Thursday, July 24, 2025

సర్వదేవ నమస్కారః - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

“అన్ని మతముల సారంబు యవని యొకటె” అని ఆర్యోక్తి. ఆ సారాన్నే ఆయా మతాల్లోని బోధకులు విభిన్నంగా వివరిస్తారు. కానీ ‘Ultimate Truth’ మాత్రం ఒక్కటే. “ఏకం సత్ విప్రాః బహుధావదన్తి” అని మన భారతీయ సనాతన ధర్మం చెబుతుంది. ఇక్కడ ‘విప్రాః’ అన్న పదానికి ‘పండితులు’ అని అర్థం.
‘Literary Parallel’ అంటే ప్రపంచ సాహిత్యాలలో ఉన్న సామ్యం గల విషయాలు. అలాగే ‘రెలిజియస్ ప్యారెల్లల్’ కూడా ఉంది. హిందూమతంలో, ప్రయాణం చేసేవారికి వీడ్కోలు చెప్పేటప్పుడు “శివాస్తే పంథానః” అంటారు. అంటే, “నీ మార్గములు శుభకరములగు గాక!” అని అర్థం. “విష్ యు హ్యాహీ జర్నీ” అనేది పాపులర్ వీడ్కోలు. విదేశాలకు వెళ్లి వారికి మాత్రం అలా చెప్పకూడదని, “బాన్‌ వాయేజ్” అని చెప్పాలని మీవంటి వారు చెప్పారు సుమండీ! బైబిల్‌లో “యెహావా నీ మార్గమును సుగమము చేయుగాక” అన్న అర్థాన్నిచ్చే సూక్తి ఉంది.
వేదాలు ‘అపౌరుషేయములు’ అంటారు. అంటే మానవులు రాసినవి కాదు. అట్లే పవిత్ర ఖుర్-ఆన్ కూడా. భగవంతుడు మౌఖికంగా, మహమ్మదు ప్రవక్తకు చెప్పినది అంటారు. ఆ గ్రంథం క్లాసికల్ అరబిక్ భాషలో ఉంది. ‘ఖుర్-ఆన్’ అన్న పదం, ఆ గ్రంథంలో 70 సార్లు వస్తుంది. ప్రవక్త కేవలం గుర్తుపెట్టుకుని, తన శిష్యులకు చెబితే, వారు దాన్ని గ్రంథస్థం చేశారు. వారినే scribes అంటారు. అన్నిమత గ్రంథాలకు లాగే ఖుర్-ఆన్‌కు కూడా ప్రక్షిప్తాలు, చేరికలు ఉన్నాయి. మనకు తాళపత్రాలు (తాటాకులు) కూడా లేని కాలంలో కూడ సాహిత్యం, మత వాఙ్మయం ఉన్నాయి. ఇప్పుడు రకరకాల బాల్, జెల్ పెన్నులు, నాణ్యమైన తెల్ల కాగితాలు ఉన్నా, మనం రాన్రాను ‘రాయని భాస్కరులం’ అవుతున్నాం. అంతా సిస్టమ్‌లో టైప్ చేయడమే. ‘కాగిత రహిత’ (Paperless) సమాజం కోసం ఎదురుచూస్తున్నాం. “అవ్వ పేరే ముసలమ్మ” అన్నట్లు, టైప్ చేయడం కూడా ఒక విధంగా రాయడమేనంటాను. కాదంటారా? ‘రాయడం’ అనకూడదు, ‘వ్రాయడం’ అనాలి, అంటున్నారా? సరే! బైబిల్, ఖుర్-ఆన్, గీత-వేదములు, ఆదిగ్రంథం (సిక్కులది) ఇవన్నీ మతగ్రంథాలయినా, వాటిలో సాహిత్య విలువలు పరిమళిస్తుంటాయి. వ్యక్తిత్వ వికాసానికి కావలసిన బోలెడు విషయాలుంటాయి. మనమేమో బోలెడు డబ్బు తగలేసి ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ క్లాసులకు వెళతాం.
కావ్యప్రబంధాల కాలంలో ‘వ్రాయసకాండ్రు’ (వ్రాసే సిబ్బంది) అని ఉండేవారు. వారు తాళపత్రాల నుండి, కొత్తవాటిపై వివిధ గ్రంథాలను ‘కాపీ’ చేసేవారు. ఆ ఉద్యోగాన్ని తక్కువగా చూసేవారట. ఎందుకంటే సృజనాత్మకత లేని పని అని! కవిపండితులంతా ఓరల్ గానే సాహిత్యాన్ని సృష్టించేవారట. అంతెందుకు? విశ్వనాథ వారు ‘వేయి పడగలు’ నవలను ఆశువుగా చెబుతుండగా, వారి సోదరుడు వెంకటేశ్వర్లుగారు వ్రాశారని మనకు తెలిసిన విషయమే. 999 అరఠావులు వచ్చిందట. 29 రోజులు పట్టిందట. అంటే సగటున రోజుకు 35 పేజీలు. వ్యాస భారతాన్ని వినాయకులవారు రాశారని ప్రసిద్ధం. తిక్కన భారతాన్ని గురునాథుడనే ఆయన శిష్యుడు, ఆయన చెబుతుంటే రాశాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో భారత యుద్ధాన్ని వివరిస్తున్నపుడు, తిక్కన కాసేపు ఆగాడట; భావం తోచక! అప్పుడు “ఏమి సెప్పుదును గురునాథ!” అన్నాడట దృతసంధి ప్రకారం, ‘కురునాథ’ కూడా అవుతుంది. శిష్యుడితో అన్నా, కురురాజుకు కూడా వర్తించి, ఔచిత్యం భంగం కాలేదు. బహుశా మహమ్మదు ప్రవక్త కూడ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటాడు.
బైబిల్ ‘ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్’ అంటుంది. హిందూమతం ‘సర్వస్యశరణాగతి’ అంటుంది. “అగోచరాల తాళంచెవులు అల్లాహ్ వద్దనే ఉన్నాయి” అంటుంది ఖుర్-ఆన్. ‘అగోచరం’ అంటే abstract, కంటికి కనబడనిది. అంటే ఆధ్యాత్మికానుభూతి. మనం భగవంతుని నిరాకారుడిగానే భావిస్తాము. విగ్రహారాధన కేవలం మనకు ఆయనపై ఏకాగ్రత కుదరటం కోసమే. “కొంచెమైనను తగపంచి కుడుట మేలు” అన్నా,” లవ్ థై నైబర్ యాజ్ థైసెల్ఫ్” అన్నా, “పొరుగువారు పస్తులుంటే తాను మాత్రం తినేవాడు విశ్వాసి (ముస్లిం) కాలేడు” అన్నా, అన్నిటి పరమార్గం ఒకటే.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే, మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. Secularism (లౌకికవాదం) మనకు శ్రీరామరక్ష! అన్ని మతాల్లో చెడ్డవారు, మంచివారు ఉంటారు. మనుషులు మంచివాళ్ళు కాకపోయినా మతం ఏదైనా మంచిదే అయి ఉంటుంది. మంచినే బోధిస్తుంది. “సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి”. “దేవుడనే వాడుంటే లోకంలో ఇంత అన్యాయం ఎందుకుంది?” అనేవారూ ఉన్నారు. మతం, దేవుడు అనే భావన, ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణను, పాపభీతిని కలిగిస్తుంది. ఏ మతం ఏమి చెప్పినా, అది మానవాళి బాగు కోసమే! అదన్నమాట!

No comments:

Post a Comment