Monday, June 10, 2024

అబద్ధాల రోజు - దత్తవాక్కు ఆంధ్రప్రభ 11 జూన్ 2024

మనకంత లేదు గానీ, పాశ్చాత్యులకు, ప్రతి అంశానికీ ఒక అంతర్జాతీయ దినోత్సవం ఏడ్చింది. కొన్ని మరీ సిల్లీగా ఉంటాయి. ఏప్రిల్ 4వ తేదీన 'టెల్ ఎ లై డే' ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారట. 'ఒక అబద్ధం చెప్పు... దినోత్సవం' అన్న మాట.
అబద్ధం అంటే? బద్ధం కానిది. అంటే కట్టుబడనిది అని అర్థం. అంతేనంటారా? దానికి వ్యతిరేకం నిజం. నిజం నిప్పులాంటిదంటారు. అంటే ఎంతదాచినా దాగదని. అబద్దం ఆడటం అంత వీజీ కాదు మాస్టారు! నిజం చెప్పడానికి పెద్దగా తెలివితేటలక్కరలేదండోయ్! నిజాయితీ ఉంటే చాలు. కానీ, అబద్దం చెప్పడానికి తెగింపు, కల్పనా సామర్థ్యం, సమయస్పూర్తి లాంటి ఎన్నో కావాలి మరి. నిజమా కాదా?ఒకసారి ఆలోచించండి!
ఇది నేను యథా మామూలుగా సరదాగా రాస్తున్నదే తప్ప, అబద్ధాలను, వాటిని చెప్పేవారిని గ్లోరిఫై చేయడానికి గానీ, కనీసం సమర్థించడానికి గానీ, కానేకాదు బాబోయ్! అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలని, గోడకట్టినట్టు (అంటే చాలా ప్లాన్డ్‌గా) ఉండాలని, నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ఆరు లోకాలు చుట్టి వస్తుందని... ఇలా అబద్ధం గురించి ఎన్నో నానుడులున్నాయి.
ఛార్లెస్ పోంజీ అని, ఇటలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఒక అసత్యహరిశ్చంద్రుడు, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, బోలెడు గడించాడట. అదే నండీ డబ్బు... ఆ మహనీయుడు ఎంత గొప్పవాడంటే యూఎస్ ప్రభుత్వం అలాంటి కార్యకలాపాలకు ఫోంజీ స్కీమ్ అని నామకరణం చేసింది. 1940లో డిస్నీ వారు ఒక సినిమా తీశారండోయ్. దాంట్లో పినోకియో అని ఒక కుర్రాడుంటాడు. వాడు అబద్దం చెప్పి నప్పుడల్లా వాడి ముక్కు కొంచెం పెరుగుతూ ఉంటుంది. భలేగా ఉందికదూ.
1997లో 'లయ్యర్, లయ్యర్' అన్న సినిమా వచ్చింది. కామెడీ.. జిమ్ క్యారీ అందులో ప్రధాన పాత్ర పోషించాడు. అందులో ఒక కుర్రవాడు వాళ్ల లాయర్ నాన్నను 24 గంటల పాటు అబద్ధాలు చెప్పొద్దంటాడు. సదరు లాయరు ఆ క్రమంలో ఎన్ని అగచాట్లు పడ్డాడన్నదే సినిమా.
మనోళ్లేం తక్కువ తినలేదులెండి! వంశీ దర్శకత్వంలో 'ఏప్రిల్ 1వ తేదీ విడుదల' అన్న సినిమా వచ్చింది. ఎమ్ కిషన్ అన్న రచయిత రాసిన నవల 'హరిశ్చంద్రుడు అబద్ధమాడితే?' ఆధారంగా దీన్ని తీశారట. ఇలాంటి పాత్రలను అవలీలగా పోషించే హాస్య నట కిరీటి మన రాజేంద్రప్రసాద్ హీరో. శోభన హీరోయిన్. వంశీ సినిమాలన్నింటి లాగే, దీంట్లో చక్కని పాటలున్నాయి. ఇళయరాజా దీనికి సంగీత దర్శకుడు. దీనికి రచనా సహకారం కోలపల్లి ఈశ్వర్, తర్వాత గొప్ప హాస్య నటుడైన కృష్ణభగవాన్ అందించారు. మరో హాస్య నటుడు ఎల్బి శ్రీరామ్ మాటలు.
రాజేంద్ర ప్రసాద్ శోభనను ప్రేమిస్తాడు. అతడిని పెళ్ళాడటానికి ఆమె పెట్టిన షరతు, అతడు ఒక నెలపాటు అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా ఉండాలి! అలా అగ్రిమెంటు ఒకటి పైగా. ఇక దాని పరిణామాలే సినిమా. చక్కని సందేశాన్ని హాస్యంతో మేళవించాడు వంశీ. ఇక రాజకపూర్ 'శ్రీ 420' (1955) కూడా అలాంటి సినిమాయే ఇంచుమించు. డబ్బుసంపాదన కోసం ఎన్నో అబద్ధాలు, మోసాలు చేస్తాడు హీరో. 420 అనేది ఇండియన్ పీనల్ కోడ్‍లో, మోసాలకు సంబంధించిన సెక్షన్. దానికి శ్రీ తగిలించి వ్యంగ్యాన్ని పండించారు.
మన సత్య హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అయినా అబద్ధం చెప్పలేదు. అందుకే ఏ పురాణ పురుషునికీ లేని 'సత్య' అన్న బిరుదు ఆయనకు ఇచ్చాం. సత్య ధర్మరాజు, సత్య శిబి, సత్య రంతిదేవుడు... అని అనలేదే?

 


అబద్ధం చెప్పేటప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయట. వీటి ఆధారం గానే లై డిటెక్టర్ పని చేస్తుంది. 'మాయాబజార్‍'లో ఆనాడే సాత్యకి దీన్ని ఉపయోగించి శకుని మామ బండారం బట్టబయలు చేశాడు.
శకుంతల దుష్యంతుడు తనను తిరస్కరించినప్పుడు సత్యం యొక్క గొప్పదనాన్ని అతనికి ఇలా చెబుతుంది.
కంః
వెలయంగ నశ్వమేధం
బులువేయును నొక్క సత్యమును నిరుగడలన్
తుల నిడి తూపగ సత్యము
వలననములు సూపు గౌరవంబున బేర్మిన్
వెయ్యి అశ్వమేధ యాగాల ఫలం ఒక వైపు, ఒక్క నిజాన్ని ఒక వైపు పెట్టి త్రాసులో తూస్తే, ముల్లు నిజం వైపే మొగ్గుతుందట.
శుక్రనీతి కొన్ని మినహాయింపులిచ్చింది.
కం:
వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు నఘము పొందరధిప!
ఆ మాత్రం సందిస్తే మన వాళ్ళు అల్లుకుపోరూ? అయినా అబద్ధాలాడి బతికే బతుకు అదీ ఒక బతుకేనా చెప్పండి! నిజం చెబితే వచ్చే నిబ్బరం, దబ్బర (అబద్ధం) చెబితే రాదు, రాదంతే... అదన్నమాట!

No comments:

Post a Comment