Wednesday, May 22, 2024

ప్రజాస్వామ్య ప్రహసనం!

అభ్యదయ రచయితల సంఘం (అరసం) వారి.. 'ఎన్నికల భారతం..' కవితల పోటీలో ఎంపికైన, వారి సంకలనం ప్రచురితమైన, నా కవిత 'ప్రజాస్వామ్య ప్రహసనం' చదవండి. 🙏

 

 

 ప్రజాస్వామ్య ప్రహసనం!


ఎన్నెన్నికలొచ్చినా ఏమున్నది గర్వకారణం!
పాలక జాతి సమస్తం పరదోపిడీ పరాయణత్వం.

ఎన్నికలలో, ఎన్ని కలలో! ఎన్ని కల్లలో!
ప్రజాస్వామ్యం దుప్పటడుగున, ప్రజానేతలు కనే కలలు
స్వార్థమనే పెను కడలి అలలు.

సిగ్గూశరం లేకుండా, చీమూనెత్తురూ లేకుండా
అధికారపార్టీలోకి అవలీలగా ఫిరాయిస్తుంటే
విస్తుబోయి చూస్తోంది, అంబేద్కర్ ఆత్మ.
రాజకీయాల్లో విలువలనే వలువల నెప్పుడో వదిలేసి
నగ్నంగా తిరుగుతున్నారు ప్రజల మధ్యన.

సొంత యింటికొచ్చానని, పైగా ఆత్మవంచన
యాంటీ డిఫెక్షన్ చట్టానికి అందమైన పైడిపూత
ఓటర్లంతా వెర్రిపప్పలనా వీళ్లనుకొంటున్నది?
ప్రజాగ్రహం ప్రవహిస్తే కారా వీరంతా పరాజితులు?
కండువా మారిస్తే దండిగా దండుకోవచ్చనే నీచులు.

‘క్విడ్ ప్రోకో' రూపం మార్చుకుని సంక్షేమ పథకాలయ్యింది.
ఎన్నికల ముందు డబ్బు పంచేవారొకనాడు! అది ఔట్ డేటెడ్!
అధికారంలోకి వచ్చిన్నాటి నుండి అనుచితాల పందేరం
చట్టానికి దొరక్కుండా ఓట్లు కొనే చక్కని వ్యవహారం
శ్రమశక్తిని నిర్వీర్యం చేసి, జనాలను సోమరులను చేసే ఘోరం.

మొదలవుతాయ్ ఎన్నికల ముందు నీతులు, హితోక్తులు
సచ్ఛీలురనే ఎన్నుకోండంటూ, ఓటును అమ్ముకోవద్దంటూ
పైగా అది పవిత్రమైనదంటూ చెప్పడానికి ఏం కష్టం?
దుర్భిణీ వేసి వెతికినా కనబడరే సచ్చీలురు! సత్పురుషులు!
అలాంటప్పుడు ఎందుకీ నీతి చంద్రికలు, సూక్తి ముక్తావళి!

అందుకే 'నోటా' అంటే నాకిష్టం! అదే నా అభ్యర్థి!
ఎదురుగ్గా కొన్ని రాళ్లు పెట్టి, తలకొట్టుకో ఏదో ఒక దానితో!
అదీ ఎన్నికల విధానం. బుద్ధిలేని వ్యవహారం.
“నా కెవరూ నచ్చలేదు” అన్న బటన్ నొక్కితే
చెంపపెట్టు అవుతుందది దుశ్శీలుర జాబితాకు.

దేశసేవ అనేది పెద్ద లాభసాటి కార్యక్రమం
ప్రజాసేవలో తరించడానికెందుకింత తాపత్రయం?
సర్పంచ్ పదవి కోసమే కోట్లు గుమ్మరిస్తున్నవాడు
అంతకు పదిరెట్లు దోచుకోవడానికే కదా చూస్తాడు
డబ్బు కట్ల పాములతో చుట్టబడిన ఎన్నికలవి!

మేధావుల మౌనం జాతికి ఒక శాపం
స్వార్థరహిత, జనహితపర యువతా! రా!
ప్రజాస్వామ్య కదనంలో వారి సింహభాగం
నిజాయితీ, నిస్వార్థం అజాగళస్తనాలవుతున్నప్పుడు
అవినీతి చెదలంటని యువకులు, మేధావులే దేశానికి దివిటీలు.

ఓటు వెయ్యమని డబ్బిచ్చేవాడెంత వెధవో
ఒక్కసారి ప్రజలంతా జూలు విదిల్చిన సింహాల్లా
ప్రజాస్వామ్య రక్షణకై గర్జించాలి! హర్యక్షాలై
నిర్జించాలి నీచ నికృష్ట రాజకీయ ప్రహసనాన్ని.
(ఎన్నికల భారతం, కవితా సంకలనంలో 81-82 పేజీలు)


 

 

 




No comments:

Post a Comment