉంటుంది.
ఇంతకు ముందు టి.వి. ఛానళ్లలో డిబేట్లలో పాల్గొనే సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొందరు, ‘మైట్యూబర్స్’ అవతారమెత్తారు. ఏదో ఒక పార్టీకి విధేయులే. కాని చాకచక్యంగా దానికి ‘నిస్పక్షపాత పూత’ పూస్తారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ సి.ఎం.కు ఇంకా ప్రజాదరణ వెల్లువెత్తుతోందని వాదిస్తారు. ఈ పొలిటికల్ లాయల్టీస్ మనలాంటి అజ్ఞానులను తికమకపెడతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్న సూత్రం వీరికి కరెక్ట్‌గా సరిపోతుంది. కాని వారి ‘భావం’ మనకు ‘భవతి’ ఐతే మటుకు చిక్కే.
ఇక పండగలు, ప్రాశస్త్యాలు, ఆధ్యాత్మిక విషయాలయితే ఇక చెప్పనక్కర లేదు. మైట్యూబయ్యలు, మైట్యూబమ్మలు విజృంభించి చెప్పేస్తుంటారు, అందరికీ తెలిసినవే అయినా, వాళ్లే కనిపెట్టినట్లు! ఎవరయినా లబ్ధప్రతిష్ఠుల వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా నెగెటివ్‌గా బయటకు వచ్చిందనుకోండి! ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక!’ ఐనా, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, తీర్మానించేస్తుంటారు! ఎవరిది కరెక్టో తెలియక ‘వ్యూయర్స్’కు మకతిక!
ఇక వంటలు చేసి చూపించే వాళ్లయితే “హాలో ఫ్రెండ్స్!” అంటూ మొదలుపెట్ట “నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి” అని స్వకల్యాణం, విశ్వకల్యాణం గురించి చెప్పి, ఒంగోలు గంగాళం ఉప్మా, కర్నాటక కారాబాత్, పప్పు, చారు కూడా చాలా వివరంగా చేసి చూపిస్తారు. ఈ మధ్య కొందరు బొగ్గుల కుంపటి, మట్టి పాత్రలు, మూకుడులు, పైగా వాటికి విభూతి రేఖలు, కుంకుమ పెట్టి, సదాచార సంపన్న వంటలు చేస్తారు. కొందరు పొలాల్లో మూడు రాళ్లు పెట్టి, కర్రలు మండించి వంట చేస్తారు. అవన్నీ చూడడానికి బాగుంటాయి, చేసేవారికి నాలుగు రాళ్లు (అదేనండి బాబు, డబ్బులు) వస్తాయి గాని, అలా వంటలు చేసే కాలం ఎప్పుడో పోయింది.
అలాగని అందరూ అలాంటివారని కాదు నా ఉద్దేశం. చక్కని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసి చూపించే యూట్యాబర్లు కూడా ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వారు చక్కగా ప్రకాశింప చేస్తారు. వ్యూయర్‌షిప్ కోసం వారు చేయరు. అలాంటి వాళ్లను మైట్యూబర్స్ అనలేం. ‘వుయ్‌ట్యూబర్లు’ అంటే బాగుంటుంది. మైట్యూబర్లలో లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారండోయ్! డబ్బుదేముందండీ మాస్టారు! కుక్కను కొడితే రాలుతుంది! అలాగని కొట్టి చూసేరు! ఇంకేం? మీరూ ఒక ‘మైట్యూబ్’ పెట్టి చెలరేగిపోండి! అదన్నమాట!
Friday, March 14, 2025
నినాదమే ఒక విధానం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక
నినాదాలు కూడ భాషలో, సాహిత్యంలో ఒక భాగమే అంటాను నేను. మీరేమంటారు? ఒక నినాదం, ఒక విధానానికి ‘షార్ట్ ఫాం’ అంటే మీరు ఒప్పుకుంటారా? నినాదం అంటే.. “ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క విశేష ఉద్దేశం”. సాహిత్యపరంగా చూస్తే, ఆ ఉద్దేశానికి, అది పరిచయ వ్యాఖ్య లేదా సంక్షిప్త రూపం.
మన భారతదేశ జాతీయ నినాదంతో మొదలుపెడదాం. ‘సత్యమేవ జయతే’! ‘ఏవ’ అంటే సంస్కృతంలో ‘కేవలం’, ‘అది మాత్రమే’ అని అర్థం. ‘సత్యం మాత్రమే జయిస్తుంది’. ఎంత గొప్ప నినాదం! నిజానికి దీన్ని ముండకోపనిషత్ లోని ఒక మంత్రం నుంచి తీసుకున్నారు. భారత జాతీయ నినాదంగా 1950 జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఆమోదించారు. జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ కింద ఇది ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఒక సూక్తి ఉంటుంది. ‘నస్‌రుమ్ మినల్లాహి వఫతహ్ ఉన్ ఖరీబ్’ - అంటే సత్యం యొక్క జయం (అల్లాహ్ జయం) అతి దగ్గరలో ఉంటుందని. చెక్ రిపబ్లిక్ దేశం నినాదం ‘ప్రావ్ దావిటేజీ’ (సత్యం మాత్రమే ఉంటుంది).
దురదృష్టం ఏమిటంటే రానురాను సోషియల్ మీడియా పుణ్యమా అని, సత్యం కనుమరుగైపోయి ‘గాసిప్’గా మారింది. జి.ఆర్. మహర్షి ‘పురాగానం’ అన్న ఒక గొప్ప కథను వ్రాశారు. “కోతి నుండి మనిషి పుట్టాడంటారు. నిజమేనా?” అని ఒక పిల్లకోతి, కోతి బాబాగారిని అడిగితే, (కోతుల్లో కూడా బాబాలుంటారండోయ్!) ఆయన చిద్విలాసంగా నవ్వి “ఎవరి జ్ఞానం కొద్దీ వారు రాసుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ మనం నమ్మాల్సిన పనిలేదు” అంటారు. ఈ చురక ఇప్పటి ట్రెండ్‌కు సరిగ్గా సరిపోతుంది!
కొన్ని నినాదాలు ఎంత శక్తివంతమైనవంటే, ప్రభుత్వాలను (పార్టీలను) అధికారంలోకి తెచ్చేస్తాయి. ఉదాహరణకు ‘గరీబీ హటావో’ తీసుకుందాం. దీనిని ఇందిరాగాంధీ గారు 1971లో తన ఎన్నికల ప్రచారంలో పేల్చారు. అది 5వ పంచవర్ష ప్రణాళికలో ఒక భాగం. ప్రతిపక్షాలు దాన్ని ‘గరీబోం కో హటావో’ అని ఎగతాళి చేసేవారనుకోండి, అది వేరే విషయం. 2004 ఎన్నికల్లో, పాలక బి.జె.పి, ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) అని ఒక మార్కెటింగ్ నినాదాన్ని వదిలింది. అయినా, వాజపేయి ప్రభుత్వం ఓడిపోయింది! అంటే అంత వెలిగిపోలేదన్నమాట! ఎన్.టి.ఆర్. గారి ‘ఆత్మగౌరవ’ నినాదం బ్రహ్మాండంగా పనిచేసి, టి.డి.పి.ని అధికారం లోకి తెచ్చింది 1983లో! ‘తెలంగాణ వచ్చుడో, చచ్చుడో!’ అన్న టి.ఆర్.ఎస్ నినాదం, మాండలీక పరిమళాలను వెదజల్లటంతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏ విజయమూ శాశ్వతం కాదు సార్! నచ్చకపోతే ఎవరినైనా ప్రజలు మార్చేస్తారు మరి. దటీజ్ ది పవర్ ఆఫ్ పీపుల్! ది డెమోక్రసీ! మళ్లీ పవరిచ్చినా, సీట్లు తగ్గించి, హెచ్చరిస్తారు ఓటర్లు! అందరినీ వింటారు, చెయ్యల్సింది చేస్తారు.

స్వాతంత్య్ర సమరంలో ‘నినాదాలు’ తమ సత్తా చూపాయి! ఆయుధం చేయలేని పనిని నిదానాలు చేయగలవని నిరూపించాయి! నినాదాన్ని సృష్టించడం ఒక అద్భుత సృజనాత్మక ప్రక్రియ. నినాదాలు కూడా సాహిత్యంలో భాగమే! 1942లో ‘క్విట్ ఇండియా’ నినాదం అలాంటిదే! మొదట ఒకరు ‘గెట్ అవుట్’ అని సూచించారట. రాజగోపాలాచారి గారు ‘రిట్రీట్ ఆర్ విత్‌డ్రా’ అయితే బాగుంటుందన్నారట. ఈ రెండూ గాంధీజీకి అంతగా నచ్చలేదట. చివరికి ‘క్విట్ ఇండియా’ నచ్చి దాన్ని ఆయన ఖరారు చేశారట. దాన్ని సూచించిన వారు యూసుఫ్ మొహర్ అలీ. ‘జైహింద్’ నినాదాన్ని సృష్టించినవారు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ అబిద్ హసన్ సఫ్రానీ గారు. నేతాజీకి ఆ నినాదమంటే చాలా ఇష్టం. ప్రతి సభలో, సమావేశంలో అది భరతవాక్యంగా ఇప్పటికీ నిలిచిపోయింది. ‘కాకా బాప్టిస్టా’ అనే ఆయన మేధోపుత్రిక (అదేనండీ బ్రెయిన్ చైల్డ్!) యొక్క ఒక పదబంధాన్ని, లోకమాన్య తిలక్, ‘స్వరాజ్యం నా జన్మహక్కు’గా అనుసృజన చేశారు.
‘రణన్నినాదం’ అని కొందరు వాడుతుంటారు. నాకెందుకో అది తప్పేమో అనిపిస్తుంది. రణత్+నినాదం. యుద్ధ స్ఫూర్తిని కలిగించే నినాదమనా? కావచ్చు కాని ‘ని’ కి వత్తు ఎందుకో? రణనినాదం అంటే సరిపోదూ? దానిలో నాకు తెలియని వ్యాకరణ రహస్యం ఉందేమో? మీకు తెలిస్తే చెప్పరూ ప్లీజ్? దీన్ని చూస్తే ‘సత్యనారాయణ’ను కొందరు ‘సత్యన్నారాయణ’ అనడం గుర్తొస్తుంది నాకు. ఒత్తు పెడితే ‘ఎఫెక్టివ్’గా ఉంటుందనో ఏమో? అన్నీ ‘ఏమోలే’!
కొన్ని నినాదాలు వ్యక్తిగత అహంకారాన్ని సూచిస్తాయి. పధ్నాలుగవ లూయీ చక్రవర్తి ‘నేనే రాజ్యాన్ని!’ అని నినదించాడు. ఆయన పిచ్చిగాని, ఆయనే రాజ్యం ఎలా అవుతాడు? రాజ్యం శాశ్వతం. రాజు నాలుగు నాళ్లుండి పోతాడు.
నినాదం వల్ల ఒక విధానం ఆవిష్కరించబడాలి. అది ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. అప్పుడే అది సార్థకం అవుతుంది. కొన్ని అంత పాపులర్ కాకపోయినా, బాగుంటాయి. ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అన్నారు గాంధీ. ‘ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు’ అన్నారు నెహ్రూ. ‘చిన్న లక్ష్యం ఒక నేరం’ అన్నారు అబ్దుల్ కలాం. లాల్ బహదూర్ శాస్త్రిగారి ‘జై జవాన్, జై కిసాన్’ గొప్ప నినాదం. సైనికులను, రైతులను అది గ్లోరిఫై చేసింది! ‘కళ, కళ కోసం కాదు, ప్రజల కోసం’ అన్నారు బళ్లారి రాఘవ! ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న భగత్‌సింగ్ నినాదం పోరాట పటిమకు స్ఫూర్తినిచ్చింది. ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ అన్నారు పి.వి. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు దాశరథి. కవిత్వం పరిమళించే నినాదం!
‘అమర్ హై’కు, ‘జిందాబాద్’కు తేడా తెలియకుండా డబ్బు తీసుకునో, బిర్యానీ పాకెట్ కోసమో నినాదాలు చేసే వారిని చూస్తే నాకు కోపం రాదు, జాలేస్తుంది. అవి చేయించే వారంటేనే నాకు ఒళ్ళు మంట! ఒక వ్యక్తి అమరుడు కావాలంటే మాటలా? ‘జిందాబాద్’ పర్షియన్ మూలాలు కల మాట. ‘లాంగ్ లివ్’ అన్న మాట. ఎవరంటే వారి కోసం నినాదాలు ఇవ్వకూడదు. అదన్నమాట!
Monday, February 17, 2025
భార్యావిధేయులు! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ
‘భార్యావిధేయులు’ అనగానే నాకెందుకో శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. సత్యభామ ఆయనను నిరంతరం కట్టడి చేస్తుంటుంది. డామినేట్ చేస్తూంటుంది! ఐనా, ఆయన కిమ్మనడు! ‘అంతేగా!’, అంతేగా!’ అంటుంటాడు పైగా! కానీ, అదంతా నటనే! జగన్నాటక సూత్రధారి! ‘మీరజాలగలడా నా యానతి?’ అంటూ జూనియర్ సముద్రాల గారు రాసిన పాటను జమునగారు అద్భుతంగా అభినయించారు. కాని, చివరకు స్వామి ‘తన నాథుడు మాత్రమే కాదు, జగన్నాథుడ’ని ఆమె గ్రహించవలసి వచ్చింది. ఈ పాటను, సత్యభామ పాత్రకు పేరుపొందిన స్థానం నరసింహారావుగారే ‘మూలం’ రచించారని అంటారు. ఈ ‘తులాభారం’ నాటకాన్ని వ్రాసిన శ్రీ ముత్తరాజు సుబ్బారావు గారికి జై!
భార్యకు విధేయుడిగా ఉండడంలో కొంత సుఖం ఉంది అంటారు, ఆ సుఖం తెలిసినవారు. ఇంగ్లీషులో వీరిని ‘హెన్‌పెక్డ్’ అంటారు. కేంబ్రిడ్జి నిఘంటువు, భార్యావిధేయుడిని ఇలా నిర్వచించింది - “ఒక స్త్రీ చేత అదుపు చేయబడి, కొంచెం భయపడుతూ ఉండే మగవాడు. ఆ స్త్రీ అతని భార్యే.” ఫెమినిస్టులు, పురుషాహంకారాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూంటారు. కానీ, ఈ రెండో పార్శ్వాన్ని పెద్దగా ఎవరూ చూపించరు! ‘కుకోల్డ్’ అని ఇంకో మాట కూడ ఉంది. వీళ్లందరూ పరిహాసానికి గురైనవారే కాని జాలిపడిన వారు లేరు వారి మీద!
ఉద్దాలకుడు ఒక మునీశ్వరుడు. ఆయన భార్య చండిక. నిజంగా చండికే. భర్తంటే లెక్కలేదు. ‘ముక్కు పట్టి ఆడిస్తూ ఉంటుంది’ మగడిని. దీన్నే ‘లెడ్ బై నోస్’ అంటారు. ‘యతో’ అంటే ‘తతో’ అంటుంది. ‘ఎడ్డెం’ అంటే ‘తెడ్డెం’ అంటుంది. తన బాధను తన గురువు గారితో చెప్పుకుంటే ఆయన ఒక సులువు చెప్పాడు. అట్నుంచి నరుక్కురమ్మని! ఉద్దాలకుని తండ్రి తద్దినం. పెడదామంటే వద్దంటుంది కదా! అందుకని “మా నాన్న నాకేం చేశాడు? ఆయనకు తద్దినం పెట్టను!” అంటాడు! “మామగారు మంచివారు! నోరు ముయ్యండి. పెట్టాల్సిందే” అంటుంది చండిక. “పెడితే పెట్టొచ్చుగాని, గారెలు, బూరెలు, మూడు కూరలు, మూడు పచ్చళ్ళు ఏం చేయనక్కరలేదు.” అంటాడు. “అలా వీల్లేదు. అన్నీ చేస్తా!” అంటుందామె. గురువుగారి స్ట్రాటజీ బాగుంది కదా!
గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, చివరికి యస్వీరంగారావు గారలు కూడా భార్యా విధేయ పాత్రల్లో జీవించారు! భర్త ఎవరైనా, భార్య మాత్రం, సూర్యకాంతం గారే! ‘భర్తావిధేయురాలు’ అన్న పదమే లేదు చూశారా! రంగనాయకమ్మ గారు, వోల్గా గారు ఊరికే హడావిడి చేస్తుంటారు గాని, మగవాళ్ళల్లో అంత దుర్మార్గులు ఉంటారా చెప్పండి? బాపు గారి దగ్గర్నుంచి, ఈనాటి కార్టూనిస్టుల వరకూ, సోషల్ మీడియా జోకర్ల (అంటే జోకులు వేసేవారు) వరకూ, అంట్లు తోమే భర్తలు, వంట చేసే భర్తలు, బట్టలుతికే భర్తలు, అప్పడాల కర్రతో నెత్తిన బుడిపెలు కట్టించుకునే భర్తలు.. అంతా వీళ్ళే కదా! కాబట్టి, ఫెమినిజం కంటే పెళ్ళామిజమే ఎక్కువ యువరానర్!
మరి ‘పతివ్రత’ల సంగతేమిటి? అంటున్నారా మాస్టారు! వాళ్లెప్పుడూ గొప్పవాళ్లే. వాళ్ళ భర్తలకి ఏమన్నా అయితే, వాళ్ళు సూర్యోదయం కాకుండా చేసి, లోకాలను అతలాకుతలం చేయగలరు. త్రిమూర్తులను పసిపాపలుగా మార్చగలరు. మరీ సూపర్ ప్రతివ్రతలున్నారండోయ్! కుష్టువ్యాధిగ్రస్థుడైన భర్తను, గంపలో తలమీద మోసుకుంటూ, ఉంపుడుగత్తె దగ్గరకు మోసుకుపోతుంది ఒక మేడం గారు. ఇలాంటి వాళ్లను చూస్తేనే ఫెమినిస్టులకు ఒళ్ళు మండేది! మండదూ మరి?
అయినా, భార్యలు భర్తలను డామినేట్ చేస్తూ౦టే, నా మటుకు నాకు ముచ్చటగా ఉంటుందండి. మరి నీ సంగతేమిటి? అంటున్నారా? నేను చెప్పింది వేరే వాళ్ల గురించి! నా సంగతి మీకెందుకు? చెప్పాల్సిందే నంటారా? సరే. మా ఆవిడ మంచిదండోయ్! నన్నేమి అనదు!

వెనకటికి, భార్యకు వీరవిధేయుడైన ఒక రాజు గారుండేవారట. భార్యంటే కించిత్ భయం కూడాను! ఆయన రాజ్యంలో అందరూ ‘డిటో’లేనట. ‘యథారాజా తథా ప్రజా!’ అసలు భార్యావిధేయుడు గాని ‘రియల్ హీరో’ ఎవరయినా ఉన్నారా? ఉంటారా? అని సదరు రాజుగారికి డౌటనుమానం ఎలిపొచ్చింది! ఒక పెద్ద సభ పెట్టాడు. ప్రజలంతా భార్యలతో వచ్చేశారు! “మీలో భార్యావిధేయులు కాని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి” అని ప్రకటన! ఎవ్వరూ ఎత్తలేదు. సభలో భయంకర నిశ్శబ్దం! కాసేపటి తర్వాత ఒకాయన చెయ్యెత్తాడు! అంతే! జయజయధ్వానాలు! పదిమంది అతన్ని భుజాల మీద మోసుకొని తెచ్చి వేదిక మీద దింపారు.
రాజుగారు అడిగారా వీరుడిని - “భర్తావతంసా! మీ విజయరహస్యంబును విన కుతూహలముగా నున్నది” అని. “విజయ రహస్యమా! గదేందిర భై?” అన్నాడు అతను. ఏమిటో చెప్పాక “ఏమో నాకేం తెలుసు? చెయ్యత్తమని మా యావిడ మోచేత్తో పొడిచింది. ఎత్తానంతే!” అన్నాడు.
నాకు తెలియక అడుగుతాను గానీ, నీ ఆలనాపాలనా చూస్తూ, కావలసినవి వండి పెడుతూ, చొక్కా గుండీ ఊడిపోతే చొక్కా మీదే దాన్ని సూదీ దారంతో కుట్టి, నీకు దగ్గరగా వచ్చి, దారాన్ని మునిపంటితో కొరికే నీ భార్య, నిన్ను డామినేట్ చేస్తే తప్పేంటి కామ్రేడ్! అసలు ‘భర్త’ అంటే ఎవరు? భార్య ఆధిక్యతను భరించేవాడు! భార్య చెప్పినట్లు విని బాగుపడనివారు లేరు, లేరు, ఈ జగాన లేరు! మా ద్రోణాచలం - కర్నూలు ప్యాసింజర్‌లో ఒక గుడ్డివాడు ఇలా పాడుతూ వచ్చేవాడు. “హాలయాన వెలసిన హా దేవుని రీతి, హిల్లాలే హీ జగతికి జీవన జ్యోతి!” ఈ పాట రాసిన వీటూరి, పాడిన ఘంటసాల వారలు అతని పాట వింటే జుట్టు పీక్కునేవారు. నేనసలే స్త్రీజన పక్షపాతిని! వాళ్లు మొగుళ్లను డామినేట్ చేస్తారు గాని, భార్యకు ప్రియురాలికి మధ్య నలిగిపోయే శోభన్ బాబు, జగపతిబాబు గార్ల ఫాన్లండీ వాళ్ళు! అదన్నమాట!
Wednesday, February 12, 2025
కారాగారహాసం! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ
అవును మిత్రమా! మీరు సరిగ్గానే చదివారు। కారాగార‘హాసమే’, ‘వాసం’ కాదు. ఎందుకలా శీర్షిక పెట్టానని మీకనుమానం రావొచ్చు. ఎందుకంటే జైలుకు వెళ్లడం వల్ల బోలెడు లాభాలున్నాయని ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే ఎవరు చేశారు? ఎప్పుడు? ఇంకెవరు? నేనే! ఇటీవలే! కొన్నిపరిణామాలను గమనిస్తే, రాజకీయ ప్రత్యర్థులను అవినీతి ఆరోపణల మీద, అధికారంలో ఉన్నవారు, జైలుకు పంపితే, అది పంపబడిన వారికి ప్లస్ పాయింట్ అయి కూర్చుంటుంది.
సదరు నాయకుడు అవినీతికి పాల్పడ్డాడా లేదా అనేది కోటిరూపాయల ప్రశ్న! దాన్ని పక్కన పెడితే, ఆయనపై ప్రజలకు సానుభూతి వెల్లువెత్తుతుంది. ఆయన జైల్లో ఉన్నన్ని రోజులూ, యూట్యూబర్లు; నెటిజన్లకు పండగే! జైల్లో ఆయనను దోమలు కుడుతున్నాయని, కుట్టడం లేదని; షుగర్ లెవెల్స్ పెరిగాయని, ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని; ఈ రోజు వాళ్లావిడ ఆయనకిష్టమైన ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, మజ్జిగపులుసు పంపిదని, ఆయన గదిలో ఫ్యాన్ పాడయిందని.. ఇలా కావలసినన్ని కబుర్లు! ఎలాగో బెయిల్ మీద విడులయింతర్వాత, ఆయనకు ఘన స్వాగతం ఏ రేంజ్‌లో ఉంటుందంటే - ‘శ్రీ కృష్ణపాండవీయం’ సినిమాలో రారాజు దుర్యోధనుడు మయసభకు వెళ్లినపుడు పాండవులు అరేంజ్ చేసిన లెవెల్లో ఉంటుంది. సి.నా.రె. గారి అంత గొప్పగా - ‘స్వాగతం! సుస్వాగతం! స్వాగతం కురుసార్వభౌమ!’ అని కాకపోయినా, ఆ నాయకుని అభిమానించే కవులు ఉండి ఉంటారు కదా! ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే, ఏదో ఒక ‘పద్మ’ అవార్డు ఇప్పించడకపోతాడా అని సదరు కవిగారు ఆశపడే ఉంటారు. జైలుకెళ్లివచ్చిన నాయకుడు మళ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తాడు.
అందుకేనేమో, ప్రక్క రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాయకుడు “దమ్ముంటే నన్ను జైలుకు పంపమను చూద్దాం! నన్ను వీళ్ళు జైలుకు పంపిస్తారు, చూడండి” అంటూ అధికారంలో ఉన్నవాళ్లకు సవాలు విసురుతూ ఉంటాడు, చిరునవ్వుతో! కారాగారహాసం అంటే అదే! నాకు తెలియకడుగుతానండీ, బెయిల్ ఇవ్వడమంటే నిర్దోషి అని తీర్మానించడం కాదనుకుంటా - దానికి అంత విజయోత్సవాలెందుకో?
లార్డ్ శ్రీకృష్ణ, జైల్లో పుట్టి, బోలెడు సానుభూతిని సంపాదించుకున్నాడండోయ్! అందుకీ జైలును ‘శ్రీకృష్ణ జన్మస్థానం’ అంటారని మీకు తెలుసని నాకు తెలుసు. ఇది ఇప్పటికీ ‘మధుర’ అనే ఊర్లో ఉంది. దీన్ని ‘గర్భగృహ’ అంటారు. క్రమంగా ఇది అందమైన మందిరంగా రూపుదిద్దుకుంది. మధురా నగరం యమునానది ఒడ్డున ఉంటుంది. ఎక్కడ పుట్టినా దేవుడు దేవుడే కదండి! నా అనుమానం ఏమిటంటే, (నాకన్నీ అనుమానాలే! ఎందుకంటే ‘సంశయాత్మా వినశ్యతి’ అని శ్రీకృష్ణుడే చెప్పాడు నాకు. నాకంటే డైరెక్ట్‌గా నాకు కాదనుకోండి, అర్జునికో ఎవరికో మరి, చెబుతుంటే విన్నా. ‘అప్పుడు నీవెక్కడున్నావు? మా చెవిలో కాలీఫ్లవర్ పెట్టొద్దు’ అంటున్నారా? ఏం, చాగంటాయన చెబితే విన్నా. సరేనా?) జైలుకు వెళ్లివచ్చి, అధికారంలోకి వచ్చినవారో, వారి వీరాభిమానులో, వారు ఉండిన జైలుగదిని సుందర స్మారకచిహ్నంగా మారుస్తారేమోనని! మారిస్తే మార్చనీ, నీ సొమ్మేం పోయిందీ అంటారా! సరే.

గొప్ప గొప్ప రచనలన్నీ జైల్లోనే రాశారటండోయ్. అత్యంత ప్రసిద్ధిగాంచిన ‘డాన్ క్విగ్జోట్’ నవలను ఆ రచయిత సేర్వాంటేస్ (Cervantes), స్పెయిన్ లోని జైల్లో వ్రాశారు. అప్పు కట్టలేదని ఆయన్ను జైల్లో పెట్టారట. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అనుమతి లేకుండా నిరసన తెలియచేసినందుకు గాను జైలుకు వెళ్లాడు. అక్కడ ఆయన ‘ది లెటర్ ఫ్రం బర్మింగ్‌హామ్ జైల్’ (The Letter from Birmingham Jail) అన్న గొప్ప పుస్తకం రాశాడు, ప్రజా హక్కుల రక్షణపై. పూణే లోని యెరవాడ జైల్లో ఉన్నపుడే కదా, మహాత్మాగాంధీ, తన స్వీయచరిత్ర ‘మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ వ్రాశారు! ఇలాంటి వాటిని ‘జైలు సాహిత్యం’ అంటారు (ట). జాన్ బన్యన్ వ్యాసిన ‘ది పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్’ జైలు రచనే. నెపోలియన్, సెయింట్ హెలీనా ద్వీపం జైలు నుండి రాసిన మెమోయిర్ (Memoir) అప్పట్లో వేడి వేడి పకోడీల్లాగా అమ్ముడుపోయిందట. నెహ్రూ గారు 1930, 1933లలో జైల్లోనుండి వ్రాసిన ఉత్తరాలు ‘గ్లింప్లెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’గా పేరుపొందాయి. మరి సమకాలీన, అదేనండీ బాబూ, మన కాలీన నాయకులు జైళ్లలో ఉన్నపుడు పెద్దగా పుస్తకాలు రాసినట్లు కనబడదు. అలా ఏవైనా ఉంటే చెబుదురు, ప్లీజ్! ‘ద్వీపాంతరవాస శిక్ష’ విధిస్తే, బ్రిటీష్ వారు అండమాన్ లోని ‘కాలాపానీ’ అన్న భయంకర కారాగారానికి స్వాతంత్య్ర వీరులను పంపేవారు. దాన్ని ‘సెల్యులార్ జెయిల్’ అంటారు అందులో చిత్రహింసలు, బలవంతపు చాకిరీ, మరణానికి దారితీసే పరిస్థితులుండేవట. వినాయక్ సావర్కార్, యోగేంద్ర శుక్లా, లాంటి గొప్పవారు ఆ జైల్లో మగ్గారు. భగత్ సింగ్ కూడా లాహోరు కుట్ర కేసులో ఆ జైలులో ఉన్నారు.
అమెరికా లోని అత్యంత భయంకరమైన జైలు ‘గ్వాంటనామో బే’. అక్రమ వలసదారులను 30 వేలమందిని అందులోకి కుక్కేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడట. అయినా, మీరూ నేనూ జైలుకెళ్తే ఏమొస్తుందండీ? “ఏ జైలు కెళ్ళినా ఏమున్నది గర్వకారణం, చిప్పకూడు తప్ప!” అని పాడుకుంటాం మహా అయితే! ‘కారాగారహాస యోగం’ పట్టాలంటే ఒక స్థాయి ఉండాలి బ్రదర్! అప్పుడే జైలుకు నవ్వుతూ వెళతారు, తిరిగి వచ్చి చరిత్ర సృష్టిస్తారు. పుస్తకాలవీ రాయరయితే! అదన్నమాట!
Saturday, February 1, 2025
అదేం బ్రహ్మవిద్యా? దత్తవాక్కు ఆంధ్రప్రభ
ఏదయినా ఒక పనిని గురించి చెప్పేటప్పుడు, “అంత కష్టమైందేమీ కాదు, ఎవరైనా చేయవచ్చు” అనే అర్థంలో, “అదేమంత బ్రహ్మవిద్యేమీ కాదు!” అంటూంటారు. అసలీ బ్రహ్మవిద్య అంటే ఏమిటి? త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవునికి దీనికి సంబంధం లేదండోయ్. ఆయన బ్రహ్మ. ఇది బ్రహ్మము! చాలా తేడా! అన్నింటికంటే గొప్పది, దాని కంటే మరొక గొప్పది ఏది లేదో అదే బ్రహ్మము. సర్వకారణము, సర్వాధారము, సృష్టంతా వ్యాపించింది, పొందతగినది, సత్ చిత్ ఆనంద లక్షణమై ఉన్నదే బ్రహ్మము.
కఠోపనిషత్ సంబంధ భాష్యం (1) లో “పూర్వోక్త విశేషణాన్యా ముముక్షూన్పరం, బ్రహ్మగమయతీతి చ...” అంటూ బ్రహ్మవిద్యను నిర్వచించారు. మరీ లోతుకు వెళ్లకుండా, మనకు తెలిసిన పరిధిలో దీన్ని చూద్దాం. ‘బృహ్’ అనే ధాతువు నుండి ‘బ్రహ్మ’ శబ్దం ఏర్పడింది. ‘బృహ్’ అంటే పెరగటం. మన చుట్టూ ఉన్న చరాచర వస్తువులన్నీ ‘దేశపరిచ్ఛిన్నములే’ (లిమిటెడ్ ఇన్ స్పేస్). కానీ బ్రహ్మము దీనికి అతీతం. దీన్ని మనం చూడలేము. కాని పొందగలం. ఎలా?
‘యోగః కర్మసు కౌశలం’ అని గీతా వాక్యం. మరీ వేదాంతాల లోతులకు వెళితే మనలాంటి వాళ్ళం ఉక్కిరిబిక్కిరవుతాం. “నేర్చుకునేంత వరకు బ్రహ్మవిద్య, నేర్చుకున్న తర్వాత కోతివిద్య” అని నానుడి. ‘కోతి విద్య’ అని ఎందుకన్నారంటే, కోతి అవలీలగా ఎలా విన్యాసాలు చేస్తుందో అలా, హేలగా.. అని! కుర్రవాడు సైకిల్ తొక్కడం నేర్చుకునేటపుడు చూడాలి వాడి పాట్లు. బ్యాలెన్స్ కుదరదు. ఒక వైపు లాగేస్తుంటుంది. క్రిందపడి మోకాళ్ళు మోచేతులు దోక్కుపోతుంటాయి. నిజంగా బ్రహ్మవిద్యా అనిపిస్తుంది. తనకసలు పట్టుబడుతుందా అని అనుమానం కూడా వస్తుంది. ఒకసారి దాని ‘కిటుకు’ తెలిసింతర్వాత చూడాలి వాడి ఫీట్లు! రెండు చేతులూ హ్యండిల్ వదిలేసి కూడా రయ్యి రయ్యిమని తొక్కుతూ వెళుతుంటే చూడాలి! అదీ సెన్స్ ఆఫ్ అచీవ్‌మెంట్ అంటే!
మా చిన్నతనంలో, ఎండాకాలం సెలవుల్లో, యాగంటయ్యగారని సారు, మాకు ఈత నేర్పేవారు. మునగ చెట్టు కొమ్మలకు బెరడు తీసి, అడుగున్నర పొడవు కట్ చేసి, నాలుగయిదు కలిపి కట్టగా కట్టేవారు. దాన్ని మా నడుముకు కట్టి, పొలాల్లోని పెద్ద దిగుడు బావిలోకి తోసేవారాయాన. ముందు రయ్యిన నీటిలోకి వెళ్లి, సర్రున పైకి తేలేవాళ్ళం. మునగ కర్రలను ‘బెండ్లు’ అనేవారు. అవి మనల్ని మునగనివ్వవు. చేతులు కాళ్లు ఆడిస్తూ ఈత కొడుతూంటే భయమేసేది. ఆయనకు (మాకు కాదు) కాన్ఫిడెన్స్ వచ్చింతర్వాత, ఆ బెండ్ల మోపు కట్టకుండా, ఏమరుపాటుగా ఉన్న మమ్నల్ని బావిలోకి తోసేవారు యాగంటయ్య సారు. ముందు కొంచెం భయపడినా చక్కగా ఈదేవాళ్లం. మా సారు నీళ్ళ మీద నిశ్చలంగా పద్మాసనంలో కూడా ఉండగలిగేవాడు. కొన్ని వందల మందికి ఈత నేర్పిన మహానుభావుడు. కేవలం పర హితమే తప్ప అందులో ఆయనకు పిసరంత స్వార్థం లేదండోయ్! ఇది బ్రహ్మవిద్య కాదంటారా, చెప్పండి?

పరబ్రహ్మతత్త్వాన్ని గురించి, అన్నమాచార్యుల వారు చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలేదనిపిస్తుంది నాకు. ‘కందువగు హీనాధికము లిందులేవు’ అంటాడాయన. ‘అందరికి శ్రీహరే అంతరాత్మ’ అంటాడు. రాజుకు బంటుకు నిద్ర ఒకటే అంటాడు. ‘బ్రాహ్మణుడైనా, పంచముడైనా చేరేది చివరకు ఒకే భూమి’ అంటాడు. దేవతలకు, పశువులకు కామసుఖం ఒకటేనట. శిష్టాన్నానికైనా, దుష్టాన్నానికైనా ‘ఆకలి’ ఒకటే! దుర్గంధం మీద, పరిమళం మీద వీచే గాలి ఒక్కటే! ఏనుగు మీద కుక్క మీద కాసే ఎండ; పుణ్యాత్ములను పాపాత్ములను రక్షించే ఏడుకొండల రాయుని నామమొకటేనని ముగిస్తాడు అన్నమయ్య. అక్కినేని నాగార్జున గారు ఈ భావాలను అద్భుతంగా అభినయించి, ఎఎన్ఆర్ గారి పేరు నిలబెట్టారు! దీన్ని బట్టి ఏం తెలుస్తూంది? సర్వత్ర సమదర్శనమే బ్రహ్మము! దాని వల్ల వచ్చే ఆనందమే బ్రహ్మానందము.
ఒక రమణ మహర్షి, ఒక షిరిడీ సాయి. ఒక మదర్ తెరీసా, ..వీరి నవ్వు చూడండి! అలౌకికమైన నవ్వది. దాన్నే ఇంగ్లీషులో ‘బ్లిస్’ అంటారు, దాన్ని పొందింతర్వాత ఇంకేవీ అవసరం లేదు. వృత్తిని నిజాయితీగా చేస్తూ, దాంట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడం కూడా బ్రహ్మవిద్య అంటాను నేను. మా మాతామహులు రామయ్యగారు. అప్పట్లో అధిక సంతానం, పేదరికం. అవి ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానానికి అవరోధాలు కాలేదు. నిరంతరం ప్రసన్నంగా ఉండే ఆయన వదనం నాకు గుర్తుంది. మా నాన్నగారికి ఆయన పిల్లనిచ్చిన మామ మాత్రమేకాదు. ఆధ్యాత్మిక గురువు కూడా.
వారి కుమారుడు, మా మేనమామ శ్రీ క్రిష్టిపాటి సీతారామ శాస్త్రిగారు. ఆయన ఉద్యోగ ప్రస్థానం ఒక కేస్ స్టడీ అవుతుంది. స్కూల్ ఫైనల్‌లో వచ్చిన మార్కులతో, ఆర్.ఎమ్.ఎస్. సార్టర్‌గా చేరాడాయన. మైసూరు పోస్టల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజ్ ఫ్యాకల్టీగా ఎదిగాడు. డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్ (పోస్ట్ మాస్టర్ కాదండోయ్!) గా రిటైరైనాడు. సార్టర్‌గా ఎలా ఉండేవాడో, డి. పి. ఎమ్. జి. గా కూడా అంతే. అదే ఆహార్యం, అదే స్వచ్ఛమైన మనస్సు. మా అత్తయ్యను చూస్తే నాకు ‘వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి’ అన్న అల్లసాని వారి పద్యపాదం గుర్తుకువస్తుంది. నన్ను ‘దత్తుడూ! బాగున్నావా!’ అంటూ దగ్గరకు తీసుకుంటుంది. ఆమె పేరు, మా అమ్మ పేరు ఒకటే. మా అమ్మ తర్వాత అంత ప్రేమగా నేను కౌగిలించుకునేది మా అత్తయ్యనే. ఆమె నవ్వితే వేయి మల్లెలు విరిసినట్లుంటుంది. అప్పుడు ఎర్ర బస్సుల్లో తిరిగినా, ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నా, వాళ్ల దృక్పథాలు మారలేదు! 50 సంవత్సరాల నుండి చూస్తున్నా మరి!
సెంచరీ చేసినప్పుడూ, పది పన్నెండు రన్స్ చేసి ఔట్ అయినపుడూ, సచిన్ టెండూల్కల్ ఒక్క లాగే నవ్వుతాడు, పసిపాపలా! ‘కష్టములకు క్రుంగని, సుఖములతో పొంగ’ని వారు వాళ్లంతా! బ్రహ్మ విద్య అంటే అదేనండీ బాబూ! ఎప్పుడూ ఒక్కలా ఉండటం! భగవద్గీతకు బ్రహ్మ విద్య అని పేరుంది మాస్టారు. అదేదో కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమనే మోటివేషనల్ స్పీచ్ కాదు సార్! మనందరికీ కరదీపిక. కళ్ళు, ముక్కు మూసుకుని (చెవులు కుదరవు లెండి) కూర్చుంటే బ్రహ్మవిద్య రాదండోయ్! “అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్, ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్” అన్నాడు హితోపదేశ కర్త. దాన్ని పాటించడమే బ్రహ్మవిద్య అంటాన్నేను. పైన పేర్కొన్న వారంతా అలాంటి వారే! అది అలవర్చుకోవటం మాత్రం బ్రహ్మవిద్యే! అదన్న మాట!
Sunday, January 26, 2025
లేడీ విలన్లు! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ
‘విలన్’ కు స్త్రీలింగం ఉందా? ఉందండోయ్! ‘విలనెస్’ అట! కానీ ఆ మాట అంత ప్రాచుర్యంలో లేదు. స్త్రీలింగాలకు లేడీ అన్న పదం చేరిస్తే మర్యాదగా ఉంటుంది. కండక్ట్రెస్స్, మేనేజెరెస్ అనడం కంటే, లేడీ కండక్టర్, లేడీ మేనేజర్ అనడం బెటర్ కదా!
చరిత్రలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో మనకు మహిళా విలన్లు ఉన్నారు. రామాయణంలో కైకేయినే తీసుకుందాం. మెయిన్ విలన్ ఆమే అంటారు. కానీ, కాదు! ఆమె చాలా మంచిది. రాముడంటే చాలా ఇష్టం ఆమెకు. మంథర వచ్చి, రామునికి పట్టాభిషేకం చేస్తున్నారని చెబితే, కైకేయి కడుంగడు సంతసించి, తన మెడలోని రత్నాల హారాన్ని తీసి మంథరకు బహుమానంగా ఇచ్చిందట. ‘భరతుని కంటె నాకు రాముడంటేనే ఇష్టం’ అన్నదట పైగా. అసలు విలన్ మంథర. ఆ పాత్రలో, ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో, ఛాయాదేవి గారు జీవించారు. ఆమె ఆహార్యం, నటన అద్భుతం. కైకమ్మకు ద్వేషం ‘నూరిపోసే’ దృశ్యంలో ఆమె నటనా విశ్వరూపం కనిపిస్తుంది. బాపు గారు జమున గారికి కైక పాత్రనిచ్చింది కూడా అందుకేనేమో! రాముడు కైకమ్మను పల్లెత్తు మాట అనలేదు!
ఇక సూర్యకాంతం గారి విలనీ, విభిన్నమైంది. దాన్ని కూడా హాస్యంతో మేళవించగల మహానటి ఆమె. నిండు గర్భవతి అయిన కోడల్ని మెట్ల మీది నుంచి తోసేస్తుంది. ఆడపడుచుకు విషం కలిపి అన్నం పెడుతుంది. సవతి పిల్లలను చిత్రహింసల పాలు చేస్తుంది. భర్తను హీనాతిహీనంగా చూస్తుంది. అయినా సరే, ప్రేక్షకులకు ఆమెపై కోపం రాదు!
1946 లో ప్రతిభా వారు ‘ముగ్గురు మరాఠీలు’ అన్న సినిమా తీశారు. అందులో అక్కినేనిని అసలు గుర్తు పట్టలేం. అందులో మహారాణి రుక్కూబాయిగా కన్నాంబ గారి విలనీ భయాన్ని కలిగిస్తుంది. ఆమెకు సంతానం ఉండదు. బావగారి కుమారులను చేరదీస్తాడు రాజు (గోవిందరాజుల సుబ్బారావు). వారిని ఆమె పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు! ఇక ‘నరసింహ’ (తమిళ డబ్బింగ్) సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర ఆమె కెరీర్ లోనే గొప్పది. అసూయను అంత బాగా ప్రదర్శించిన పాత్ర. “నాకు దీటుగా నా కెరీర్‌లో ప్రతినాయకురాలి పాత్రలో నాకంటే బాగా నటించారు రమ్యకృష్ణ” అని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెను ప్రశంసించారు.

ఇక సాహిత్యానికొద్దాం. ప్రసిద్ధ నాటకం ‘మేక్‌బెత్’లో ముగ్గురు మంత్రగత్తెలు ఉంటారు. వారు మహాకవి షేక్‌స్పియర్ ‘త్రీ విచ్చెస్’ గా ప్రసిద్ధులు. వారికి ‘భయంకర సోదరీమణులు’ (వియర్డ్ సిస్టర్స్) అని కూడా పేరు. మేక్‌బెత్ పతనానికి కారకులు. వారు మాట్లేడే భాష రిడిల్స్ (పొదుపు కథలు) తో కూడి, మానవాతీత శక్తులను ప్రతిఫలిస్తుంది.
మన తెలుగు టీవీ జీడిపాకం సీరియల్స్‌లో అత్తలు, కోడళ్ళు అందరూ విలన్లే! ఎందుకో మరి. ఆయా పాత్రలు నటించేవారికి అభిమానులు కూడా మహిళా ప్రేక్షకులే. దీన్నే ఇంగ్లీష్‌లో ‘ప్యారడాక్స్’ అంటారు. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అబ్బో! దుర్మార్గంలో ఇంత సృజనాత్మకత ఉందా? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతా పెద్దింటి ఆడవాళ్లే. అందంగా ఉంటారు. పైగా పెద్ద పెద్ద కళ్లను మరింత పెద్దవిగా చేసి, వికృతంగా తిప్పుతూ డైలాగులు చెబుతూంటే భయం వేస్తుంది. వారి పేర్లు కూడా భువనేశ్వరి, రాజేశ్వరి, ఇలా హుందాగా ఉంటాయి. కోడళ్లు కూడ ‘హమ్ కిసీ సే కమ్ నహీ’ అంటూ దుర్మార్గం పనులు చేస్తుంటారు, సీరియల్స్‌లో. అందంగా ఉన్నా, వీళ్ళంతా అలా అనిపించరు. కారణం, దుర్మార్గం అందాన్ని మింగేస్తుందేమో?
‘శూర్పణఖ’ పాత్రను చూస్తే నాకు జాలేస్తుంది. కాని కోపం రాదు. ఆమె రామలక్ష్మణులను కామించడం తప్పు కావచ్చు. “మేం అలాంటివాళ్లం కాదు, వెళ్లిపో” అని చెప్పొచ్చు కదా! ముక్కు చెవులు కోయడం ఎందుకు? నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మగారి అభిమానిని లెండి! అయినా, నాకు తెలీకడుగుతున్నా, దుర్మార్గానికి ఆడా మగా తేడా ఉంటుందటండీ, మన పిచ్చిగాని! ఆడాళ్లలో మగాళ్లలో దుర్మార్గులుంటారు. కాని వారి సంఖ్య తక్కువంటా నేను. విలన్‌లు ఉంటే కదా హీరోల గొప్పదనం తెలిసేది? మన హీరోలు, “నాకు ఫలానా విలనే కావాలి” అని నిర్మాతలను డిమాండ్ చేస్తారట. సమ ఉజ్జీ ఉంటే తన పాత్ర ఎలివేట్ అవుతుందని!
నిజ జీవితంలో, మన ఇళ్లల్లో కూడా లేడీ విలన్లు లేరంటారా? వారిని చూసే కదా రచయితలు విలనమ్మలను సృష్టించేది? ‘ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్’ అన్నారు కదా అరిస్టాటిల్ గారు! మా అమ్మమ్మ చెల్లెలొకామె ఉండేది. ఆమె బాల వితంతువు. ఎవరయినా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆమెకు సహించేది కాదు. ఆమె ఎవరింట్లో అయినా నాలుగు రోజులుండి వెళ్లిందంటే, ఆ ఇంట్లో గొడవలే! అంత పవర్‌ఫుల్ విలన్ ఆమె.
నన్నడిగితే, (ఎవరడిగారు?) ఆడైనా, మగైనా ప్రతి మనిషిలో కొంత విలనిజం ఉంటుంది. మంచివాళ్లు దాన్ని అణచుకొని, సంస్కారం చూపుతారు. ‘సోఫిస్టికేటెడ్ విలనీ’ అని ఒకటుంది. చక్కగా డ్రెస్ చేసుకొని, నవ్వుతూ మాట్లాడుతూ, గొంతులు కోస్తారన్నమాట. విలనిజం వినోదం వరకైతే పరవాలేదు. అది మన జీవితాలను ప్రభావితం చేసి, మనమూ దుర్మార్గులం అయితే ప్రమాదం! లేడీ విలన్‍ల దంతా నటనే నండోయ్! నిజ జీవితంలో వారు బంగారు తల్లులు! వారికి శతకోటి వందనాలు! అదన్నమాట!
Sunday, January 12, 2025
పాజిటివ్.. నెగెటివ్!- దత్తవాక్కు - ఆంధ్రప్రభ
ప్రతి విషయానికీ రెండు పార్శ్వాలుంటాయి. నాణేనికి రెండు వైపులున్నట్లు! దాన్నే ‘అదర్‍సైడ్ ఆఫ్ ది కాయిన్’ అన్నాడు అంగ్రేజీవాడు! ఈమధ్య సోషియల్ మీడియాను గమనిస్తే, పాజిటివ్‌గా, నెగెటివ్‌గా, పుంఖానుపుంఖాలుగా అభిప్రాయాలు వెల్లువెత్తడం కనిపిస్తుంది. వీళ్ళకు ‘నెటిజన్లు’ అని పాత్రికేయులే పేరు పెట్టారు! సరిగ్గా నప్పింది! నెట్‌లో హడావిడి చేసే సిటిజన్లన్న మాట. సంస్కృతంలో ‘యద్భావం తద్భవతి’ అన్న ఒక సూత్రం ఉంది. దాన్ని ఇంగ్లీషులో తర్జుమా చేద్దాం. ‘యాజ్ యు థింక్, సో యు బికమ్’. నిజానికి ఇది పాజిటివ్ దృక్పథాన్ని ప్రతిబించించే అంశం కాని, సమకాలీన జర్నలిజం సోషల్ మీడియాలలో ఇది ‘ఎవరికి నచ్చింది వారు చెప్పుకునే’ దానిగా పరిణమించింది.
ముందు అధికారంలో ఉన్నవారు అంతా సర్వనాశనం చేశారనీ, తాము వచ్చి చక్కదిద్దుతున్నామనీ, ప్రస్తుతం పగ్గాలు చేపట్టిన వారు సెలవిస్తుంటారు. ప్రతిపక్షం తక్కువేం తినలేదు. తాము బ్రహ్మండంగా వెలగబెట్టిన దాన్ని ఇప్పుడొచ్చిన వాళ్లు పూర్తిగా పాడుచేస్తున్నారని వీళ్లు! విచిత్రం ఏమిటంటే, ‘కడుపు నిండిన’ వర్గమే సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటుంది. పాలన వల్ల పాజిటివ్ గానో నెగెటివ్ గానో ‘అఫెక్ట్’ అయినవారికి, బీదాబిక్కీకి, సోషల్ మీడియా మేధా ప్రదర్శన చేసే టైమ్ ఉండదు! జీవనపోరాటమే వారికి సరిపోతుంటే, ఈ అభిప్రాయ పోరాటం వారెక్కడ చేయగలరు? కేంద్రంలో, రాష్ట్రాలలో, జరుగుతున్న పరిణామాలకు నెటిజన్లు స్పందిస్తున్న తీరు చూస్తే విస్తుబోతాం.
ఒక బాలమేధావి, ప్రపంచ స్థాయి ఛెస్ ఛాంపియన్‌గా, నిలిస్తే, ఆయన పేరు మూలాలు వెతుకుతాడో మేధావి. ఇంకొకాయన, కేంద్ర ఆర్థికమంత్రిగారు ఎయిర్‌పోర్ట్‌లో ఆ పిల్లవానికి వచ్చిన ప్రైజ్‍మనీపై ట్యాక్స్ వసూలు చేయడానికి ఎదురుచూస్తున్నారని జోక్ చేస్తాడు! ఒక మాస్ హీరో వీరమాస్ సినిమా విడుదల రోజు ఆ మహానటుడు థియేటర్‌కు వస్తే, తొక్కిసలాట జరిగి ఒకరు మరణిస్తే, వేరొకరు చావు బతుకుల్లో ఉంటే, నెటిజన్ల ‘యద్భావం తద్భవతి’ యాటిట్యూడ్‌లు వారి వారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ (సారీ! దీనికి తెలుగు పదం తోచడం లేదు) ను ప్రతిబింబిస్తాయి. ఆయన థియేటరుకు వెళ్లడం తప్పని ఒకరంటే, ఆయనకూ సినిమా చూసే హక్కు ఉందంటాడు ఇంకొకాయన. అరెస్టయిన ఆయన్ను చూడడానికి సెలిబ్రిటీలందరూ వెళ్లడం, మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లకపోవడం గురించి కామెంట్స్ చేస్తారు. జాతీయ అవార్డు పొందిన వాడిని అరెస్టు చేస్తారా? అంటూ ఆశ్చర్యపోతాడు ఇంకో ఆయన. ఇంకో ప్రముఖ నటుని కుటుంబంలో ఆస్తి పంపకాలలో, తండ్రీ కొడుకులు గొడవ పడితే, అదేదో జాతీయ ప్రాముఖ్యత గల అంశమైనట్లు, హై డ్రామా! ఉత్కంఠ! అంటూ గంటల తరబడి ఊదరకొడతారు. పైన పేర్కొన్న విషయాల్లో, ప్రభుత్వ చర్యలను విమర్శించేవారు, మద్దతిచ్చేవారు, ‘యద్భావం తద్భవతి’ లాగా తయారవుతారు. ఇదంతా ఒక ప్రహసనం! కామన్ మ్యాన్‌కు అనవసరం!
కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ నెగెటివ్ గానే ఉంటాయి. పాజిటివ్ వెర్షన్ ఉండదు. “ఫరవా లేదు” అంటాం గాని, “ఫరవా ఉంది” అని ఎవరయినా అన్నట్లు ఎక్కడా కనబడదు! “శుభస్య శీఘ్రం” అని ఉంది గాని “అశుభస్య ఆలస్యం” అని లేదు కదా! సామెతల్లో అయితే పాజిటివ్ నెగెటివ్ రెండు ఉండి, ఏది అనుసరించాలో తెలియక, మనల్ని కన్‍ఫ్యూజ్ చేస్తాయి. ఉదా: ‘నిదానమే ప్రధానం’ ఓ.కె. - మరి, ‘ఆలస్యం అమృతం విషం’? ‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్!’ బాగానే ఉంది! ‘హేస్ట్ ఈజ్ వేస్ట్’ ఇదీ సరే! మరి, ‘మేక్ హే వైల్ ది సన్ షైన్స్!’ - దీన్నెలా తీసుకోవాలని మా గురువు గారు తాటిచెర్ల కృష్ణశర్మగారిని అడిగానో సారి. ఆయన నవ్వుతూ, “ఒరేయ్! టు హూమ్ సో ఎవర్ ఇట్ ఈజ్ కన్సర్న్‌డ్” అన్నారు! “ఎవరికేది వర్తిస్తే వారికది!”
నిజమే! వామపక్షవాదులు దేన్నైనా, తమ భావజాలంతో ముడిపెడుతుంటారు. దాన్ని ఇష్టపడేవారికి అది నచ్చుతుంది. పెద్దాయన చేస్తున్నదంతా అద్భుతం అని ఆయన తరపు వాళ్లంటే, కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు అని అగెనెస్ట్ బ్యాచి! ‘యద్భావం తద్భవతి’ వాళ్ళు ఉండనే ఉన్నారు! నాలాంటి, మీలాంటి వాళ్ళకు ఏది నిజమో తెలియక జుట్టు పీక్కుంటాం. ఎప్పుడూ ఒక్కలాగే ఉంది మన పరిస్థితి! ఎవరూ ఊడబొడిచిందేమీ లేదు!
‘ఆబ్జెక్టివ్ క్రిటిసిజమ్’ అని సాహిత్య విమర్శలో ఒక చక్కని సిద్ధాంతం ఉంది. ‘నిష్పక్షపాత’ అని అర్థం, ‘ఆబ్జెక్టివ్’ అన్న పదానికి. అదిప్పుడెక్కడ ఏడ్చింది, మహాప్రభో!? ‘నిజమైన’ దాన్ని చెప్పే నాథుడే కరవయ్యాడు! ‘కనకదుర్గ పూజామహిమ’ అని విఠలాచార్య గారి సినిమా ఈమధ్య యూట్యూబ్‌లో, మా స్మార్ట్ టీవీలో చూశానండి. ‘రామాయణంలో పిడకల వేట’ అనుకుంటున్నారా! కాదు! అందులో ఒక రాజు, ఒక రాణి ఉంటారు. రాజు మిక్కిలినేని గారు. రాణి ఎవరో మరి? ఇద్దరూ సంగీతంలో నిష్ణాతులే. వారు సౌధోపరి భాగంలో ఉండగా, ఒక జంతువు అరుపు వినబడుతుంది. దాని అరుపులోని షడ్జమం, పంచమం వగైరాలను బట్టి అది మగనక్క అని రాజుగారు, కాదు ఆడనక్క అని రాణిగారు వాదించుకుంటారు. వాదోపవాదాలు పెరిగి పందాల వరకు వెళుతుంది విషయం. ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారని కోట్లల్లో పందేలు కాసే అద్భుత ప్రజాస్వామ్యం మనది! ఎవరు గెలిస్తే, మిగతావారు అడవులలో వెళ్లాలని.. ఈ కథ ఎందుకు చెప్పానో తమరికర్ధమయే ఉంటుందీ పాటికి. ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది మరి! ఏ నక్క ఐతే ఏమిటి? దానికంత రాద్ధాంతం అవసరమా! ఒక్కటి మాత్రం తప్పదు! నిజం నిప్పు! అది దాచాలన్నా దాగదు! అదన్నమాట!
Saturday, January 4, 2025
అలవాటు... మేనరిజమ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ
‘అవ్వ పేరే ముసలమ్మ’ అనుకుంటున్నారా తవురు గోరు? అక్కడే సాంబారులో కాలేశారు! రెండూ వేరు వేరండీ బాబు! అలవాటుకు హ్యాబిట్ అని అర్థం చెప్పుకోవచ్చు. పిల్లి అంటే మార్జాలము అని చెప్పినట్లుంది కదూ! “ఏదై నా ఒక పనిని మళ్లీ, మళ్లీ, అది పనిగా చేస్తూ ఉండే ప్రవర్తన” అని దాన్ని నిర్వచించారు. ఎవరు? ఎవరో వల్లకాట్లో రామనాథాయ! కొంపదీసి అన్నింటినీ అలా నిర్వచించడం ఆయన అలవాటేమో?
ఈ ‘అలవాటు’ లో సదరు వ్యక్తి ప్రమేయం లేకపోవచ్చునని మనస్తత్త్వశాస్త్రవేత్తలు వాక్రుచ్చారు! అంటే దేంతోనో గట్టిగా క్రుచ్చలేదు! చెప్పారని.. కవి హృదయం! బయటికి కనబడుతుంది కాని, అలవాటు ‘మానసికం’ అట.
‘పచ్చిబియ్యం తినడం’ ఒక దురలవాటు. దానివల్ల రక్తహీనత, నీరసం వస్తాయట. ‘పొగ త్రాగడం’ ఉండనే ఉంది. అయినా, నాకు తెలియక అడుగుతా, పొగ త్రాగడం ఏమిటండి? అదేమైనా పానీయమా? పొగ పీల్చడం అంటే సరిపోతుందా? ఆలోచించండి. దీన్ని ఒక ఫాషన్, ప్యాషన్‌గా చేసుకుంటారు కొందరు (అ)నాగరికులు. ముక్కులోంచి, నోట్లోంచి (రింగులు రింగులుగా) వదులుతుంటారు పైగా. చెవుల్లోంచి రాదేమో? రోజుకెన్ని. ఆ లెక్కన నెలకెన్ని, సంవత్సరానికెన్ని సిగరెట్లు తాగుతాడో, మొత్తం ఖర్చు లక్షల్లో తేలి, ఎంత నష్టపోతున్నాడో చెప్పి, ఆ అలవాటు మానేయమన్నాడట ఒకాయన. ‘అలా లెక్కలేసుకుంటే బ్రతకలేమండీ!’ అనేది జవాబు! అలవాట్లకు శాస్త్రప్రమాణాలు చూపే ఘనులున్నారు.
“రావణ యుద్ధం బందున/బావనుడగు లక్ష్మణుండు పడి మూర్ఛి లినన్/
ఆవల బొగ చెట్టుండిన/బావని సంజీవి కేల పరుగెత్తు నృపా”
రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే, అక్కడ పొగాకు మొక్క ఉండి ఉంటే. ఆంజనేయుడు సంజీవని కోసం ఎందుకు పరిగెత్తుతాడు? అలా ఉంటాయి!

ఇక మ్యానరిజమ్ అంటే, విభిన్నమైన వ్యవహారశైలి. అదొక లక్షణం, విధానం. అది మాటల్లో గాని, ప్రవర్తనలోగాని ద్యోతకం అవుతుంది. మళ్లీ, ‘మ్యానర్స్’ వేరు! ఈ మ్యానరిజమ్ కళల్లో కూడ ఉంటుంది. లియొనార్డో డావిన్సీ, రాఫెల్, మైకేల్ యాంజిలో, రవివర్మ, వడ్డాది పాపయ్యలాంటి వారి శైలి వారిని ఇట్టే గుర్తించేలా చేస్తుంది. రచనా శైలిని బట్టి, ఆ రచయిత ఎవరో సులభంగా తెలిసిపోతుంది. “అది శోభనపు గది. సాలంకృతము. అసలు శోభనమన్న నేమి? ఈ ప్రపంచకము విచిత్రమైనది. శోభతే ఇతి శోభనమ్ అని విశ్వ నిఘంటుకారుడు చెప్పియున్నాడు...” ఇది ఎవరు రాశారు చెప్పుకోండి చూద్దాం? ఇంకెవరు? కవిసమ్రాట్ విశ్వనాథ!
ఈ పదం, ‘మ్యానియెరా’ అన్న ఇటాలియన్ పదం నుంచి వచ్చిందట. దీన్నే స్టయిల్ అంటారు. నటులు ఒక్కొక్కరు ఒక్క మ్యానరిజమ్‌ను పండించి, ప్రసిద్ధులవుతారు. రజనీకాంత్ స్టైల్, ప్రభాస్ స్టైల్, యన్టీఆర్ స్టైల్, ఎయన్నార్ స్టైల్. యస్వీఆర్ స్టైల్... అబ్బో! ఎన్ని స్టైల్లో? వాటిని అనుకరించి పొట్టపోసుకునే వారున్నారు. వారిని మిమిక్రీ ఆర్టిస్టులంటారు. అదీ గొప్ప కళే. ఒక విషయం గమనించారా మాస్టారు? వాళ్ళు మిమిక్రీ చేస్తుంటే మనకు నవ్వొస్తుంది కాని, ఒరిజినల్ వ్యక్తుల మ్యానరిజమ్ వల్ల రాదు! హీరో వర్షిష్ కూడా!
ప్రముఖుల విచిత్ర అలవాట్లు చూడండి. మైకేల్ యాంజిలో స్నానం చేసే వాడు కాదట. మా మాతామహుడొకాయన ఉండేవారు. ఆయన కూడ స్నానం చేసేవాడు కాదు, జంధ్యాలు మార్చుకునేవాడు కాదు. అవన్నీ కలిసి పెద్ద మోకులా ఉండేవి. దీన్ని వైరాగ్యం అనొచ్చా? లేక బద్ధకమా? ఫ్రాన్సిస్ బేకన్‌కు ‘హ్యాంగోవర్’తో పని చేయడం ఇష్టం ఆట! మద్యపాన ప్రియులకు హ్యాంగోవర్ అంటే తెలుసు బాగా! ఒకాయన విమాన ప్రయాణం చేసి వచ్చాడట. ఎవరో ఫోన్ చేస్తే, తాను హ్యాంగోవర్‌లో ఉన్నానన్నాడట! ఇతనికి తాగే అలవాటు లేదు కదా! ఇదేమిటి అని సదరు పృచ్ఛకుడు నివ్వెరపోయాడు. ‘జెట్‌లాగ్’ కు వచ్చిన అవస్థ! పదం తెలుసు కదా అని వాడి ఉంటాడు!
‘అగథా క్రిస్టీ’ అపరాధ పరిశోధన నవలలకు పెట్టింది పేరు. ఆమె బాత్ టబ్‍లో కూర్చుని, యాపిల్స్ తింటూ రచనలు చేసేదట. సల్మాన్ ఖాన్‌కు సబ్బులు సేకరించే అలవాటు ఉందట. జాన్ అబ్రహం, కాలు కదిలిస్తూ ఉంటాడట. ఆయనకు డాన్సు రాదు! అమితాబ్, తన పిల్లలు విదేశాలతో ఉంటే రెండు చేతి వాచీలు పెట్టుకుంటాడు. రెండు టైమ్ జోన్‌లు తెలియాలని!
పోసాని కృష్ణమురళి మాట్లాడేటప్పుడు మాటిమాటికీ షర్ట్ సర్దుకుంటుంటాడు. అది ఆయన మ్యానరిజమ్. తనను వృద్ధాప్యంలో ప్రజలు చూస్తే తట్టుకోలేరని శోభన్‌బాబు లేటు వయస్సులో బయటకు వచ్చేవాడు కాదు.
‘ఎడంచేతివాటం’ అని ఒకటుంది. వాళ్ళు ఎడంచేత్తోనే అన్ని పనులూ చేస్తారు. సూర్యకాంతం గారు, సచిన్ టెండూల్కర్, రతన్ టాటా, బరాక్ ఒబామా, ఐన్‌స్టీన్ కొన్ని ఉదాహరణలు. మళ్లీ ‘లెఫ్టిస్ట్స్’ వేరండోయ్. వారు వామపక్షవాదులు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నారు సీనియర్ సముద్రాల. అక్కినేని వారు ఆ పాటలో జీవించారు. ఆ పాటలో లోతైన ఆధ్యాత్మిక పరిమళాలున్నాయి.
మా గురువుగారు తాటిచెర్ల కృష్ణశర్మ గారు. ఆయన మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ముందు ఇద్దరిని పిలిచి, సంచిలోంచి చిన్న సీసా తీసి, వారి చేతుల్లో నాలుగు చుక్కలు వేసి, అటువైపొకరు, ఇటు వైపొకరు కణతలు రుద్దుతూ ఉంటే, అద్భుతంగా పాఠం చెప్పేవారు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించనంతవరకు అలవాటయినా, మ్యానరిజమైనా మంచిదే! మీ ప్రమేయం లేకుండా, మీకలాంటివేమయినా ఉన్నాయా? చెక్ చేసుకోండి! అదన్నమాట!
Saturday, December 28, 2024
జీవన్ భద్రాణి పశ్యతి! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ
సంస్కృత భాషలోని సూక్తుల్లో ఇది ఎంతో గొప్పది. బ్రతకడం అనేది ఎంత విలువైందో తెలియచేస్తుంది. ఇది ‘శ్రీమద్రామాయణం’ లో వాల్మీకి మహర్షి, ఆంజనేయస్వామి వారి చేత చెప్పిస్తాడు. సుందరకాండలోని 13వ సర్గలో వస్తుంది. సీతాన్వేషణలో తాను విఫలమైనానని మారుతి తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ‘అమ్మవారు దొరకలేదని శ్రీరామచంద్రునితో ఎలా చెప్పగలను? ఆ మహనీయునికి నా ముఖం ఎలా చూపించగలను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అనుకుంటాడు పవనపుత్రుడు. కాని వెంటనే తనను తాను సంబాళించుకొని, ఈ శ్లోకం చెబుతాడు. శ్లోకం లోని ఒక భాగమే యథాప్రకారం ప్రసిద్ధం. మిగతాది..
శ్లో: వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, ధృవో జీవిత సంగమః
సాక్షాత్తు శివాంశ సంభూతుడు అమిత బలపరాక్రమసంపన్నుడు, మహాజ్ఞాని, హనుమంతుల వారినే ‘వైఫల్యం’ క్రుంగదీసి ఆత్మహత్యకు పురికొల్పిందే, ఇక సామాన్యుల సంగతేమిటి?
టెంత్, ఇంటర్ పరీక్షా ఫలితాల తర్వాత, పిల్లలు, తాము ఫెయిల్ అయినామనో, ఎమ్‍సెట్, నీట్ లాంటి ప్రవేశపరీక్షల్లో, తామాశించిన ర్యాంక్ రాలేదనో, ఆత్మహత్యలు చేసుకొంటుంటారు. ఆ మేరకు వార్తలు చూస్తుంటాం. వాళ్లు దుర్బలమనస్కులని మనస్తత్వ శాస్త్రవేత్తలు సెలవిస్తుంటారు. మళ్లీ, డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి పరీక్షా ఫలితాల తర్వాత ఈ ధోరణి అంతగా కనబడదు. అంటే దౌర్బల్యం తగ్గినట్లా? లేక, వయోపరిపాకం వల్ల కొంత రియలైజేషన్ వచ్చినందుకా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు చూస్తే విస్తుపోయేలా ఉన్నాయి! 15-29 వయస్సుగల వారిలో ఈ టెండెన్సీ అధికమట. ప్రతి సంవత్సరం 7,20,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఆత్యహత్యలు చేసుకొంటున్నారట. 73 శాతం మధ్య తరగతి వారే ఇందులో ఉన్నారట.
తమ పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చేయాలని, యు.ఎస్.లో ఎం.ఎస్. చేసి, అమెరికాలో ఆకుపచ్చ కార్డు పొందాలని, తల్లితండ్రులు మొదట్నించి వారి చిన్న బ్రెయిన్‌లో ‘స్లో పాయిజన్’లా ఎక్కిస్తుంటారు. దాన్ని సాధించలేకపోతే వారి, వీరి జీవితాలు వ్యర్థం అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితం నెగెటివ్ అయితే సూయిసైడ్ లకు దారితీస్తుంది. ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అన్న గీతావాక్యం వీళ్ల తలకెక్కదు.
కేవలం పిరికివాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారంటే నేనసలు ఒప్పుకోను. తనను తాను చంపుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? పాతాళ భైరవి సినిమాలో, ‘రాణిగారి తమ్ముడు’ రేలంగి, తనను రాకుమారి పెళ్లాడకుండా తోటరాముడిని పెళ్లాడుతూందని, అడవికి వచ్చి, ఒక చెట్టుకొమ్మకు ఉరివేసుకోబోతాడు. ఉరితాడు మెడకు గుచ్చుకుంటుంటే, మెడకు తాడుకు మధ్య ఒక మెత్తని వస్త్రం పెట్టుకొని ట్రై చేస్తాడు. అప్పుడు చూడాలి రేలంగి గారి హావభావాలు. “చావడం అంటే ఇంత కష్టమనుకోలేదు! చచ్చే చావులా ఉంది!” అంటాడు.
ఏదయినా ఒక అకృత్యాన్ని చేయబూనినపుడు ‘అది ఆత్మహత్యా సదృశ్యం’ (సూయిసైడల్) అంటారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటామని ఊరికే బెదిరిస్తుంటారు. కాని చావరు! దాన్నే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అంటారు. తెలుగులో ఏమంటారో మరి? ‘భావోద్వేగ బెదిరింపు’ సరిపోతుందా? ఒక జోక్ చూడండి.
“నేనిక భరించలేను, రైలు కింద పడి చచ్చిపోతా” అని మగడు బయలుదేరుతుంటాడు. భార్య “ఇప్పుడు బొకారో ఎక్స్‌ప్రెస్సేగా ఉంది? అదెప్పుడు కరెక్టు టైమ్‍కి వచ్చి చచ్చింది? ఒకవేళ లేటుంటే, రెండు కట్టలు కొత్తిమీర, పావుకిలో మిర్చి, వంద గ్రాముల అల్లం, మన రైతు బజార్లో తెచ్చి ఇచ్చి వెళ్ళండి. గోపాలపట్నం దగ్గర చావకండి. కష్టం. జనాలు తిరుగుతుంటారు. కొత్తవలస దగ్గరైతే బెటరేమో ఆలోచించండి” అంటూ ఉంటుంది నవ్వుతూ! ఆయన ఎలాగూ చావడని ఆమెకు తెలుసు! ‘లైట్’ తీసుకొందని అర్థం.
‘ఇద్దరు అమ్మాయిలు’ సినిమాలో అనుకుంటాను, డి.వి నరసరాజుగారు సంభాషణలు. ఆయన చాలా హాస్యచతురుడు. సూర్యకాంతం “నేను నూతిలో దూకి చచ్చిపోతా” అంటుంది. ఆమె కూతురు రమాప్రభ. “అమ్మా! నీవు నూతిలో దూకి చావద్దే!” అంటుంది గోముగా. “నా తల్లే, నా తల్లే! నేనంటే ఎంత ప్రేమో?” అంటుంది సూర్యకాంతమ్మగారు. “అదేం కాదే! నీవు దూకితే, నూతిలోని కప్పలన్నీ చచ్చిపోతాయే!” అంటుంది రమాప్రభ. ఇలాంటి జోక్‌లు ఎందుకు రాశానంటే ‘ఆత్మహత్య’ అన్న భయంకర కాన్సెప్ట్‌ను హాస్యం కలిపి పలుచన చేద్దామని.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం చాగంటి కోటేశ్వరరావు గారిని, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సంస్కారం లాంటివి చెబుతారట. చక్కని ఆలోచన. ఆయనంతటి జ్ఞాన సంపన్నులు చెపితే, పిల్లలు తప్పక వింటారు. ఈ ఆత్మహత్యలు ఎంతటి అర్థం లేనివో ఆయన పిల్లలకు వివరించాలని నా సవినయ మనవి. చెప్పేవారిని బట్టి కదా ఆచరణ ఉంటుంది! ఆ విషయంలో, చాగంటి వారిని మించిన వారెవరు?
ప్రజాఉద్యమాల్లో పాల్గొని, నిరాశతోనో, ఉద్యమానికి మరింత స్ఫూర్తి నివ్వాలనో, కొందరు ‘ఆత్మాహుతి’ చేసుకుంటుంటారు. వారు నిజంగా గొప్పవారు. కాని, అది ఉద్యమ విజయానికి దోహదం చేయదని వారికి చెప్పేవారెవరు? గర్ల్ ఫ్రెండ్ తనను ప్రేమిస్తానని చెప్పకపోతే, వాటర్ ట్యాంక్‌పై నుండి దూకి చస్తానని బెదిరిస్తుంటారు, భావి భారత యువకులు! ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోసేవారి కంటే, కత్తితో గొంతు కోసేవారి కంటే వీరు చాలా చాలా బెటర్. ‘వద్దు దూకవద్ద’ని పోలీసులు, హ్యాండ్ మైకులో అరుస్తూ సదరు అమరప్రేమికుడిని కాపాడి జాగ్రత్తగా క్రిందికి దింపి తీసుకు రావాలని నానాపాట్లు పడుతుంటారు పాపం! ఏమొచ్చినా, పోలీసుల చావుకే వస్తుంది. ‘బ్రతికి యుండిన శుభములబడయవచ్చు’ కదా! “బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చు” అన్నారు! ఈ బలుసాకును రైతుబజారులో ఎప్పడూ చూడలేదు. సి.పి. బ్రౌన్ గారు దీన్ని ‘రెచ్చెడ్ డైట్’ అన్నారు. దరిద్రపు తిండి! కనీసం దాన్నైనా తిని బ్రతకమని! అదన్నమాట.
Sunday, December 22, 2024
దంతసిరి - దత్తవాక్కు - ఆంధ్రప్రభ
బాగా తిని జీర్ణించుకోగల శక్తి ఉన్నవారిని, వీడికి ‘దంతసిరి’ దండిగా ఉందంటారు ఉత్తరాంధ్రలో. అన్ని చోట్లా దీనికి ‘తిండిపుష్టి’ అని పేరు. ఇంగ్లీషులో వీళ్లను ఫుడీ (Foody) లంటారు. అలా అంటే నాకు ‘ఫెడీల్మని’ అన్న మాట గుర్తుకొస్తుంది. దానికి దీనికి సంబంధం లేదనుకోండి. పదాల సౌండ్‌లో సామ్యం! అంతేనండి మాస్టారు!
‘ఆహార నిద్రాభయ మైథునం చ సామాన్యమే తత్పశుభిర్న రాణాం’ అంటున్నది సుభాషితం. శ్లోకం ఇంకా ఉంది కాని, మన టాపిక్‌కు ఇంత వరకు చాలండోయ్! తిండి, నిద్ర, భయం, శృంగారం, పశువులకు మనుషులకు సమానమైన లక్షణాలంటున్నాడు సుభాషితకర్త. కాని నేనొప్పుకోనంటే ఒప్పుకోను! మిగతావి ఇప్పుడొద్దు గాని, ఆహారాన్నే తీసుకుందాం. జంతువులు ఆకలి వేస్తేనే తింటాయి. కడుపులో అనీజీగా ఉంటే తినడం మానేస్తాయి. మరి మనమో! ఆలోచించండొకసారి! ‘కడుపు నిండిన అమ్మకు గారెలు చేదు’ అని సామెత. ఆమె ఎవరో, ఆమెకెందుకు చేదో గాని, నా మటుకు నాకు అలా లేదండి. కడుపు నిండినా, మాంఛి కరకరలాడే అలసంద (బొబ్లర్లు) వడలు, ఎవరయినా బలవంతం చేస్తే, రెండు తినేస్తా!
దీనినే ‘కక్కుర్తి’ అంటారండి! ఇది మంచిది కాదని తెలిసినా, ‘జిహ్వచాపల్యం’ అనేదొకటుంది కదండి! దాన్ని గెలవడం మహామహులకే చేతకాదు. మనమెంత? విశ్వామిత్రుడంతటివాడు ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్నాడని ఐతిహ్యం. ‘క్షుద్బాధ’ ఎంతో భయంకరమైనది. ‘జఠరాగ్ని’ అని ఒకటుంది. అదీ ఆకలి అనే అగ్ని. అది నిరంతరం పొట్టలో ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.

తిన్నది అరగడం ఒక గొప్ప వరం. జీర్ణశక్తి లోపిస్తే తినడాన్ని ఎంజాయ్ చెయ్యలేము. ఎంజైములు ఊరకపోతే ఎంజాయిలుండవండోయ్! కొందరికి జీర్ణశక్తి అద్భుతం. నేను పలాసలో పనిచేసేటప్పుడు మా కొలీగ్, ఫిజికల్ డైరెక్టర్, మల్లికార్జున అని ఉండేవాడు. ఆయన మంచి తిండిపుష్టి గలవాడు. ఆయనకు మా సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ తుంబనాధం గారు ‘దంతసిరి వస్తాదు’ అని పేరుపెట్టారు. యస్.వి. యూనివర్సిటీ వాలీబాల్ ఛాంపియన్. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ చేసి, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా వెళ్లాడు. నాకు మంచి మిత్రుడు. పాపం చిన్నవయసులో చనిపోయాడు. అజీర్ణం వల్ల కాదులెండి, హార్ట్ ఎటాక్. ఒకసారి మా ఇంకో కొలీగ్, ఇతనితో పందెం కట్టగా మా పి.డి.గారు యాభై అరటికాయ బజ్జీలు అవలీలగా తిని, వంద రూపాయలు గెల్చుకొన్నాడు. 1984లో నండి! వందంటే మాటలా? మా జీతాలే వందల్లో ఉండేవి! ఆ అరటికాయ బజ్జీలు నిలువుగా తరిగి చేసేవారు. పెద్దవి!
‘దంతసిరి’ అనేసరికి నాకు మా నాన్నగారి మిత్రులు తిమ్మాభొట్లుగారు గుర్తొస్తారు. ఆయనను మేం ‘పెదనాన్నా’ అనేవాళ్లం. సన్నగా ఉండి కడుపు లోపలికి అంటుకుపోయి ఉండేది. నాకప్పుడు పదేళ్లుండొచ్చు. నాన్న ఆయనను ‘వృకోదరా’ అనేవారు. ‘వృకం’ అంటే ‘కడుపులో రగిలే అగ్ని’ అని ప్రముఖ భాషాశాస్త్ర పరిశోధకులు తిరుమల రామచంద్రగారు చెప్పారు. మా తిమ్మాభొట్లు పెదనాన్న గారికి పొట్టలో వృకం ఉంది. ఆయన లైఫ్ స్టైల్ కూడా విభిన్నం. భీమసేనుడికి ఆ పేరుంది. కానీ శారీరికంగా ఆయనెక్కడ? ఈయనెక్కడ? మా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో రామళ్లకోట అనే ఊర్లో ఆయన నివాసం. మధ్యలో బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అక్కడ లలితా పరమేశ్వరి గుడిలో ఆయన అర్చకులు. చుట్టు పక్కల ఊర్లలో పౌరోహిత్యం. అంతా నడకే, చెప్పులు వేసుకునేవాడు కాదు.
మా ఊరు (వెల్దుర్తి)లో ఏదైన పౌరోహిత్యం పని ఉంటే, ముందు మా యింటికి వచ్చి, మా అమ్మతో, “లక్ష్మీనర్సు తల్లీ! ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంట్లోనే చేయి కడుగుతా, అమ్మా!” అని చెప్పి వెళ్లేవారు. చేయి కడగటం అంటే భోంచేయడం. అమ్మకు ఆయన భోజన పరాక్రమం తెలుసు కాబట్టి ‘తగినంత’ వండేది. ఆయన నన్ను ‘దత్తప్రభూ’ అని పిలిచేవారు ప్రేమగా. నేనూ, మా తమ్ముళ్ళు, చెల్లి ఆయన తింటుంటే చూడడానికి చేరేవాళ్లం. ముగ్గురు నలుగురు తినేంత భోజనం కావాలి. తద్దినాలకు ఆయన భోక్తగా వస్తే వడలు ఎక్కువ చేయాలి. నెయ్యి అరచేతి నిండా పోయాలి. పప్పు, వంకాయకూర కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి తినేవారు మా తిమ్మాబొట్లు పెదనాన్న. అలా తిన్నా కొంచెమైనా పొట్ట రాలేదు. రోజూ 16 కిలోమీటర్లు నడిస్తే ఇంకేం వస్తుంది చెప్పండి? భోంచేసి, కాసేపు కునికి, మళ్లీ నడుచుకుంటూ రామళ్లకోటకు వెళ్ళేవారు. ధన్యజీవి మా పెదనాన్నగారు.
ఇప్పటి తరానికి నాజూకుతనం, తిండిలో! రెండిడ్లీ, సింగిల్ వడ తింటే ఆపసోపాలు! మా చిన్నతనంలో ‘సింగిలిడ్లీ బకెట్ సాంబార్’ అనే నానుడి ఉండేది. అదేదో సినిమాలో సునీల్ కోసం బేసిన్ నిండా రెండు డజన్ల ఇడ్లీలు తెస్తాడు సర్వర్ సుందరం. “మనిషన్న వాడెవడయినా అన్ని యిడ్లీలు తింటాడా? ఒకటి తీసెయ్!” అంటాడు సునీల్! “తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్!” అన్నారు కదా గురజాడ! కాబట్టి కామ్రేడ్స్, బాగా తినండి! తర్వాత పడుకోకుండా కష్టపడండి. ‘ఈసురోమని’ ఉండద్దు! అదన్న మాట!



