Sunday, March 31, 2024

అనువాద ధారావాహిక ‘అంతరిక్షంలో మృత్యునౌక’ 8వ భాగం

శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించాను. ఈ ధారావాహిలో చివరి భాగం లింక్. మిగతా భాగాలను సంచిక వెబ్‍సైట్‍లో చదవవచ్చు.


https://sanchika.com/antarikshamlo-mrutyunauka-8/


నా కథ 'మా తుఝే సలాం'కు బహుమతి

ఉషా పక్ష పత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో, నా కథ, 'మా తుఝే సలాం' ప్రథమ బహుమతుల శ్రేణిలో ఉన్నదని సవినయంగా తెలుపుకొంటున్నాను.


 


నా కథ 'సృష్టిలో తీయనిది' ఎంపిక

తెలంగాణ సాహిత్య పరిషత్ నిర్వహించిన బాలల కథల పోటీలో నా కథ, 'సృష్టిలో తీయనిది' ఎంపిక అయినదని సవినయంగా తెలుపుతున్నాను.
ఈ కథలతో వారు ఒక సంకలనం తేబోతున్నారు.


 


మగవాళ్ళకీ ఉంది ఓ రోజు! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ -31 మార్చ్ 2024

మహిళా దినోత్సవానికి ఉన్నంత క్రేజ్ పురుష దినోత్సవానికి ఉండదు. ఆ మధ్య నవంబర్ 19వ తేదీన అనుకుంటాను. ఇది కూడా జరిపారు. పురుషులు ప్రపంచానికిచ్చిన పాజిటివ్ వ్యాల్యూస్ అనేది ఆ ఉత్సవం థీమట. బాగానే ఉంది.
పురుషాధిక్య సమాజమని, ఫెమినిస్టులు పళ్ళునూరు కుంటారు గానీ, అది పాత ముచ్చట. స్త్రీలు అబలలు కాదు, సబలలని ఎప్పుడో నిరూపించుకున్నారండోయ్! ఏదైనా పోటీలో ఒక మహిళ రాణించి, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందనుకోండి, అది గొప్ప వార్త. స్త్రీ జాతికే వన్నె తెచ్చిన అంటూ పొగిడేస్తారు. అదే మగవానికైతే, అంత సీన్ ఉండదు. మనక్కూడా దినోత్సవం ఉందా మిత్రమా? అని మా ఫ్రెండ్ డా. యల్లమంద హాశ్చర్యపోయినాడు. నాకప్పుడు అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందాన్ని అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. 'అయితే, మనం కూడా ప్రేమించవచ్చా గురువుగారూ?' అలా.
హమ్ ఔతోంసే కమ్ నహీ! అని మనం నిరూపించుకోవల్సిన తరుణం ఆసన్నమైంది పురుష శ్రేష్ఠులారా... ఐఎండి (ఇంటర్నేషనల్ మెన్స్ డే) ఒక అంతర్జాతీయ అవసరం... అని నేను బల్లగుద్ది వాదిస్తున్నా. గత నవంబర్లో 59 దేశాలు దీన్ని జరుపుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది లెండి. దీన్ని మొట్టమొదట 1992లో జరిపారు. థామస్ ఓస్టర్ అనే ఆయన దీన్ని ప్రారంభించాడు. 'మగజాతి పిత' అందామా ఆయన్ను? పదం అంత బాగున్నట్టు లేదు. ఫాదర్స్ డే ఉంది. అది కొంత బెటర్.
ఐఎండి రోజు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.



అవి.. కొందరు పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్‌ను (సినిమా, క్రికెట్ వాళ్ళు కాకుండా) వెలుగులోకి తేవడం, కుటుంబం, పిల్లల సంరక్షణలో వారి పాత్రను గ్లోరిఫై చేయడం, సమాజంలో పురుషుల పట్ల వివక్ష (?) ను నిరోధించడం.
అరవిందన్ భండారీ అనే ఆయన తన ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కుతున్నాడు చూడండి. "ఫెమినిజం అనే పదమే జెండర్ బయాస్డ్. దానికి బదులు 'ఎగలిటేరియన్' అన్న పదం పెట్టుకోవల్సింది. సమాన హక్కులకు సంబంధించిన ఉద్యమం అది. మనకు గృహ హింస చట్టం ఎందుకు లేదు? మనలో ఆత్మహత్యల రేటు ఎందుకు ఎక్కువ? మనల్నే ఎందుకు లోకం గిల్టీగా భావిస్తుంది. పురుష సాధికారత గుర్తించి ఎందుకు చర్చ జరగదు? ఫేక్ రేప్ ఆరోపణలు ఎందుకు పెరుగుతున్నాయి? మగవారిపై అత్యాచారాలను గురించి చట్టానికి పట్టదా?" ఇదీ వరస. నవ్వుతున్నారేం... నవ్వండి, నవ్వండి. అరవిందన్ బాధలో కొంతైనా నిజం లేదా చెప్పండి.
హోటళ్ళలో ఛెఫ్‍లు అంతా మనమే. నలపాకం, భీమపాకం అన్నారు. దీనిని బట్టి ఏం అర్థమైంది? ద్రౌపది, దమయంతి అసలు వంటలు చేసేవారు కాదనేకదా. ఆడవాళ్ళ మీద వచ్చినన్ని జోకులు, కార్టూన్లు మగవారి మీద ఎందుకు రావు? ఇదంతా వివక్ష కాదా అధ్యక్షా. మగవారిని ఆరాధించే మహిళలూ లేకపోలేదండోయ్. జస్లీన్ కౌర్ పూరి అనే రచయిత్రి 'ఆన్ లవింగ్ మెన్' అన్న అందమైన కవిత రాశారు (2018).
'గ్లాస్ నీలి కళ్ళు అతడు వెచ్చని చిరునవ్వును కలిగి ఉన్నాడు నేను, నాలా కాకుండా అతని మనసును సెన్సిటివ్‍గా ఆరాధించాను'.
థాంక్యూ మేడమ్. నిజమైన మగవాడు ఎవరో ఇలా చెప్పారు.. 'కష్టాల్లో నవ్వగలిగి, బాధలనుండి బలం పొంది ఆత్మ విశ్లేషణల వల్ల ధైర్యాన్ని పొందగలవాడు.' ఒక కొంటె పెద్దమనిషి కోట్... 'తనకంటే పొడవైన పెళ్ళాన్ని కూడా ఆనందంగా బయటకు తీసుకెళ్ళగలిగినవాడు'.
అయ్యా... ఇదంతా సరదాగా రాసిందే గానీ, ఆడవారి పట్ల నాకు ఆవగింజంతయినా చిన్న చూపు లేదుగాక లేదని మనవి, మహిళా దినోత్సవానికి ఉన్నంత ప్రాముఖ్యత పురుష దినోత్సవానికి ఎందుకు లేదని నా బాధ. దానికి వాళ్ళేం చేస్తారు. పాపం. ఎవరి దినం, సారీ, దినోత్సవం వారే జరుపుకోవాలి గాని.
నా పిచ్చిగానీ, సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే ముళ్ళపూడి వారు మాత్రం గడుసుగా 'మనం కొంచెం ఎక్కువ సమానం' అన్నారు గానీ, అబ్బే... అలా కుదరదు. మొత్తం మానవ జాతిని సూచించడానికి 'మ్యాన్' అంటారు. 'మాన్‌కైండ్' అంటారు. పురుష ప్రయత్నం అంటారు. అది చాలదూ మనకు? అయినా 'యత్ర నార్యస్తు పూజ, రమంతే తత్ర దేవతాః', 'ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి' లాంటి వాటిని బీట్ చేసే సూక్తులు మనకు లేవే? అనేది నా బాధ. 'ఆడవాళ్ళూ మీకు జోహార్!,', 'మగవాళ్ళూ మీకు రెండు జోహార్లు'... ఆగండి మనకూ ఓ రోజొస్తుంది! అదన్నమాట!



గోదావరి - పాపికొండలు - భద్రాచల యాత్ర-1

యల్లమంద అన్నాడు “మాస్టారూ! మీరు ఇదివరకెపుడైనా, గోదావరి నదిలో, పాపికొండల మీదుగా, లాంచీలో ప్రయాణించారా?”
“లేదు మిత్రమా! తుని, నర్సీపట్నంలతో ఏళ్ల తరబడి పనిచేసినా కుదరలేదు.”


https://sanchika.com/godavari-papikondalu-bhadrachalam-yaatra-pds-1/

'మహాప్రవాహం!'-20

“బాగుంది రోయ్, అమ్మేది వాడు, కొనుక్కునేది నీవు. మద్యన నా కెందుకు?” అన్నాడు రుక్మాంగద రెడ్డి. అన్నాడు కాని ఊర్లో తనకింకా మరేద ఉన్నందుకు, తన మాటకు వాండ్లు ఇలవ యిస్తూన్నందుకు ఆ యప్ప మొగంలో కుశాల కనపడినాది.


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-20/


Wednesday, March 27, 2024

తెలంగాణ రిటైర్డ్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి సాహిత్య సమావేశంలో నా ప్రసంగం

మొన్న, మార్చ్ 25 న, సికింద్రాబాద్, సప్తగిరి రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాలులో, తెలంగాణ రిటైర్డ్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, వారి సాహిత్య సమావేశం లో నేను ప్రధాన వక్తగా, 'మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు' అన్న అంశం మీద ప్రసంగించాను.




 












Saturday, March 23, 2024

పాదాభివందనం - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ -24 మార్చ్ 2024

గౌరవాన్ని ప్రదర్శించడంలో చాలా పద్ధతులున్నాయి. ఒక చెయ్యి మాత్రం ఎత్తి (కుడిదే) అభివాదం చేయడం. ఆ వేళను బట్టి గుడ్ మార్నింగ్‍లు, గుడ్ ఆఫ్టర్‌నూన్‌లు, గుడ్ నైట్‌లు చెప్పుకోవడం. 'శుభోదయం' అన్న, అలాంటి పద బంధాలు, నాకు తెలిసి, భారతీయ సంస్కృతిలో లేవు. సామాజిక మాధ్యమాలు వచ్చింతర్వాత, ఈ గ్రీటింగ్‍లు శృతిమించాయి. 'శుభ బుధవారం!' అని పోస్టు పెడతాడొకాయన, "వెధవా! బుధవార మెన్నడురా?" అని నా చిన్నపుడు జోక్! పొద్దున్న కలిస్తే గుడ్ మార్నింగు, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్‌నూన్. రాత్రి కలిస్తే మాత్రం, ఎంత రాత్రయినా గుడ్ ఈవెనింగే! గుడ్ నైట్ అనేది రాత్రి విడిపోయేటపుడే అనాలని హైస్కూల్లో మా ఇంగ్లీషు సారు శంకరయ్య గారు చెప్పారు. అంతేగాని రోజులో మొట్ట మొదట కలిస్తే "గుడ్మార్నింగ్" అనడం తప్పురా! అనేవారాయన.
కాళ్ళు మొక్కడం అనేది అవతల వ్యక్తి మీద ఎంతో భక్తి ప్రపత్తులు ఉంటే గాని జరగదు. "కాల్మొక" అన్నది ఒక ప్రాంతంలో, బానిసత్వానికి చిహ్నంగా వాడేవారు. ఇప్పుడా దొరతనాలూ లేవు, ఆ న్యూనతలూ లేవు. 'పాద ధూళి శిరసున ధరించడం' అనేది పాదాభివందనానికి సూపర్ లేటివ్ డిగ్రీ! నార్త్ ఇండియాలో, పెద్ద వారికి, రైల్వే, బస్ స్టేషన్లలో అయినా, వంగి పాదాలను తాకుతారు. మనసులో గౌరవం ఉండాలి గాని, ప్లేస్ దేముంది?
కొందరు, గుడిలో, మూలవిరాట్టు దగ్గరే, పూజారికి దక్షిణ ఇచ్చి, కాళ్ళకు మొక్కుతారు. అది తప్పని, పరమాత్మను అది కించపరిచినట్లు అని సద్గురు శివానంద మూర్తి గారు ఒకసారి చెప్పారు. ఇక రాజకీయాల్లో, సినీరంగంలో, పాదాభివందనాలు జోరుగా సాగుతాయి. 'ఫలానా నాయకుడు ఫలానా కేంద్ర నాయకునికి' పాదాభివందనం చేశాడు. ఫలానా ఇంకో నాయకునికి చేయ లేదు అని గౌరవాన్ని దాటి వేరే అంశాల వరకు విమర్శలు వెళుతుంటాయి. సినిమాల సక్సెస్ మీట్లలో, ప్రీలాంచ్ వేడుకల్లో, వేదిక మీదే పెద్ద హీరోల కాళ్ళకు మొక్కుతుంటారు. వివిధ శాఖల టెక్నీషియన్లు, వెండితెర వేల్పులు పొందే గౌరవం అది.
అదేదో సినిమాలో, “నాకు నమస్కారం పెట్టావా? నాకు విష్ చేయలేదెందుకు?” అని అడిగి పెట్టించుకుంటూ ఉంటుందొక హాస్య పాత్ర. అయ్యా! గౌరవం అనేది ఇస్తే తీసుకోవచ్చు గానీ, అడిగి తీసుకోవడం హాస్యాస్పదం అని ఆ పాత్ర ద్వారా చెప్పాడా దర్శకుడు.
'ప్రేమాభిషేకం' సినిమాలో 'వందనం! అభివందనం' అన్న సూపర్ హిట్ సాంగ్ మనందరికీ తెలుసు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దానిని రాస్తే, బాలు గారు పాడగా, అక్కినేని గారు అభినయించిన అద్భుత పాట! చక్రవర్తి గారి కంపోజిషన్. అందులో, "నిన్నకు నేటికి సంధిగ నిలిచిన సుందరీ! పాదాభివందనం!" అని వస్తుంది. ప్రియురాలికి పాదాభివందనం చేయడం ప్రేమకు పరాకాష్ట. కానీ అక్కడ ఉన్నది ఒక ప్రాస్టిట్యూట్. ఆమె నిన్నకు నేటికి సంధిగా ఎలా నిలిచిందో నాకెంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్థం కాదు. మీకేమయినా తెలిస్తే చెబుదురూ? ఒకసారి, ముళ్ళపూడి వారి జోక్. ఇద్దరు కవి పండిత రచయితలు రిక్షాలో వెళుతూ దేవదాసు సినిమాలో సీనియర్ సముద్రాల వ్రాసిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అన్న పాటను గురించి తర్కించుకుంటున్నారట. దాని అర్థం ఇదనీ, అదనీ, అది కాదనీ, ఇదేననీ, అలా. వింటూన్న రిక్షావాడు "తాగుబోతోని మాటలకు అర్తం ఏటుంటాది బాబూ!" అని ఒక్క ముక్కలో తేల్చేశాడట. దాసరి గారి 'నిన్నకు నేటికి సంధిగ నిలిచిన' అనే ప్రయోగాన్ని కూడా అలా సరిపెట్టుకుంటే పోలా? ఇంకా లోతైన అర్ధం ఉంటే నాకు ఫోన్ చేయండి.

 



పాదాభివందనం చేయడాన్ని కూడ ఆత్మాభిమానంతో ముడిపెట్టిన మహానుభావులు తిరుపతి వేంకట కవులు. కవులకు మీసాలెందుకు అని ఎవరో అధిక్షేపిస్తే, తమ పాండితీ ప్రకర్షను ఇలా చెబుతూ, మమ్మల్ని సంస్కృతాంధ్రాలలో ఎవరైనా గెలిస్తే, వారికి పాదాభివందనం చేస్తామని సవాలు చేశారు.
ఉ.
దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మముగెల్వుడు గెల్చిరేని ఈ
మీసము దీసి మీ పదసమీపములన్ తలలుంచి మ్రొక్కమే
~
శోభనం గదిలో భార్య భర్తకు పాదాభివందనం చేస్తుంది. అది అనాదిగా వస్తున్న ఆచారం. "మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి చాలు!" అని పతివ్రతలు భర్తలను దీనంగా, పాత సినిమాల్లో వేడుకొంటుంటారు. వాటి మీద ఫెమినిస్టులు రగిలిపోతుంటారు. ముత్యాల సుబ్బయ్య గారు 'పవిత్రబంధం' అనే గొప్ప సినిమా తీశారు. వివాహం యొక్క విశిష్టతను చాటిన చిత్రమది. అందులో ఫస్ట్ నైట్ నాడు సౌందర్య వెంకటేశ్ కాళ్ళకు మొక్కితే అతడు కూడ ఆమె పాదాలకు నమస్కరించబోతే, ఆమె వారిస్తే, అతడు "వై నాట్?" అంటాడు. దటీజ్ ద స్పిరిట్!
ఇప్పుడు పెళ్ళిళ్ళ తీరు మారింది. వధూవరులు సింహాసనాల్లాంటి కుర్చీల్లో ఆసీనులై ఉంటే, ఆహుతులు క్యూలో నిలబడి, వారికి శుభాకాంక్షలు చెప్పి, గిఫ్ట్‌లు ఇచ్చి, వెళ్ళిపోతారు. గుడ్ ఓల్డ్ డేస్, మాంగల్య ధారణ తర్వాత, వధూవరులు క్రిందికి వచ్చి, పెద్దవారికి అందరికీ పాదాభివందనాలు (వంగి) చేసేవారు. యూత్ కాబట్టి వారికి నడుము నొప్పి వచ్చేది కాదు. పైగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం విధాయకం.
ఒకసారి (1986) బర్కత్‌పురాలోని డా॥ దివాకర్ల వేంకటావధాని గారింటికి, మా రెండేళ్ళ బాబును తీసుకొని వెళ్ళాం నేను, నా భార్య. వారు మా నాన్నగారికి ఆత్మీయ స్నేహితులు. నేనంటే వారికి వాత్సల్యం. వచ్చేటప్పుడు మేమిద్దరం ఆ మహనీయునికి పాదాభివందనం చేసి మా చంటోడిని
కూడ మొక్కమన్నాం. వాడు నిష్కర్షగా "నేను మొక్కను!" అని ప్రకటించాడు. మేము వాడిని కోప్పడుతూంటే, దివాకర్లవారిలా అన్నారు నవ్వుతూ - "వీడికి నమస్కారార్హత లేదని వాడికి తెలిసిపోయింది! వద్దు లేరా నాన్నా!!". విద్యాదదాతి వినయం! అదన్నమాట!

'మహాప్రవాహం!'-19

“ఏంది సంజన్నా, శానా ఇబ్బంది పెడుతున్నావు!” అన్నాడు సారు.
“కొండంత దేవునివి నీవు! కొండంత పత్రి పెట్టలేము. ఏదో శిన్నది. మా సంతోషము. మీరు వద్దంటే శానా బాదపడతాము” అన్నారు.


https://sanchika.com/mahaapravaaham-pds-serial-19/

మా మధ్య ప్రదేశ్ పర్యటన-10

క్యూ మధ్యలో మెట్లు! ఎక్కడం, దిగడం! చిన్న అంత వెలుగు లేని దారులు కేవలం శివాలయాల్లోనే అనుభవమయ్యే ఒక పవిత్ర పరిమళం. అన్ని వేలమంది! కొంత త్రోపులాట ఉన్నా, భక్తుల స్వీయ క్రమశిక్షణ చాలా గొప్పది. వారిని నియంత్రిస్తూన్నది ఓంకారేశ్వరుడు గాక మరెవ్వరు?


https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-10/

Wednesday, March 20, 2024

నా గురించి మా అత్త రాసిన కవిత

మా అత్త, శ్రీమతి క్రిష్టిపాటి లక్ష్మీ నరసమ్మ గారు, నా మీద ఎంతో అభిమానంతో, రాసిన కవిత ఇది. విశేషం ఏమిటంటే మా అమ్మ పేరు కూడా అదే.

~
పల్లెటూరి అబ్బాయి ప్రయివేటుగా చదివి పట్టాలు చేపట్టె
కలిమి లేముల నధిగమించి కళాశాలలో అడుగిడె అధ్యాపకునిగా
వేలుపు వరమిచ్చె దత్తునికి హంసవాహిని ఆనతిచ్చె
కలం కదం తొక్క అక్షరమాలలు గుచ్చి సత్కారం బొందెన్

🙏

Saturday, March 16, 2024

నోటాకే ఓటేస్తే - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ -17 మార్చ్ 2024

అప్పట్లో బ్యాలట్ పేపర్‌లో వరుసగా అభ్యర్థుల పేర్లు, ఆయా పార్టీల బొమ్మలు వరుసగా ఉండేవి. అందులో ఉన్న వారిలో మనకు ఎవ్వరూ నచ్చకపోయినా, మనమేం చేయలేని పరిస్థితి. చచ్చినట్లు ఎవరికో ఒకరికి ఓటు వేసి తీరాల్సివచ్చేది.
కొన్ని రాళ్ళు ఎదురుగా పెట్టి "ఏదో ఒక రాయితో నెత్తిన కొట్టుకోవలసిందే!" అన్నట్లు లేదూ? అప్పుడు చిన్న రాయిని ఎంచుకుంటాం. ఎందుకంటే, చిన్న దెబ్బ తగలాలని. ఎన్నికల ముందు ధర్మ పన్నాలు. వస్తూ ఉంటాయి. వ్యాసాలుగా, సోషియల్ మీడియాలో, విరివిగా! మీ ఓటు చాలా పవిత్రమైనదనీ, అవినీతి పరులను, నేర చరిత్రగల వారిని ఎన్నుకోకండని సచ్చీలురను, సమాజానికి మంచి చేసే వారిని మాత్రమే ఎన్నుకోవాలని, ఓటును అమ్ముకోవద్దని... ఇలా!
ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కాని ఎన్నికల్లో నిలబడే వారిలో 'సచ్చీలురు' దుర్భిణీ వేసి వెతికినా కనబడరే! అలాంటి వాళ్ళకు పార్టీలు టికెట్లు ఇవ్వనే ఇవ్వవు! గెలుపు గుర్రాలకే టికెట్లు! శీలం ఎవరికి కావాలి?
'నోటా' (NOTA) అంటే " None of the Above" అని విస్తృతార్థం. అదేనండీ అబ్రివియేషన్ అన్నమాట. పైన ఉన్న అభ్యర్థులెవరూ నాకు నచ్చలేదోచ్! అని చెప్పడం! ఈ విధానం చాలా దేశాల్లో అమల్లో ఉందండోయ్! 'అవ్వ పేరే ముసలమ్మ' అన్నట్లు, రకరకాల వెర్షన్‍లలో. కెనడాలోనట 'I don't support any one', ఫ్రాన్స్‌లో దీన్ని 'బ్లాంక్ నోట్' అంటారట. ఇండోనేసియాలో ఐతే 'Empty Box'. అమెరికాలోని నెవడా రాష్ట్రంలో NOTC (None of these Candidates). రష్యాలో దీన్ని 'Against All' (అందరికీ వ్యతిరేకం) అనేవారట. 2006లో దాన్ని రద్దు చేశారు.
'నోటా' గుర్తు మీకు తెలుసు కదా! నిలువుగా ఒక చతురస్రం. మధ్యలో నాలుగు పెద్ద, చిన్న అడ్డగీతలు, దాన్ని కొట్టివేస్తూ ఇంటూ (X) మార్కు! నాకెందుకో ఇది తెగ నచ్చుతుంది మరి! నాదంతా అదో టైపులెద్దురూ! 2009లో మన దేశ ఎన్నికల సంఘం 'నోటా'ను ప్రవేశపెడతామని సుప్రీంకోర్టుకు విన్నవిస్తే, ప్రభుత్వం వ్యతిరేకించిందట. వ్యతిరేకించక ముద్దెట్టుకుంటారా ఏమిటి కాని, పౌరహక్కుల ప్రజాసంఘం (People's Union for Social liberties) అనే ఒక స్వచ్చంద (ప్రభుత్వేతర) సంస్థ, ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో పడేసింది! ఇంకేం, 27 సెప్టెంబరు 2013న సుప్రీంకోర్టు, 'నోటా' ఉండాల్సిందేనని, వోటింగ్ యంత్రాలలో ' సదరు బొత్తాన్ని, అదేనండీ బటన్‌ను (అదేమిటో గాని, అచ్చతెలుగులో చెబితే అర్థమై చావదు) ప్రవేశపెట్టాలని ఆర్డరేసింది! ఈ కోర్టులు ఉన్నాయి గనుక సరిపోయిందిగాని, లేకపోతే... ఎందుకులెండి మాస్టారు!
ఎన్నికల సంఘం, నోటాకు పడిన ఓట్లను లెక్కెడతాం గానీ, వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తామని, డిపాజిట్ గల్లంతవడానికి, వాటిని పట్టించుకోమని తేల్చింది. మొత్తుకొని ముఖం కడుక్కున్నట్లుంది!


నోటా గురించి ఆ నోటా ఈ నోటా విన్న సచ్చీలురయిన ఓటర్లు (అభ్యర్థులు కాదు మహాప్రభూ..) 2014 సార్వత్రిక ఎన్నికలలో 1.1 శాతం ఓట్లను నోటాకే వేశారు! మొత్తం ఎన్నో తెలుసా మహాశయా, 6,000,000 ఓట్లు! నోటా సింబల్‌ను తయారు చేసిన సృజనశీలురు 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహమ్మదాబాద్' వారు.
'కెప్టెన్ ప్లానెట్' అన్న సిరీస్‌లో, ఆరో సీజన్ ఎపిసోడ్ నాకు గుర్తుకొస్తుందండోయ్! దాని పేరు 'డర్టీ పాలిటిక్స్'. అందులో ప్రెసిడెంట్ పదవికి నలుగురు పోటీ పడుతుంటారు. అందులో ముగ్గురు విలన్లు! నాలుగోవాడికి ప్రజల్లో మంచి పేరుంటుంది. ఇంకేం? ఈ ముగ్గురూ ఆ నాలుగో వాడిని 'కిడ్నాప్' చేస్తారు. అప్పుడు ప్రజలకు 'కోపమొచ్చి' 70 శాతానికి పైగా 'నోటా'కి వోటేస్తారు. మళ్ళీ ఎలక్షన్ జరపాల్సి వస్తుంది, నోటా పవర్ అలా ఉంటుం దాని సరదాగా (?) చూపించారా. సిరీస్‌లో!
నోటాను 'పళ్ళు లేని పులి'గా ది హిందూ పత్రిక రాసుకొచ్చింది. అప్పటి సి.జె.ఐ. రాజకీయ పార్టీలు, తమ అభ్యర్థి గెలవలేనప్పుడు, నోటాకు వోట్లు వేయించే ప్రమాదముందన్నారు!
కాని, క్రమంగా 'నోటా'కు ఆదరణ పెరుగుతున్నదండోయ్! ఓడిపోయిన వారిని ఎగతాళి చేయడానికి "కనీసం నోటా కొచ్చిన ఓట్లు కూడా రాలేదు పాపం!" అంటుంటాం. నాకు ఆ మధ్య ఒక కల వచ్చిందిలెండి! కలే సుమండీ! ఎలక్షన్లలో నోటాకు మెజారిటీ వచ్చిందట. అన్ని స్థానాలలో హేమాహేమీలందరూ చతికిల బడ్డారట! రాజ్యాంగ సంక్షోభం! అప్పుడు రాష్ట్రపతి తన విశేషాధికారాలను ఉపయోగించి, ప్రతి నియోజక వర్గం నుంచీ మేధావులను, శాస్త్రవేత్తలను అవినీతి మరకలు లేని (మరక మంచిదే అని మాత్రం అనకండేం. అదేదో యాడ్‍లో లాగా) విశ్రాంత ఐఏఎస్ లను సమాజ సేవకులను ఎంపిక చేసి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారట.
అందులో మంత్రులంతా తమ తమ శాఖల్లో నిష్ణాతులట. ప్రభుత్వ పదవీ కాలం రెండేళ్ళేనట! జై నోటా! అని నేను నిద్రలో అరుస్తుంటే మా ఆవిడ గట్టిగా కుదిపి నిద్రలేపింది! తెల్లారు జామున వచ్చే కలలు నిజమవుతాయట! ఏమిటీ, మూఢ నమ్మకమా! సరే అయితే! అదన్నమాట!





పెనుగొండ పురాతన ఆలయాలు, కోట సందర్శన

స్వామి వారి వైభవం ఎక్కడైనా అసామాన్యమే. మూల విరాట్టు నాలుగడుగుల ఎత్తు విగ్రహం. తిరుపతి వేంకటేశ్వరుని నమూనా. ముఖ మంటపం పురాతన స్తంభాలతో అలరారుతూంది. స్వామివారి ధ్వజ స్తంభం సమున్నతంగా ఉంది.

https://sanchika.com/penugonda-temples-and-fort-visit-pds/
 


'మహాప్రవాహం!'-18

అది గ్రయించినట్లు సుంకిరెడ్డి అన్నాడు - “అన్నా, ఎవరి యాపారం వాండ్లది.. నా కస్టమర్ల వేరు, నీ కస్టమర్లు వేరు. యాపారంలో మనం ఒకరికొకరు సాయం జేసుకోవాల. ఒకేల సరుకు అర్జంటుగా యాదయిన రకం అయిపోతే నీ కాడికి నేను రావాల, నా కాడికి నీవు రావాల.”


 
https://sanchika.com/mahaapravaaham-pds-serial-18/


మా మధ్య ప్రదేశ్ పర్యటన-9

ఆ పక్కనే పురాతన రామాలయం ఉంది. అక్కడ ప్రత్యేకత ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభువు చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు.


 

https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-9/

Tuesday, March 12, 2024

అపరిగ్రహం - దత్తవాక్కు ఫీచర్ - ఆదివారం ఆంధ్రప్రభ - 10 మార్చి 2024

ఇదేమిటీ? నవగ్రహాలను గురించి విన్నాం కానీ, ఈ గ్రహం గురించి ఎప్పుడూ వినలేదే? అనుకుంటున్నారా? ఇది గ్రహం కాదు మాస్టారు, పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ప్రవచించిన 'అష్టాంగ యోగ'లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, అనే ఎనిమిది అంగాలున్నాయి. అందులో మొదటిది 'యమ' అంటే సంయమనం. దీనిలో మళ్లీ ఐదు ఉపాంగాలున్నాయి. అందులో ఐదవదే ఈ అపరిగ్రహం! అంటే స్వీకరించకపోవడం (Non-acceptance).
పరిగ్రహం అంటే తీసుకోవడం. దానికి వ్యతిరేకమే అపరిగ్రహం, తీసుకోకపోవడం, ఏదో సరదా కబుర్లు చెబుతాడనుకుంటే, ఇదేమిటి, సీరియస్ మ్యాటరు? అనుకోకండి సార్. వస్తున్నా, మన జోనర్ లోకే వస్తున్నా,
యోగాను కాసేపలా ఉంచుదాం. మనకు ఇవ్వాలంటే బాధ. తీసుకోవాలంటే సంతోషం. 'ఇచ్చిపుచ్చుకోవడాలు' అని పెళ్ళి సంబంధాలలో మాట్లాడుకుంటారు. వాటిలో తేడాలు వచ్చి పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోయిన సందర్భాలున్నాయండోయ్. లంచాలు తీసుకోవడం ఒక ఘనకార్యంగా తయారయింది. "అబ్బాయి టౌన్ ప్లానింగ్‌లో జూనియర్ అసిస్టెంట్, పై సంపాదన బాగానే ఉంటుందట!" అని మురిసిపోతారు అమ్మాయి తరపువాళ్ళు. నన్నడిగితే (ఎవరడిగారని?) లంచం ఇచ్చేవానికి కూడ శిక్ష ఉండాలి. ఇస్తేనే గదా తీసుకొనేది. అది అలవాటై, కొడుకు ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టడానికి కూడ ఒక తండ్రి. చేయి చాస్తున్నట్టు ఒక కార్టూన్! కార్టూన్లు ఊరికే పుడతాయా మరి!
'బుద్ధిమంతుడు' సినిమాలో, ఆరుద్రగారు ఒక చక్కని పాట రాశారు. అందులో 'అపరిగ్రహం' గురించి సింపుల్‍గా చెప్పాడా కవివరేణ్యుడు. "ఇచ్చుటలో ఉన్న హాయీ, వేరెచ్చటనూ లేనే లేదని! లేటుగ తెలుసుకున్నాను. నా లోటును దిద్దుకున్నాను" అంటారు అక్కినేని. ఆ పాటను అభినయిస్తూ, అప్పుడాయన 'తాగి' ఉంటాడు. తాగిన వాడు అబద్ధం చెప్పడు కదా!
'శ్రీకృష్ణ తులాభారం'లో నారదుడికి తన ప్రాణనాథున్ని దానం చేస్తుంది సత్యభామ. దానిని పరిగ్రహిస్తాడా కలహభోజనుడు! అదంతా పెద్ద నాటకం లెండి. అపరిగ్రహమును మనసా వాచా కర్మణా నమ్మిన యోగి పుంగవుడు నారద మునీంద్రుడు. మరి ఆ దానాన్ని ఎందుకు పరిగ్రహించాడు? సత్యభామకు బుద్ధి రావడం కోసం! పైగా, "సేవలందుటె గాని, సేవించుటెరుగని శ్రీనాథుడె నాకు సేవకుడయ్యె!" అని మురిసిపోవడం. నారదుని పరిగ్రహంలోనే అపరిగ్రహం ఉంది. అది ఆధ్యాత్మికం.
ఇటీవల బీహార్ మాజీ సీఎం 'జననాయర్ శ్రీ కర్పూరీ ఠాకూర్'కు కేంద్రం 'భారతరత్న' ఇచ్చింది. ఒకసారి లోకనాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జన్మదినాన, ఆయనకు శుభాకాంక్షలు తెల్పడానికి, కర్పూరీ ఠాకూర్ వెళ్ళారు. ఆయన కుర్తా చిరిగిపోయి ఉందట. అది చూసి చంద్రశేఖర్, జనతా పార్టీ అధ్యక్షులు "ఇదేమిటయ్యా! ఇంద! మంచి కుర్తా ఒకటి కొనుక్కో! చూడలేకపోతున్నా" అని కొంత డబ్బు ఇస్తే, ఎంచక్కా తీసుకుని, వెంటనే దానిని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారట! అదీ అపరిగ్రహం అంటే! కర్పూరానికీ, ఉప్పుకూ చాలా తేడా ఉందని గదా వేమన సెలవిచ్చింది!
కోట్లు కోట్లు జనం డబ్బు దిగమింగి, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చునే వారున్నారు! 'పరిగ్రహం'లో అంటే పుచ్చుకోవడంలో వారు ఘనులు! ప్రకృతి నుంచి, సమాజం నుండి మనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి! 'హెన్రీ డేవిడ్ తారూ' అనే అమెరికన్ రచయిత 'వాలెన్' అనే పుస్తకం రాశారు (1854). దుఃఖానికి మూలం, అవసరానికి మించి తీసుకోవడమేనంటాడా మహానుభావుడు, 'సింప్లిపై' అన్నది ఆయన నినాదం. కనీసావసరాలకు సరిపడా మాత్రమే తన రచనల ద్వారా సంపాదిస్తూ, సంతోషంగా గడిపి చూపించాడాయన. అదీ అపరిగ్రహం!


దీన్ని పాటించడం చాలా కష్టం. దీనికి పతంజలి యోగసూత్రాలు అధ్యయనం చేయనవసరరం లేదు. తన ఆటోలో డబ్బున్న బ్యాగ్‍ను ప్రయాణికుడు మర్చిపోతే, దాన్ని భద్రంగా పోలీసులకు అప్పజెప్పి, సొంతదారునికి చేర్చిన వాడు యోగి కాక మరెవ్వరు? ఆపరిగ్రహానికి ప్రతిరూపం కాదా ఆ ఆటో ఆయన! విషాన్ని నిర్వచించమంటే "మనది కానిది" అన్నాడట ఒక జ్ఞాని. ఎంత సులువుగా చెప్పాడో!
కోట్లకొద్దీ స్వంత సంపదను సమాజానికిచ్చేసే ధనవంతులున్నారు. పదవిని తృణప్రాయంగా వదులుకునే మహనీయులున్నారు. మేం టూర్లకు వెళితే, మాకు ట్రావెల్ కంపెనీ వారు డ్రైవర్ కమ్ గైడ్‌ను ఇస్తారు. కారుతో బాటు ఖజురహోలో, అభిషేక్ పరిహాస్ అనే కుర్రవాడు, మా డ్రైవర్ కమ్ గైడ్. మాతోబాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, చేయమని ఎంత బలవంతం చేసినా, సున్నితంగా తిరస్కరించేవాడు! చివర్లో కొంత బక్షీస్ ఇవ్వబోతే తీసుకోలేదు. అపరిగ్రహం కాదు ఇది! ఇతన్ని చూసి పతంజలి ఋషి సంతోషిస్తాడా, లేదా చెప్పండి!
అదేదో సినిమాలో కోట శ్రీనివాస రావు లాగా ప్రతిదానికీ, “నాకేంటి" అనకుండా, మన పరిధిలో కొంత అపరిగ్రహాన్ని పాటిస్తే, దుష్ట గ్రహాలు మన జోలికి రావు! మొన్న రైతుబజారులో ఆకుకూరలు కొని, వంద నోటిచ్చి, చిల్లర తీసుకోవడం మరచి వచ్చేస్తుంటే, ఆ ముసలామె "ఓ సారూ! పిలుస్తుంటే ఉర్కవడ్తివి. చిల్లర దీస్కో!" అని నా వెనక పరిగెత్తుకొని వచ్చి, ఇచ్చి వెళ్ళింది. మా! తుఝే సలామ్!
అదన్న మాట!



Saturday, March 9, 2024

మా మధ్య ప్రదేశ్ పర్యటన-8వ భాగం

ఉజ్జయినిలో ఒక ‘మిరకిల్’ ప్రతి సంవత్సరం జరుగుతుంది. వర్షాకాలానికి ముందు ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక క్రతువు నిర్వహిస్తారు. అది పూర్తికాగానే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, భారీ వర్షం పడుతుంది.


 

https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-8/


నా నవల 'మహాప్రవాహం!'-17వ భాగం

“ఓర్నీ, ఎంత పని జేసినావురా? నేనే ఇద్దరు మనుసులను చెట్టి నీ శావు ముందర బజ్జీలంగడి పెట్టిస్తా మనుకొంనుంటినే. సర్లే, వాండ్లు బీదోల్లు అంటున్నావు, ఆడ బతకలేక పోతాండారంటన్నావు. నాకు ఏదో ఒక ఆదారముంది లే - మా యిద్దరి పొట్టలకు బోను మిగలతానే ఉండాది. వాండ్లకే ఇద్దాములీ నాయినా. నీవు మంచోనివి గాబట్టి వాండ్లకు ఊరికే యిస్తాండావు. ఇంకోడయితే శాపు ముందర బండి పెట్కున్నందుకు నెలకింతని వసులు చేసెటోల్లు. ముందుగాల ఇంతని దుడ్డు గుడ్క కట్టిచ్చుకొనేటోల్లు.” అన్నాడు. 

 




https://sanchika.com/mahaapravaaham-pds-serial-17/

అనంతపురం కాలేజీలో నేను చేసిన ప్రేరక ప్రసంగం నివేదిక

 ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అన్నం అంశంపై శ్రీ పాణ్యం దత్తశర్మ మాట్లాడి, విద్యార్థులకు భారతీయ సంస్కృతిలోని వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించారు.


 


https://sanchika.com/panyam-dattasarma-preranaatmaka-prasangam-nivedika/

Thursday, March 7, 2024

మహిళలూ మహరాణులూ..

 అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా పాణ్యం దత్తశర్మ పద్యమాలిక 



భారత సాంస్కృతిక రాజధాని వారణాసి మహాశివరాత్రి ప్రత్యేక సాహితీ ప్రసంగం

మహా శివరాత్రి పర్వదిన సందర్బంగా నా ప్రసంగం 'భారత సాంస్కృతిక రాజధాని, వారణాసి' స్వాధ్యాయ యు ట్యూబ్ ఛానెల్ లో వీక్షించమని మనవి.
ఓం నమః శి వాయ! హర హర మహాదేవ! శంభో! శంకర!🙏🌹


 

Wednesday, March 6, 2024

మహాప్రవాహం-16వ భాగం

సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతున్న నా నవల 'మహాప్రవాహం' -16వ భాగం చదవండి.
~


 

“యాపారం బాగా తగ్గిపోయినట్టున్నాది!”
“అవునప్పా, పొద్దున అరగోనె బొరుగులు నానబెత్తాంటిమి ఉగ్గానికి. బజ్జీలు పెద్ద జల్ల (గంప) నిండా ఏస్తాంటిమి. ఇప్పుడు పావు గోనెడు ఏసినా కర్చు గావడంల్యా. మనుసులు తగ్గిపోయినంక యాపారం తగ్గిపోక ఏం జేస్తాది. ఐదు కేజీల అలచందలు నానబోసి రుబ్బుతాంటిమి వడలకు. ఇప్పుడు రెండు కేజీల కేసినా ఇగ్గడంల్యా”
(పూర్తి ఆర్టికల్ సంచికలో చదవండి)

https://sanchika.com/mahaapravaaham-pds-serial-16/

పర్లి-వైద్యనాథ్ భక్తి పర్యటన

సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన మా పర్లి-వైద్యనాథ్ భక్తి పర్యటన వివరాలు చదవండి.
~



దేవాలయం అంతర్భాగం నల్ల రాతినిర్మాణం. చాలా పురాతనమైనది. పైకప్పుకు దన్నుగా నగిషీలు చెక్కిన నల్లని చెక్క నిలువుగా, అడ్డంగా ఉన్నాయి. అవి నల్లగా నిగనిగ మెరుస్తున్నాయి. పరీక్షగా చూస్తేగాని, అవి చెక్కతో చేయబడ్డాయని తెలియదు.
(పూర్తి ఆర్టికల్ సంచికలో చదవండి)

https://sanchika.com/parli-vaidyanath-yaatra-pds/

మా మధ్య ప్రదేశ్ యాత్రా విశేషాలు -7వ భాగం

సంచిక వెబ్ పత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతున్న మా మధ్య ప్రదేశ్ యాత్రా విశేషాలు -7వ భాగం చదవండి.
~


మంటపం మీద ముగ్గురం శివలింగం చుట్టూ కూర్చున్నాము. “కార్తీక మాస పుణ్యతిథౌ, మహాకాలేశ్వర దివ్య సన్నిధౌ అన్యోన్య సహాయేన ఏకవార రుద్రాభిషేకం కరిష్యే” అని సంకల్పం చెప్పించాను. ముగ్గురి గోత్ర నామాలు, భార్యా, పిల్లల, మనుమల పేర్లు చెప్పి, స్వామిని ఆవాహన చేసి, నేను నమకము, చమకములోని మొదటి పనస చదువుతూ ఉండగా, అందరం, సీల్డ్ వాటర్ బాటిల్ లోని నీటిని, మూడు డిస్పోసబుల్ గ్లాసుల్లో పోసుకొని, స్వామికి చక్కగా అభిషేకం చేశాము.
(పూర్తి ఆర్టికల్ సంచికలో చదవండి)

https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-7/

నేనే ప్రధాన మంత్రి నయితే..

బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, అరుంధతి వనితా వేదిక, త్యాగరాయ గాన సభ తే.5-3-24, మహిళా దినోత్సవం.
సంస్కృతి, సాహితి అనే ఇద్దరు చిన్నారుల మాక్ ఇంటర్వ్యూ ప్రదర్శన. 

స్క్రిప్ట్ రచన పాణ్యం దత్త శర్మ, నిర్వహణ. శ్రీమతి అన్నపూర్ణ కృష్ణ ప్రసాద్, ఆస్ట్రేలియా

 


 

Tuesday, March 5, 2024

గణేశ ప్రార్థన

 అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా
ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్

('మనుచరిత్ర'లో అల్లసాని పెద్దన చేసిన విఘ్నేశుడి ప్రార్థనా పద్యం)

తాత్పర్యం:

బుజ్జి గణపయ్య వాళ్లమ్మ ఒడిలో కూర్చుని పాలు తాగుతున్నాడు. పిల్లలు ఒక వైపు తాగుతూ, రెండో వైపు రొమ్ముతో ఆడుకుంటారు కదా! అలాగే ఆయన కూడా చేద్దాం అనుకుంటే, అటువైపు రొమ్ము లేదు. పైగా పాము ఉంది! అంటే అర్ధనారీశ్వరతత్త్వంలో రెండో సగం శివుడు మరి. దాన్ని తామరతూడు అనుకొని లాగే విఘ్నపతికి నమస్కారం అంటున్నారు అల్లసాని పెద్దన. మనుచరిత్ర లోని పద్యమిది. ఎలాంటి అయిడియా వచ్చిందో చూడండి, ఆ కవివర్యునికి!

(ఇమేజ్ సోర్స్: ఇంటర్‍నెట్)

దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం ఎడిట్ పేజీ కాలమ్ - 03 మార్చ్ 2024

దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం ఎడిట్ పేజీ కాలమ్ - 03 మార్చ్ 2024

అజ్ఞానమే ఆనందం

"తనకేమీ తెలియదని తెలుసుకోవడమే అసలైన 'జ్ఞానం'" అన్నారు జనకమహారాజు. ఎంత నిజం. అన్నీ తెలుసు అనుకోవడమే ఒక భ్రమ. మనల్నెవరైనా ఏమైనా అడిగారనుకోండి... "అయ్యో, నాకు తెలియదే!" అంటే సరి. మనం సేఫ్, చూశారా మన అజ్ఞానం మనల్నెలా కాపాడుతుందో. చిన్న తనంలో మా అమ్మ, "నీ మొహం, నీకేం తెలియదు" అని విసుక్కునేది నన్ను. ఆమె అలా అంటుంటే ఎంత బాగుండేదో... పెళ్ళయ్యాక భార్యదీ అదే డైలాగు. కాని దానిలో అర్థం వేరుగా ఉంటుందండోయ్.
రాబర్ట్ లిండ్ 'న్యూ స్టేట్స్‌మన్' అనే పత్రికలో 'ది ప్లెషర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్' అనే వ్యాసం రాశారు. 'అజ్ఞానంలోని ఆనందాలు' అని దానర్థం. అజ్ఞానం అనేది అంత తీసిపారేయాల్సినదేమీ కాదంటాడాయన. కొత్తదేదైనా తెలుసుకోవాలంటే వచ్చే ఆనందానికది మూలమట. అంతేకదా నేర్చుకునే ఆనందం కావాలంటే నేర్చుకోని అజ్ఞానం ముందుండాలి కదా... ఆయన లాజిక్ మీకర్థమైందా? అర్థం కాకపోతేనే మంచిది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే ఆనందం.
ప్రశ్నలు అడగడంలో ఉన్న ఆనందం, వాటికి జవాబులు ఇవ్వడంలో ఉండదండోయ్. ఎందుకంటే రెండవది కష్టం. ఇంటర్వ్యూ చేసేవాడు నవ్వుతూ ఉంటాడు. ఇచ్చేవాడికి చచ్చేచావు... అన్ని ప్రశ్నలు వేయాలంటే, ఎంత అజ్ఞానం ఉండాలి?
అరిస్టాటిల్ అంతటివాడికి అనుమానం వచ్చిందట. 'మధ్యాహ్నం పూట తుమ్మితే అపశకునం, ఉదయం తుమ్మితే మంచిశకునం, ఎందుకూ?' అని. దీన్నిబట్టి ఆయన క్కూడ కొన్ని విషయాలలో అజ్ఞానం ఉందన్నమాట.
మనకు తెలియనిది ఎవరికీ తెలియదు అని తెలిస్తే మనకు మహదానందం. అలాకాక, మనకు తప్ప అందరికీ తెలుసని తెలిస్తే, మనమింత అజ్ఞానులమా అని బాధ. అయినా, అందరికీ అన్నీ తెలియాలని లేదు. 'నిజంగా నాకు తెలియదు' అని ఒప్పుకోవడం గొప్ప సంస్కారం. కొందరుంటారు. వారిని ఇంగ్లీష్‌లో 'బ్లఫ్ఫింగ్ మాస్టర్స్' అంటారు. దబాయింపు సెక్షన్ అమలు చేయడంలో వారు దిట్టలు! తెలియఁ "పోయినా, తెలిసినట్లు బిల్డప్ ఇస్తారు. మనం కాదంటే, సాక్ష్యాలు, రెఫరెన్స్లు కూడా ఇస్తారు. నోటిమాటలతోనే సుమా! డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాదు. వాళ్ళదగ్గర ఉంటేగా, కొత్తచోట, దారి తెలియక, దోవనపోయే వాడినడిగా మనుకోండి. వాడికి తెలియకపోయినా, ఏదో ఒకటి చెబుతాడు.
వీళ్ళు మరీ ప్రమాదం. గురువుగారి కంచు మర చెంబు కనబడలేదు... శిష్యులనడిగితే, మాకు తెలియదన్నారు.
ఒకడు లేచాడు. "గురువుగారండీ, ఆరోజు వనభోజనాలకు తెచ్చారు కదండీ"


"అదేరా!"
"దానిమీద మీ తాతగారి పేరుంటుంది కదండీ!"
"అవును నిజమే!"
"మొన్నామధ్య అమ్మగారడిగితే చింతపండు పులుసుతో తోమాను కదండీ"
"ఎక్కడుంది?".
"ఏమోనండి, నాకు తెలియదు!"
ఇది అజ్ఞానమే అంటారా, అతితెలివి అంటారా?
మా మనవడున్నాడు. వాడికి ఏడేళ్ళు. "తాతా, నీకొకటి తెలుసా?" అని ప్రారంభిస్తాడు. "తెలియదురా" అనాలి నేను అజ్ఞానంగా, అంతేగాని, “నాకు తెలుసు” అంటే డిజప్పాయింట్ అవుతాడు. సెల్ఫోన్ నెట్‌వర్కులన్నీ కోట్లు సంపాయిస్తున్నాయంటే, ఈ పాయింటు మీదేనండీ "వదినా మా తోడికోడలు కూతురేం చేసిందో తెలుసా?" ఇలా సమాచార విప్లవం వెల్లువలా మారడానికి అజ్ఞానమే కారణం. ప్రామాణికతను పక్కన పెడితే, సోషల్ మీడియా, మన అజ్ఞానాన్ని పారద్రోలడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉంటుంది. "నిన్నటి మీ ప్రసంగాన్ని పేపర్లో వేశారండి" "గుడ్, బాగా కవర్ చేశారా?" "అవునండి నమ్ము, నమ్మకపో" అనే శీర్షిక కింద వేశారు.
మన జ్ఞానం అంతా ఉడుత తొర్రలో దాచుకున్నలాంటిదంటాడు సెనెకా అన్న గ్రీకు వేదాంతి. ఉడుతకది అపురూపమే! లోకానికి కాదు.
కాబట్టి కామ్రేడ్స్, అజ్ఞానం లేకపోతే జ్ఞానం లేదు. 'నేను జ్ఞానిని' అనుకుంటే అహంకారం.. 'నేను అజ్ఞానిని' అనుకుంటే వినయం, వినయాన్నే అవలంబిద్దాం... అదన్నమాట.

నృసింహ స్తోత్రం

 

సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యే స్థితం

యోగారూఢ మతిప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం

త్య్రక్షం చక్ర పినాక సాభయ కరాం బిభ్రాణ మర్కచ్ఛవిం

ఛత్రీభూత ఫణీంద్ర మిందు ధవళం లక్ష్మీనృసింహం భజే!