Sunday, April 14, 2024

నాన్నకు కోపంతో - దత్తవాక్కు - ఆంద్రప్రభ ఆదివారం - 14 ఏప్రిల్ 2024

 నాన్న కన్నా... అమ్మంటేనే అందరికీ ప్రేమ, తొమ్మిది నెలలు కడుపులో మోసి కంటుంది అమ్మ, ఆమె స్థానం అద్వితీయమైనదే! అందులో సందేహం లేదు.. కానీ, నాన్న కెందుకో, సాహిత్యంలో, సినిమాల్లో, ఇతరత్రా అంత ప్రాధాన్యత ఉండదు. అక్కడ ఉన్నా అంత చెప్పుకోదగింది కాదు!
వనితా మానస సూన సాయకుడు... జీవదాత్త పాదులందు.. అంటాడు తెనాలి రామకృష్ణ కవి తన పాండు రంగ మహత్యం కావ్యంలోని నిగమ శర్మోపాఖ్యానంలో.
నిగమ శర్మను అతిగారాబంతో ళ్ళమ్మ ఎందుకూ పనికి రానివానిగా చేసింది. జులాయి వెధవయ్యాడు, జూదరి అయ్యాడు. వ్యభిచారి కూడా. జీవత్తాతపాదుడు అన్న.. తెనాలి వారి ప్రయోగం చాలా అర్ధవంతమైంది. దానికర్థం తండ్రి ఇంకా బతికే ఉన్న కొడుకు అని. తాతపాదుడంటే.. సంస్కృతంలో నాన్న. నిగమ శర్మ ఎన్ని వెధవ పనులు చేస్తున్నా, వాడి ఆటలు సాగుతున్నాయంటే కారణం.. వాడి నాన్న బతికే ఉండటమని తెనాలి వారి కవిహృదయం. జీవత్తాతపాదుడనే శీర్షికతో నేనొక కథ రాశాను, తెనాలి వారి స్పూర్తితో... కథామంజరి మాసపత్రికలో అది ప్రచురించారు.
తండ్రి బతికున్నంతవరకూ జీవితం హ్యాపీస్/ అంతా ఆయనే చూసుకుంటాడు. తిట్టినా.. కొట్టినా పాకెట్ మనీ ఇస్తాడు. ఆయనుంటే కొండంత అండ. ఆయన పోయాకే తెలుస్తుంది. ఆయన విలువ, కానీ, బతికున్నంత కాలం, ఆయన చండశాసనునిగా, ఒక డిసిప్లేరియన్‍గా ఉంటాడు. ప్రేమను వ్యక్తం చేయడం అమ్మకు చేతనైనట్టుగా, నాన్నకు చేతకాదు. ఒక వేళ ప్రేమ ఉన్నా, దాన్ని బయటపెట్టడు నాన్న. సంక్షేమ పథకాల్లో అమ్మ పేర్లే పెడతారు కానీ, నాన్న పేర్లు పెట్టరు! అమ్మ ఒడి అంటారు కానీ, నాన్న తొడ అనరుగా! అడపాదడపా సినిమాల్లో నాన్న పాటలు ఉంటాయి. ధర్మదాత సినిమాలో 'ఓ నాన్న! నీ మనసే వెన్న.. అమృతం కన్నా అది ఎంతో మిన్న' అన్న సి.నా.రె.గారి పాటంటే నాకెంతో ఇష్టం. నాన్న అంతరంగాన్ని ఆ జ్ఞానపీఠ కవివర్యుడు హృద్యంగా ఆవిష్కరించారు. ఘంటసాలతో పాటు టిఆర్ జయదేవ్ అనే గాయకుని గొంతు కూడా ఇందులో వింటాం.. సుశీలమ్మ గురించి చెప్పేదేముంది. ది నైటింగేల్ ఆఫ్ ది సౌతిండియా!
'తండ్రి హరిజేరుమనియెడు తండ్రి తండ్రి!' అని ప్రహ్లాదునితో చెప్పిస్తారు పోతనగారు. ఆధ్యాత్మ దర్శనం చేయించిన వాడు కూడా నాన్నే. కానీ, నాన్న దగ్గర మనకు చనువు తక్కువ. అమ్మ, దగ్గర చేరి ఓవర్ యాక్షన్..! ఆయన టాస్క్ మాస్టర్, మన జీవితానికి ఒక ఆర్డరు ఏర్పరచాలని ఆయన నిరంతరం తపిస్తుంటాడు. ఆ క్రమంలో కొంత కాఠిన్యం వహిస్తూ ఉంటాడు. ఆ మధ్య తనికెళ్ళ భరిణి, చిన జీయర్ స్వామి పాల్గొన్న ఒక అధ్యాత్మిక సభలో 'నాన్నెందుకో వెనుకబడ్డాడు' అన్న కవిత చదివి వినిపించారు. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే, నాన్న పాతికేళ్ళు అంటారు తనికెళ్ళ. దెబ్బ తగిలినప్పుడు అమ్మా! అని అరుస్తాం. కానీ, నాన్నా అని అరవం, నాన్నను మన పెన్నెముక అంటారు. ఈ కవిత రాసిన వారు. 'పాపం నాన్న' అని నేనూ ఒక కవిత రాశానండోయ్! అప్పుడే విసుగ్గా మొహం పెట్టకండి! అది 2017లో నవ్య వార పత్రికలో వచ్చింది. తనికెళ్ళ అనేసరికి ఇంటరెస్టు! దత్తశర్మ అనేసరికి విసుగు ఇదేం న్యాయమండి! కాకి కవిత కాకికి ముద్దు!


 

మా నాన్న బ్రహ్మశ్రీ, శతావధాని, పౌరాణిక రత్న పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. ఆయనకు గురజాడ కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులకు లాగ కించిత్ ప్రథమ కోపమున్నూ.. ఉండేది. నేను కాలేజీ ప్రిన్సిపాల్ నయినా ఆయనంటే భయం పోలేదు. నేనేదైనా చక్కని పద్యం రాసి వినిపిస్తే పొరపాటునైనా బాగుందని అనేవారు కారు. ఈ విషయంలో నాకు మహాకవి భారవి గుర్తుకొస్తాడు. నేను భారవి అంతటి వాడిని కాకపోయినా, మా నాన్న మాత్రం మహా పండితుడే. ఆయన నన్ను కోప్పడేవారు. తెలుగు, సంస్కృత కావ్యాలను నాకు బోధించినవాడు ఆయనే. నమక, చమక, పురుష సూక్త మహన్యాసములు నా తొమ్మిదవ ఏటనే నేర్పించింది ఆయనే. నేను మొరాయిస్తే ఒక కొబ్బరి పీచుతాడుతో కొట్టడానికి నా వెంట పడేవారు. ఉట్టి కేకలే! ఒక్క దెబ్బపడేది కాదు. అప్పుడాయనంటే కోపం, ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా చూపించడానికి ఆయన లేరు.
సిల్వియా ప్లాత్ అన్న రచయిత్రి రాసిన 'డాడీ' అన్న కవిత సుప్రసిద్ధం. ఆమె ఇలా అంటుంది. daddy, i have had to kill you, you died before i had time. ఆమె ఇలా అంటుంది. తాను అర్థం చేసుకోకముందే ఆయన వెళ్ళిపోయాడని ఆమె కోపం. ఆయన్ను ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ గాడ్ అంటుంది. ఎంత గొప్ప భావన. నాన్నను వర్ణించడానికి ఆమె వాడే రూపకాలు మనలను కంటతడి పెట్టిస్తాయి. నాన్నయన్నట్టి. పద మది మిన్న జగతి, మంచి హితుడును వేదాంతి మార్గదర్శి, అతని కోపంబు. దీవెనై యరయవల యుమనల, వెన్నవంటిది మధురంబు నాన్న మనసు. అదన్న మాట!

No comments:

Post a Comment