Saturday, June 15, 2024

సెల్‍తో సేల్స్ - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 16 జూన్ 2024

మొన్నా మధ్య మా వనస్థలిపురంలో ఒక 'పూజా స్టోర్సు’కి వెళ్లాను. దీపారాధన నూనె, వత్తులు వగైరా కొందామని. అందులో విశేషమేముంది? అంటున్నారా? ఉందుంది... అదే ఈ వ్యాసానికి మూలం. కౌంటరుకి అటువైపు ఒక మధ్య వయసు మహిళ కూర్చుని మన అష్టమ వ్యసన సాధకమైన స్మార్ట్ ఫోన్‌ను కెలుకుతూ, చిరునవ్వులు చిందించుకుంటూ 'సెల్ వశ్యం'లో ఉంది. అదేమిటి అంటారా? పారవశ్యంలాగ ఇటీవల 'సెల్ వశ్యం' అని వచ్చిందిలెండి. దాన్ని పొందినవారికి ఇహలోక చింతన ఉండదు... అంటే ఆధ్యాత్మికత అనుకునేరు! శాంతం పాపం! శాంతం పాపం!
'అమ్మా! దీపారాధన నూనె' అంటూ కావ్య ప్రస్తావన చేశాను. ఆమెకు నా పిలుపు వినబడలేదు. తలెత్తి చూడలేదు. కనీసం రక్తమాంసయుతమైన ఒక మానవజీవి (అంటే నేనేనండీ బాబు) అక్కడ నిలబడినట్లు కూడా ఆ సెల్మణి (సెల్వమణి కాదు) గ్రహించలేదు. సరే అనుకొని ఇంకో షాపుకెళ్లాను.
కొందరు షాపులవాళ్లు కొంచెం బెటరండోయ్! ఫోన్లోంచి తలెత్తి చూసి మనం అడిగినది వాళ్ల షాపులో లేదని చెప్పేస్తారు. ఉందంటే ఫోన్ ఆపి ఇవ్వాల్సివస్తుంది కదా!
ఇక ఆటో వాళ్లయితే, స్టార్టయినప్పటినుంచి మనల్ని దింపేంత వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. 'హ్యాండ్స్ ఫ్రీ' గా ఉండేలా ఇయర్ ఫోన్స్‌ని తగిలించుకుంటే కొంత నయం. కానీ కొందరు చిరంజీవులు చెవికి భుజానికి మధ్య ఆ మహత్తర సాధనాన్ని నొక్కిపట్టి, సంభాషణ సాగిస్తుంటారు. పైగా అతివేగం. వెనుక కూర్చున్న నాలాంటి అర్భకులకు గుండెలు దడదడలాడు తుంటాయి. ఒక్కోసారి జీపీఎస్ సరిగ్గా గమనించకుండా దారితప్పిన సందర్భాలూ లేకపోలేదు.

 


 ఇంకో సాయంత్రం, పునుగులో బజ్జీలో తిందామని వెళ్లాను. ఒక చేత్తో ఫోన్‌లో చూస్తూ, మరొక చేత్తో పునుగులు వేస్తున్నాడో నలభీముడు! అవి పూర్తిగా రోస్ట్ అయి, వడియాలుగా మారాయి. ప్లేటులో నాకు కొన్ని పునుగులు వేసి ఇచ్చిందో అమ్మాయి. ఎంత మంచిదో... బంగారుతల్లి! ఎందుకంటున్నానంటే ఆమె వద్ద సెల్ ఫోన్ లేదు. కౌంటరు దగ్గర టోకెన్లు జారీ చేస్తున్న యజమానుల వారికి పునుగుల రూపురేఖలను గురించి సవినయముగా విన్నవించుకున్నా. ఆయన నలభీముడిని మందలించాడు. ఆ యువకిశోరం నిర్లక్ష్యంగా నవ్వేశాడంతే! ఆ నవ్వులో 'నేనింతే' అనే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందంటే నమ్మండి. యజమానులవారు ఇలా సెలవిచ్చారు - 'ఇయ్యాల్రేపు వర్కర్లు దొరుకుతలేరు సార్, మస్తు పరేశాన్ చేస్తున్రు, గా ప్లేట్లు పక్కన బెట్టుండ్రి, మంచిగ ఎయ్యిపిస్త!'. దటీజ్ ది స్పిరిట్! ఏ నైస్ గై! గై అంటే ఫ్రెంచి భాషలో 'వాడు' అని అర్థమని మీలాంటివారే చెప్పారు. నైస్ గై అంటే మంచివాడు. ఫూలిష్ గై అంటే తెలివి తక్కువవాడు (అంటే నేనేనా కొంపదీసి). ఇప్పుడు యువభారత పౌరులు 'హాయ్ గైస్' అని పలకరించుకుంటుంటారు. 2023లో ఒక జాతీయ సంస్థ 'ఎఫెక్ట్ ఆఫ్ సెల్ ఫోన్ ఆన్ రిటయిల్ సేల్స్' (ఈసీఆర్‌ఎస్) అనే ఒక సమగ్ర సర్వే నిర్వహించిందట. దాని ప్రకారం సెల్ ఫోన్ వాడకం వల్ల రిటైల్ అమ్మకాల్లో 30శాతం క్షీణత నమోదు అయ్యిందట. ఏమిటి నవ్వుతున్నారు? 'నమ్ము, నమ్మకపో' శీర్షికన పేపర్లలో... అదేదో సినిమాలో పి.ఎల్. నారాయణ అన్నట్లు పెద్దక్షరాల్లో వేశారు. తమిళంలో సొల్లు అంటే మాట. మాట్లాడటం... అని మంచి అర్థమే ఉంది. కానీ తెలుగులో 'సొల్లు కబుర్లు' అంటే పనికిమాలిన మాటలనే అర్థంతో వాడుతుంటారు. ఈ 'సొల్లు' అనే పదానికి 'సెల్లు' అనే పదానికి ఏమయినా సంబంధం ఉండొచ్చు నంటారా? ఒకసారి సీరియస్‍గా ఆలోచిద్దురూ!'సెల్‌తో సేల్స్' ని కాసేపలా పక్కన పెడితే, సెల్ ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ వంట చేసే వనితామణులు భారతావనిలో ఉన్నారు. ఇంటికి వచ్చిన అతిథులు, ఇంటివాళ్లు ఎవరి సెల్‌లో వాళ్లు తలదూర్చి, వీళ్లెందుకు ఆహ్వానించారో, వాళ్లెందుకు వచ్చారో మరచి సెల్ వశ్యంలో మునిగిపోతుంటారు.
కొంతకాలం కిందటి వరకు (గుడ్ ఓల్డ్ డేస్) రైల్లో, బస్సులో తోటి ప్రయాణీకులతో 'మీరెంత దాకా'తో ప్రారంభించి, కుటుంబవిషయాలను కలబోసుకునే వరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడంత సీనేదీ? పలకరించినా ఎవరూ పలకరు. పైగా మనం తీవ్రవాదులమేమో అన్నట్లు అనుమానంగా చూడటం! ఏతావాతా (దీనికర్థం నాకు తెలియదు) చెప్పొచ్చేదేమిటంటే సెల్ ఫోన్ మన వ్యాపారాలకే ముప్పు తెచ్చేది, మన నిత్య జీవితాన్ని నిర్వీర్యం చేసేది కాకూడదని నా మనవి. అంతేగానీ, ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. అదన్న మాట.

1 comment: