Tuesday, March 5, 2024

దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం ఎడిట్ పేజీ కాలమ్ - 03 మార్చ్ 2024

దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం ఎడిట్ పేజీ కాలమ్ - 03 మార్చ్ 2024

అజ్ఞానమే ఆనందం

"తనకేమీ తెలియదని తెలుసుకోవడమే అసలైన 'జ్ఞానం'" అన్నారు జనకమహారాజు. ఎంత నిజం. అన్నీ తెలుసు అనుకోవడమే ఒక భ్రమ. మనల్నెవరైనా ఏమైనా అడిగారనుకోండి... "అయ్యో, నాకు తెలియదే!" అంటే సరి. మనం సేఫ్, చూశారా మన అజ్ఞానం మనల్నెలా కాపాడుతుందో. చిన్న తనంలో మా అమ్మ, "నీ మొహం, నీకేం తెలియదు" అని విసుక్కునేది నన్ను. ఆమె అలా అంటుంటే ఎంత బాగుండేదో... పెళ్ళయ్యాక భార్యదీ అదే డైలాగు. కాని దానిలో అర్థం వేరుగా ఉంటుందండోయ్.
రాబర్ట్ లిండ్ 'న్యూ స్టేట్స్‌మన్' అనే పత్రికలో 'ది ప్లెషర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్' అనే వ్యాసం రాశారు. 'అజ్ఞానంలోని ఆనందాలు' అని దానర్థం. అజ్ఞానం అనేది అంత తీసిపారేయాల్సినదేమీ కాదంటాడాయన. కొత్తదేదైనా తెలుసుకోవాలంటే వచ్చే ఆనందానికది మూలమట. అంతేకదా నేర్చుకునే ఆనందం కావాలంటే నేర్చుకోని అజ్ఞానం ముందుండాలి కదా... ఆయన లాజిక్ మీకర్థమైందా? అర్థం కాకపోతేనే మంచిది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే ఆనందం.
ప్రశ్నలు అడగడంలో ఉన్న ఆనందం, వాటికి జవాబులు ఇవ్వడంలో ఉండదండోయ్. ఎందుకంటే రెండవది కష్టం. ఇంటర్వ్యూ చేసేవాడు నవ్వుతూ ఉంటాడు. ఇచ్చేవాడికి చచ్చేచావు... అన్ని ప్రశ్నలు వేయాలంటే, ఎంత అజ్ఞానం ఉండాలి?
అరిస్టాటిల్ అంతటివాడికి అనుమానం వచ్చిందట. 'మధ్యాహ్నం పూట తుమ్మితే అపశకునం, ఉదయం తుమ్మితే మంచిశకునం, ఎందుకూ?' అని. దీన్నిబట్టి ఆయన క్కూడ కొన్ని విషయాలలో అజ్ఞానం ఉందన్నమాట.
మనకు తెలియనిది ఎవరికీ తెలియదు అని తెలిస్తే మనకు మహదానందం. అలాకాక, మనకు తప్ప అందరికీ తెలుసని తెలిస్తే, మనమింత అజ్ఞానులమా అని బాధ. అయినా, అందరికీ అన్నీ తెలియాలని లేదు. 'నిజంగా నాకు తెలియదు' అని ఒప్పుకోవడం గొప్ప సంస్కారం. కొందరుంటారు. వారిని ఇంగ్లీష్‌లో 'బ్లఫ్ఫింగ్ మాస్టర్స్' అంటారు. దబాయింపు సెక్షన్ అమలు చేయడంలో వారు దిట్టలు! తెలియఁ "పోయినా, తెలిసినట్లు బిల్డప్ ఇస్తారు. మనం కాదంటే, సాక్ష్యాలు, రెఫరెన్స్లు కూడా ఇస్తారు. నోటిమాటలతోనే సుమా! డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాదు. వాళ్ళదగ్గర ఉంటేగా, కొత్తచోట, దారి తెలియక, దోవనపోయే వాడినడిగా మనుకోండి. వాడికి తెలియకపోయినా, ఏదో ఒకటి చెబుతాడు.
వీళ్ళు మరీ ప్రమాదం. గురువుగారి కంచు మర చెంబు కనబడలేదు... శిష్యులనడిగితే, మాకు తెలియదన్నారు.
ఒకడు లేచాడు. "గురువుగారండీ, ఆరోజు వనభోజనాలకు తెచ్చారు కదండీ"


"అదేరా!"
"దానిమీద మీ తాతగారి పేరుంటుంది కదండీ!"
"అవును నిజమే!"
"మొన్నామధ్య అమ్మగారడిగితే చింతపండు పులుసుతో తోమాను కదండీ"
"ఎక్కడుంది?".
"ఏమోనండి, నాకు తెలియదు!"
ఇది అజ్ఞానమే అంటారా, అతితెలివి అంటారా?
మా మనవడున్నాడు. వాడికి ఏడేళ్ళు. "తాతా, నీకొకటి తెలుసా?" అని ప్రారంభిస్తాడు. "తెలియదురా" అనాలి నేను అజ్ఞానంగా, అంతేగాని, “నాకు తెలుసు” అంటే డిజప్పాయింట్ అవుతాడు. సెల్ఫోన్ నెట్‌వర్కులన్నీ కోట్లు సంపాయిస్తున్నాయంటే, ఈ పాయింటు మీదేనండీ "వదినా మా తోడికోడలు కూతురేం చేసిందో తెలుసా?" ఇలా సమాచార విప్లవం వెల్లువలా మారడానికి అజ్ఞానమే కారణం. ప్రామాణికతను పక్కన పెడితే, సోషల్ మీడియా, మన అజ్ఞానాన్ని పారద్రోలడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉంటుంది. "నిన్నటి మీ ప్రసంగాన్ని పేపర్లో వేశారండి" "గుడ్, బాగా కవర్ చేశారా?" "అవునండి నమ్ము, నమ్మకపో" అనే శీర్షిక కింద వేశారు.
మన జ్ఞానం అంతా ఉడుత తొర్రలో దాచుకున్నలాంటిదంటాడు సెనెకా అన్న గ్రీకు వేదాంతి. ఉడుతకది అపురూపమే! లోకానికి కాదు.
కాబట్టి కామ్రేడ్స్, అజ్ఞానం లేకపోతే జ్ఞానం లేదు. 'నేను జ్ఞానిని' అనుకుంటే అహంకారం.. 'నేను అజ్ఞానిని' అనుకుంటే వినయం, వినయాన్నే అవలంబిద్దాం... అదన్నమాట.

No comments:

Post a Comment