Friday, April 4, 2025

సంధ్యావందనమ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

“సంధ్యకు సిద్ధంకా నాయనా!” అని 37 ఏళ్ల పెళ్లి కొడుకును, పెళ్లికి ఒక రోజుకు ముందు ఉపనయనం మొక్కుబడిగా చేసుకొన్నవాడిని, అడిగితే “సంధ్యా? ఎవరా అమ్మాయి!” అని అడిగాడట. 


 

ఈమధ్య చాలా మంది వీకెండ్స్ ప్రసిద్ధ దేవస్థానాలకు విపరీతంగా వెళుతున్నారు. కార్ పార్కింగ్ కూడా దొరకడం లేదు! భక్తి కార్పొరేట్ అయిపోయింది! ఇక సంధ్యావందనం చేసేవారెవరు? ఆమధ్య, బెంగుళూరులో, మా మేనకోడలు కొడుక్కు ‘వడుగు’ చేశారు. వాడి పేరు ధరణీరామ్! నిండా పదేళ్లు కూడ ఉండవు. పంచశిఖలతో, దండము, ముంజి ధరించి, హోమంలో సమిధలు వ్రేలుస్తూ, సాక్షాత్తు వామనుడిలా ఆ బుజ్జి వటువు ప్రకాశిస్తుంటే, నాకు ఎంత ముచ్చచేసిందో! ఆ సందర్భంగా, బలిచక్రవర్తి యాగానికి సాక్షాత్త్ విష్ణువైన వామనస్వామి వచ్చిన ఘట్టాన్ని, పద్యప్రసంగం చేసి, బాల వటువును ఆశీర్వదించాను.
‘ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి’ అని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు వేడుకలన్నీ లేటే! ఉపనయనం, పెండ్లి, కలిపి చేస్తారు. పిల్లో, పిల్లాడో పుడితే, ఎన్ని నెలలైనా నామకరణం చెయ్యరు. ఏం పేరు పెట్టాలో, గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. తీరా అతి సృజనాత్మకంగా ఆలోచించి పేరు పెడితే, అవి అర్థంపర్థం లేకుండా అఘోరిస్తాయి!
సంధ్యావందనం, ‘సంధి యందు చేయతగినది’. దాన్ని చేయకుండా ఇతర కర్మలను నిర్వహించరాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సూర్యునికి అర్ఘ్యం, గాయత్రీ మంత్రజపం, యశస్సును, తేజస్సును, బుద్ధిని, ప్రజ్ఞను, శ్రేయస్సును, బలాన్ని ప్రసాదిస్తాయి. మూడు సార్లు (త్రికాల) సంధ్య వార్చాలి. వృత్తి ఉద్యోగాల వల్ల సాధ్యం కాకపోతే, ‘మానసిక సంధ్య’ కూడ చేసుకోవచ్చు. నాలుగు వేదాల సంప్రదాయాలను బట్టి సంధ్యావందనాలుంటాయి. చివర్లో, ‘కరోమి యద్యత్ సకలం నారాయణేతి సమర్పయామి!’ అని వస్తుంది. దానితో పాటు ‘అగ్నికార్యం’ అని మరొక కర్మ ఉంది. ఇది యజుర్వేదీయం. మోదుగ పుల్లలను సమిధలుగా వ్రేలుస్తూ అగ్నిని ఆరాధించాలి. ‘ఓం అగ్నయే నమః’, ‘ఓం హుతవహాయ నమః’, ‘ఓం సప్తజిహ్వాయ నమః’ అంటూ హోమ భస్మాన్ని నుదుట ధరించాలి. కనీసం ఇవి ఉన్నాయని కొందరయినా తెలుసుకొంటారని నా ఆశ. నాకు మా నాన్నగారు 8వ ఏటనే ఉపనయనం చేశారు. నా వడుగు అలంపురం క్షేత్రంలో జరిగింది. సంధ్యావందనంతో బాటు, అగ్నికార్యం కూడ ఐదారేండ్లు చేసుకున్నానని సవినయంగా మనవి చేస్తున్నా. మా తండ్రిగారి దయ వల్ల, దేవతార్చన, నమక చమకాలు, పురుషసూక్త, శ్రీసూక్తాలు. మహన్యాసం అన్నీ వచ్చాయి. ‘తండ్రి, హరి జేరుమనియెడు తండ్రి, తండ్రి!’ అని భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాదుడన్నట్లు, అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టం.
వెనకటికి ఒకాయన, కొడుక్కు వడుగు చేశాడట. వాడు మర్నాటి నుండీ సంధ్య వార్చడం మానేశాడు. ఆయన ఇల్లాలు “ఏమండీ! వాడిని కూర్చోబెట్టి సంధ్య వార్పించకూడదూ!” అంటే ఆ మహానుభావుడు. “నిన్నగాక మొన్న వడుగయిన వాడికే సంధ్యావందనం గుర్తు లేకపోతే, ఎప్పడో ముఫై ఏళ్ల కింద చేసుకొన్న నాకు గుర్తుండి ఛస్తుందా!” అన్నాడట. యథా పితా, తథా సుతా! సరిపోయింది.
ఒకసారి ఒక ఆధునిక మేధో సంపన్నుడు, “నాకు ఉపనయనం అయింది. కానీ ఎప్పుడూ సంధ్యావందనం చేయను! కాని ఏమయింది? నా జీవితం సూపర్‌గా ఉంది కదా!” అని సంబరపడిపోయాడట. దానికి, నడిచే దేవుడు, కంచి మహాపెరియవ పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యస్వామి వారు ఇచ్చిన సమాధానం!
“ఒక సైకిలిస్టు కొంత సేపు వేగంగా పెడల్ తొక్కిన తర్వాత, తొక్కడం ఆపినా, సైకిలు పరుగు తీస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఊపును సంతరించుకుంటుంది (gains momentum). మన పూర్వీకులు, బ్రహ్మతేజోసంపన్నులు, మన సనాతన ధర్మం అనే సైకిల్‌ను బాగా తొక్కి వదిలారు. ఇది యింకా నడుస్తూనే ఉంది. నీవు సంధ్యావందనం చేయకపోయినా, బాగున్నావంటే, వారి వారసత్వం, వారి పుణ్యం, నిన్ను నడిపిస్తున్నాయని తెలుసుకో”.
క్రమంగా ఆ ప్రభావం తగ్గుతూ వస్తుంది. యువతరానికి ఎన్నో వ్యామోహాలు! మన సంస్కృతి, సంప్రదాయం అంటే ఏమిటో తెలియదు. జంధ్యం తీసి ఎప్పుడో ‘చిలక్కొయ్య’ (అది ఇప్పుడుందా!) కు తగిలించేశారు. యజ్ఞోపవీతాన్ని ధరించడానికి, పాతది తీసేయడానికి వేర్వేరు మంత్రాలున్నాయి. యజ్ఞోపవీతం లోని మూడు సూత్రాలు, గాయత్రి (అలోచన) సరస్వతీ (పదం), సావిత్రి (కర్మ). మధ్య లోని ముడి అనంతమైన బ్రహ్మపదార్థం.
“జంధ్యం యొక్క ప్రాశస్త్యం ఏమిరా?” అని గురువుగారు అడిగితే, “వీపు దురద పెట్టినపుడు గోక్కోవడానికి భేషుగ్గా ఉంటుంది!” అన్నాడట ఒక శిష్యుడు. ‘సాక్షి’ ప్రసంగాలలో పానుగంటి వారు జంఘాలశాస్త్రితో ఒక చోట ఇలా చెప్పిస్తారు: “భారతీయులకు, బ్రిటీష్ వారిలాగా ఇంగ్లీషు పలకడం రాదు - అన్నది నేనంగీకరించను. నా సవాలు ఏమిటంటే మన మాధ్యాహ్మిక సంధ్యావందనం లోని అర్ఘ్యప్రదాన మంత్రాన్ని వాళ్లను సుస్వరంగా పలకమనండి. వందేళ్లు టైం ఇచ్చినా పలకలేరు.”
ఆ మంత్రం ఇది. “హగ్ం సస్యుచిషత్, వసురంతరిక్షసత్, హోతా వేదిషత్, అతిథిర్ధురోణ సత్, బుష ద్వర, సద్వృత, సద్వ్యోమ, సదబ్జా,..” ఇలా సాగుతుంది. అంత మహోజ్జ్వలమైనది మన వైదిక ధర్మం.
రోజుకో ఐదు సార్లు, ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నా వారి దైవాన్ని ప్రార్థన చేసేవారిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటే, అదే మనల్ను రక్షిస్తుంది. సర్వేజనాః సుఖినోభవన్తు! అదన్నమాట!

No comments:

Post a Comment