Saturday, September 21, 2024

కారాలు - మిరియాలు! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 22 సెప్టెంబర్ 2024

'కారాలు-మిరియాలు' అంటే మీకు తెలుసు కదా! చాలా కోపంగా ఉండటమని. దానికీ ఈ శీర్షికకూ సంబంధం లేదండి మాస్టారు! ‘మరెందుకు పెట్టావు?' అంటే... నేను చెప్పే కారాలు వేరండీ! మనకు త్రీమేంగోస్ కారం, స్వస్తిక్ కారం, ఆశీర్వాద్ కారం, ఎం.టీ.ఆర్. కారం... ఇలా బోలెడు కారం పొడులు తెలుసు. కానీ నేనివాళ చెప్పదలచుకొన్నది వాటి గురించి కాదు! పాయింటుకు రావయ్యా... అంటున్నారా? వస్తున్నా!
జీవితంలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి రెండు కారాలు. ఒకటి అహంకారం, రెండు మమకారం. అహంకారానికి తమ్ముళ్ళే గర్వం, పొగరు, స్వాతిశయం, వగైరా! సరే, మమకారంతో మనకేం ఇబ్బంది? అంటే ఉంది!
'అహం' అంటే సంస్కృతంలో 'నేను'కు సంబంధించిన తత్త్వమే 'అహంకారం'. ఈ 'నేను' అనేదుంది చూశారూ, అన్ని అనర్థాలకూ అదే మూలం. అది మనిషిని ఎదగనివ్వదు సరికదా, ఆలోచించనివ్వదు. ఇతరులను గౌరవించనివ్వదు. ఇంగ్లీషులో దీన్ని 'ఇగో' అంటారు. ఇది 'ఐ' అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఈ పదాన్ని ఇంగ్లీషు పదాలలో మొదట చేర్చినవాడు, మనస్తత్వ శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అహంకారం కేవలం ధనవంతులకు, సెలబ్రిటీలకు ఉంటుందనుకుంటే మనం 'సూపు'లో కాలేసినట్టే. దానికి క్యాడర్, స్టేటస్, వెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనితో సంబంధం లేదు. అడుక్కునే వాళ్ళల్లో కూడ అంతరాలుంటాయండోయ్! ఇప్పుడు బిచ్చగాళ్ళు టెన్ రుపీస్ అన్నా ధర్మం చేయకపోతే మనల్ని లోకువగా చూస్తారు. ఆ మధ్య ఒక జోక్! 'చిల్లర లేదు' అని ధర్మం చేసేవాడంటే, “ఫోన్ పే చేయండి సార్! లేదా కార్డు స్వైప్ చేయండి అదీ ఉంది నాకాడ" అన్నాడట స్వీకరించే మహానుభావుడు. ఆ స్థాయిలో అడుక్కునేవాడుంటే వాడికి ఆ మాత్రం అహంకారముండదా చెప్పండి!
'బ్రహ్మ కుమారీస్' వారు ఇలా అంటారు - "అహంకారం కంటే దృఢత్వాన్ని ఎంచుకోవడంతో, సామరస్యంగా వ్యవహరించడంతో అందరూ మీతో కలిసి ఉండడానికి, మరియు మీతో పనిచేయడానికి సౌకర్యంగా ఉంటారు. మీరు వారిని గౌరవిస్తారు కాబట్టి, వారు మిమ్మల్ని గౌరవిస్తారు!” ఎంత నిజం..? పరస్పర గౌరవాభిమానాలే ప్రపంచాన్ని సజావుగా నడిపిస్తాయి గాని, అహంకారాలు కాదు.
ఈ అహంకారాలు చిత్రంగా ఉంటాయి. ఒక బిచ్చగాడు ఒక ఇంటివద్ద నుంచి, నిరాశగా వస్తున్నాడు. ఆ యింట్లో అత్తాకోడళ్ళున్నారు. అత్త గుడినుంచి వస్తూ అతన్ని చూసి, "ఏం అబ్బాయి? మా ఇంటినుంచేనా?" అంది.
“అవునమ్మగారు. మీ కోడలు గారు బిచ్చం వెయ్యలేదు”
“అదెవరు అలా చెప్పడానికి? రా నా వెంట" అని వాడిని తనతో తీసుకుని వెళ్ళి, గుమ్మంలో నిలబడి “ఆ! ఇప్పుడు వెళ్ళు! బిచ్చం లేదు!" అన్నదట ఆ మహాతల్లి! ఏ నిర్ణయమైనా తనే తీసుకోవాలన్నమాట! దీన్నే 'కారం' అనాలో మరి.
'మమకారం' కూడా ఇంచుమించు అలాంటిదే గాని, కొంచెం తక్కువ ప్రమాదకరం! కొడుకులను, కూతుళ్ళను తమ రంగంలో వారసులను చెయ్యాలని అందరూ తహతహలాడతారు, సదరు సంతానానికి టాలెంటు ఉన్నా, లేకపోయినా! అలా మన నెత్తి మీద రుద్దబడిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. మితిమీరిన ప్రేమతో, అతి గారాబంతో పిల్లలను పాడు చేసే వాళ్ళు లేరా చెప్పండి? వేదాంతంలో ఈ మమకారానికి లోతైన అర్థం వుంది. 'మమత్వం' అంటారు దీన్ని వేదాంతులు. 'మమ' అంటే సంస్కృతంలో 'నా యొక్క' అని అర్థం. 'నమమ' 'నమమ' అంటాయి శృతులు. 'నాది కాదు' అని అర్థం. పురోహితులు ఏదైనా పూజ లేదా క్రతువు చేయించేటప్పుడు, కర్తను 'మమ' అనుకోమంటారు. సంకల్పఫలితం దానివల్ల వస్తుంది. “ఏదో మమ అనిపించుకుని వెళితే బాగుంటుంది” అంటుంటారు. ఫార్మాలిటీ!
అహంకార మమకారాలను విసర్జించడం కేవలం యోగులకే సాధ్యం అంటారు కాని, సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉండి నిరహంకారులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. డా. దివాకర్ల వెంకటావధాని గారి వినయశీలాన్ని నేను స్వయంగా చూశాను.
అబ్దుల్ కలాం గారు, కర్పూరీ ఠాకూర్, లాల్ బహదూర్ శాస్త్రి గారు, త్రిపుర సి.ఎం. మానిక్ సర్కార్ గారలు, ఇలా ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!
'ధిషణాహంకారం' కొందరికి శోభనిస్తుంది. నిజంగా ‘ధిషణ' ఉన్నప్పుడే సుమండీ. కవిసమ్రాట్ విశ్వనాథ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. వారి 'అహంకారం' వారికి సహజాలంకారం. ఏ గొప్పా లేకపోయినా అహంకారాన్ని ప్రదర్శిస్తారు కొందరు. వారిని చూస్తే నాకు కోపం రాదు. జాలేస్తుంది.



నానేతంతానంతే బావూ... అహంకారాన్ని, మమకారాన్ని విడిచిపెట్టేంత గొప్పవాళ్ళం మనం కాదు గానీ, ఎదుటి వారిని కించపర్చకుండా ఉంటే చాలు. అహంకారం కంటే 'స్వోత్కర్ష' మనకు వినోదాన్ని కలిగిస్తుంది. విజయం వల్ల వినయం రావాలి గాని, గర్వం రాకూడదు సార్!
అహమున జిక్కిన మనుజులు
బహుపూజ ఫలితమెల్ల బూదినిగలయున్
ఇహపరముల జెడిపోదురు
మహనీయతనందబోరు
మహిలో సత్యా!
అన్నారొక కవి.
అదన్నమాట!

1 comment:

  1. స్వోత్కర్ష,అహంకారాలు మధ్య చిన్నలైన్ వుంది. చక్కగా అవిష్క రించావు

    ReplyDelete