Sunday, June 2, 2024

మాటలకు 'ఊతం'గా - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 2 జూన్ 2024

మొన్న యూ ట్యూబ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల విషయాలను ప్రత్యేకంగా ప్రసారం చేసే ఒక ఛానెల్ చూశాను. ఆ వీడియోకారుడు ఇలా చెబుతున్నాడు... 'ఒక తాజా సమాచారమైతే ఇప్పుడైతే వచ్చింది. ప్రభుత్వమైతే ఒక డిఎనైతే విడుదల చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లయితే సంబరాలు చేసుకుంటున్నారు. దీని బకాయిలనైతే...' ఇలా ఒక్క వ్యాక్యంలో ఏడు 'ఐతే'లు, అవసరమా చెప్పండి?
ఏదైనా విషయాన్ని చెప్పే క్రమంలో చాలామంది కొన్నిరకాల ఊతపదాలను వాడుతుంటారు. అది సహజం. మధ్యలో ఆలోచించుకోవడానికి ఇవి పనికొస్తాయి. వీటిని 'గ్యాప్ ఫిల్లర్స్' (ఖాళీలను పూడ్చేవి?) అనవచ్చు. కానీ ఊతలు శృతిమించితే విసుగు పుట్టిస్తాయి. ఈ మధ్య అందరూ ఎక్కువగా వాడే ఊతపదం 'ఏదైతే ఉందో'. ఇంగ్లీషులో 'దట్ విచ్'తో మొదలయ్యే ఒక 'సబార్డినేట్ క్లాజ్' ఉంది. నిర్వచించడానికి దీనిని వాడతారు. తెలుగు భాష నేటివిటీలో ఆ విధానం లేదు. ‘ఈ అవినీతి ఏదైతే ఉందో...' అని మొదలుపెట్టి 'అది సమాజాన్ని నాశనం చేస్తుంద'ని అంటాడొకాయన. 'ఈ అవినీతి సమాజాన్ని...' అని చెబితే చాలదా? ఈ ప్రయోగం ముఖ్యంగా వక్తల్లో ఎక్కువగా కనబడుతుంది.
'పోతే' అనే పదం ఒకటుంది. తర్వాత అంశాన్ని సూచించడానికి దీనిని వాడతారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం పాత్ర ద్వారా దీనిని వెక్కిరించారు. వేదిక మీద బ్రహ్మానందం ముఖ్య అతిథి రామబ్రహ్మం గారు... పోతే... ఆత్మీయ అతిథి రాజశేఖరం గారు... పోతే... అనుకోని అతిథి శేషాచలం గారు... పోతే...' అని చెబుతుంటాడు. ఇంకో అర్థం రాలేదూ?! సంస్కృతంలో 'తు, హి, వై పాదపూరణీ!" అని ఒక సూత్రం ఉంది. ఛందస్సులో ఒక మాత్ర తక్కువైతే 'గ్యాప్ ఫిల్లర్స్' గా వీటిని వేసుకోవచ్చు. 'ఖలు' అని ఒకటుంది. ఇవన్నీ అవ్యయాలు. 'ఖలు' అంటే 'కదా' అని అర్థం. 'శరీర మాధ్యం ఖలు ధర్మసాధనమ్!' ఇలాంటి వాటికి కొంత శాస్త్రీయ ప్రమాణం ఉంది. 'జాతస్య ‘హి' ధృవం మృత్యు?', 'ఆత్మా 'వై' పుత్రనామాసి', 'భవభూ తిస్తుపండితః'... తెలుగు ఛందస్సులో ఈ సులువు లేదు. 


నేను 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజేస్' (సిఐఇఎఫ్ఎల్)లో పిజిడిటిఇ (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్) అనే కోర్సు చేశార్లెండి. చాలామంది నన్ను తెలుగు పంతులనుకుంటారు కానీ, నేను ఇంగ్లీషు మాస్టర్నే సుమండీ! అప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ ఒకాయన 'ఫొనెటిక్స్' అనే సబ్జక్టుకి వచ్చేవారు. తను లెక్చరిచ్చిన గంటసేపట్లో 'అఫ్‌కోర్స్' అనే మాటని పదేపదే వాడుతుండేవారు. ప్రతి వాక్యంలో మినిమం రెండు అఫ్‌కోర్సులు. ఒక రోజు నేను మా ఫ్రెండ్ ఉదయకుమార్ జాగ్రత్తగా వాటిని లెక్కపెట్టాము. మొత్తం 187 తేలాయి. ఇంతకీ 'అఫ్‌కోర్స్' అంటే అర్థమేమిటో? 'పాఠకులకు బాగా తెలిసినదే, వేరే చెప్పాల్సిన పని లేదు' అని కవి హృదయం.
మా నాన్నగారికి ఒక ఊతపదం ఉండేది. మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో 'దేవుడు మేలుచేస్తే' అనేవారు. మా ఇంటికి చెరుకుల పాడు సిద్దాంతి అని ఒకాయన వచ్చేవారు. ఆయన ఊతపదం 'అంజెప్పి' (అని చెప్పి). 'స్వామీ పనిమీదంజెప్పి వెల్దుర్తికి వచ్చినాను. మిమ్మల్ని చూసి పోదామంజెప్పి ఇట్లా రావడమైంది. నిన్న దుర్గాష్టమంజెప్పి ఖడ్గమాల పారాయణం చేసినాను. అమ్మవారి కుంకుమ మీకు ఇస్తామంజెప్పి...' ఇలా సాగేదాయన వాక్ప్రవాహం.
సినిమాల్లో కూడా ఈ ఊత పదాలు అలరించాయి. అదేమిటో గాని, ఆర్ నాగేశ్వరరావుకు ఎప్పుడూ దుశ్శాశనుని పాత్రే. మాయా బజార్ లోనో, మరి దేంట్లోనో 'అదే మన తక్షణ కర్తవ్యం' అనే ఒకే ఒక్క డైలాగు ఆయనకుంటుంది. దానినే ప్రతిచోటా వాడతాడు. 'మహా మంత్రి తిమ్మరుసు' అనే సినిమాలో లింగమూర్తి అనే గొప్ప నటుడుంటాడు. తనికెళ్ల భరణి గారికి ఆయన అభిమాన నటుడు. ఈ విషయం భరణిగారే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. లింగమూర్తి అందులో విలన్. ‘జగన్నాధ! జగన్నాధ!' అని మాటిమాటికీ అంటుంటాడు. అట్లే 'పరమానందయ్య శిష్యుల కథ'లో ముక్కామల గారు, ఆయనా గొప్ప నటుడే. ఆయనా అందులో విలనే. 'మహాదేవ, మహాదేవ' అనేది ఆయన ఊతపదం. లింగమూర్తి, ముక్కామల వాటిని ఎన్నోరకాలుగా, విభిన్న షేడ్స్ ఆఫ్ మీనింగ్ చెబుతూ అభినయిస్తూంటే ప్రేక్షకులకు వినోదంతో పాటు ఆశ్చర్యం! 'ఆ ఒక్కటీ అడక్కు'లో రావుగోపాలరావు 'సపోజ్, పర్ సపోజ్' అంటూ ప్రతివాక్యాన్ని ప్రారంభిస్తారు.
ఊత అంటే సపోర్టు. పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్లుంది కదండీ! దాన్ని మన మాటల్లో వంటల్లో ఉప్పులా జాగ్రత్తగా వాడాలని నా ఉద్దేశం. ఉప్పెక్కువైతే తినలేం! ఊతమెక్కువైతే వినలేం! ఈ ఊతపదం ఏదైతే ఉందో... ఇదేమిటి, నాకూ అంటుకున్నట్లుంది. మరైతే, నేనైతే, ఉంటానైతే! అదన్నమాట.

2 comments:

  1. సమాజం లోని అసహజాలను ఎత్తి చూపుతూ, వాటికి హాస్యం జోడించి చురుక్కుమనిపించి అంతలోనే "అవును కదా" అనిపించి, లోకం పోకడను చమత్కారంగా చెబుతూ చివర్లో ఒక ఆత్మ విమర్శ లాంటి సందేశం వదులుతారు దత్తశర్మ గారు తన 'దత్త వాక్కు'లో.
    పాణ్యం శంకర కుమార శర్మ గారి అభిప్రాయం

    ReplyDelete
  2. ఊతనిచ్చింది

    ReplyDelete