Sunday, April 28, 2024

గుంపులో చేరి అరుద్దాం! - దత్తవాక్కు - ఆదివారం ఆంద్రప్రభ 28 ఏప్రిల్ 2024

 ఈ మధ్య జరుగుతూన్న ఎలక్షన్ల హడావిడి, ప్రచారార్భాటం, వాగ్దాన వాగాడంబరాలు చూస్తుంటే నాకెందుకో ఛార్లెస్ డికెన్స్ గుర్తుకు వచ్చాడు. బోడి గుండుకు, మోకాలికి ముడిపెడుతున్నాడేమిటా అని మీ కనుబొమలు ముడిపెట్టకండి... నాయకులారా,
ఓటరు మహాశయులారా. ఈ 'మహాశయులు' అనే పదం ఎవరు కనిపెట్టారో కానీ ఇది నేతి బీరకాయలో నెయ్యి! కరిమింగిన వెలగపండు! ఇక చాలా... సరే సరే... ఎందుకన్నానంటే అటు వారికీ, ఇటు వీరికీ, అంత 'మహా' ఆశయాలు లేవు. ఉన్నాయని గుండెలమీద
చేతులు వేసుకుని చెప్పమనండి.
ఇంతకీ ఛార్లెస్ డికెన్స్‌ను అలా వదిలేశాం. 'అలివర్ ట్విస్ట్' లాంటి కరుణ రసాత్మకమైన నవలలే కాకుండా, సమాజంలోని కొన్ని అంశాలపై సున్నితమైన, వ్యంగ్య శరాలను కూడా సంధించాడాయన, ఆయన రాసిన సెటైర్ (వ్యంగ్య విమర్శ) ‘పిక్‌విక్ పేపర్స్'. ఇది నవల అనే చెప్పవచ్చు. డికెన్స్ 'బాజ్' అనే పేరు తో దీనిని ఎడిట్ చేశాడు. 1837లో ఇది పుస్తక రూపంలో వచ్చింది. డికెన్స్ తన 24 ఏళ్ల వయసులోనే ఒక పార్లమెంటరీ రిపోర్టర్‍గా పనిచేశాడు. ఇప్పటికీ ఇంగ్లాండులో 'పిక్‌విక్ క్లబ్' ఉందండోయ్.
ఆయన సృష్టించిన మిస్టర్ పిక్‍విక్‌ను మనం మన జంఘాలశాస్త్రితో, బారిస్టర్ పార్వతీశంతో, సత్యరాజాతో కొంతవరకు పోల్చవచ్చు. మన ఎన్నికల ప్రహసనాన్ని డికెన్స్... 13వ అధ్యాయంలో ప్రస్తావించాడు. అది ఒక వ్యంగ్యపు విందు, హాస్యపు చిందు, చురుక్కున తగిలే మందు, వెరసి మనసుకు పసందు! ఎలా ఉంది నా అనుప్రాస? అదేమిటి మొహమలా పెట్టారు? సరే... విషయానికి వస్తా.
ఈటన్స్ విల్ అనే ఊర్లో ఎన్నికలు జరుగుతుంటాయి. మిస్టర్ పిక్‍విక్ తన స్నేహితులు కొందరితో అక్కడికి వెళతాడు. రెండు పార్టీలు... హోరాహోరీ, కచాకచీ, ముష్టాముష్టీ, బాహాబాహీ పోరాడుతుంటాయి. వాటి పేర్లు బ్లూస్, బఫ్స్! రెండూ ఒక దాని మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటుంటాయి. అంత దుమ్మెక్కడిది? అంటున్నారా, తెప్పించుకుంటారండీ బాబూ! రెండు పార్టీల ఊరేగింపు ఒక చోట ఎదురవుతుంది. నినాదాలు నింగికెగిసేలా అరుస్తుంటారు. పిక్‍విక్ మిత్రులతో అంటాడు.

 


 " 'షౌంటింగ్ కంటెస్ట్' (కేకల పోటీ) నడుస్తున్నట్లుంది... ఎందుకైనా మంచిది... yell with the largest mob.. అంటే గుంపులో చేరి కేకలేద్దాం పదండి"
ఈ మాటకెంత ప్రాచుర్యం వచ్చిందంటే... అది ఒక సామెతై కూర్చుంది. ఇప్పటి రాజకీయ వలసలు చూస్తుంటే, ఆయన చెప్పింది నిత్యనూతనం. పార్టీల పేర్లు చూడండి ఎలా పెట్టాడో. బ్లూస్ అంటే 'ఏడుపుగొట్టు పాట' అనీ, ఈసురోమని ఉండటం అనీ అర్థం. బఫ్స్ అంటే కండబలం మెండుగా ఉండటం. మొత్తానికి ఇరు వర్గాలకూ బుర్రలేదని డికెన్స్ వారి అభిప్రాయం. ఈయన కొంటెతనం చూస్తే నాకు డి.వి.నరసరాజు గారు గుర్తొస్తారు. ఆయనా వ్యంగ్య ధురీణుడే!
బ్లూస్ పార్టీకి ఎన్నికల సలహాదారు 'పెర్కర్'. వారికి సొంత న్యూస్ పేపర్ కూడా ఉందం డోయ్. దాని ఎడిటర్ మిస్టర్ పాట్. ఆయనను pompous wind bag అంటాడు రచయిత. అంటే స్థూలకాయడని. ఆయనింట్లోనే వీరి బస. వీళ్లు మర్నాడు బ్లూస్ పార్టీ ఊరేగింపులో ఉంటారు. బఫ్స్ వారి ఊరేగింపు వీరిని అటకాయిస్తుంది. బ్లూస్ వారి అభ్యర్థి 'శామ్యుయల్ స్లమ్‍కీ’ ప్రచారానికి బయల్దేరేముందు తన సహాయకునితో ఇలా అంటాడు. "షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఒక పేద యువకుడిని, పాదాభివందనం చేయడానికి ఒక పెద్దాయనను, కౌగిలించుకో డానికొక వికలాంగుని, అక్కున చేర్చుకోవడానికొక ముసలవ్వను, ఎత్తుకుని ముద్దాడటానికొక పసి పాపను రెడీగా ఉంచారా లేదా". అమ్మ డికెనూ! దాదాపు 180 ఏళ్ల క్రిందటే మా నాయకులు ప్రజలతో మమేకం కావడంలోని మర్మాన్ని బయటపెట్టేశావే! శబ్బాసురా శంకరా.
బఫ్స్ పార్టీ అభ్యర్థి హొరేషియోగారు. ఓట్ల లెక్కింపులో 'టై' ఏర్పడి సమీయే గెలుస్తాడు. పెర్కర్ ఆయన గెలవడానికి తగిన 'లంచాలను' పెద్ద ఎత్తున ఓటర్లకిచ్చి ఉంటాడు. అయ్యా... అదీ సంగతి. ఏమంటే... అప్పటికింకా వ్యక్తిగత దూషణలున్నట్లు లేదు. ఎవరు గెలుస్తారు? ఏముద్ధరిస్తారు... అనేది పక్కన బెడితే... ఈ ప్రహసనమంతా చక్కని వ్యంగ్య వినోదంగా మలచిన డికెన్స్‌కు ఆయన సృష్టించిన మిస్టర్ పిక్‍విక్‌కు జై! మనలాంటి మధ్య తరగతి మందహాసాలకు ఎన్నికలు ఒక చక్కని వినోదం! ఆ మందహాసంలో ఒక నిస్సహాయ విషాదం కూడా ఉంది! కానివ్వండి! అదన్నమాట.

No comments:

Post a Comment