Saturday, May 18, 2024

నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 19 మే 2024

ఛీ నోర్ముయ్! ముందు నీవు ముయ్యి! ఇంతకూ ఎవరి నోరు
వారు మూసుకోవాలా లేక ఎదుటివారి నోరు ముయ్యాలా? చిత్రంగా ఉంటుంది తెలుగు! 'ఏమిటి తల తిరుగుతోందా?', ''తమరిదా... చిత్తం... తిరగడం లేదండీ.. మామూలు గానే ఉంది" ఇలా ఉంటాయి భాషా విన్యాసాలు.. నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదండోయ్ ప్రశాంతత. వాగడం ఈజీ గానీ, నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం. అందుకే దాన్ని మన శాస్త్రాలు పరబ్రహ్మతత్వంతో 'సమానం' అన్నాయి. నిశ్శబ్దానికి అంత వెయిట్ ఉందన్న మాట! నిశ్శబ్దానికి బ్రాండ్ అంబాసిడర్స్
పీవీ నరసింహారావుగారు, మన్మోహన్ సింగ్ గారు! ఇద్దరూ కాకలు తీరిన మేధావులు, కానీ అసలు మాట్లాడరు. పివి గారు కింది పెదవిని బిగించుకుని కూర్చుంటారు. మన్మోహన్ గారు పెదవి విప్పితే ముత్యాలు రాలుతాయేమోనని జాగ్రత్తగా ఉంటారు. ఇద్దరూ కలిసి భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఒక గొప్ప ఊపునిచ్చారు మరి!
వాక్కు అనే పదం నుంచి వాగడం పుట్టిందేమో ఖర్మ! వాగాడంబరం అని సంస్కృతంలో ఒక చక్కని పదం ఉంది. అర్థం పర్థం లేకుండా వాగుతూ ఉండేవారిని ఇంగ్లీషులో చాటర్ బాక్సులంటారు. 'స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్' అన్నారు వాళ్ళే. మనవాళ్ళేం తీసిపోయారనుకుంటున్నారా? 'కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా?' అన్నారు కదా!
వాక్చాతుర్యం వేరు, వాగుడు వేరు. తమ మాటలతో ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేస్తారు కొందరు వక్తలు! కొందరికి సేజి మీద ఏదైనా మాట్లాడటమంటే కాళ్ళు వణుకుతాయి. నోరెండిపోతుంది. గొంతు పెగలదు! వీరిని 'సభా పిరికి' అంటారు. ఈ పదం దుష్టసమాసం సుమండి!
'ఊరుకున్నంత ఉత్తమం లేదు. బోడిగుండంత సుఖం లేద'ని.. మనకో నానుడి ఉంది. దీన్నే ప్రఖ్యాత అమెరికన్ రచయిత ఆర్ డబ్ల్యు ఎమర్సన్ గారు ఇలా చెప్పారు చమత్కారంగా! 'సైలెన్స్ ఈజ్ పూలిష్, ఇఫ్ యు ఆర్ వైజ్! బట్ వైజ్, ఇఫ్ యూ ఆర్ పూలిష్'. పదాలతో ఆడుకోవడం అంటే ఇదే! దీని అర్థం లోతైనది. "నీవు తెలివైనవాడివైతే, నిశ్శబ్దంగా ఉండటం తెలివితక్కువతనం.. అదే నీవు తెలివితక్కువవాడివైతే నిశ్చబ్దంగా ఉండటమే తెలివైన పని!". అదీ సంగతి.

 



నేను శ్రీకాకుళం జిల్లా పలాసలో లెక్చరర్ పని చేస్తున్నప్పుడు మా కాలేజీకి రెండు కిలోమీటర్ల దూరంలో నెమలికొండ అనే దత్త క్షేత్రం ఉండేది. దాన్ని స్థాపించి అభివృద్ధి చేసిన వారు శ్రీ త్రినాథ యోగి. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా, ప్రసన్నంగా ఉండేవారు. 'సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్'. భావవ్యక్తీకరణకు నిశ్శబ్దాన్ని మించిన మార్గం లేదు. ఆ ఆశ్రమంలో గోడల మీద రాసిన సూక్తులు 40 సంవత్సరాల తర్వాత కూడా నేను మర్చిపోలేదు. అతి భాష, మతి హాని! మిత భాష అతి హాయి! మితభాషిత్వాన్ని ఇంగ్లీషులో రిటైసెన్స్ అంటారు. గొప్ప పదం అది. నిశ్శబ్దం ఎంత గొప్పదో ఒక కవి ఇలా చెప్పారు.
~
సీ.
నీకు నచ్చని చోట నీవు భేదింపంగ
నిశ్శబ్దమును మించు నేర్పులేదు
నీదు దుఃఖంబును నీవు వ్యక్తముజేయ
తగును నిశృబ్దంబు తానె యెపుడు
మరణించువారికి మంచి సంతాపంబు
నిశ్శబ్ద రూపమై నింపు శాంతి
మొండి వాదనలను దండిగా నెదిరించి
నిశ్శబ్దమే గెలిచి నిలుచు సతము
ఆ.వె.
కాని, మానవ హక్కులు హనన మంద
వసుధ నన్యాయమది చాల వ్యాప్తి చెంద
సాటి మానవులాపద జేబు గనగ
నీవు భజియించు మౌనంబు నేరమగును
~
మన అయిష్టతను వ్యక్తం చేయడానికి, దుఃఖాన్ని ప్రకటించడానికి, మరణానికి సంతాపం ప్రకటించడానికి మొండి వాదనలను ఎదుర్కొనడానికి నిశ్శబ్దమే సరైనదట. కానీ ఎదుటి వారికి అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం నేరమవుతుంది. ఇంతకూ కవి పేరు చెప్పలేదేం? అని అడుగుతున్నారా? కనుక్కోండి చూద్దాం!. అర్ధం చేసుకోవాలబ్బా!
మౌనం అర్ధాంగీకారం, మౌనేన కలహం నాస్తి, ఇలాంటివి లౌక్యంతో కూడిన స్ట్రాటజీలే సుమండి. ఎదుటి వారు ఏం మాట్లడకపోతే సగం అంగీకరించినట్లేనట! కామ్‌గా ఉంటే కలహాలే రావట. దీన్నే రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారంటారు (స్ట్రేటజిక్ సైలెన్స్), 'నా నోరు మంచిది కాదు., నన్ను కెలకొద్దు' అనే వారితో జాగ్రత్తగా ఉండాలండోయ్!
'పెదవి దాటితే పృథివి దాటుతుంది..', 'ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు'.. అయినా దాపరికం లేమికి మగ, ఆడ తేడాలేదు! సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సమాచార విప్లవం మరి ముదిరింది. ఎదుటివాడు స్పందించకపోతే తెలంగాణలో 'సప్పుడు సేస్తలేడు' అంటారు. రాయలసీమలో 'కుయ్ అనలేదు, కయ్ లేదు' అంటారు. కోస్తాలో 'కిమ్మనకుండా ఉండిపోయాడు' అంటారు. కిం... అంటే 'ఏమిటి'... అని అర్థం. యాసలు వేరైనా భావం ఒకటే!
కాబట్టి మాటలను పొదుపుగా వాడండి. బ్రీఫ్ బట్ ఎఫెక్టివ్, క్లుప్తంగా, ప్రభావవంతంగా ఉండాలి మాటలు. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి చిన్నప్పటి నుంచి మూగది, బ్రహ్మానందంతో పెళ్లయిం తర్వాత ఆమెకు మాటలు వస్తాయి. ఆమె వాగుడును ఆ మొగుడు తట్టుకోలేకపోతాడు. ఇంతకూ సౌండ్ పొల్యూషన్‌కు కారణాలలో అతి వాగుడును కూడా చేర్చవచ్చా? ఆలోచించండి! మౌనంగానే ఎదగమని కదా కవి గారు చెప్పింది! అదన్న మాట!

No comments:

Post a Comment