Tuesday, May 14, 2024

ధూమపానోపాఖ్యానం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ 14 మే 2024

"పొగచుట్టకు, సతి మోవికి/తగనుచ్ఛిష్టత లేదని/ఖగవాహన తోడ కాలకంఠుడు పలికెన్/పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్" అంటాడు గురజాడ వారి కన్యాశుల్కంలో, గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో. ఏదైనా దురలవాటు ఉన్నవారు దానిని సమర్థించుకోవడానికి గిరీశంలా పురాణాలను కూడా ఉటంకిస్తారు. ఎంత సమర్థించుకున్నా దురలవాటు ప్రమాదకరమైనదే!
పబ్లిక్ ప్లేస్లలో పొగతాగరాదు, పొగతాగుట నేరము లాంటి బోర్డులుంటాయి. సినిమాల్లో, ఏదైనా పాత్ర పొగతాగే సన్నివేశం వచ్చినప్పుడు పొగతాగుట ఆరోగ్యానికి హానికరం అని తెర దిగువన, ఎవరికీ కనబడకుండా, అతి చిన్న అక్షరాలతో చట్టబద్ధమైన హెచ్చరికను వేసి చేతులు దులుపుకుంటారు. మద్యం సేవించడం కంటే ఇదేమీ అంత ప్రమాదం కాదని వాదించే స్మోకింగ్ కింగ్స్ ఉన్నారండోయ్!
యద్భావం తద్భవతి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. పురాణ కాలక్షేపం అయిన తర్వా త భక్తులారా! భగవంతుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడో అర్థమైంది కదా! అంటే ఒక ఆసామీ లేచి, నాకు బాగా అర్థమైందండి అన్నాడట వినయంగా. ఏమిటని అడిగితే, కాల్చే చుట్ట ఆరిపోతే చెవి సందున పెట్టుకోవడానికి అన్నాట్ట! అలా ఉంటుంది మనతోని.
1964లో విడుదలైన 'రాముడు- భీముడు' సినిమాలో రేలంగి-గిరిజల మీద ఒక పాట చిత్రీకరించారు దర్శకులు తాపీ చాణక్యగారు. పెండ్యాల వారు దానికి స్వరకర్త. సిగరెట్ తాగడాన్ని గ్లోరిఫై చేస్తూ రేలంగి 'పట్టుబట్టి ఒక దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు' అనీ, 'ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడూ...' అనీ అంటే గిరిజ దానికి రిటార్టు ఇస్తుంది. 'కంపు కొట్టు ఈ సిగిరెట్టూ' అంటూ 'కడుపు నిండునా, కాలు నిండునా...' అనీ, ఇక ఆంజనేయుని లంకా దహనాన్ని 'ఎవడో కోతలు కోశాడూ' అనీ, 'ఊపిరి తిత్తుల క్యాన్సర్కిదియే కారణమన్నారు డాక్టర్లూ', అని తిప్పి కొడుతుంది. ఆనాటి సినిమా కాబట్టి సమాజానికి వ్యతిరేక సందేశం వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు. కళకు సామాజిక ప్రయోజనం ఉండాలనేది అప్పటి వారి లక్ష్యం. కాసులు రాల్చేదే కళ అనేది ఇప్పటి వారి గమ్యం. ఇలాంటి పాటలు రాయడంలో కొసరాజు రాఘవయ్య చౌదరిగారు చేయి తిరిగినవారు. పాడటంలో మాధవపెద్ది వారికి మంచి ప్రావీణ్యమున్నదనే గుర్తింపు ఉంది. ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో, నిండా పొగ అలుముకొని ఉండేది. మా చిన్నప్పుడు దాన్ని అతి సహజంగా స్వీకరించేవాళ్ళం. కాలుతున్న సిగెరెట్ మీద ఇంటూ మార్క్ పెద్దగా వేసి పొగ తాగరాదు అనే స్లయిడ్ వేసేవారు మొక్కుబడిగా. ఇప్పుడా పరిస్థితి లేదు లెండి. పబ్లిక్ స్మోకింగ్ చాలా వరకూ తగ్గిపోయింది. కొన్ని చోట్ల స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేసి పొగధీరులకు సౌకర్యం చేశారు.
పొగతాగటంలో కూడా స్టేటస్‌లు ఉన్నాయి. బీడీలు తాగడం లో-క్లాస్, పైప్ పీల్చడం హైక్లాస్, ఇక హుక్కా తాగడం రాజరికం. నేను పలాస ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేసినప్పుడు నిష్ఠల సుబ్బారావుగారని మా ప్రిన్సిపాల్.. ఆయన రూమంతా చుట్టకంపు ఉండేది. కానీ ఆయన్నే మనగలం? 'బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్!'.
ప్యాసివ్ స్మోకింగ్ అసలు స్మోకింగ్ కన్నా ప్రమాదమట. అంటే మనం తాగకపోయినా, పక్కవాడు వదిలే పొగని విధిలేక పీల్చాల్సి రావడం. ఇంట్లో తండ్రి స్మోకర్ అయితే, భార్యకూ, పిల్లలకూ ఇది తప్పదు. కొన్ని సమాజాల్లో 'నెసెరీ ఈవిల్స్' ఉంటాయి. స్మోకింగ్ కూడా అలాంటిదే. నాకు మటుకు అంత విచ్చలవిడిగా స్మోక్ చేయడం తగ్గిందనిపిస్తోంది. బహుశా 'పాజిటివ్ థింకింగ్' ఏమో? అదన్న మాట!

No comments:

Post a Comment