Saturday, August 3, 2024

పెంపకాల ఇంపులు - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 04 ఆగస్టు 2024

 మొన్నా మధ్య ముఖపుస్తకంలో, అదేనండి బాబూ, ఫేస్‌బుక్‍లో ఒక పోస్టు చూశాను. నాకు అది తెగ నచ్చేసింది. మీరు కూడా మెచ్చుకుంటారని మీకు చెబుతున్నా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచినట్టు, మీరు మీ పిల్లలను పెంచాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఆ ప్రపంచం ఇప్పుడు లేదు కనుక, ఎంత నిజం! జనరేషన్ గ్యాప్ అనేదుంది చూశారూ, అదో తప్పనిసరి వ్యవహారమండీ మాస్టారు.
మా చిన్నప్పుడు, ఒక రకంగా గాలికి పెరిగాం. మా అమ్మా, నాన్నా మమ్మల్ని పట్టించుకునేవారు కారు. ఎక్కువ మందిమి. కిలోన్నర బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే, నాక్కావాలి, నాక్కావాలని కొట్టుకునే వాళ్ళం. మా అమ్మకు మిగిలేది కాదు. మా నాన్న విసుక్కునే వాడు - 'కంచాల్లో కుంభాలు తోడితే గాని చాలదు ఈ వెధవలకు'. ఇదంతా మా అన్నదమ్ముల మీదే. ఆడపిల్లలనేమీ అనేవాడు కాదాయన. మా అమ్మ మాత్రం "నా కుందిలెండి" అనేది నవ్వుతూ. ఉందో, లేదో ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలకు ఉప్మా పెడితే తింటారా? స్విగ్వీలో బర్గర్ కావాలంటారు.
కానీ ఇంటికి వచ్చిన వాళ్లకు నమస్కరించడం, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు చెంబుతో తెచ్చిచ్చి, తుడుచుకోవడానికి కాశీ తువ్వాలు ఇవ్వడం... ఇలాంటివి మాకు నేర్పారు. "ఒరేయ్ చిన్నోడా! పెదనాన్నకు నీకొచ్చిన పద్యం ఒకటి చెప్పు" అని అమ్మ చెబితే, మా తమ్ముడు నాలుగేళ్ల వెధవ, వెంటనే 'శ్రీరాముని దయచేతను నారూఢిగా
సకల జనులు ఔరా యనగా' అంటూ జంకూ గొంకూ లేకుండా పద్యం చదివేవాడు. చదివి మా నాన్న వైపు చూసేవాడు భయంగా. సదరు పెదనాన్న, "భేష్ గట్టివాడవురా భడవా.." అని మెచ్చుకుంటే, సిగ్గుపడి, మా అమ్మ చీరకుచ్చెళ్ల వెనుక దాక్కునే వాడు.
మరి ఇప్పుడో? చెంబులూ లేవు, కాళ్లు కడుక్కోవడాలూ లేవు, "మున్నీ, అంకుల్‍కు వైఫై కనెక్టుచేసి ఇవ్వు, బేబీ! చార్జింగ్ పెట్టివ్వాలేమో అడుగు" అని చెబుతున్నారు ఇప్పటి మమ్మీలు, డాడీలు. ఆధునిక అతిధి సత్కారం ఇదే మరి.
పిల్లలను పెంచడం ఆషామాషీ వ్యవహారం కాదు బాబోయ్! ఆషామాషీ ఏమిటని అడక్కండి. నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి! సైకాలజిస్టు డయానా బామ్రిండ్ గారు పిల్లల పెంపకంలో మూడు పద్దతులను సెలవిచ్చారు. అవి 1) అథారిటేటివ్ పేరెంటింగ్ 2) అథారిటేరియన్ పేరెంటింగ్ 3) పర్మిసివ్ పేరెంటింగ్. మొదటిది పిల్లలకు సంయమనంతో ప్రేమగా చెప్పి ఒప్పించడం, పిల్లల మనోభావాలను గుర్తించడం, రెండవది ఒక రకంగా నియంతృత్వం. కఠినమైన క్రమశిక్షణను వారిపై రుద్ది, తల్లిదండ్రులంటేనే భయపడేలా ప్రవర్తించడం, దీనినే 'వర్జీనియా వూల్ఫ్ 'పేరంటల్ టైరనీ' అని చెప్పారు. 'తల్లిదండ్రుల దుర్మార్గం' అని అనువదించవచ్చు. ముప్పాళ్ళ రంగనాయకమ్మగారైతే 'దొంగ తల్లిదండ్రులున్నారు జాగ్రత్త!' అని నవలే రాసేశారు ఏకంగా. అటువంటి తల్లితండ్రులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతాం. ఉంటారు సుమండీ! కానీ, చాలా తక్కువ మంది ఉంటారు. తల్లిదండ్రుల గొప్పదనాన్ని సూచించే ఎన్నో కొటేషన్లు మనకున్నాయి. కానీ, ఒకటి గుర్తుంచుకోవాలి. 


వాళ్ళూ మనుషులే. బలహీనతలు వారికీ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తలు నిత్యం పోట్లాడుకుంటుంటే దాని ప్రభావం పిల్లలపై ఉండదా చెప్పండి? నాన్న వ్యసనపరుడైతే పిల్లలు సరిగ్గా పెరగరు. 'ఆవు చేనిలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?' 'యథా మాతా పితా, తధా సుతాః' పిల్లలను కొట్టడం అసలు పెంపకమే కాదు!
ఇక మూడవది పర్మిసివ్ పేరెంటింగ్. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. మన అభిరుచులు వారిపై రుద్దకూడదు. వాడు చక్కని సంగీతవేత్త కావాలనుకుంటే మనం పట్టుబట్టి నారాయణ ఐఐటి అకాడమీలో చేర్పించకూడదు. పిల్లలతో మంచి సాహిత్యం చదివించాలి. గరిపెల్లి అశోక్, ఆర్.సి. కృష్ణస్వామి రాజు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, వేంపల్లె షరీఫ్, కూచిమంచి నాగేంద్ర గారల వంటి రచయితలు ఎంతో మంది పిల్లల కోసం పుస్తకాలు రాశారు. అప్పుడు చంద్రమామ పత్రిక అన్ని భారతీయ భాషల్లో వెలువడేది (ఇంచుమించు). ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చి చదివే అలవాటును మింగేసింది.
సాందీపని మహర్షి, కృష్ణునికి, కుచేలునికీ, బలరామునికి చదువు నేర్పాడు. ఆయన ఆశ్రమం ఇప్పటికీ ఉజ్జయినిలో ఉంది. పిల్లలను గురుకులాల్లో పెట్టి చదివించడం ఏనాటి నుంచో ఉంది. ప్రహ్లాదుని గురువులు చండా మార్కులు. హిరణ్యకశిపునికి పాపం పేరెంటింగ్ తెలియక, వారి దగ్గరకు పంపితే, ప్రహ్లాదుడు వారికీ కొరకరాని కొయ్య అవుతాడు. అందరూ శ్రీరామునిలా తండ్రి మాట వింటారా? ఇప్పుడు పిల్లలకు ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువ. ఐక్యూ కూడా ఎక్కువే. దానికి తగ్గట్టు వాళ్ళను తీర్చిదిద్ద కపోతే... డేంజర్. మా మనవడు ఏడేళ్ళ వాడు నన్నడిగాడు... "తాతా! నీకు స్కూల్ లేదు. హోం వర్క్ లేదు కదా, ఎప్పుడూ రాసుకుంటూ ఉంటావెందుకు?" అని. నేను నిస్సహాయంగా చూశాను. మా కోడలన్నది "తాత, నాన్న లాగ వర్క్ ఫ్రం హోం చేస్తారురా". అది వాడికి తెలుసు, అదన్నమాట!

1 comment:

  1. Permissive parenting చాలా కుటుంబాల్లో మెల్లమెల్లగా చోటు చేసుకుంటుంది ఒకనాటి అథారిటేటివ్ పేరెంటing ఇప్పుడు చాలా తగ్గిపోయింది పేరేంటఇంగ్ పై చిన్నచురకవేస్తు చక్కగా చెప్పావు

    ReplyDelete