Tuesday, March 12, 2024

అపరిగ్రహం - దత్తవాక్కు ఫీచర్ - ఆదివారం ఆంధ్రప్రభ - 10 మార్చి 2024

ఇదేమిటీ? నవగ్రహాలను గురించి విన్నాం కానీ, ఈ గ్రహం గురించి ఎప్పుడూ వినలేదే? అనుకుంటున్నారా? ఇది గ్రహం కాదు మాస్టారు, పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ప్రవచించిన 'అష్టాంగ యోగ'లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, అనే ఎనిమిది అంగాలున్నాయి. అందులో మొదటిది 'యమ' అంటే సంయమనం. దీనిలో మళ్లీ ఐదు ఉపాంగాలున్నాయి. అందులో ఐదవదే ఈ అపరిగ్రహం! అంటే స్వీకరించకపోవడం (Non-acceptance).
పరిగ్రహం అంటే తీసుకోవడం. దానికి వ్యతిరేకమే అపరిగ్రహం, తీసుకోకపోవడం, ఏదో సరదా కబుర్లు చెబుతాడనుకుంటే, ఇదేమిటి, సీరియస్ మ్యాటరు? అనుకోకండి సార్. వస్తున్నా, మన జోనర్ లోకే వస్తున్నా,
యోగాను కాసేపలా ఉంచుదాం. మనకు ఇవ్వాలంటే బాధ. తీసుకోవాలంటే సంతోషం. 'ఇచ్చిపుచ్చుకోవడాలు' అని పెళ్ళి సంబంధాలలో మాట్లాడుకుంటారు. వాటిలో తేడాలు వచ్చి పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోయిన సందర్భాలున్నాయండోయ్. లంచాలు తీసుకోవడం ఒక ఘనకార్యంగా తయారయింది. "అబ్బాయి టౌన్ ప్లానింగ్‌లో జూనియర్ అసిస్టెంట్, పై సంపాదన బాగానే ఉంటుందట!" అని మురిసిపోతారు అమ్మాయి తరపువాళ్ళు. నన్నడిగితే (ఎవరడిగారని?) లంచం ఇచ్చేవానికి కూడ శిక్ష ఉండాలి. ఇస్తేనే గదా తీసుకొనేది. అది అలవాటై, కొడుకు ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టడానికి కూడ ఒక తండ్రి. చేయి చాస్తున్నట్టు ఒక కార్టూన్! కార్టూన్లు ఊరికే పుడతాయా మరి!
'బుద్ధిమంతుడు' సినిమాలో, ఆరుద్రగారు ఒక చక్కని పాట రాశారు. అందులో 'అపరిగ్రహం' గురించి సింపుల్‍గా చెప్పాడా కవివరేణ్యుడు. "ఇచ్చుటలో ఉన్న హాయీ, వేరెచ్చటనూ లేనే లేదని! లేటుగ తెలుసుకున్నాను. నా లోటును దిద్దుకున్నాను" అంటారు అక్కినేని. ఆ పాటను అభినయిస్తూ, అప్పుడాయన 'తాగి' ఉంటాడు. తాగిన వాడు అబద్ధం చెప్పడు కదా!
'శ్రీకృష్ణ తులాభారం'లో నారదుడికి తన ప్రాణనాథున్ని దానం చేస్తుంది సత్యభామ. దానిని పరిగ్రహిస్తాడా కలహభోజనుడు! అదంతా పెద్ద నాటకం లెండి. అపరిగ్రహమును మనసా వాచా కర్మణా నమ్మిన యోగి పుంగవుడు నారద మునీంద్రుడు. మరి ఆ దానాన్ని ఎందుకు పరిగ్రహించాడు? సత్యభామకు బుద్ధి రావడం కోసం! పైగా, "సేవలందుటె గాని, సేవించుటెరుగని శ్రీనాథుడె నాకు సేవకుడయ్యె!" అని మురిసిపోవడం. నారదుని పరిగ్రహంలోనే అపరిగ్రహం ఉంది. అది ఆధ్యాత్మికం.
ఇటీవల బీహార్ మాజీ సీఎం 'జననాయర్ శ్రీ కర్పూరీ ఠాకూర్'కు కేంద్రం 'భారతరత్న' ఇచ్చింది. ఒకసారి లోకనాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జన్మదినాన, ఆయనకు శుభాకాంక్షలు తెల్పడానికి, కర్పూరీ ఠాకూర్ వెళ్ళారు. ఆయన కుర్తా చిరిగిపోయి ఉందట. అది చూసి చంద్రశేఖర్, జనతా పార్టీ అధ్యక్షులు "ఇదేమిటయ్యా! ఇంద! మంచి కుర్తా ఒకటి కొనుక్కో! చూడలేకపోతున్నా" అని కొంత డబ్బు ఇస్తే, ఎంచక్కా తీసుకుని, వెంటనే దానిని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారట! అదీ అపరిగ్రహం అంటే! కర్పూరానికీ, ఉప్పుకూ చాలా తేడా ఉందని గదా వేమన సెలవిచ్చింది!
కోట్లు కోట్లు జనం డబ్బు దిగమింగి, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చునే వారున్నారు! 'పరిగ్రహం'లో అంటే పుచ్చుకోవడంలో వారు ఘనులు! ప్రకృతి నుంచి, సమాజం నుండి మనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి! 'హెన్రీ డేవిడ్ తారూ' అనే అమెరికన్ రచయిత 'వాలెన్' అనే పుస్తకం రాశారు (1854). దుఃఖానికి మూలం, అవసరానికి మించి తీసుకోవడమేనంటాడా మహానుభావుడు, 'సింప్లిపై' అన్నది ఆయన నినాదం. కనీసావసరాలకు సరిపడా మాత్రమే తన రచనల ద్వారా సంపాదిస్తూ, సంతోషంగా గడిపి చూపించాడాయన. అదీ అపరిగ్రహం!


దీన్ని పాటించడం చాలా కష్టం. దీనికి పతంజలి యోగసూత్రాలు అధ్యయనం చేయనవసరరం లేదు. తన ఆటోలో డబ్బున్న బ్యాగ్‍ను ప్రయాణికుడు మర్చిపోతే, దాన్ని భద్రంగా పోలీసులకు అప్పజెప్పి, సొంతదారునికి చేర్చిన వాడు యోగి కాక మరెవ్వరు? ఆపరిగ్రహానికి ప్రతిరూపం కాదా ఆ ఆటో ఆయన! విషాన్ని నిర్వచించమంటే "మనది కానిది" అన్నాడట ఒక జ్ఞాని. ఎంత సులువుగా చెప్పాడో!
కోట్లకొద్దీ స్వంత సంపదను సమాజానికిచ్చేసే ధనవంతులున్నారు. పదవిని తృణప్రాయంగా వదులుకునే మహనీయులున్నారు. మేం టూర్లకు వెళితే, మాకు ట్రావెల్ కంపెనీ వారు డ్రైవర్ కమ్ గైడ్‌ను ఇస్తారు. కారుతో బాటు ఖజురహోలో, అభిషేక్ పరిహాస్ అనే కుర్రవాడు, మా డ్రైవర్ కమ్ గైడ్. మాతోబాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, చేయమని ఎంత బలవంతం చేసినా, సున్నితంగా తిరస్కరించేవాడు! చివర్లో కొంత బక్షీస్ ఇవ్వబోతే తీసుకోలేదు. అపరిగ్రహం కాదు ఇది! ఇతన్ని చూసి పతంజలి ఋషి సంతోషిస్తాడా, లేదా చెప్పండి!
అదేదో సినిమాలో కోట శ్రీనివాస రావు లాగా ప్రతిదానికీ, “నాకేంటి" అనకుండా, మన పరిధిలో కొంత అపరిగ్రహాన్ని పాటిస్తే, దుష్ట గ్రహాలు మన జోలికి రావు! మొన్న రైతుబజారులో ఆకుకూరలు కొని, వంద నోటిచ్చి, చిల్లర తీసుకోవడం మరచి వచ్చేస్తుంటే, ఆ ముసలామె "ఓ సారూ! పిలుస్తుంటే ఉర్కవడ్తివి. చిల్లర దీస్కో!" అని నా వెనక పరిగెత్తుకొని వచ్చి, ఇచ్చి వెళ్ళింది. మా! తుఝే సలామ్!
అదన్న మాట!



No comments:

Post a Comment