‘ప్లే’ అంటే ఆడుకోవడం, ఆడడం అని తెలుసు కదా మాస్టారు! కాని, ‘ప్లే’ అంటే నాటకం/సినిమాలలో ఒక పాత్ర పోషించడం కూడా. ఇంగ్లీషు నాటకాలు రాసేవాళ్లను ‘ప్లేరైట్’ (playwright) అంటారు. సోషియల్ మీడియా వచ్చింతర్వాత, ఏదైనా వీడియోను చూడడాన్ని ‘ప్లే’ చేయడం అంటారు. ఉదాహరణకు ఎఫ్.బి.లో ఒక వీడియోను 50 మంది చూశారనుకోండి.. 50 Plays.. అని వస్తుంది.
అవసరానికి మించి పాత్రను పోషించడం ఓవర్ ప్లే. బాగా తగ్గించి పోషించడం అండర్ ప్లే. మన సినిమా రంగంలో చాలా మంది గొప్పనటులు ఓవర్ ప్లే చేసి ప్రఖ్యాతులైనారు. దానిని వారు పండించారు కూడా. తమిళ సినిమారంగంలో ఓవర్ ప్లే ఎక్కువ అని అంటుంటారు. మన హస్యనటులను చూడండి. పాత తరం వారు ఓవర్ ప్లే చేసేవారు కారసలు. ఇప్పటి హాస్యనటులదంతా ఓవర్ ప్లేనే! గొణుగుతున్నట్లుగా డవిలాగులు చెప్పి, అండర్ ప్లే చేసి, సూపర్ స్టార్ లైనోళ్లు కూడా మనకు ఉన్నారండోయ్! ఒకప్పటి హీరో, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు ఒకాయనను మా చిన్నప్పుడు “పావలా ఇస్తే, రూపాయి యాక్షన్ చేస్తాడు” అని అనేవారు! అతి సర్వత్ర వర్జయేత్! మితి సర్వత్ర జయేత్! ఇదెక్కడుంది? అనుకోకండి. నేనే సృష్టించా.
పాత్రకు తగినంత భావోద్వేగాన్ని ప్రదర్శించకపోయినా, తక్కువ ప్రదర్శించినా, రెండూ ప్రేక్షకులను మెప్పించలేవు. చార్లీ చాప్లిన్ మూకీ సినిమాలు చూసే ఉంటారు. మొత్తం ఓవర్ ప్లే ఉంటుంది. కానీ అవన్నీ కళాఖండాలు కాదంటారా చెప్పండి? ‘సత్యహరిశ్చంద్ర’ పాత్రను యస్.వి.రంగారావు, యన్టీఆర్ గార్లు ఇద్దరూ పోషించారు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది నటన. ఓవర్/అండర్ ప్లేలు అసలుండవు. ‘విప్రనారాయణ’లో అక్కినేని గారి నటన కూడా అలాంటిదే. గుమ్మడి గారు కూడా అలాంటి నటులే.
మా ఊర్లో ఒక ఆర్.ఎం.పి. డాక్టరుగారుండేవారు. ఆయనకు నాటకాల పిచ్చి. ‘దుర్యోధన’ ఏకపాత్రాభినయం మా నాన్నగారి వద్ద నేర్చుకునేవారు. మయసభలో “అదిగో ఆ కనబడు ద్వారము నుండి నిష్క్రమించెద గాక!” అంటూ వెళితే అక్కడ ద్వారం ఉంటే కద! లేదనుకుని ఇంకో దారిలో వెళితే, ద్వారబంధం కురురాజుకు తలకు తగిలి, నొప్పి పెడుతుంది. డాక్టరుగారు అప్పుడు “అబ్బా...” అని దీర్ఘం తీశారు చాలాసేపు. మా నాన్న “అంత పొడుగెందుకురా వెధవా!” అంటే, అయన “అబ్బ!” అని మరీ క్లుప్తంగా అన్నారు. “మొదటిది అతివృష్టి ! రెండోది అనావృష్టి” అని నవ్వారు మా నాన్నగారు! ఆయన దుర్యోధన పాత్రను ‘కురుక్షేత్రం’లో పోషించారట. నేనప్పటికి పుట్టలేదట! రాయలసీమరత్నం, వెల్దుర్తి వెంకట నర్సునాయుడు నాన్నగారి శిష్యులే. ‘గయోపాఖ్యానం’ నాటకంలో అర్జున పాత్రకు ఆయన ప్రసిద్ధి. షణ్ముఖి ఆంజనేయరాజు గారేమో శ్రీ కృష్ణుడు. వారి నటనకు ప్రజలు జేజేలు పట్టారు!
నటనలోనే కాదండోయ్, మన దైనందిన జీవితంలో కూడా అండర్ ప్లే, ఓవర్ ప్లే చేసేవాళ్ళు బోలెడుమంది. పలాసలో నేను ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేసేటప్పుడు ఒక కామర్స్ లెక్చరర్ ఉండేవారు. ఆయన పేరు జి.ఎస్.ఎన్. ఎవరైనా ఆయనతో ఏదైనా గొప్పగా చెబితే, వెంటనే ఆయన “అందులో గొప్పేముంది?”, “మొదట్నించీ ఉన్నదే కదా!”, “ఇలాంటివి చాలా చూశాను” ఇలా ఆ విషయాని కనిష్టీకరించేవారు. పదం బాగులేదనుకుంటా! అదేనండీ downplay!
ఒకసారి మా ఊర్లో ఒక బంధువింటికి బోజనానికి పిలిచారు. ఆ ఇల్లాలు నాకు వరుసకు మరదలు అవుతుంది. చివర్లో పెరుగు వడ్డిస్తూ, “బావా! ఇంత మంచి పెరుగు మీరు జన్మలో తిని ఉండరు తెలుసా!” అన్నదామె. ఆ పెరుగు పుల్లగా, నీళ్లగా, దరిద్రంగా ఉంది! ఓవర్ ప్లే!
ప్రగల్బాలన్నీ ఓవర్ ప్లే కిందికి వస్తాయి. ‘కన్యాశుల్కం’ లో గిరీశం డైలాగులన్నీ ‘ఓవర్ ప్లే’ కిందికి వస్తాయి. ఆయన కేంబ్రిడ్జిలోనో, ఆక్స్ఫర్డ్ లోనో లెక్చరిచ్చే సరికి అక్కడి ప్రొఫెసర్లు అంతా డంగై పోయారట. ఓవర్ ప్లే గిరీశం క్యారెక్టర్‌కు అతికినట్లు సరిపోయింది. సినిమాల్లో యన్.టి.ఆర్. గిరీశం పాత్రను మన కళ్లముందు నిలబెడతారు. ఎ గ్రేట్ అండ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ పెర్మార్మెన్స్ ఇన్ హిజ్ కెరీర్! ఇదేమిటండోయ్ ఇంగ్లీషు వచ్చేస్తుంది? ఎక్కువైతే మా ఎడిటర్ గారు కోప్పడతారండి బాబూ!!
‘అతి దానాత్ హతః కర్ణః అతి లోభాత్ సుయోధనః
అతికామాత్ దశగ్రీవః అతి సర్వత్ర వర్షయేత్!’
అతిగా దానాలు చేయడం వల్ల కర్ణుడు, అతి లోభంవల్ల దుర్యోధనుడు, అతి కామముతో రావణుడు నశించారు. కాబట్టి ‘అతి’ని అన్నిచోట్లా విడనాడాలని ‘నరసింహ సుభాషితం 85’ చెబుతూ ఉంది. నటులు ఓవర్ ప్లే, అండర్ ప్లే చేసినా నష్టం లేదు. జీవితాల్లో ఇవి రెండూ చేయకూడదు సుమండీ! అనవసరంగా ‘బోలెడు’ ‘హాచ్చర్యపోతుంటారు కొందరు. కొందరు ‘కాష్టకుడ్యాశ్మసన్నిభులు’ (కర్ర, గోడ, రాయితో సమానులు) స్పందించాల్సినంతగా స్పందించరు! ప్రతిదానికీ, “దేశంలో ఎక్కడా లేని విధంగా” అని తగిలిస్తుంటారు కొందరు. “ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!” అన్నారు త్యాగరాజస్వామి! ఎవర్నీ ఏమి అనలేని కాలం! కోపాలెలిపొస్తాయి! అదన్న మాట!