Sunday, April 28, 2024

గుంపులో చేరి అరుద్దాం! - దత్తవాక్కు - ఆదివారం ఆంద్రప్రభ 28 ఏప్రిల్ 2024

 ఈ మధ్య జరుగుతూన్న ఎలక్షన్ల హడావిడి, ప్రచారార్భాటం, వాగ్దాన వాగాడంబరాలు చూస్తుంటే నాకెందుకో ఛార్లెస్ డికెన్స్ గుర్తుకు వచ్చాడు. బోడి గుండుకు, మోకాలికి ముడిపెడుతున్నాడేమిటా అని మీ కనుబొమలు ముడిపెట్టకండి... నాయకులారా,
ఓటరు మహాశయులారా. ఈ 'మహాశయులు' అనే పదం ఎవరు కనిపెట్టారో కానీ ఇది నేతి బీరకాయలో నెయ్యి! కరిమింగిన వెలగపండు! ఇక చాలా... సరే సరే... ఎందుకన్నానంటే అటు వారికీ, ఇటు వీరికీ, అంత 'మహా' ఆశయాలు లేవు. ఉన్నాయని గుండెలమీద
చేతులు వేసుకుని చెప్పమనండి.
ఇంతకీ ఛార్లెస్ డికెన్స్‌ను అలా వదిలేశాం. 'అలివర్ ట్విస్ట్' లాంటి కరుణ రసాత్మకమైన నవలలే కాకుండా, సమాజంలోని కొన్ని అంశాలపై సున్నితమైన, వ్యంగ్య శరాలను కూడా సంధించాడాయన, ఆయన రాసిన సెటైర్ (వ్యంగ్య విమర్శ) ‘పిక్‌విక్ పేపర్స్'. ఇది నవల అనే చెప్పవచ్చు. డికెన్స్ 'బాజ్' అనే పేరు తో దీనిని ఎడిట్ చేశాడు. 1837లో ఇది పుస్తక రూపంలో వచ్చింది. డికెన్స్ తన 24 ఏళ్ల వయసులోనే ఒక పార్లమెంటరీ రిపోర్టర్‍గా పనిచేశాడు. ఇప్పటికీ ఇంగ్లాండులో 'పిక్‌విక్ క్లబ్' ఉందండోయ్.
ఆయన సృష్టించిన మిస్టర్ పిక్‍విక్‌ను మనం మన జంఘాలశాస్త్రితో, బారిస్టర్ పార్వతీశంతో, సత్యరాజాతో కొంతవరకు పోల్చవచ్చు. మన ఎన్నికల ప్రహసనాన్ని డికెన్స్... 13వ అధ్యాయంలో ప్రస్తావించాడు. అది ఒక వ్యంగ్యపు విందు, హాస్యపు చిందు, చురుక్కున తగిలే మందు, వెరసి మనసుకు పసందు! ఎలా ఉంది నా అనుప్రాస? అదేమిటి మొహమలా పెట్టారు? సరే... విషయానికి వస్తా.
ఈటన్స్ విల్ అనే ఊర్లో ఎన్నికలు జరుగుతుంటాయి. మిస్టర్ పిక్‍విక్ తన స్నేహితులు కొందరితో అక్కడికి వెళతాడు. రెండు పార్టీలు... హోరాహోరీ, కచాకచీ, ముష్టాముష్టీ, బాహాబాహీ పోరాడుతుంటాయి. వాటి పేర్లు బ్లూస్, బఫ్స్! రెండూ ఒక దాని మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటుంటాయి. అంత దుమ్మెక్కడిది? అంటున్నారా, తెప్పించుకుంటారండీ బాబూ! రెండు పార్టీల ఊరేగింపు ఒక చోట ఎదురవుతుంది. నినాదాలు నింగికెగిసేలా అరుస్తుంటారు. పిక్‍విక్ మిత్రులతో అంటాడు.

 


 " 'షౌంటింగ్ కంటెస్ట్' (కేకల పోటీ) నడుస్తున్నట్లుంది... ఎందుకైనా మంచిది... yell with the largest mob.. అంటే గుంపులో చేరి కేకలేద్దాం పదండి"
ఈ మాటకెంత ప్రాచుర్యం వచ్చిందంటే... అది ఒక సామెతై కూర్చుంది. ఇప్పటి రాజకీయ వలసలు చూస్తుంటే, ఆయన చెప్పింది నిత్యనూతనం. పార్టీల పేర్లు చూడండి ఎలా పెట్టాడో. బ్లూస్ అంటే 'ఏడుపుగొట్టు పాట' అనీ, ఈసురోమని ఉండటం అనీ అర్థం. బఫ్స్ అంటే కండబలం మెండుగా ఉండటం. మొత్తానికి ఇరు వర్గాలకూ బుర్రలేదని డికెన్స్ వారి అభిప్రాయం. ఈయన కొంటెతనం చూస్తే నాకు డి.వి.నరసరాజు గారు గుర్తొస్తారు. ఆయనా వ్యంగ్య ధురీణుడే!
బ్లూస్ పార్టీకి ఎన్నికల సలహాదారు 'పెర్కర్'. వారికి సొంత న్యూస్ పేపర్ కూడా ఉందం డోయ్. దాని ఎడిటర్ మిస్టర్ పాట్. ఆయనను pompous wind bag అంటాడు రచయిత. అంటే స్థూలకాయడని. ఆయనింట్లోనే వీరి బస. వీళ్లు మర్నాడు బ్లూస్ పార్టీ ఊరేగింపులో ఉంటారు. బఫ్స్ వారి ఊరేగింపు వీరిని అటకాయిస్తుంది. బ్లూస్ వారి అభ్యర్థి 'శామ్యుయల్ స్లమ్‍కీ’ ప్రచారానికి బయల్దేరేముందు తన సహాయకునితో ఇలా అంటాడు. "షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఒక పేద యువకుడిని, పాదాభివందనం చేయడానికి ఒక పెద్దాయనను, కౌగిలించుకో డానికొక వికలాంగుని, అక్కున చేర్చుకోవడానికొక ముసలవ్వను, ఎత్తుకుని ముద్దాడటానికొక పసి పాపను రెడీగా ఉంచారా లేదా". అమ్మ డికెనూ! దాదాపు 180 ఏళ్ల క్రిందటే మా నాయకులు ప్రజలతో మమేకం కావడంలోని మర్మాన్ని బయటపెట్టేశావే! శబ్బాసురా శంకరా.
బఫ్స్ పార్టీ అభ్యర్థి హొరేషియోగారు. ఓట్ల లెక్కింపులో 'టై' ఏర్పడి సమీయే గెలుస్తాడు. పెర్కర్ ఆయన గెలవడానికి తగిన 'లంచాలను' పెద్ద ఎత్తున ఓటర్లకిచ్చి ఉంటాడు. అయ్యా... అదీ సంగతి. ఏమంటే... అప్పటికింకా వ్యక్తిగత దూషణలున్నట్లు లేదు. ఎవరు గెలుస్తారు? ఏముద్ధరిస్తారు... అనేది పక్కన బెడితే... ఈ ప్రహసనమంతా చక్కని వ్యంగ్య వినోదంగా మలచిన డికెన్స్‌కు ఆయన సృష్టించిన మిస్టర్ పిక్‍విక్‌కు జై! మనలాంటి మధ్య తరగతి మందహాసాలకు ఎన్నికలు ఒక చక్కని వినోదం! ఆ మందహాసంలో ఒక నిస్సహాయ విషాదం కూడా ఉంది! కానివ్వండి! అదన్నమాట.

సరస్వతీ పుత్రుని సాహిత్య దీప్తి

నేడు శ్రీ పుట్టపర్తి నారాయాణాచార్యుల జయంతి. ఈ సందర్భంగా నేను ఆంద్రప్రభలో వ్రాసిన వ్యాసం చదవండి.
~
ఆయనది ధిషణాహంకారమేగాని వ్యక్తిగత గర్వం కాదు. అవసరమైతే ఏ సవాలునైనా స్వీకరించేవారు. “ఆయనకు అన్ని భాషలు రావు. కేవలం ప్రచారమే” అని ఒక లబ్దప్రతిష్ఠుడు ఆక్షేపిస్తే, "14 భాషల్లో ఎవరు ఏ ప్రశ్న ఐనా వేయవచ్చు. వాటిలో ఆశు కవిత్వం చెబుతాను” అన్న ధీశాలి ఆయన. ఈయన అహంకారం ఎంతైనా సముచితం. పుట్టపర్తి వారి వంటి వారికి జననమే కాని మరణం ఉండదు.


 



'మహాప్రవాహం!'-24

మొదట్లో కస్టమర్ల కాల్లకు చెప్పలు తొడిగి, సైజులు చూస్తాంటే ఒక రకంగా అనిపించేది. తర్వాత అలవాటయి పోయినాది. బతుకు తెరువు నడిపేది వాండ్లే గదా అనిపించేది.
~
కాలమా! మజాకా! ఎవుర్ని యాడకు దీస్కపోతాదో! మాదవ కుటుంబమును తన ఎంటన గుంజుకొనిపోయింది! దానిస్టమే గాని మనిస్టం గాదు కద!


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-24/

 


Thursday, April 25, 2024

డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు పంపిన ఆశీస్సులు

డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు నన్నూ, తమ్ముడు కోవెల సంతోష్ కుమార్‍ను దీవిస్తూ పంపిన పద్యాలు:


 


విశేష బహుమతి పొందిన నా 'బాలల నాటకం'

బాలబాట మాసపత్రిక ఇటీవల నిర్వహించిన బాలల నాటక రచనా పోటీలో నేను రచించిన 'పరధర్మో భయావహః'  అనే బాలల నాటకానికి ప్రత్యేక బహుమతి లభించింది. ఈ మేరకు బాలబాట నిర్వాహకురాలు కొల్లూరి స్వరాజ్యం వేంకట రమణమ్మ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 


 


Sunday, April 21, 2024

గ్రాంఫోన్... టేప్ రికార్డర్.. సెల్‍ఫోన్! - దత్తవాక్కు - ఆంద్రప్రభ - ఆదివారం - 21 ఏప్రిల్ 2024

1887 లోనండీ... ఎమిల్ బెర్లినర్ అనే ఆయన గ్రామోఫోన్‌ను కనిపెట్టాడు. ఎలక్ట్రిక్ రికార్డు ప్లేయర్‌కిది పూర్వీకుడు. నవ్వుతున్నారెందుకు? మనుషులకే కాదు... యంత్రాలకూ పూర్వీకులుంటారు. తేడా ఏమంటే, యంత్రాలకు తద్దినాల సమస్య లేదు. అది తొలి కార్బన్ మైక్రో ఫోన్. దాని పేటెంట్‌ను ఆయన అలెగ్జాండర్ గ్రాహంబెల్‌కి అమ్మేశాడు. అదే థామస్ అల్వా ఎడిసన్‌కి ప్రేరణ. ఆయన విజయవంతంగా మానవుని గొంతును, రికార్డు చేసి స్టోర్ చేయగలిగాడు. టిన్ ఫాయిల్ ఫోనోగ్రాఫ్ ద్వారా దానిని ప్లే చేయగలిగాడు.
1900లో గ్రామోఫోన్‍కు ట్రేడ్‍మార్క్ 'హిజ్ మాస్టర్స్ వాయిస్'ను సంపాదించాడు ఎడిసన్. అదే హెచ్ఎంవీ కంపెనీగా తర్వాత పేరుపొందింది. వెడల్పుగా బ్యాండుమేళం మూతిలా ఉన్న దాని దగ్గర ఒక కుక్క కూర్చుని వింటూ ఉంటుంది. దానిపేరు నిప్పర్, కుక్క తన యజమాని గొంతును ఎలా గుర్తిస్తుందో... అంత క్లారిటీగా అన్న మాట,
తయారైన తర్వాత ఎడిసన్ తన తొలి రికార్డును ఎవరైనా గొప్పవాడి గొంతుతో చేయిద్దామనుకుని జర్మన్ వేదాంతి, విద్యావేత్త, మాక్స్ ముల్లర్‌ని సంప్రదిస్తే... ఆయన సరేనన్నాడట.
ఆయన గొంతులో ఒక విషయాన్ని రికార్డు చేసి ఒక సభలో వినిపిస్తే, అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట. కారా మరి? కొందరు భయస్తులు ఇది దయ్యాల పనే అని తేల్చేశారట.
కానీ, మాక్స్ ముల్లర్ చెప్పినది ఏదో వేరే భాష, 'ఇదేమిటో తెలుసా?' అని అడిగి 'ఇది సంస్కృతం... భారతీయ పురాతన సనాతన భాష. గ్రాంఫోన్‍లో నేను చదివింది ఋగ్వేదంలోని అగ్నిమీళే పురోహితం అన్న మంత్రం. అగ్నిని ఆరాధించే ప్రార్థన.. సమస్త జ్ఞానానికి ఆద్యులు భారతీయులే' అని చెప్పాడట ముల్లర్. సభికులు చప్పట్లు. 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయి!' అని ఎగతాళి చేసేవారు తెలుసుకోవాలి మరి.
తర్వాత టేపు రికార్డర్లు వచ్చాయి. ధ్వనులను ఒక నల్లని, ఒక సెంటిమీటర్ వెడల్పున్న చిన్న రిబ్బను లాంటి టేపులో రికార్డు చేసి, ఒక ప్లాస్టిక్ డొక్కులో చుట్టేవారు. దానిని క్యాసెట్ అని అనేవారు, టేపు రికార్డర్లో దాన్ని అమర్చి ప్లే అనే స్విచ్ నొక్కితే టేపు తిరుగుతూ, ప్రీ రికార్డెడ్ పాటలు, ఇంకా ఎన్నో చక్కగా వినిపించేవి. 80వ దశకంలో ఇంట్లో టేపు రికార్డర్ ఉంటే ఒక ప్రిస్టేజ్‌గా భావించేవారు, చౌక రకం టేప్ రికార్డర్లలో టేపు స్ట్రక్ అయితే, దాన్ని బయటకు తీసి పెన్సిల్‍తో చుట్టడానికి నానా అవస్థపడే వాళ్ళం.
ఇప్పుడు సెల్ ఫోన్ షాపులున్నట్టు ఎక్కడ చూసినా క్యాసెట్లు, రికార్డింగ్ దుకాణాలుండేవి అప్పుడు. అబ్బో ఎప్పటి మాట నలభై ఏళ్ళ కిందట. ఎన్నో ప్రముఖ క్యాసెట్ కంపెనీలు చక్కని సంగీతాన్ని రికార్డు చేసి అమ్మేవి. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ గారు వ్యాపారాన్ని అటుంచితే ఈ రంగంలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మనకు నచ్చిన సినిమా పాటలను, కీర్తనలను సెలక్టు చేసి ఇస్తే క్యాసెట్ షాపాయన వాటన్నింటినీ ఒకే క్యాసెట్లో రికార్డు చేసి ఇచ్చేవాడు. 60 నిమిషాల క్యాసెట్లు, 90 నిమిషాల క్యాసెట్లు ఉండేవి. ధర రూ.35 నుండి ప్రారంభం. 90లలో పుట్టిన వారికి ఈ విషయాలు తెలియవు పాపం. (పాపం ఎందుకో).


తర్వాత వచ్చేశాయి బాబోయ్... సెల్‍ఫోన్‍లనే మాయాజాలాలు! అన్నింటినీ తుడిచిపెట్టి పారేశాయి. 'బస్సొచ్చి బండోడి కడుపు కొట్టిండోయ్!' అన్నట్టు, సెల్లొచ్చి సమస్తమూ తొలగ దోసిందోయ్ అనాలి ఇప్పుడు. సెల్‍ఫోన్ స్మార్ట్ ఫోన్‍గా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అదొక అద్భుత ప్రపంచాన్ని మన అరచేతిలో ఇమిడ్చే పరికరం, ఆడియో, వీడియో దేన్నయినా ఇట్టే రికార్డు చేస్తుంది. దాన్ని క్షణాల్లో కావలసిన వారికి షేర్ చేయవచ్చు. యూ-ట్యూబ్‍లో నా ప్రసంగాలు, పద్యాలు, పాటలు వస్తుంటాయి. మా కోడలు ప్రత్యూష కొన్ని ఇంట్లోనే రికార్డు చేస్తుంది. ఒకసారి ఆ అమ్మాయి బయటికి వెళ్తే మా మనవడు ఏడేళ్ళ వాడు 'నేను తీస్తాలే తాతా' అని చక్కగా నా పద్యాలను వీడియో తీసి చూపించాడు. ఇంతకు ముందు మా కాలంలో 'పుస్తకం హస్త భూషణం' అనేవారు, ఇప్పుడది 'సెల్ఫోన్ చేతికి అందం'గా మారింది. మహాప్రభూ! కెమెరాలను, చేతివాచీలను, టేపు రికార్డర్లను, అలారం టైమ్‍పీస్‍లను సర్వేసమస్తాలను దెబ్బతీసింది సెల్ ఫోన్! మీరు మెయిన్ రోడ్డు మీద వెళుతూంటే ప్రతి ఐదు షోరూమ్‍లలోనూ ఒకటి సెల్ ఫోన్‍లది అయిఉంటుంది.
సౌలభ్యం సంగతటుంచితే ఆ కాలంలో గ్రాంఫోన్, టేపు రికార్డుల ఆనందం అనుభవించిన వారికే తెలుసు. గ్రామఫోన్ ప్లేటు కొంతకాలానికి అరిగిపోయి, దాని పిస్ ఒక చోట చిక్కుకుని అక్కడ ఉన్న పాట భాగాన్ని పదే పదే వినిపిస్తుంటే నవ్వుకునే వాళ్ళం కాని, విసుక్కునే వాళ్ళం కాదు. 'జగమే మాయ' అనే దేవదాసు పాటలో పిన్ను ఇరుక్కున్న చోట వేదాలలో, దాలలో, దాలలో... ఇలా పిన్ తీసేవరకు రిపీట్ అయ్యేది. ప్రతి గుడిలో ఒక గ్రాంఫోన్, టూరింగ్ టాకీస్ కూడా. ఘంటసాల వారి 'వాతాపి గణపతిం భజే', 'దినకరా శుభకరా' వినీ వినీ అవి నోటికి వచ్చేవి. రికార్డింగ్లు శృతి మించి, రహస్యంగా వాయిస్ రికార్డు చేసే సాక్ష్యాలుగా ఇస్తున్నారు. దొరికితే మాత్రం సోషల్ మీడియాలో అవి వైరల్! ఇంతకూ వైరల్ అంటే ఏమిటో? వైరస్‍లాగా పాకిపోయేదనో ఏమో ఖర్మ, ఇంతకూ వైరల్ కానిదేదైనా ఉందాఅని? అదన్నమాట!..

'మహాప్రవాహం!'-23

“ఏం చేస్తాము తల్లీ! కొడుకు మనోడు గాని, కోడలు మనది కాదు గదా, ఆ యమ్మకి నా పోడంటేనే గిట్టకపాయె. మా వాండ్లు (భార్య) సచ్చిపోయేంత వరుకు బాగనే ఉండె. ఆడికి రమ్మంటారుగాని, ఆ మాటలు కడుపు లోనించి రావు, పెదిమెల మించి వస్తాయి. సేద్దెం జెయ్యలేక మానేస్తి. ఇదో ఈ బండి, ఈ నోరు లేని జీవాలు మిగిలినాయి. బస్టాండు కాడ సూపెట్టుకోని, యావయినా సరుకులు తీసుకుపోనీకె ఎవరయినా పిలుస్తే పోతా. ఇవిటి మ్యాతకు, నా తిండికి లోటు లేదు తల్లీ! పైన శగిలి ఉన్నంత కాడికి జేస్తా. మూలబడినంక వానికీ తప్పదు, వాని పెండ్లానికి తప్పదు.”

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-23/


Wednesday, April 17, 2024

'రామ నీల మేఘ శ్యామ!' - పాట - నా నోట

స్వాధ్యాయ యు ట్యూబ్ చానల్ లో రామనవమికి నేను పాడిన ఈలపాట రఘురామయ్య గారి పాట, 'రామ నీల మేఘ శ్యామ!' మీకోసం




రామాయణం లోని ముఖ్యమైన మూడు ఆదర్శాలు

సీతారాముల వివాహాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటున్నాం? మనం ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో తెలిపి, వారు మనకు ఆదర్శంగా నిలిచారు గనుక.


(పూర్తి వ్యాసం సంచిక వెబ్ పత్రికలో ఈ లింక్ ద్వారా చదవగలరు)

https://sanchika.com/ramayanamloni-mukhyamaina-moodu-aadarshaalu-pds-essay/ 


Sunday, April 14, 2024

నా నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైనట్టు తెలిపే వార్త - ఆంధ్రప్రభలో

నా నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైనట్టు తెలిపే వార్త ఆంధ్రప్రభ దినపత్రికలో


 


నాన్నకు కోపంతో - దత్తవాక్కు - ఆంద్రప్రభ ఆదివారం - 14 ఏప్రిల్ 2024

 నాన్న కన్నా... అమ్మంటేనే అందరికీ ప్రేమ, తొమ్మిది నెలలు కడుపులో మోసి కంటుంది అమ్మ, ఆమె స్థానం అద్వితీయమైనదే! అందులో సందేహం లేదు.. కానీ, నాన్న కెందుకో, సాహిత్యంలో, సినిమాల్లో, ఇతరత్రా అంత ప్రాధాన్యత ఉండదు. అక్కడ ఉన్నా అంత చెప్పుకోదగింది కాదు!
వనితా మానస సూన సాయకుడు... జీవదాత్త పాదులందు.. అంటాడు తెనాలి రామకృష్ణ కవి తన పాండు రంగ మహత్యం కావ్యంలోని నిగమ శర్మోపాఖ్యానంలో.
నిగమ శర్మను అతిగారాబంతో ళ్ళమ్మ ఎందుకూ పనికి రానివానిగా చేసింది. జులాయి వెధవయ్యాడు, జూదరి అయ్యాడు. వ్యభిచారి కూడా. జీవత్తాతపాదుడు అన్న.. తెనాలి వారి ప్రయోగం చాలా అర్ధవంతమైంది. దానికర్థం తండ్రి ఇంకా బతికే ఉన్న కొడుకు అని. తాతపాదుడంటే.. సంస్కృతంలో నాన్న. నిగమ శర్మ ఎన్ని వెధవ పనులు చేస్తున్నా, వాడి ఆటలు సాగుతున్నాయంటే కారణం.. వాడి నాన్న బతికే ఉండటమని తెనాలి వారి కవిహృదయం. జీవత్తాతపాదుడనే శీర్షికతో నేనొక కథ రాశాను, తెనాలి వారి స్పూర్తితో... కథామంజరి మాసపత్రికలో అది ప్రచురించారు.
తండ్రి బతికున్నంతవరకూ జీవితం హ్యాపీస్/ అంతా ఆయనే చూసుకుంటాడు. తిట్టినా.. కొట్టినా పాకెట్ మనీ ఇస్తాడు. ఆయనుంటే కొండంత అండ. ఆయన పోయాకే తెలుస్తుంది. ఆయన విలువ, కానీ, బతికున్నంత కాలం, ఆయన చండశాసనునిగా, ఒక డిసిప్లేరియన్‍గా ఉంటాడు. ప్రేమను వ్యక్తం చేయడం అమ్మకు చేతనైనట్టుగా, నాన్నకు చేతకాదు. ఒక వేళ ప్రేమ ఉన్నా, దాన్ని బయటపెట్టడు నాన్న. సంక్షేమ పథకాల్లో అమ్మ పేర్లే పెడతారు కానీ, నాన్న పేర్లు పెట్టరు! అమ్మ ఒడి అంటారు కానీ, నాన్న తొడ అనరుగా! అడపాదడపా సినిమాల్లో నాన్న పాటలు ఉంటాయి. ధర్మదాత సినిమాలో 'ఓ నాన్న! నీ మనసే వెన్న.. అమృతం కన్నా అది ఎంతో మిన్న' అన్న సి.నా.రె.గారి పాటంటే నాకెంతో ఇష్టం. నాన్న అంతరంగాన్ని ఆ జ్ఞానపీఠ కవివర్యుడు హృద్యంగా ఆవిష్కరించారు. ఘంటసాలతో పాటు టిఆర్ జయదేవ్ అనే గాయకుని గొంతు కూడా ఇందులో వింటాం.. సుశీలమ్మ గురించి చెప్పేదేముంది. ది నైటింగేల్ ఆఫ్ ది సౌతిండియా!
'తండ్రి హరిజేరుమనియెడు తండ్రి తండ్రి!' అని ప్రహ్లాదునితో చెప్పిస్తారు పోతనగారు. ఆధ్యాత్మ దర్శనం చేయించిన వాడు కూడా నాన్నే. కానీ, నాన్న దగ్గర మనకు చనువు తక్కువ. అమ్మ, దగ్గర చేరి ఓవర్ యాక్షన్..! ఆయన టాస్క్ మాస్టర్, మన జీవితానికి ఒక ఆర్డరు ఏర్పరచాలని ఆయన నిరంతరం తపిస్తుంటాడు. ఆ క్రమంలో కొంత కాఠిన్యం వహిస్తూ ఉంటాడు. ఆ మధ్య తనికెళ్ళ భరిణి, చిన జీయర్ స్వామి పాల్గొన్న ఒక అధ్యాత్మిక సభలో 'నాన్నెందుకో వెనుకబడ్డాడు' అన్న కవిత చదివి వినిపించారు. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే, నాన్న పాతికేళ్ళు అంటారు తనికెళ్ళ. దెబ్బ తగిలినప్పుడు అమ్మా! అని అరుస్తాం. కానీ, నాన్నా అని అరవం, నాన్నను మన పెన్నెముక అంటారు. ఈ కవిత రాసిన వారు. 'పాపం నాన్న' అని నేనూ ఒక కవిత రాశానండోయ్! అప్పుడే విసుగ్గా మొహం పెట్టకండి! అది 2017లో నవ్య వార పత్రికలో వచ్చింది. తనికెళ్ళ అనేసరికి ఇంటరెస్టు! దత్తశర్మ అనేసరికి విసుగు ఇదేం న్యాయమండి! కాకి కవిత కాకికి ముద్దు!


 

మా నాన్న బ్రహ్మశ్రీ, శతావధాని, పౌరాణిక రత్న పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. ఆయనకు గురజాడ కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులకు లాగ కించిత్ ప్రథమ కోపమున్నూ.. ఉండేది. నేను కాలేజీ ప్రిన్సిపాల్ నయినా ఆయనంటే భయం పోలేదు. నేనేదైనా చక్కని పద్యం రాసి వినిపిస్తే పొరపాటునైనా బాగుందని అనేవారు కారు. ఈ విషయంలో నాకు మహాకవి భారవి గుర్తుకొస్తాడు. నేను భారవి అంతటి వాడిని కాకపోయినా, మా నాన్న మాత్రం మహా పండితుడే. ఆయన నన్ను కోప్పడేవారు. తెలుగు, సంస్కృత కావ్యాలను నాకు బోధించినవాడు ఆయనే. నమక, చమక, పురుష సూక్త మహన్యాసములు నా తొమ్మిదవ ఏటనే నేర్పించింది ఆయనే. నేను మొరాయిస్తే ఒక కొబ్బరి పీచుతాడుతో కొట్టడానికి నా వెంట పడేవారు. ఉట్టి కేకలే! ఒక్క దెబ్బపడేది కాదు. అప్పుడాయనంటే కోపం, ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా చూపించడానికి ఆయన లేరు.
సిల్వియా ప్లాత్ అన్న రచయిత్రి రాసిన 'డాడీ' అన్న కవిత సుప్రసిద్ధం. ఆమె ఇలా అంటుంది. daddy, i have had to kill you, you died before i had time. ఆమె ఇలా అంటుంది. తాను అర్థం చేసుకోకముందే ఆయన వెళ్ళిపోయాడని ఆమె కోపం. ఆయన్ను ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ గాడ్ అంటుంది. ఎంత గొప్ప భావన. నాన్నను వర్ణించడానికి ఆమె వాడే రూపకాలు మనలను కంటతడి పెట్టిస్తాయి. నాన్నయన్నట్టి. పద మది మిన్న జగతి, మంచి హితుడును వేదాంతి మార్గదర్శి, అతని కోపంబు. దీవెనై యరయవల యుమనల, వెన్నవంటిది మధురంబు నాన్న మనసు. అదన్న మాట!

గోదావరి - పాపికొండలు - భద్రాచల యాత్ర-3

కూనవరంలో బస్ ఆపాడు. పక్కనే ఉన్న ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్లారు. అక్కడ మంచాలు, కుర్చీలు ఉన్నాయి. బాత్ రూం ఉంది. ఆ యింటివారు మమ్మల్ని ఆదరించి కూర్చోబెట్టారు. మెత్తని ఉల్లిపాయ పకోడీ, చక్కని టీ సర్వ్ చేశారు. ఇదంతా పున్నమి ట్రావెల్స్ వారి ప్యాకేజ్‌లో భాగమేనట.


https://sanchika.com/godavari-papikondalu-bhadrachalam-yaatra-pds-3/


'మహాప్రవాహం!'-22

“నాక్కూడ్క యాదయిన పని చెప్పరా” అన్నాడు మాదవ.
చలమేశు నవ్వి, “ఆ గంపన మెరపకాయలు, అల్లము, ఉల్లిగడ్డలు సన్నగా తరగనీకె నీతోన ఐతాదా?” అన్నాడు.
“అదేమంత బ్రమ్మ విద్దెనా, మా యింట్లో మా అమ్మకు తరిగిచ్చేది నేనే” అని ఒక టేబుల్ మింద అన్నీ పెట్టుకోని శాకు తోన తరగ బట్నాడు. 


https://sanchika.com/mahaapravaaham-pds-serial-22/


Friday, April 12, 2024

శ్రీమద్రామాయణము, వ్యక్తిత్వ మార్గదర్శనము - ప్రసంగం

13 ఏప్రిల్ 2024, సాయంత్రం 6 గంటలకు చెన్నై లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు నిర్వహించే 'నెల నెలా వెన్నెల' కార్యక్రమంలో శ్రీరామనవమి పర్వదినమును పురస్కరించుకొని, నేను చేసిన ప్రసంగం, 'శ్రీమద్రామాయణము, వ్యక్తిత్వ మార్గదర్శనము' వారి యూ ట్యూబ్ చానల్‌లో ప్రసారం అవుతుంది. మీకు పంపుతున్న, సంబంధిత లింక్ సరిగ్గా సా.6 గం. కు తెరుచుకుంటుంది. వీక్షించండి. ఇతరులకు పంపండి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 

 





 


నా నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైనట్టు తెలిపే వార్త

నా నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైనట్టు తెలిపే వార్త సూర్య దినపత్రికలో


 


Thursday, April 11, 2024

సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో నా నవల ఉత్తమ నవలగా ఎంపిక

అమెరికా లోని డల్లాస్ లోని తెలుగు సాహిత్యసంస్థ 'సిరికోన’ వారు నిర్వహించిన కళా రంగ ఇతివృత్త నవలల పోటీలో, ఒక హరికథా విద్వాంసుని ప్రస్థానాన్ని, ఫిక్షన్‌గా మలచి, నేను రాసిన నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా పురస్కారం అందుకున్నదని సవినయంగా తెలుపుతున్నాను.


 

నరసింహస్వామిపై సుప్రసన్న కీర్తనలు 1

శ్రీమాన్ కోవెల సుప్రసన్నచార్యుల వారు, అశువుగా, శ్రీ వేల్పుకొండ నరసింహ స్వామి వారిపై, రచించిన కీర్తనలను, స్వరపరచి, పాడే భాగ్యం కలిగింది. ఇది మొదటిది. వరుసగా ఇవి స్వాధ్యాయ యూ ట్యూబ్ లో వస్తాయి. 🙏


 


Monday, April 8, 2024

నా నవల 'ఆపరేషన్ రెడ్'కు ₹ 5000/- బహుమతి

చదువు - అన్వీక్షికి సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటీ 2023లో నా నవల 'ఆపరేషన్ రెడ్' చదువు ఒరిజినల్స్ విభాగంలో ₹ 5000/- బహుమతి గెల్చుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. 


 


తెలుగదేల యన్న..? - కథ

గంపనిండా, 27 రకాల డిషెస్ వచ్చాయి. పులిహర, బూరెలు, అరటికాయ ముద్దకూర, కొత్తిమీర పచ్చడి, మజ్జిగపులుసు, ఉలవచారు.. ఎన్నెనో! డైనింగ్ టేబుల్ మీద అన్నీ విప్పి, వాళ్లు పంపిన అరిటాకుల నిండా వడ్డించుకున్నారు. వాటిని ఫోటోలు తీసి ‘యుగాడీ లంచ్ విత్ భీమవరం బుచ్చయ్యాస్’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు. తినడం కంటే అది ముఖ్యం కదా!



https://sanchika.com/telugadela-yanna-pds-story/

కోమలం క్రోధి నామ సంవత్సరం - ఉగాది ప్రత్యేక ప్రసంగం

ఉగాది పండుగ, మీ ఇంట, మెండగు సంతసం నిండగా, మీకు నా శుభ కామనలు 🙏🌹




Saturday, April 6, 2024

గత కాలమె మేలు! - దత్తవాక్కు - ఆంద్రప్రభ ఆదివారం - 07 ఏప్రిల్ 2024

కృష్ణద్వైపాయనుడైన వ్యాస భగవానుడు, పాండురాజు అకాల మరణం తరువాత అందరికీ దుఃఖోపశమనం చేస్తాడు. అప్పుడు తన తల్లి సత్యవతీదేవితో ఆయన ఇలా చెబుతాడు.
కం.
మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతు లతి క్షణికంబులు
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
(నన్నయ్య - ఆదిపర్వము-పంచమాశ్వాసము)
ఆయన ఆధ్యాత్మిక విషయాన్ని చెబుతుంటే, దాన్ని వదిలేసి, కొందరు చివరి పాదాన్ని పట్టుకుని, భవిష్యత్తు కంటే గతమే మంచిదని వాదిస్తుంటారు. అదేమిటో గానండీ... చాలా శ్లోకాలు, పద్యాల చివరి పాదాలు నానుడులుగా, జాతీయాలుగా, సామెతలుగా, పలుకుబడులుగా (అన్నీ ఒకటే అంటున్నారా... సరే. కానీండి) మారతాయి. కానీ ముందు పాదాలు ప్రసిద్ధి చెందవు. ఇలా కవిత్వంలోని ఒకభాగం విశ్వజనీనంగా మారడాన్ని ఇంగ్లీషులో ప్రోవర్బియల్ స్టేటస్ పొందటం అంటారు. షేక్‍‌స్పియర్ నాటకాల్లో చాలా వాక్యాలు ఇలాంటివే.
'గతం గతః' అన్నారు పెద్దలు, గతించిందే గతం. అది మనం అరచి గీపెట్టినా మళ్లీ రాదు. రాదంటే రాదంతే. దాన్ని వదిలెయ్యాలి. వర్తమానంలో బతకాలి. భవిష్యత్తు పట్ల ఆశతో ఉండాలి. అలా కాకుండా గత స్మృతులలో విహరించడాన్ని ఇంగ్లీషులో 'నోస్టాల్జియా' అంటారు.
ముఖ్యంగా వృద్ధాప్యంలో ఈ ధోరణి ఎక్కువ. 'మా చిన్నతనంలో...', 'ఆ రోజుల్లో' అంటూ ప్రారంభం అవుతుంది నోస్టాల్జియా. వినేవారికి విసుగ్గా ఉంటుందన్న ధ్యాసే ఉండదు. 'మా అమ్మ కట్టెల పొయ్యిమీద మామిడికాయ, తోటకూర పప్పు వండేది. దాని రుచి ఈ కుక్కర్లో వండిన పప్పుకు వచ్చిచస్తుందా?', 'నా చిన్నప్పుడు బడికి నాలుగు మైళ్లు నడిచి వెళ్లేవాళ్లం..', 'మా ఆయన కట్టిపేడుతో నెత్తినకొట్టా డొకసారి.. కాఫీ చల్లారి పోయిందని... ఇంత బుడిపె కట్టింది. అంత కోపం మారాజు', 'టైప్ మిషను మీద అక్షరాలు టైప్ చేస్తుంటే ఆ అందమే వేరు. ప్రతి లైనుకు బర్రున ఇటువైపు లాక్కుని... ఈ కంప్యూటర్లంటే నాకు నచ్చదు సుమండీ'.. ఇలాంటి డవిలాగులు వింటే వాళ్ల మీద నాకు కోపం రాదు. జాలేస్తుంది. జరిగిపోయిందాన్ని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏముందీ? ఇప్పటికీ కుక్కర్లు వాడకుండా అన్నం పప్పు లను బయట ఉడికింపచేసే నోస్టాలిక్ భర్తలున్నారండీ బాబూ.. వారి భార్యలకు నా లాల్ సలామ్. 'తింటే తిను... లేకపోతే మానేయ్' అనని వారి పతిభక్తి గొప్పది. కాళిదాసు మహాకవి అంతటివాడు ఈ గతం, వర్తమానం అనే కాన్సెప్టుని ఎంత బ్యాలన్స్‌డ్‍గా చెప్పాడో చూడండి...
శ్లో,
పురాణమిత్యేవ నసాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్య పద్యం
సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే
మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః
(మాళవికాగ్నిమిత్రము)
"పాతదైనంత మాత్రమున అంతా మంచిదికాదు. కొత్తది కాబట్టి అంతా చెడ్డదీ కాదు. తెలివిగల వారు రెండింటినీ పరిశీలించి, మంచి చెడ్డలు నిర్ణయిస్తారు. మూర్ఖులు ఇతరులను గుడ్డిగా అనుసరిస్తారు" ఎంత నిజం. రెండింటిలో మంచీచెడూ ఉంటాయి. మంచిని స్వీకరించాలి. చెడును వదిలేయాలి.
తన 'ముత్యాల సరాలు'లో గురజాడ వారిలా అంటారు.... 'పాతకొత్తల మేలుకలయిక క్రొమ్మెరుంగుల జిమ్మగా'. గతం ఎప్పుడూ విలువైనదే. కానీ దానిలోనే నివసిస్తే ప్రమాదం. వర్తమాన, భవిష్యత్తులకు అదే పునాది. 

 


"ఏదైనా ఒక నాగరికతను ధ్వంసం చేయాలంటే దాని చరిత్రను వక్రీకరిస్తే సరి" అంటారు కోవెల సంతోష్ కుమార్ తన 'రామం భజే శ్యామలం' అన్న గ్రంథంలో.
సాహిత్యంలో పూర్వ మహా కవులను ఇప్పటికీ శిరోధార్యులుగా భావిస్తాము. ఎన్నో కొత్త కొత్త ప్రక్రియలు పుడుతుంటాయి... వాటినీ స్వీకరించాలి. ఈమధ్య గత సాహితీ రీతులను అసలు సాహిత్యమే కాదని అనే అల్పజ్ఞులు తయారైనారు. కవిసమ్రాట్ విశ్వనాథ అంతటివారు తమ రామాయణ కల్పవృక్ష అవతారికలో పూర్వ కవులను ఇలా స్మరించారు.
సీ.
ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన్న శిల్పపు దెనుగుతోట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు
పోతన్న తెలుఁగుల పుణ్య పేటి
శ్రీనాథుడు రసప్రసిధ్ధ ధారాధుని
కృష్ణరాయ డనన్య కృతిప్రబంధ
పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు
రామకృష్ణుడు సురారామగజము
తే.గీ.
ఒకడు నాచనసోమన్న, యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్రకవిలోకమూర్ధమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి.
~
మహాకవి ఎ.ఎల్. టెన్నిసన్ ఇలా అంటాడు - "The old order changeth, yielding place to the new, And God fulfils Himself in many ways..." పాతపద్దతి మారుతూ, కొత్తదానికి చోటిస్తుంది. రెండూ దేవుని ఆవిష్కరణలే.
కాబట్టి కామ్రేడ్స్. రోటిపచ్చడి మా అమ్మ చేసినట్లు చేయమని మీ ఆవిడని సతాయించకండేం... చక్కగా మిక్సీ పచ్చడిని రామా ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా తినేయండి. అబ్బాయి లోన్ పెట్టి ఇన్నోవా కొంటే మీరు సైకిల్లో తిరిగేవారని చెబుతూ వాడిని చిన్నబుచ్చకండి. మీ సమ వయస్కులతో పంచుకోండి మీ నోస్టాల్జియాను. యువతరంమీద రుద్దకండి భాయీ.
Those who live in the past... die in the past అన్న సామెత కొంచెం కష్టంగానే ఉన్నా, నిజం మాస్టారు. 'గతాన్ని తెరిచి, వర్తమానంలో నిలిచి, భవిష్యత్తుని మలచుకో. ఇదెవరి మాట? ఇంకెవరిది.. నాదేనండి బాబూ... అదన్న మాట.

యు ట్యూబ్‌లో నా ఆధ్యాత్మిక ప్రసంగం

 కపిల.. దేవహూతి సంవాదం, సాంఖ్యకారిక, భాగవతం తృతీయ స్కంధం నుంచి ప్రసంగం

 



వినండి, వినిపించండి.

గోదావరి - పాపికొండలు - భద్రాచల యాత్ర-2

‘బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్’ అంటామే, అది మాకు అనుభవగోచరమైంది. ఉప్పొంగుతున్ననది. దగ్గరలో పాపికొండలు. “అంబరచుంబి శిరసరిజ్ఘరీ” అని పెద్దన గారన్నట్లు ఆకాశాన్ని చుంబిస్తున్నాయా పర్వత రాజాలు. వాటి నిండా దట్టమైన చెట్లు, ఎండ ప్రభావం ఏ మాత్రం లేదు. ప్రకృతి తన ఎ.సి. ఆన్ చేసింది. సెంట్రలైజ్డ్ ఎ.సి. అది. అందరికీ సమానంగా అందిస్తుంది. తరతమ భేదాలు లేకుండా అందరికీ తన ఫలాలనివ్వడమే ప్రకృతి లక్షణం. దాన్ని మానవుడు అలవరచుకుంటే, అతని జన్మ ధన్యం. 


 https://sanchika.com/godavari-papikondalu-bhadrachalam-yaatra-pds-2/


'మహాప్రవాహం!'-21

"కాలము మనుసుల జీవితగతి మారుస్తాది రా చలమయ్యా! బాపనోండ్ల పిల్లలు, రెడ్డి పిల్లలు పెద్ద సదువులు సదువుకోని రకరకాల ఉద్యోగాలు సేస్తాన్నారు. పనిచేసే కాడ పై అధికారి తక్కువ కులమోడైనా, మరేద యిస్తున్నారు." 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-21/