Tuesday, August 12, 2025

వందేళ్ళా? బాబోయ్! -దత్తవాక్కు- ఆంధ్రప్రభ

ఈ మధ్య జనాలకు ఆరోగ్యం మీద అవగాహన పెరిగి, శ్రద్ధ కూడా రెండింతలు పెరిగిందట! సగటు ఆయుర్దాయం 80 సం॥ అయిందని సీనియర్ సిటిజన్స్ తెగ సంబరపడిపోతున్నారట. రామ్‌దేవ్ బాబా గారేమని సెలవిచ్చారంటే... మితంగా భుజిస్తూ, యోగాసనాలు వేస్తూ, బాడీ ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటే 150 నుండి 200 సం॥ వీజీగా బతికెయ్యవచ్చునని.
లివర్‌పూల్ విశ్వవిద్యాలయాచార్యులు ‘జొయావో పెడ్రో డి మాగల్తీస్’ (João Pedro de Magalhães) గారు వేల్స్ (సొరచేపల) మీద పరిశోధనలు చేసి అవి 210 సం॥ వరకు హాయిగా బతికేస్తాయని తెల్చారు. అంత దీర్ఘ జీవితంలో కూడా, ఏజింగ్ (వయసు మీదపడటం) కు సంబంధించిన రుగ్మతలు గాని, శారీరిక మానసిక సమస్యలు గాని వాటికి ఉండవట. కానీ మనకు అలా కాదే! సవాలక్ష సమస్యలు. ‘మంచాన పడకుండా మరో యాభైయేళ్లు బతకమ’ని దీవించిందట వెనకటికో బామ్మగారు. పరాధీనం కాకుండా, తన పోషణకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే, బ్రతకొచ్చు! కానీ, ఇందులో అయితేలూ, కానీలు (ఇఫ్స్ అండ్ బట్స్) చాలా ఉన్నాయి.
‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న నానుడి ఇక్కడా వర్తిస్తుందంటాను నేను. ఈ శ్లోకం ‘నరసింహ సుభాషితం’ లోని 85వ శ్లోకం. దాని పూర్తి పాఠం - “అతి దానాత్ హతః కర్ణః, అతి లోభాత్ సుయోధనః, అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్ర వర్జయేత్!”. ‘అత్యాయుః అనర్థకమ్’ అని యాడ్ చేద్దామా? 
‘మోనోటనీ’ అని ఇంగ్లీషులో ఒక పదముంది. ‘విసుగు రావడం’ అని దానర్థం. ఒక దశలో, జీవితం మీద విసుగు వస్తుంది. మరీ వందేళ్లు బతికుంటే... నీ కళ్ల ముందే నీకంటే చిన్నవారు, నీ స్నేహితులు చాలామంది మరణిస్తూంటారు. నీవు మాత్రం ఉంటావు. ఒక దశలో నీకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అది నీ చేతిలో లేదే! ఆ మధ్య డోన్‌లో మా చిన్నాన్న (మా నాన్నగారి కజిన్) ను చూడడానికి వెళ్లాము. ఆయనకు 93 సం॥. కళ్ళు సరిగ్గా కనబడవు, ఏదైనా బిగ్గరగా ఆయన చెవి దగ్గర చెప్పాలి. క్షేమ సమాచారాల తర్వాత, ఆయన “ఏమిటో రా! నా పెన్షన్ ఇది వరకులా పెరగడం లేదు. డి.ఎ.లు ఇవ్వడం లేదు. మొన్నటి పి.ఆర్.సి.లో ఇంటెరిమ్ రిలీఫ్ కంటే ఫిట్మెంట్ తక్కువుంది!” అన్నాడు. నేను సరదాగా “చిన్నాయనా! ఇంకా ఏడేళ్లు ఉంటే సెంచరీ చేస్తావు. అప్పుడు నీ క్వాంటమ్ పెన్షన్ వందశాతం పెరుగుతుంది కదా!” అన్నాను. “ఏదో ఉన్నాగాని, నాకు విసుగ్గా ఉందిరా! ఈ వయసులో ఎంత వస్తే ఏమిటి? త్వరగా ఆ పరాత్పరుడు తీసుకుపోతే మేలు!” అన్నాడాయన.
‘స్టీఫెన్ లీ కాక్’ అనే రచయిత ‘హౌ టు లివ్ టు బి 200’ అన్న కథ లాంటి వ్యాసం వ్రాశాడు. ఆయన వ్యంగ్య వైభవ నిపుణుడు. ఆయనకు తెలిసిన ‘జిగ్గిన్స్’ అనే ఆయన, పొద్దుపొద్దున్నే చన్నీటి స్నానం చేస్తాడు. చర్మరంధ్రాలు దానివల్ల బాగా తెరుచుకుంటాయట. తర్వాత వేడి స్పాంజ్ ముక్కతో తుడుచుకుంటాడు. అలా చేస్తే అవి మూసుకుంటాయి. తెరచిన కిటికీ వద్ద నిలబడి ఊపిరి పీల్చి వదుల్తాడు. తర్వాత శాండో ఎక్సర్‍సైజ్. అవి కుక్కలు చేస్తాయట. ఇక సాయంత్రం డంబెల్స్. పళ్లతో బరువులు పట్టుకొని ఎత్తడం. అర్ధరాత్రి వరకు స్లింగ్ షాట్లు. ఎందుకు స్వామి ఇదంతా? అంటే 200 సం॥ బ్రతకడానికని చెప్పాడు. కానీ ‘జిగ్గిన్స్’ చచ్చిపోయాడంటాడు లీ కాక్. ఇలాంటి వాళ్ళకు ఆయన ‘హెల్త్ మానియాక్స్’ అని పేరు పెట్టాడు. వారు తెల్లవారే లేచి చెప్పులు లేకుండా వాక్‌కి వెళతారట. అరిపాదాలకు మంచు తగలాలని. నైట్రోజన్ ఎక్కువని మాంసం తినరట. కొళాయి నీరు తాగరట, క్యాన్డ్ సార్డైన్‌లు తినరు. గ్లాసుతో పాలు తాగరు. ‘మందు’ ముట్టరు. కానీ అందరిలాగా మామూలుగానే చచ్చిపోతారట.
“నీకు నచ్చింది తిను. హాయిగా ఉన్నన్నాళ్లు లైఫ్ ఎంజాయ్ చెయ్” అంటాడు లీ కాక్. నీ తిండిలో స్టార్చ్ ఉందా, ఆల్బమైన్ ఉందా, గ్లూటిన్ ఉందా, నైట్రోజన్ ఉందా అని బుర్ర బద్దలు కొట్టుకోవద్దంటాడు. నా మటుకు నాకు సాయంత్రం బైట, మిర్చి బజ్జీలు, పునుగులు వేడివేడిగా తినకపోతే ఏదోలా ఉంటుంది.
ఆ మధ్య దలైలామా గారి బర్త్‌డే జరిగింది. ఆయన టిబెటన్ బుద్ధిజం‍లో గొప్ప ఆధ్యాత్మికవేత్త. మన దేశంలోనే ఉంటాడు. ఆయనకు 90 ఏళ్ళు. ఆయన జన్మదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆయనను శాంతిదూతగా గౌరవిస్తారు. ఆయన లాంటి మహానీయులు ఎంత కాలం బ్రతికినా మంచిదేనంటాను నేను. “కాకిలా కలకాలం బ్రతకడం ఎందుకు?” అంటే కాకుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వాటి సుగుణాలు వాటికున్నాయి. అవి పిండం ముట్టకపోతే? అదే ‘బలగం’ సినిమా! సూపర్ హిట్. 
మైకేల్ జాక్సన్ ప్రసిద్ధ పాప్ సింగర్. ఆయన గొప్ప ధనవంతుడు. ఆయిన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి, ఎందరో డాక్టర్లు. కాని ఆయన గుండె ఆగి మరణించాడు తన 51వ సం॥ లో! మరింతమంది డాక్టర్లు? 
పునీత్ రాజ్ కుమార్, గొప్పనటుడు. కోట్లాది అభిమానులు. జిమ్‍లో వ్యాయామం చేస్తూ, తన 46వ ఏట, గుండెపోటుతో మరణించాడు. వివేకానంద స్వామి 39 సంవత్సరాలే జీవించారు. ఆదిశంకరులు 32 ఏళ్ళు. జగజ్జేత అలెగ్జాండర్ 33 సంవత్సరాలు. అయినా వారు అమరులు. ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారు. అమర గాయకుడు ఘంటసాల 52 సంవత్సరాలు బ్రతికారు. కానీ సంగీతంతో సజీవుడు. సో, ఎన్నేళ్ళు బతికామన్నది కాదు సోదరా, ఎంత బాగా బతికామన్నది ముఖ్యం! బలుసాకు తినైనా బతకాలని ఏం లేదు. మంచితనం మిగల్చకుండా సెంచరీ కొడితే ఏం లాభం? అదన్నమాట!

గుండెతడి ధారావాహిక-1వ ఎపిసోడ్

నేను వ్రాసిన గుండెతడి అనే నవల సంచిక వెబ్ వారపత్రికలో ధారావాహికగా వస్తోంది.
మొదటి ఎపిసోడ్ ఈ లింక్ ద్వారా చదవవచ్చు.



https://sanchika.com/gundetadi-pds-novel-ep-1/

Monday, August 11, 2025

ఇమౌజీలతో ఎమోషన్లు! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

ఆదిమ మానవులకు భాషెక్కడిది పాపం? అరుపులు, సైగలతోనే వాళ్ల కమ్యూనికేషనంతా. వోకల్ కార్డ్స్ మొదటి నుంచీ ఉన్నాయి గాని, దంతములు (డెంటల్స్), తాలవ్యములు (palates), ముక్కుతో పలికేవి (nasals) ఇలా ఫొనెటిక్స్ అప్పటికి లేవు. క్రమంగా ఆ అరుపులు, నోటి నుండి వెలువడే ధ్వనులు ఒక క్రమపద్ధతిని సంతరించుకోసాగాయి. అవి పదాలుగా, చిన్న చిన్న వాక్యాలుగా రూపాంతరం చెందాయి. అలా కొన్ని వేల సంవత్సరాలకు భాషకు ఒక రూపం ఏర్పడింది. తర్వాత ఎవరో మేధావి బయలుదేరాడు. ఈ భాషను బాగా స్టడీ చేసి, ఏ నియమాల ద్వారా ఇది ఏర్పడుతూందో గమనించి, దాని సూత్రాలను వ్రాశాడు. అదే వ్యాకరణం. “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్?” అని మాయాబజార్ సినిమాలో ఘటోత్కచులవారన్నట్లు, ఎవరూ కనిపెట్టకుండా సూత్రాలెలా వస్తాయ్?
భాష, సాహిత్యం, కవిత్వం, దినదిన ప్రవర్థమానాలుగా వెలుగొందుతూ, వార్తాపత్రికలు, వార, పక్ష, మాస, త్రైమాసిక.. అబ్బా! ఎన్ని పత్రికలు? ఇవన్నీ చక్కగా భాషా సేవ చేస్తూ ఉన్నాయి. (ఉండేవి?) కాని, భాషతో పనిలేని చోద్యపు కాలం ఒకటి దాపురించింది మహాశయా! అది సోషల్ మీడియాలో మాత్రమే దర్శనమిస్తుంది. నాలుగు మాటలు టైపు చేయడానికి బద్ధకమో, లేదా లైఫ్‌ను సింప్లిఫై చేసుకునే ఒక క్రమంలో భాగమో, మళ్లీ ఆదిమ మానవుల కాలంలోకి వెళ్లాం. ఇమౌజీలని దాపురించాయి. మొదట్లో అందరూ వాటిని ఎమోజీలు అంటూంటే, కాబోలు! అనుకునే వాడిని. కాని దాన్ని ‘ఇమౌజీ’ అని పలకాలట.
ఈ పిక్టోగ్రాములనన్నింటినీ తెలుగులో వ్రాద్దామని జుట్టు పీక్కున్నా. పిల్లి అంటే మార్జాలము అన్న చందంగా తయారవుతుంటే ఊరుకున్నా. టైప్ చేసే సంభాషణల్లో, ఎమోషన్స్ వ్యక్తపరచే పదాల (తోచకపోతే?)ను వాడకుండా, ఈ ఇమౌజీలను వాడతారన్నమాట.
సరే, బాగుందబ్బాయ్! కానీ, ‘పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండ’న్నట్లు, ‘మనవాళ్ళొట్టి మేధావులోయ్!’. కదా! పెళ్లికీ పిడుక్కీ ఒకే మంత్రం చందాన, ఇమౌజీలను ఎడాపెడా వాడేయడం మొదలెట్టారు.
2010 తర్వాత ఇవి మరింత పాపులర్ అయ్యాయి, ‘యూనికోడ్’ వీటిని ‘యూనికోడ్ స్టాండర్డ్’ లోకి మార్చినప్పటినుంచి. ఇమౌజీలు వాడడం నాగరికుల సంస్కృతిలో ఒక భాగమైంది. “నాగరీకుల భోజనంలో గోంగూర లేకుండా ఎలా? గోంగూర లేనిదే ప్రభువులు ముద్దముట్టరు” అని వంగర గారన్నట్లు, అవి లేని సంస్కృతిని మనం ఊహించలేం సుమండీ!
ఇమౌజీలను పాజిటివ్ కమ్యూనికేషన్ కోసమే ఉపయోగించాలని శాస్త్రం ఘోషిస్తోంది! వాటికంటూ ఒక సొంత అర్థముండదు. కానీ అవి Paralanguage క్రిందికి వస్తాయి. Text కు clarity ని, క్రెడిబిలిటీని ఇస్తాయి. అంతే గానీ అసలు text అన్నదే లేకుండా వీటితోనే పని కానిచ్చేస్తేమంటే ఎలాగండి మాస్టారు?
మనలో మన మాట, మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఇమౌజీ లను ఎక్కువగా ఉపయోగిస్తారని, ఒక సర్వేలో తేలిందట.
ఇమౌజీలను మిసండర్‌స్టాండ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది ఆర్యా! పంపినవాడి మెదడులో ఏ ఆలోచనలున్నాయో, అవే ఆలోచనలు రిసీవ్ చేసుకునేవాడికి ఉండాలనేముంది? కొన్ని దేశాలతో, బెదిరించడానికి రివాల్వర్లు, కత్తులు ఇమౌజీలుగా పెడతారట.
ఫేస్‌బుక్కోడు ఎంత తెలివైనవాడంటే, పోస్ట్ నచ్చితే ‘లైక్’ సింబల్ కొట్టొచ్చు. అంతే! కాని నచ్చకపోతే, ‘డిస్‌లైక్’ సింబల్ పెట్టలేదు, చూశారా! కామెంట్‌లో చెప్పవచ్చు కదా, అంటారేమో! “ఆయనే ఉంటే...” అన్నట్లు, అంత ఓపికే ఉంటే...
మణికట్టు వరకు కట్ చేసి బొటనవేలు పైకి లేపి ఉంచిన ‘మొండిచెయ్యి’ ఇమౌజీని చాలామంది ఉపయోగిస్తుంటారు. పంపినవాడికి పద్మభూషణ్ వచ్చిందని తెలిసినా అదే మొండి చెయ్యి చూపుతారు. తెలుగులో ‘మొండి చెయ్యి చూపడం’ అంటే వేరే అర్థం ఉంది!
వెకిలినవ్వులు, పడీపడీ నవ్వడం, నోటి మీద చేయి వేసుకొని విస్తుబోవడం, మాడుమొహం, భేషుగ్గా ఉందని బొటన వేలిని చూపుడువేలిని గుండ్రంగా తగిలించి, మిగతా మూడు వేళ్లు పైకెత్తడం, నాలుక బయటపెట్టి వెక్కిరించడం, గులాబీపువ్వు, రెండు చేతులూ జోడించి పైకెత్తడం (దీంట్లో అయ్యా! మీకో నమస్కారం! ఇక ఆపండి! అనే అర్థం కూడా రావచ్చు!), రెండు కళ్లనుండి ధారాపాతంగా కన్నీరు కార్చడం, పళ్లన్నీ కనిపించేలా ఇకిలించడం... అబ్బ! ఎన్నని చెప్పను? 
గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు, రెడీమేడ్ వీడియోలు వచ్చేశాయి. అన్ని సందర్భాలకు అవి తయారు చేసిపెట్టారు. ఎవరనుకున్నారు? ‘గూగుల్ కిచెన్’ వారు.
ఆలీని, బ్రహ్మనందాన్ని, రవితేజను ఈ వీడియోలలో, ఆయా సినిమాలలో వారు చూపిన విచిత్ర, చిత్ర భావాలను, సందర్భ శుద్ధితో పెడతారు. పాపం, వారికి రెమ్యూనరేషన్ ఏమయినా ఉంటుందో, లేదా ఉచిత పథకాలో, మరి!
‘రిప్’ అని ఒకటుంది. అది ఇమౌజీ కాదు కాని, సూక్ష్మంగా మోక్షం చూపిస్తూంది. ఒకాయనకు జ్వరం వచ్చిందని ఎఫ్.బి. లో పోస్ట్ పెడితే, ఆయన ఫ్రెండ్ (ముఖపుస్తక నేస్తం) ‘రిప్’ అని పెట్టాడట. అదీమిట్రా బాబూ అని అడిగితే, “తప్పేముంది? రెస్ట్ ఇన్ పీస్! ‘ప్రశాంతంగా రెస్టు తీసుకో’ అన్నాను” అన్నాడట! అతి తెలివి!
చక్కని భాష ఉండగా, దాన్ని సింప్లిఫై చేయడం కాదు, దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం కాదా ఇది! అదన్నమాట!