Sunday, September 15, 2024

పదార్థాలు - పదాల అర్థాలు - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 15 సెప్టెంబర్ 2024

తెలుగు భాష చాలా పురాతనమైనది, గొప్పది. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న పదాలలో సింహ భాగం సంస్కృత పదాలే. అన్నట్లు, సింహభాగం అన్న పదం కూడా సంస్కృతమేనండోయ్. విశేషం, విచిత్రం ఏమిటంటే, మనకు సంస్కృత పదాలతో ఉన్నంత సాన్నిహిత్యం, తెలుగు పదాలతో లేదు. నా ఉద్దేశ్యం, అచ్చ తెలుగు పదాలతో!
'పదార్థం' అంటే ఒక వస్తువు, దినుసు కావచ్చు (Substance). పదానికి అర్థం కూడ. మనం కొన్ని పదాలను, ప్రఖ్యాత కవులు ఉపయోగించినవి, వాటి అర్థం తెలియకుండానే విని, పాడి, ఆనందిస్తుంటాం! "అజ్ఞానమే ఆనందం" అన్నారు. Robert Lyndon అనే రచయిత Pleasure of Ignorance అనే వ్యాసమే రాశాడు. తెలియకపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమిటి? అని మీరు అనుకోవచ్చు. నష్టం ఏమీ లేదు, భాషకు! పదం అర్థాన్ని తెలుసుకుంటే వచ్చే ఆనందం వేరు!
'భక్త తుకారాం' సినిమాలో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గొప్ప పాట రాశారు. "ఘనాఘన సుందరా!". ఈ పాట తెలియనివారెవరు? పాటల పోటీలలో ఎక్కువగా పాడుతుంటారు. సరే, బాగానే ఉంది, 'ఘనా' అంటే ఏమిటని చాలామందిని అడిగాను. తెలియదని ఎవరూ అనలేదు. “చాలా గొప్ప” అని చెప్పారు. కానీ, “ఘనాఘనము" అంటే మేఘం. అది సంస్కృత పదం. మేఘం వలె సుందరుడని కవి భావం.
పోతన గారు, 'శారద నీరదేందు ఘనసార పటీర' అన్న ప్రసిద్ధ పద్యం రాశారు. 'శారద' అంటే శరదృతువు. 'నీరద' అంటే 'మేఘం' మరి 'ఘనసారం?' 'గొప్పసారం కలది' అని కాదు. ఘనసారం అంటే కర్పూరమండీ బాబు!
'నేటిభారతం' సినిమాలో "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో...." అనే పాట ఉంటుంది. గొప్ప పాట. దీనిని వేటూరి సుందరరామమూర్తి గారు వ్రాశారు. అందులో 'మరో మహాభారతం', 'ఆరవ వేదం' అంటారు వేటూరి. 'ఆరవ వేదం' అంటే ఏమిటబ్బా..! మొత్తం నాలుగు వేదాలు. అవి మనకు తెలుసు. మహాభారతాన్ని 'పంచమవేదం' అంటారు. వేటూరి గారిది 'మరో' మహాభారతం. అందుకే 'ఆరవ వేదం'. 


 తెలుగు పదాలు స్థూలంగా ఐదు రకాలు మాస్టారు.
1) తత్సమాలు: అంటే, సంస్కృత పదానికి 'డూ, మూ, వూ, లూ' చేరి తెలుగు పదాలై కూర్చుంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్! రామః రాముడు, ధేనుః ధేనువు, కార్యః కార్యము, శాస్త్రాః శాస్త్రాలు. అలా అని అన్ని చేయడం కుదరదు మిత్రమా!
2) తత్భవాలు: సంస్కృత, ప్రాకృత భాషలలో నుండి కొంచెం మార్పుతో ఏర్పడతాయి. తామరసం: తామర, దేవ, దేవర, రథం, రదము, యజ్ఞం, జన్నము.
3) దేశ్యములు: తెలుగు వారి స్వంత పదాలు: ఊరు, పేరు, చెట్టు, పుట్ట, తల్లి, తండ్రి.
4) అన్యదేశ్యములు: ఇతర భాషల నుండి వచ్చినవి. రోడ్డు, కారు, టికెట్టు, బస్సు, రైలు, దస్తావేజు, పరవా (పరవాలేదు అంటాం గాని, పరవా ఉంది అనం ఎందుకో), రైలు అంటే అసలు 'పట్టా' అని అర్థం. రైల్వే, పట్టాలదారి.
5) గ్రామ్యములు: వ్యాకరణం లెక్క లోకి రావు కాని ప్రజలు సహజంగా మాట్లాడే మాటలు. మాండలీకాల్లో (యాసల్లో) ఉంటాయి. చూస్తిమి, లెగు, కూకో, జిమ్మడ.. జిమ్మ అంటే జిహ్వ. నీ నాలుక పడిపోను! అని అర్థం. బాబోయ్! తెలుగు, తెనుగు, ఆంధ్రము అన్నీ ఒకటే. అచ్చ తెలుగు పదాలతోనే పేచీ! గురువు అంటే అందరికీ తెలుసు “ఒజ్జ' అంటే ఏమోనబ్బా! గురువు! అది అచ్చ తెనుగు. అన్నమయ్య కొన్ని పదాలను వేరే అర్థంలో వాడతాడు. "నగుమోము గనలేని నా 'జాలి' తెలిసీ” అన్న కీర్తనలో 'జాలి' అంటే ఆయన లెక్క ప్రకారం 'నిస్సహాయత'. అలా ఎలా? అంటే, 'నిరంకుశాః కవయః' అన్నారు. కవులకా స్వతంత్రం ఉంది మరి. నన్నయ గారి కవిత్వం అంతా తత్సములే. తిక్కన్న గారి కవిత్వంలో అచ్చ తెలుగు పదాలెక్కువ.
అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత నిజరూపాల్లో విరాటుని కొలువుకు పాండవులు బయలుదేరుతున్నారు. అప్పుడాయన, “వేడ్క తొడి, పూసి, కట్టి" అంటారు. అర్థమైంది కద! అన్నమయ్య గారు ఒగి, వెక్కసపు అవ్వల, ఇవ్వల, నడుమ, తుది (ఎరుక తుది: జ్ఞానానికి పరాకాష్ట) ఇలాంటి పదాలు వాడతారు. అన్నీ అచ్చ తెలుగే. “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాలో “ఎకిమీడా” అన్న పాట ఉంది. దాన్ని సిరివెన్నెల రాశారు. ఎకిమీడు అంటే ప్రియుడు, చెలికాడు అని అర్థం. పూర్తిగా అచ్చ తెలుగులో మాట్లాడితే.." ఇది చాల యక్కరం, వడారం ఆణియ పదాలనే వాడవలె. లేదా మన నుడి చచ్చును." (వడారం: కేవలం, ఆణియ: తెలుగు, నుడి: భాష) ఎలా ఉంది మహాశయా? 'అచ్చ' అంటే 'అసలైన' అని. ‘టూకీగా', 'భేషుగ్గా', 'శభాష్', ‘లగాయతు', 'బేకారు', 'నిఖార్సయిన'... ఇవన్నీ తెలుగు పదాలేనంటారా? త్వరలో పుస్తక ప్రదర్శన “షురూ!" ఇది ఉర్దూ. భాష ఒక సముద్రం. ఎన్నో ఇతర భాషల నదులను తనలో కలిపేసుకుని 'తొణక్కుండా' ఉంటుంది. అదన్నమాట!

No comments:

Post a Comment