Sunday, January 26, 2025

భారతమాతకు నీరాజనం

రిపబ్లిక్ డే పర్వదినాన నేను రచించి, స్వరపరచి, పాడిన గీతం 'భారతమాతకు నీరాజనం' స్వాధ్యాయ ఛానెల్‍లో వినండి.


 


లేడీ విలన్లు! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

‘విలన్’ కు స్త్రీలింగం ఉందా? ఉందండోయ్! ‘విలనెస్’ అట! కానీ ఆ మాట అంత ప్రాచుర్యంలో లేదు. స్త్రీలింగాలకు లేడీ అన్న పదం చేరిస్తే మర్యాదగా ఉంటుంది. కండక్ట్రెస్స్, మేనేజెరెస్ అనడం కంటే, లేడీ కండక్టర్, లేడీ మేనేజర్ అనడం బెటర్ కదా!
చరిత్రలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో మనకు మహిళా విలన్లు ఉన్నారు. రామాయణంలో కైకేయినే తీసుకుందాం. మెయిన్ విలన్ ఆమే అంటారు. కానీ, కాదు! ఆమె చాలా మంచిది. రాముడంటే చాలా ఇష్టం ఆమెకు. మంథర వచ్చి, రామునికి పట్టాభిషేకం చేస్తున్నారని చెబితే, కైకేయి కడుంగడు సంతసించి, తన మెడలోని రత్నాల హారాన్ని తీసి మంథరకు బహుమానంగా ఇచ్చిందట. ‘భరతుని కంటె నాకు రాముడంటేనే ఇష్టం’ అన్నదట పైగా. అసలు విలన్ మంథర. ఆ పాత్రలో, ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో, ఛాయాదేవి గారు జీవించారు. ఆమె ఆహార్యం, నటన అద్భుతం. కైకమ్మకు ద్వేషం ‘నూరిపోసే’ దృశ్యంలో ఆమె నటనా విశ్వరూపం కనిపిస్తుంది. బాపు గారు జమున గారికి కైక పాత్రనిచ్చింది కూడా అందుకేనేమో! రాముడు కైకమ్మను పల్లెత్తు మాట అనలేదు!
ఇక సూర్యకాంతం గారి విలనీ, విభిన్నమైంది. దాన్ని కూడా హాస్యంతో మేళవించగల మహానటి ఆమె. నిండు గర్భవతి అయిన కోడల్ని మెట్ల మీది నుంచి తోసేస్తుంది. ఆడపడుచుకు విషం కలిపి అన్నం పెడుతుంది. సవతి పిల్లలను చిత్రహింసల పాలు చేస్తుంది. భర్తను హీనాతిహీనంగా చూస్తుంది. అయినా సరే, ప్రేక్షకులకు ఆమెపై కోపం రాదు!
1946 లో ప్రతిభా వారు ‘ముగ్గురు మరాఠీలు’ అన్న సినిమా తీశారు. అందులో అక్కినేనిని అసలు గుర్తు పట్టలేం. అందులో మహారాణి రుక్కూబాయిగా కన్నాంబ గారి విలనీ భయాన్ని కలిగిస్తుంది. ఆమెకు సంతానం ఉండదు. బావగారి కుమారులను చేరదీస్తాడు రాజు (గోవిందరాజుల సుబ్బారావు). వారిని ఆమె పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు! ఇక ‘నరసింహ’ (తమిళ డబ్బింగ్) సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర ఆమె కెరీర్ లోనే గొప్పది. అసూయను అంత బాగా ప్రదర్శించిన పాత్ర. “నాకు దీటుగా నా కెరీర్‌లో ప్రతినాయకురాలి పాత్రలో నాకంటే బాగా నటించారు రమ్యకృష్ణ” అని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెను ప్రశంసించారు.


ఇక సాహిత్యానికొద్దాం. ప్రసిద్ధ నాటకం ‘మేక్‌బెత్‍’లో ముగ్గురు మంత్రగత్తెలు ఉంటారు. వారు మహాకవి షేక్‌స్పియర్ ‘త్రీ విచ్చెస్’ గా ప్రసిద్ధులు. వారికి ‘భయంకర సోదరీమణులు’ (వియర్డ్ సిస్టర్స్) అని కూడా పేరు. మేక్‌బెత్ పతనానికి కారకులు. వారు మాట్లేడే భాష రిడిల్స్ (పొదుపు కథలు) తో కూడి, మానవాతీత శక్తులను ప్రతిఫలిస్తుంది.
మన తెలుగు టీవీ జీడిపాకం సీరియల్స్‌లో అత్తలు, కోడళ్ళు అందరూ విలన్లే! ఎందుకో మరి. ఆయా పాత్రలు నటించేవారికి అభిమానులు కూడా మహిళా ప్రేక్షకులే. దీన్నే ఇంగ్లీష్‌లో ‘ప్యారడాక్స్’ అంటారు. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అబ్బో! దుర్మార్గంలో ఇంత సృజనాత్మకత ఉందా? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతా పెద్దింటి ఆడవాళ్లే. అందంగా ఉంటారు. పైగా పెద్ద పెద్ద కళ్లను మరింత పెద్దవిగా చేసి, వికృతంగా తిప్పుతూ డైలాగులు చెబుతూంటే భయం వేస్తుంది. వారి పేర్లు కూడా భువనేశ్వరి, రాజేశ్వరి, ఇలా హుందాగా ఉంటాయి. కోడళ్లు కూడ ‘హమ్ కిసీ సే కమ్ నహీ’ అంటూ దుర్మార్గం పనులు చేస్తుంటారు, సీరియల్స్‌లో. అందంగా ఉన్నా, వీళ్ళంతా అలా అనిపించరు. కారణం, దుర్మార్గం అందాన్ని మింగేస్తుందేమో?
‘శూర్పణఖ’ పాత్రను చూస్తే నాకు జాలేస్తుంది. కాని కోపం రాదు. ఆమె రామలక్ష్మణులను కామించడం తప్పు కావచ్చు. “మేం అలాంటివాళ్లం కాదు, వెళ్లిపో” అని చెప్పొచ్చు కదా! ముక్కు చెవులు కోయడం ఎందుకు? నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మగారి అభిమానిని లెండి! అయినా, నాకు తెలీకడుగుతున్నా, దుర్మార్గానికి ఆడా మగా తేడా ఉంటుందటండీ, మన పిచ్చిగాని! ఆడాళ్లలో మగాళ్లలో దుర్మార్గులుంటారు. కాని వారి సంఖ్య తక్కువంటా నేను. విలన్‌లు ఉంటే కదా హీరోల గొప్పదనం తెలిసేది? మన హీరోలు, “నాకు ఫలానా విలనే కావాలి” అని నిర్మాతలను డిమాండ్ చేస్తారట. సమ ఉజ్జీ ఉంటే తన పాత్ర ఎలివేట్ అవుతుందని!
నిజ జీవితంలో, మన ఇళ్లల్లో కూడా లేడీ విలన్లు లేరంటారా? వారిని చూసే కదా రచయితలు విలనమ్మలను సృష్టించేది? ‘ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్’ అన్నారు కదా అరిస్టాటిల్ గారు! మా అమ్మమ్మ చెల్లెలొకామె ఉండేది. ఆమె బాల వితంతువు. ఎవరయినా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆమెకు సహించేది కాదు. ఆమె ఎవరింట్లో అయినా నాలుగు రోజులుండి వెళ్లిందంటే, ఆ ఇంట్లో గొడవలే! అంత పవర్‌ఫుల్ విలన్ ఆమె.
నన్నడిగితే, (ఎవరడిగారు?) ఆడైనా, మగైనా ప్రతి మనిషిలో కొంత విలనిజం ఉంటుంది. మంచివాళ్లు దాన్ని అణచుకొని, సంస్కారం చూపుతారు. ‘సోఫిస్టికేటెడ్ విలనీ’ అని ఒకటుంది. చక్కగా డ్రెస్ చేసుకొని, నవ్వుతూ మాట్లాడుతూ, గొంతులు కోస్తారన్నమాట. విలనిజం వినోదం వరకైతే పరవాలేదు. అది మన జీవితాలను ప్రభావితం చేసి, మనమూ దుర్మార్గులం అయితే ప్రమాదం! లేడీ విలన్‍ల దంతా నటనే నండోయ్! నిజ జీవితంలో వారు బంగారు తల్లులు! వారికి శతకోటి వందనాలు! అదన్నమాట!


నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 12వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 12వ భాగం సంచికలో చదవండి.
~
సివిక్స్ సారు ఆశ్చర్యపోయినాడు. “హరికథలు చెబుతాడా? ఏదీ ఒక పద్యం చెప్పు, విందాము.”
వాడు సారు వైపు చూసినాడు. సారు పాడమన్నట్లు సంజ్ఞ చేశాడు. వాడు గొంతు సవరించుకొని, లవకుశ సినిమాలోని.
“రంగారు బంగారు చెంగావులు ధరించు/శృంగారవతి నారచీరలూనె” అన్న వాల్మీకి పద్యాన్ని సుమధురంగా పాడాడు. అశ్వత్థ గారు ఆనందాబుధిలో ఓలలాడారు. వైనతేయను ఆశీర్వదించారు.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-12/

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 19వ భాగం లింక్

తండ్రీ! పరమాత్మా! పరమేష్ఠీ! బ్రహ్మదేవా! నీ తత్త్వంబు గ్రహింప నాబోంట్లకు శక్యంబె?

శా.:
నీవే సూత్రము, అంతరాత్మవు కదా, నీ రీతి గుహ్యంబునౌ
నీ వాల్లభ్యము చేత నెల్ల జగముల్ నిద్రించు నిశ్చింతగాన్
నీవే ప్రాణుల బుద్ధి జ్ఞానములకున్ నేర్పున్ నేర్పు సంధాతవై
నీవే కర్తవు, భర్తవున్, సకలమౌ మీమాంసకున్ పాహిమాం!

~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-19/



జయజానకి రమణ - రామదాసు కీర్తన

స్వాధ్యాయ ఛానెల్ కోసం నేను పాడిన రామదాసు గారి 'జయజానకి రమణ' కీర్తన వినండి.


 


నా హాస్య కథ 'తెలుగోండ్ల పెండ్లి'

విశాఖపట్టణం నుంచి ప్రచురితమయ్యే విశాఖ సాహితి మాసపత్రిక జనవరి 2025 సంచికలో నా హాస్య కథ 'తెలుగోండ్ల పెండ్లి' ప్రచురితమైంది.
కథను చదివి చదివి హాయిగా నవ్వుకోండి 😄.




Click on the image to view in bigger size

Monday, January 20, 2025

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 11వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 11వ భాగం సంచికలో చదవండి.
~
వైనతేయ హరిదాసు వేషంలో స్టేజి మీదకు వచ్చాడు. అందరికీ నమస్కరించాడు. దస్తగిరిసారు ఎవరిదో హార్మోనియం తెప్పించి పెట్టుకొన్నాడు. క్రాఫ్ట్ టీచర్ రంగస్వామికి డోలక్‌లో ప్రవేశముంది. వాళ్లిద్దరూ హరిదాసుకు వాద్యసహకారం అందిస్తారు
“సభికులారా! ఈ రోజు నేను గానం చేస్తున్న హరికథ, ప్రఖ్యాత రచయిత ఛార్లెస్ డికెన్స్ వ్రాసిన నవల ఆలివర్ ట్విస్ట్!” అనగానే వేదిక మీద నున్న ఎం.ఎల్.ఎ, సి.ఐ. గారితో పాటు సభిలందరూ ఆశ్చర్యపోయారు. ‘ఇంగ్లీషు నవలను హరికథ చెబుతాడా?’ అందరిలో ఆసక్తి నెలకొంది.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/srimadramaramana-pds-serial-11/