Sunday, March 31, 2024

మగవాళ్ళకీ ఉంది ఓ రోజు! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ -31 మార్చ్ 2024

మహిళా దినోత్సవానికి ఉన్నంత క్రేజ్ పురుష దినోత్సవానికి ఉండదు. ఆ మధ్య నవంబర్ 19వ తేదీన అనుకుంటాను. ఇది కూడా జరిపారు. పురుషులు ప్రపంచానికిచ్చిన పాజిటివ్ వ్యాల్యూస్ అనేది ఆ ఉత్సవం థీమట. బాగానే ఉంది.
పురుషాధిక్య సమాజమని, ఫెమినిస్టులు పళ్ళునూరు కుంటారు గానీ, అది పాత ముచ్చట. స్త్రీలు అబలలు కాదు, సబలలని ఎప్పుడో నిరూపించుకున్నారండోయ్! ఏదైనా పోటీలో ఒక మహిళ రాణించి, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందనుకోండి, అది గొప్ప వార్త. స్త్రీ జాతికే వన్నె తెచ్చిన అంటూ పొగిడేస్తారు. అదే మగవానికైతే, అంత సీన్ ఉండదు. మనక్కూడా దినోత్సవం ఉందా మిత్రమా? అని మా ఫ్రెండ్ డా. యల్లమంద హాశ్చర్యపోయినాడు. నాకప్పుడు అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందాన్ని అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. 'అయితే, మనం కూడా ప్రేమించవచ్చా గురువుగారూ?' అలా.
హమ్ ఔతోంసే కమ్ నహీ! అని మనం నిరూపించుకోవల్సిన తరుణం ఆసన్నమైంది పురుష శ్రేష్ఠులారా... ఐఎండి (ఇంటర్నేషనల్ మెన్స్ డే) ఒక అంతర్జాతీయ అవసరం... అని నేను బల్లగుద్ది వాదిస్తున్నా. గత నవంబర్లో 59 దేశాలు దీన్ని జరుపుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది లెండి. దీన్ని మొట్టమొదట 1992లో జరిపారు. థామస్ ఓస్టర్ అనే ఆయన దీన్ని ప్రారంభించాడు. 'మగజాతి పిత' అందామా ఆయన్ను? పదం అంత బాగున్నట్టు లేదు. ఫాదర్స్ డే ఉంది. అది కొంత బెటర్.
ఐఎండి రోజు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.



అవి.. కొందరు పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్‌ను (సినిమా, క్రికెట్ వాళ్ళు కాకుండా) వెలుగులోకి తేవడం, కుటుంబం, పిల్లల సంరక్షణలో వారి పాత్రను గ్లోరిఫై చేయడం, సమాజంలో పురుషుల పట్ల వివక్ష (?) ను నిరోధించడం.
అరవిందన్ భండారీ అనే ఆయన తన ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కుతున్నాడు చూడండి. "ఫెమినిజం అనే పదమే జెండర్ బయాస్డ్. దానికి బదులు 'ఎగలిటేరియన్' అన్న పదం పెట్టుకోవల్సింది. సమాన హక్కులకు సంబంధించిన ఉద్యమం అది. మనకు గృహ హింస చట్టం ఎందుకు లేదు? మనలో ఆత్మహత్యల రేటు ఎందుకు ఎక్కువ? మనల్నే ఎందుకు లోకం గిల్టీగా భావిస్తుంది. పురుష సాధికారత గుర్తించి ఎందుకు చర్చ జరగదు? ఫేక్ రేప్ ఆరోపణలు ఎందుకు పెరుగుతున్నాయి? మగవారిపై అత్యాచారాలను గురించి చట్టానికి పట్టదా?" ఇదీ వరస. నవ్వుతున్నారేం... నవ్వండి, నవ్వండి. అరవిందన్ బాధలో కొంతైనా నిజం లేదా చెప్పండి.
హోటళ్ళలో ఛెఫ్‍లు అంతా మనమే. నలపాకం, భీమపాకం అన్నారు. దీనిని బట్టి ఏం అర్థమైంది? ద్రౌపది, దమయంతి అసలు వంటలు చేసేవారు కాదనేకదా. ఆడవాళ్ళ మీద వచ్చినన్ని జోకులు, కార్టూన్లు మగవారి మీద ఎందుకు రావు? ఇదంతా వివక్ష కాదా అధ్యక్షా. మగవారిని ఆరాధించే మహిళలూ లేకపోలేదండోయ్. జస్లీన్ కౌర్ పూరి అనే రచయిత్రి 'ఆన్ లవింగ్ మెన్' అన్న అందమైన కవిత రాశారు (2018).
'గ్లాస్ నీలి కళ్ళు అతడు వెచ్చని చిరునవ్వును కలిగి ఉన్నాడు నేను, నాలా కాకుండా అతని మనసును సెన్సిటివ్‍గా ఆరాధించాను'.
థాంక్యూ మేడమ్. నిజమైన మగవాడు ఎవరో ఇలా చెప్పారు.. 'కష్టాల్లో నవ్వగలిగి, బాధలనుండి బలం పొంది ఆత్మ విశ్లేషణల వల్ల ధైర్యాన్ని పొందగలవాడు.' ఒక కొంటె పెద్దమనిషి కోట్... 'తనకంటే పొడవైన పెళ్ళాన్ని కూడా ఆనందంగా బయటకు తీసుకెళ్ళగలిగినవాడు'.
అయ్యా... ఇదంతా సరదాగా రాసిందే గానీ, ఆడవారి పట్ల నాకు ఆవగింజంతయినా చిన్న చూపు లేదుగాక లేదని మనవి, మహిళా దినోత్సవానికి ఉన్నంత ప్రాముఖ్యత పురుష దినోత్సవానికి ఎందుకు లేదని నా బాధ. దానికి వాళ్ళేం చేస్తారు. పాపం. ఎవరి దినం, సారీ, దినోత్సవం వారే జరుపుకోవాలి గాని.
నా పిచ్చిగానీ, సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే ముళ్ళపూడి వారు మాత్రం గడుసుగా 'మనం కొంచెం ఎక్కువ సమానం' అన్నారు గానీ, అబ్బే... అలా కుదరదు. మొత్తం మానవ జాతిని సూచించడానికి 'మ్యాన్' అంటారు. 'మాన్‌కైండ్' అంటారు. పురుష ప్రయత్నం అంటారు. అది చాలదూ మనకు? అయినా 'యత్ర నార్యస్తు పూజ, రమంతే తత్ర దేవతాః', 'ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి' లాంటి వాటిని బీట్ చేసే సూక్తులు మనకు లేవే? అనేది నా బాధ. 'ఆడవాళ్ళూ మీకు జోహార్!,', 'మగవాళ్ళూ మీకు రెండు జోహార్లు'... ఆగండి మనకూ ఓ రోజొస్తుంది! అదన్నమాట!



No comments:

Post a Comment