Thursday, March 20, 2025

మైట్యూబ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

నాకెందుకో, యూట్యూబ్‌కు మైట్యూబ్ అని పేరు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మిత్రమా! ఎందుకంటే ఎవరయినా సరే, ఒక ఛానెల్ పెట్టి, తమకు తెలిసింది. తెలియనిదీ చెప్పి, ఊదరకొట్టేయొచ్చు. నాకు కొంతమంది, “మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేయొచ్చు కదా!” అని ఒక అయాచిత, ఉచిత సలహా పారేస్తుంటారు. ఉచితాలు మంచివి కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టే హితవు చెప్పినా వాళ్లు వినరే! ఖర్చు లేని పని గదా! అప్పుడు, ఎవరో పంపిన ఒక జోక్ నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు, “పెద్దయ్యాక, నీవేమవుతావురా?” అని అడిగితే, “ఇంజనీరు అవుతా, లేదా డాక్టర్‌ను అవుతా, లేదా కలెక్టర్‌ను అవుతా” అని చెప్పేవాడట. తీరా పెద్దయ్యక “వెల్‍కమ్ టు మై యూట్యూబ్ ఛానెల్ ‘ఊకదంపుడు!’ లైక్! కామెంట్! అండ్ సబ్‌స్క్రైబ్!” అంటూ తయారయ్యాడట!
ఈమధ్య సొంతంగా యాట్యూబ్ ఛానెల్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. పవన్ అన్న చెప్పినట్లు, ‘ట్రెండ్ సృష్టించడమే గాని, ఫాలో అవను’ అన్నది ఈ సోకాల్డ్ యూట్యూబర్లకు వర్తించదు. ‘బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్!’ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది లెండి. అంటే ఎవడి తప్పెట (డబ్బా!) వాడు మోగించుకోవడం. మైట్యూబర్లు, సారీ. యూట్యూబర్లు చెప్పేదానికి, చూపేదానికి ఫలానా ప్రమాణం అంటూ ఏవీ ఉండనవసరం లేదు సోదరా! మనకు వచ్చింది, నచ్చింది, చెప్పేయవచ్చు.
యూట్యూబర్‍లలో చాలామంది వాడే ఊతపదం ‘ఐతే’. ప్రతి వాక్యంలో కనీసం నాలుగైదు ఐతేలు ఉంటేగాని వారికి నోరు పెగలదు మరి. మా ఉద్యోగ పెన్షనర్ల ఛానెల్స్ బోలెడు. ‘ఐ.ఆర్, డి.ఎ.లపై సంచలన ప్రకటన! ఉద్యోగ పెన్షనర్లు సంబురాలు!’ అని పైన ఉంటుంది. ఓపన్ చేస్తే, దాన్ని ప్రకటించింది. యూనియన్ వాళ్లు! విసుగొచ్చి మావాళ్లు అవి చూడడం మానేశారంటే నమ్మండి!
‘పద్యవీణ’ అని చానెల్ పెడతాడొక శాల్తీ. ఆయనకు పద్యం రాగయుక్తంగా చదవడం రాదు. వివరణ ఎంత ఘోరంగా ఉంటుందంటే, “ఆకాశవాణి! అల్లాటప్పా కేంద్రం! వార్తలు చదువుతున్నది వెంగళప్ప!” లెవెల్లో సాగుతుంది. ఇంకో ఆయన తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రముఖ నటులు ఉన్న సన్నివేశాన్ని చూపుతూ, సౌండ్ మ్యూట్ చేసి, ఈయన ఆ పద్యాలను పాడుతుంటాడు. ఎంత స్ట్రాటజీయో చూడండి! యన్టీఆర్‌ను, యస్వీఆర్‌ను చూడ్డం ఎవరికైనా ఇష్టమే కదా! కాని అక్కడ పాడుతున్నది ఘంటసాలవారు కాదు, మైట్యూబర్!
ఇంకొకాయన, మార్కర్ పెన్‌తో డిస్ ప్లే బోర్డు మీద రాస్తూ, కొట్టేస్తూ, తుడుపుతూ నానా పాట్లు పడుతుంటాడు వివరిస్తూ! పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్నమాట! దాంట్లో పవరూ ఉండదు, పాయింటూ ఉండదు! నీరస నిస్సార ప్రెజెంటేషన్ మాత్రం ఉంటుంది.



ఇంతకు ముందు టి.వి. ఛానళ్లలో డిబేట్లలో పాల్గొనే సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొందరు, ‘మైట్యూబర్స్’ అవతారమెత్తారు. ఏదో ఒక పార్టీకి విధేయులే. కాని చాకచక్యంగా దానికి ‘నిస్పక్షపాత పూత’ పూస్తారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ సి.ఎం.కు ఇంకా ప్రజాదరణ వెల్లువెత్తుతోందని వాదిస్తారు. ఈ పొలిటికల్ లాయల్టీస్ మనలాంటి అజ్ఞానులను తికమకపెడతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్న సూత్రం వీరికి కరెక్ట్‌గా సరిపోతుంది. కాని వారి ‘భావం’ మనకు ‘భవతి’ ఐతే మటుకు చిక్కే.
ఇక పండగలు, ప్రాశస్త్యాలు, ఆధ్యాత్మిక విషయాలయితే ఇక చెప్పనక్కర లేదు. మైట్యూబయ్యలు, మైట్యూబమ్మలు విజృంభించి చెప్పేస్తుంటారు, అందరికీ తెలిసినవే అయినా, వాళ్లే కనిపెట్టినట్లు! ఎవరయినా లబ్ధప్రతిష్ఠుల వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా నెగెటివ్‌గా బయటకు వచ్చిందనుకోండి! ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక!’ ఐనా, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, తీర్మానించేస్తుంటారు! ఎవరిది కరెక్టో తెలియక ‘వ్యూయర్స్’కు మకతిక!
ఇక వంటలు చేసి చూపించే వాళ్లయితే “హాలో ఫ్రెండ్స్!” అంటూ మొదలుపెట్ట “నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి” అని స్వకల్యాణం, విశ్వకల్యాణం గురించి చెప్పి, ఒంగోలు గంగాళం ఉప్మా, కర్నాటక కారాబాత్, పప్పు, చారు కూడా చాలా వివరంగా చేసి చూపిస్తారు. ఈ మధ్య కొందరు బొగ్గుల కుంపటి, మట్టి పాత్రలు, మూకుడులు, పైగా వాటికి విభూతి రేఖలు, కుంకుమ పెట్టి, సదాచార సంపన్న వంటలు చేస్తారు. కొందరు పొలాల్లో మూడు రాళ్లు పెట్టి, కర్రలు మండించి వంట చేస్తారు. అవన్నీ చూడడానికి బాగుంటాయి, చేసేవారికి నాలుగు రాళ్లు (అదేనండి బాబు, డబ్బులు) వస్తాయి గాని, అలా వంటలు చేసే కాలం ఎప్పుడో పోయింది.
అలాగని అందరూ అలాంటివారని కాదు నా ఉద్దేశం. చక్కని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసి చూపించే యూట్యాబర్లు కూడా ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వారు చక్కగా ప్రకాశింప చేస్తారు. వ్యూయర్‌షిప్ కోసం వారు చేయరు. అలాంటి వాళ్లను మైట్యూబర్స్ అనలేం. ‘వుయ్‌ట్యూబర్లు’ అంటే బాగుంటుంది. మైట్యూబర్లలో లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారండోయ్! డబ్బుదేముందండీ మాస్టారు! కుక్కను కొడితే రాలుతుంది! అలాగని కొట్టి చూసేరు! ఇంకేం? మీరూ ఒక ‘మైట్యూబ్’ పెట్టి చెలరేగిపోండి! అదన్నమాట!



No comments:

Post a Comment