Saturday, April 6, 2024

గత కాలమె మేలు! - దత్తవాక్కు - ఆంద్రప్రభ ఆదివారం - 07 ఏప్రిల్ 2024

కృష్ణద్వైపాయనుడైన వ్యాస భగవానుడు, పాండురాజు అకాల మరణం తరువాత అందరికీ దుఃఖోపశమనం చేస్తాడు. అప్పుడు తన తల్లి సత్యవతీదేవితో ఆయన ఇలా చెబుతాడు.
కం.
మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతు లతి క్షణికంబులు
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
(నన్నయ్య - ఆదిపర్వము-పంచమాశ్వాసము)
ఆయన ఆధ్యాత్మిక విషయాన్ని చెబుతుంటే, దాన్ని వదిలేసి, కొందరు చివరి పాదాన్ని పట్టుకుని, భవిష్యత్తు కంటే గతమే మంచిదని వాదిస్తుంటారు. అదేమిటో గానండీ... చాలా శ్లోకాలు, పద్యాల చివరి పాదాలు నానుడులుగా, జాతీయాలుగా, సామెతలుగా, పలుకుబడులుగా (అన్నీ ఒకటే అంటున్నారా... సరే. కానీండి) మారతాయి. కానీ ముందు పాదాలు ప్రసిద్ధి చెందవు. ఇలా కవిత్వంలోని ఒకభాగం విశ్వజనీనంగా మారడాన్ని ఇంగ్లీషులో ప్రోవర్బియల్ స్టేటస్ పొందటం అంటారు. షేక్‍‌స్పియర్ నాటకాల్లో చాలా వాక్యాలు ఇలాంటివే.
'గతం గతః' అన్నారు పెద్దలు, గతించిందే గతం. అది మనం అరచి గీపెట్టినా మళ్లీ రాదు. రాదంటే రాదంతే. దాన్ని వదిలెయ్యాలి. వర్తమానంలో బతకాలి. భవిష్యత్తు పట్ల ఆశతో ఉండాలి. అలా కాకుండా గత స్మృతులలో విహరించడాన్ని ఇంగ్లీషులో 'నోస్టాల్జియా' అంటారు.
ముఖ్యంగా వృద్ధాప్యంలో ఈ ధోరణి ఎక్కువ. 'మా చిన్నతనంలో...', 'ఆ రోజుల్లో' అంటూ ప్రారంభం అవుతుంది నోస్టాల్జియా. వినేవారికి విసుగ్గా ఉంటుందన్న ధ్యాసే ఉండదు. 'మా అమ్మ కట్టెల పొయ్యిమీద మామిడికాయ, తోటకూర పప్పు వండేది. దాని రుచి ఈ కుక్కర్లో వండిన పప్పుకు వచ్చిచస్తుందా?', 'నా చిన్నప్పుడు బడికి నాలుగు మైళ్లు నడిచి వెళ్లేవాళ్లం..', 'మా ఆయన కట్టిపేడుతో నెత్తినకొట్టా డొకసారి.. కాఫీ చల్లారి పోయిందని... ఇంత బుడిపె కట్టింది. అంత కోపం మారాజు', 'టైప్ మిషను మీద అక్షరాలు టైప్ చేస్తుంటే ఆ అందమే వేరు. ప్రతి లైనుకు బర్రున ఇటువైపు లాక్కుని... ఈ కంప్యూటర్లంటే నాకు నచ్చదు సుమండీ'.. ఇలాంటి డవిలాగులు వింటే వాళ్ల మీద నాకు కోపం రాదు. జాలేస్తుంది. జరిగిపోయిందాన్ని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏముందీ? ఇప్పటికీ కుక్కర్లు వాడకుండా అన్నం పప్పు లను బయట ఉడికింపచేసే నోస్టాలిక్ భర్తలున్నారండీ బాబూ.. వారి భార్యలకు నా లాల్ సలామ్. 'తింటే తిను... లేకపోతే మానేయ్' అనని వారి పతిభక్తి గొప్పది. కాళిదాసు మహాకవి అంతటివాడు ఈ గతం, వర్తమానం అనే కాన్సెప్టుని ఎంత బ్యాలన్స్‌డ్‍గా చెప్పాడో చూడండి...
శ్లో,
పురాణమిత్యేవ నసాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్య పద్యం
సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే
మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః
(మాళవికాగ్నిమిత్రము)
"పాతదైనంత మాత్రమున అంతా మంచిదికాదు. కొత్తది కాబట్టి అంతా చెడ్డదీ కాదు. తెలివిగల వారు రెండింటినీ పరిశీలించి, మంచి చెడ్డలు నిర్ణయిస్తారు. మూర్ఖులు ఇతరులను గుడ్డిగా అనుసరిస్తారు" ఎంత నిజం. రెండింటిలో మంచీచెడూ ఉంటాయి. మంచిని స్వీకరించాలి. చెడును వదిలేయాలి.
తన 'ముత్యాల సరాలు'లో గురజాడ వారిలా అంటారు.... 'పాతకొత్తల మేలుకలయిక క్రొమ్మెరుంగుల జిమ్మగా'. గతం ఎప్పుడూ విలువైనదే. కానీ దానిలోనే నివసిస్తే ప్రమాదం. వర్తమాన, భవిష్యత్తులకు అదే పునాది. 

 


"ఏదైనా ఒక నాగరికతను ధ్వంసం చేయాలంటే దాని చరిత్రను వక్రీకరిస్తే సరి" అంటారు కోవెల సంతోష్ కుమార్ తన 'రామం భజే శ్యామలం' అన్న గ్రంథంలో.
సాహిత్యంలో పూర్వ మహా కవులను ఇప్పటికీ శిరోధార్యులుగా భావిస్తాము. ఎన్నో కొత్త కొత్త ప్రక్రియలు పుడుతుంటాయి... వాటినీ స్వీకరించాలి. ఈమధ్య గత సాహితీ రీతులను అసలు సాహిత్యమే కాదని అనే అల్పజ్ఞులు తయారైనారు. కవిసమ్రాట్ విశ్వనాథ అంతటివారు తమ రామాయణ కల్పవృక్ష అవతారికలో పూర్వ కవులను ఇలా స్మరించారు.
సీ.
ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన్న శిల్పపు దెనుగుతోట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు
పోతన్న తెలుఁగుల పుణ్య పేటి
శ్రీనాథుడు రసప్రసిధ్ధ ధారాధుని
కృష్ణరాయ డనన్య కృతిప్రబంధ
పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు
రామకృష్ణుడు సురారామగజము
తే.గీ.
ఒకడు నాచనసోమన్న, యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్రకవిలోకమూర్ధమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి.
~
మహాకవి ఎ.ఎల్. టెన్నిసన్ ఇలా అంటాడు - "The old order changeth, yielding place to the new, And God fulfils Himself in many ways..." పాతపద్దతి మారుతూ, కొత్తదానికి చోటిస్తుంది. రెండూ దేవుని ఆవిష్కరణలే.
కాబట్టి కామ్రేడ్స్. రోటిపచ్చడి మా అమ్మ చేసినట్లు చేయమని మీ ఆవిడని సతాయించకండేం... చక్కగా మిక్సీ పచ్చడిని రామా ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా తినేయండి. అబ్బాయి లోన్ పెట్టి ఇన్నోవా కొంటే మీరు సైకిల్లో తిరిగేవారని చెబుతూ వాడిని చిన్నబుచ్చకండి. మీ సమ వయస్కులతో పంచుకోండి మీ నోస్టాల్జియాను. యువతరంమీద రుద్దకండి భాయీ.
Those who live in the past... die in the past అన్న సామెత కొంచెం కష్టంగానే ఉన్నా, నిజం మాస్టారు. 'గతాన్ని తెరిచి, వర్తమానంలో నిలిచి, భవిష్యత్తుని మలచుకో. ఇదెవరి మాట? ఇంకెవరిది.. నాదేనండి బాబూ... అదన్న మాట.

No comments:

Post a Comment