Sunday, April 21, 2024

గ్రాంఫోన్... టేప్ రికార్డర్.. సెల్‍ఫోన్! - దత్తవాక్కు - ఆంద్రప్రభ - ఆదివారం - 21 ఏప్రిల్ 2024

1887 లోనండీ... ఎమిల్ బెర్లినర్ అనే ఆయన గ్రామోఫోన్‌ను కనిపెట్టాడు. ఎలక్ట్రిక్ రికార్డు ప్లేయర్‌కిది పూర్వీకుడు. నవ్వుతున్నారెందుకు? మనుషులకే కాదు... యంత్రాలకూ పూర్వీకులుంటారు. తేడా ఏమంటే, యంత్రాలకు తద్దినాల సమస్య లేదు. అది తొలి కార్బన్ మైక్రో ఫోన్. దాని పేటెంట్‌ను ఆయన అలెగ్జాండర్ గ్రాహంబెల్‌కి అమ్మేశాడు. అదే థామస్ అల్వా ఎడిసన్‌కి ప్రేరణ. ఆయన విజయవంతంగా మానవుని గొంతును, రికార్డు చేసి స్టోర్ చేయగలిగాడు. టిన్ ఫాయిల్ ఫోనోగ్రాఫ్ ద్వారా దానిని ప్లే చేయగలిగాడు.
1900లో గ్రామోఫోన్‍కు ట్రేడ్‍మార్క్ 'హిజ్ మాస్టర్స్ వాయిస్'ను సంపాదించాడు ఎడిసన్. అదే హెచ్ఎంవీ కంపెనీగా తర్వాత పేరుపొందింది. వెడల్పుగా బ్యాండుమేళం మూతిలా ఉన్న దాని దగ్గర ఒక కుక్క కూర్చుని వింటూ ఉంటుంది. దానిపేరు నిప్పర్, కుక్క తన యజమాని గొంతును ఎలా గుర్తిస్తుందో... అంత క్లారిటీగా అన్న మాట,
తయారైన తర్వాత ఎడిసన్ తన తొలి రికార్డును ఎవరైనా గొప్పవాడి గొంతుతో చేయిద్దామనుకుని జర్మన్ వేదాంతి, విద్యావేత్త, మాక్స్ ముల్లర్‌ని సంప్రదిస్తే... ఆయన సరేనన్నాడట.
ఆయన గొంతులో ఒక విషయాన్ని రికార్డు చేసి ఒక సభలో వినిపిస్తే, అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట. కారా మరి? కొందరు భయస్తులు ఇది దయ్యాల పనే అని తేల్చేశారట.
కానీ, మాక్స్ ముల్లర్ చెప్పినది ఏదో వేరే భాష, 'ఇదేమిటో తెలుసా?' అని అడిగి 'ఇది సంస్కృతం... భారతీయ పురాతన సనాతన భాష. గ్రాంఫోన్‍లో నేను చదివింది ఋగ్వేదంలోని అగ్నిమీళే పురోహితం అన్న మంత్రం. అగ్నిని ఆరాధించే ప్రార్థన.. సమస్త జ్ఞానానికి ఆద్యులు భారతీయులే' అని చెప్పాడట ముల్లర్. సభికులు చప్పట్లు. 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయి!' అని ఎగతాళి చేసేవారు తెలుసుకోవాలి మరి.
తర్వాత టేపు రికార్డర్లు వచ్చాయి. ధ్వనులను ఒక నల్లని, ఒక సెంటిమీటర్ వెడల్పున్న చిన్న రిబ్బను లాంటి టేపులో రికార్డు చేసి, ఒక ప్లాస్టిక్ డొక్కులో చుట్టేవారు. దానిని క్యాసెట్ అని అనేవారు, టేపు రికార్డర్లో దాన్ని అమర్చి ప్లే అనే స్విచ్ నొక్కితే టేపు తిరుగుతూ, ప్రీ రికార్డెడ్ పాటలు, ఇంకా ఎన్నో చక్కగా వినిపించేవి. 80వ దశకంలో ఇంట్లో టేపు రికార్డర్ ఉంటే ఒక ప్రిస్టేజ్‌గా భావించేవారు, చౌక రకం టేప్ రికార్డర్లలో టేపు స్ట్రక్ అయితే, దాన్ని బయటకు తీసి పెన్సిల్‍తో చుట్టడానికి నానా అవస్థపడే వాళ్ళం.
ఇప్పుడు సెల్ ఫోన్ షాపులున్నట్టు ఎక్కడ చూసినా క్యాసెట్లు, రికార్డింగ్ దుకాణాలుండేవి అప్పుడు. అబ్బో ఎప్పటి మాట నలభై ఏళ్ళ కిందట. ఎన్నో ప్రముఖ క్యాసెట్ కంపెనీలు చక్కని సంగీతాన్ని రికార్డు చేసి అమ్మేవి. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ గారు వ్యాపారాన్ని అటుంచితే ఈ రంగంలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మనకు నచ్చిన సినిమా పాటలను, కీర్తనలను సెలక్టు చేసి ఇస్తే క్యాసెట్ షాపాయన వాటన్నింటినీ ఒకే క్యాసెట్లో రికార్డు చేసి ఇచ్చేవాడు. 60 నిమిషాల క్యాసెట్లు, 90 నిమిషాల క్యాసెట్లు ఉండేవి. ధర రూ.35 నుండి ప్రారంభం. 90లలో పుట్టిన వారికి ఈ విషయాలు తెలియవు పాపం. (పాపం ఎందుకో).


తర్వాత వచ్చేశాయి బాబోయ్... సెల్‍ఫోన్‍లనే మాయాజాలాలు! అన్నింటినీ తుడిచిపెట్టి పారేశాయి. 'బస్సొచ్చి బండోడి కడుపు కొట్టిండోయ్!' అన్నట్టు, సెల్లొచ్చి సమస్తమూ తొలగ దోసిందోయ్ అనాలి ఇప్పుడు. సెల్‍ఫోన్ స్మార్ట్ ఫోన్‍గా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అదొక అద్భుత ప్రపంచాన్ని మన అరచేతిలో ఇమిడ్చే పరికరం, ఆడియో, వీడియో దేన్నయినా ఇట్టే రికార్డు చేస్తుంది. దాన్ని క్షణాల్లో కావలసిన వారికి షేర్ చేయవచ్చు. యూ-ట్యూబ్‍లో నా ప్రసంగాలు, పద్యాలు, పాటలు వస్తుంటాయి. మా కోడలు ప్రత్యూష కొన్ని ఇంట్లోనే రికార్డు చేస్తుంది. ఒకసారి ఆ అమ్మాయి బయటికి వెళ్తే మా మనవడు ఏడేళ్ళ వాడు 'నేను తీస్తాలే తాతా' అని చక్కగా నా పద్యాలను వీడియో తీసి చూపించాడు. ఇంతకు ముందు మా కాలంలో 'పుస్తకం హస్త భూషణం' అనేవారు, ఇప్పుడది 'సెల్ఫోన్ చేతికి అందం'గా మారింది. మహాప్రభూ! కెమెరాలను, చేతివాచీలను, టేపు రికార్డర్లను, అలారం టైమ్‍పీస్‍లను సర్వేసమస్తాలను దెబ్బతీసింది సెల్ ఫోన్! మీరు మెయిన్ రోడ్డు మీద వెళుతూంటే ప్రతి ఐదు షోరూమ్‍లలోనూ ఒకటి సెల్ ఫోన్‍లది అయిఉంటుంది.
సౌలభ్యం సంగతటుంచితే ఆ కాలంలో గ్రాంఫోన్, టేపు రికార్డుల ఆనందం అనుభవించిన వారికే తెలుసు. గ్రామఫోన్ ప్లేటు కొంతకాలానికి అరిగిపోయి, దాని పిస్ ఒక చోట చిక్కుకుని అక్కడ ఉన్న పాట భాగాన్ని పదే పదే వినిపిస్తుంటే నవ్వుకునే వాళ్ళం కాని, విసుక్కునే వాళ్ళం కాదు. 'జగమే మాయ' అనే దేవదాసు పాటలో పిన్ను ఇరుక్కున్న చోట వేదాలలో, దాలలో, దాలలో... ఇలా పిన్ తీసేవరకు రిపీట్ అయ్యేది. ప్రతి గుడిలో ఒక గ్రాంఫోన్, టూరింగ్ టాకీస్ కూడా. ఘంటసాల వారి 'వాతాపి గణపతిం భజే', 'దినకరా శుభకరా' వినీ వినీ అవి నోటికి వచ్చేవి. రికార్డింగ్లు శృతి మించి, రహస్యంగా వాయిస్ రికార్డు చేసే సాక్ష్యాలుగా ఇస్తున్నారు. దొరికితే మాత్రం సోషల్ మీడియాలో అవి వైరల్! ఇంతకూ వైరల్ అంటే ఏమిటో? వైరస్‍లాగా పాకిపోయేదనో ఏమో ఖర్మ, ఇంతకూ వైరల్ కానిదేదైనా ఉందాఅని? అదన్నమాట!..

No comments:

Post a Comment