Saturday, March 16, 2024

నోటాకే ఓటేస్తే - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ -17 మార్చ్ 2024

అప్పట్లో బ్యాలట్ పేపర్‌లో వరుసగా అభ్యర్థుల పేర్లు, ఆయా పార్టీల బొమ్మలు వరుసగా ఉండేవి. అందులో ఉన్న వారిలో మనకు ఎవ్వరూ నచ్చకపోయినా, మనమేం చేయలేని పరిస్థితి. చచ్చినట్లు ఎవరికో ఒకరికి ఓటు వేసి తీరాల్సివచ్చేది.
కొన్ని రాళ్ళు ఎదురుగా పెట్టి "ఏదో ఒక రాయితో నెత్తిన కొట్టుకోవలసిందే!" అన్నట్లు లేదూ? అప్పుడు చిన్న రాయిని ఎంచుకుంటాం. ఎందుకంటే, చిన్న దెబ్బ తగలాలని. ఎన్నికల ముందు ధర్మ పన్నాలు. వస్తూ ఉంటాయి. వ్యాసాలుగా, సోషియల్ మీడియాలో, విరివిగా! మీ ఓటు చాలా పవిత్రమైనదనీ, అవినీతి పరులను, నేర చరిత్రగల వారిని ఎన్నుకోకండని సచ్చీలురను, సమాజానికి మంచి చేసే వారిని మాత్రమే ఎన్నుకోవాలని, ఓటును అమ్ముకోవద్దని... ఇలా!
ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కాని ఎన్నికల్లో నిలబడే వారిలో 'సచ్చీలురు' దుర్భిణీ వేసి వెతికినా కనబడరే! అలాంటి వాళ్ళకు పార్టీలు టికెట్లు ఇవ్వనే ఇవ్వవు! గెలుపు గుర్రాలకే టికెట్లు! శీలం ఎవరికి కావాలి?
'నోటా' (NOTA) అంటే " None of the Above" అని విస్తృతార్థం. అదేనండీ అబ్రివియేషన్ అన్నమాట. పైన ఉన్న అభ్యర్థులెవరూ నాకు నచ్చలేదోచ్! అని చెప్పడం! ఈ విధానం చాలా దేశాల్లో అమల్లో ఉందండోయ్! 'అవ్వ పేరే ముసలమ్మ' అన్నట్లు, రకరకాల వెర్షన్‍లలో. కెనడాలోనట 'I don't support any one', ఫ్రాన్స్‌లో దీన్ని 'బ్లాంక్ నోట్' అంటారట. ఇండోనేసియాలో ఐతే 'Empty Box'. అమెరికాలోని నెవడా రాష్ట్రంలో NOTC (None of these Candidates). రష్యాలో దీన్ని 'Against All' (అందరికీ వ్యతిరేకం) అనేవారట. 2006లో దాన్ని రద్దు చేశారు.
'నోటా' గుర్తు మీకు తెలుసు కదా! నిలువుగా ఒక చతురస్రం. మధ్యలో నాలుగు పెద్ద, చిన్న అడ్డగీతలు, దాన్ని కొట్టివేస్తూ ఇంటూ (X) మార్కు! నాకెందుకో ఇది తెగ నచ్చుతుంది మరి! నాదంతా అదో టైపులెద్దురూ! 2009లో మన దేశ ఎన్నికల సంఘం 'నోటా'ను ప్రవేశపెడతామని సుప్రీంకోర్టుకు విన్నవిస్తే, ప్రభుత్వం వ్యతిరేకించిందట. వ్యతిరేకించక ముద్దెట్టుకుంటారా ఏమిటి కాని, పౌరహక్కుల ప్రజాసంఘం (People's Union for Social liberties) అనే ఒక స్వచ్చంద (ప్రభుత్వేతర) సంస్థ, ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో పడేసింది! ఇంకేం, 27 సెప్టెంబరు 2013న సుప్రీంకోర్టు, 'నోటా' ఉండాల్సిందేనని, వోటింగ్ యంత్రాలలో ' సదరు బొత్తాన్ని, అదేనండీ బటన్‌ను (అదేమిటో గాని, అచ్చతెలుగులో చెబితే అర్థమై చావదు) ప్రవేశపెట్టాలని ఆర్డరేసింది! ఈ కోర్టులు ఉన్నాయి గనుక సరిపోయిందిగాని, లేకపోతే... ఎందుకులెండి మాస్టారు!
ఎన్నికల సంఘం, నోటాకు పడిన ఓట్లను లెక్కెడతాం గానీ, వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తామని, డిపాజిట్ గల్లంతవడానికి, వాటిని పట్టించుకోమని తేల్చింది. మొత్తుకొని ముఖం కడుక్కున్నట్లుంది!


నోటా గురించి ఆ నోటా ఈ నోటా విన్న సచ్చీలురయిన ఓటర్లు (అభ్యర్థులు కాదు మహాప్రభూ..) 2014 సార్వత్రిక ఎన్నికలలో 1.1 శాతం ఓట్లను నోటాకే వేశారు! మొత్తం ఎన్నో తెలుసా మహాశయా, 6,000,000 ఓట్లు! నోటా సింబల్‌ను తయారు చేసిన సృజనశీలురు 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహమ్మదాబాద్' వారు.
'కెప్టెన్ ప్లానెట్' అన్న సిరీస్‌లో, ఆరో సీజన్ ఎపిసోడ్ నాకు గుర్తుకొస్తుందండోయ్! దాని పేరు 'డర్టీ పాలిటిక్స్'. అందులో ప్రెసిడెంట్ పదవికి నలుగురు పోటీ పడుతుంటారు. అందులో ముగ్గురు విలన్లు! నాలుగోవాడికి ప్రజల్లో మంచి పేరుంటుంది. ఇంకేం? ఈ ముగ్గురూ ఆ నాలుగో వాడిని 'కిడ్నాప్' చేస్తారు. అప్పుడు ప్రజలకు 'కోపమొచ్చి' 70 శాతానికి పైగా 'నోటా'కి వోటేస్తారు. మళ్ళీ ఎలక్షన్ జరపాల్సి వస్తుంది, నోటా పవర్ అలా ఉంటుం దాని సరదాగా (?) చూపించారా. సిరీస్‌లో!
నోటాను 'పళ్ళు లేని పులి'గా ది హిందూ పత్రిక రాసుకొచ్చింది. అప్పటి సి.జె.ఐ. రాజకీయ పార్టీలు, తమ అభ్యర్థి గెలవలేనప్పుడు, నోటాకు వోట్లు వేయించే ప్రమాదముందన్నారు!
కాని, క్రమంగా 'నోటా'కు ఆదరణ పెరుగుతున్నదండోయ్! ఓడిపోయిన వారిని ఎగతాళి చేయడానికి "కనీసం నోటా కొచ్చిన ఓట్లు కూడా రాలేదు పాపం!" అంటుంటాం. నాకు ఆ మధ్య ఒక కల వచ్చిందిలెండి! కలే సుమండీ! ఎలక్షన్లలో నోటాకు మెజారిటీ వచ్చిందట. అన్ని స్థానాలలో హేమాహేమీలందరూ చతికిల బడ్డారట! రాజ్యాంగ సంక్షోభం! అప్పుడు రాష్ట్రపతి తన విశేషాధికారాలను ఉపయోగించి, ప్రతి నియోజక వర్గం నుంచీ మేధావులను, శాస్త్రవేత్తలను అవినీతి మరకలు లేని (మరక మంచిదే అని మాత్రం అనకండేం. అదేదో యాడ్‍లో లాగా) విశ్రాంత ఐఏఎస్ లను సమాజ సేవకులను ఎంపిక చేసి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారట.
అందులో మంత్రులంతా తమ తమ శాఖల్లో నిష్ణాతులట. ప్రభుత్వ పదవీ కాలం రెండేళ్ళేనట! జై నోటా! అని నేను నిద్రలో అరుస్తుంటే మా ఆవిడ గట్టిగా కుదిపి నిద్రలేపింది! తెల్లారు జామున వచ్చే కలలు నిజమవుతాయట! ఏమిటీ, మూఢ నమ్మకమా! సరే అయితే! అదన్నమాట!





No comments:

Post a Comment