Sunday, June 30, 2024

హ్యుమరిజం - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 30 జూన్ 2024

 అవును! తమరు సరిగ్గానే చదివారు. అప్పు తచ్చు కానే కాదు! ఇదేమిటి, సోషలిజం, కమ్యూనిజం, హ్యూమనిజం, ఫెమినిజం లాంటి ఎన్నో ఇజాలను గురించి విన్నాము. కానీ ఈ హ్యూమరిజం ఏమిటి మహాప్రభూ అంటున్నారా? వాటన్నింటికంటే ఇది చాలా పవర్ఫుల్లండీ మాస్టారు! దీన్ని అనుసరించేవారు జనప్రియులవుతారు. రోగాలు, రొష్టులు ఉండవు. లైఫంతా హ్యాపీస్! (హ్యాపీకి బహువచనం ఉంటుందా? అని కదా మీ శంక! 'సినిమా ప్రయోగాణాం సాదు' అంటే సినిమా వాళ్ళు ప్రయోగించిన భాషా ప్రయోగాలు కరక్టే! దీన్నెవ్వరు చెప్పారో నాకు తెల్వద్! గొప్ప రచయితలు, రాజకీయవేత్తలు, చివరికి వేదాంతులు కూడా తమ హాస్య స్పూర్తిని చాటి వారి హాస్యోక్తులతో పాపులర్ అయ్యారు. వాటిని మన కాలమ్‌లో పలుకరించాం, అడపదడపా. ఉప్పుడు నేనే తంతానంతే... మనలాంటి మామూలోళ్ళు గూడా హ్యూమరిజాన్ని చక్కగా పండిస్తారు. నేను పలాస ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేస్తున్న బంగారు కాలం. అప్పుడు మా కొలీగ్స్ చాలా మంది హ్యూమరిస్టులే. తవిటయ్య మా అటెండర్. మా తెలుగు మాస్టారు యల్లమందను "బావూ... టయమెంతయినాదేటీ?" అని అడిగాడొకసారి. ఈయన చేతివాచీ చూసి "యాభై.. తక్కువ మూడు" అన్నాడు గంభీరంగా! అంటే రెండూ పది! తవిటయ్యకి అర్థం కాక బుర్రగోక్కుంటూ "ఏటో ఈ తెలుగు బావు. ఇకట మాట్తాండు నా తోన" అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంఎస్ఎన్ మూర్తిగారు మా కెమిస్ట్రీ మాస్టారు. వికటకవినే ఆటపట్టించగల సమర్థుడు. మాది పెద్ద కాలేజీ. ముగ్గురం ఇంగ్లీషు లెక్చరర్లం. మేం కలిసి వస్తూంటే ఎమ్మెస్సెన్ గారు "అదిగో ఆంగ్లేయులు వస్తున్నారు" అనేవారు. స్టాఫ్ రూంలో ఆయన జోకులు బ్రహ్మాండంగా పేలేవి. నన్ను "ఇంగ్లీషు మాస్టారూ! మీకు ఇంగ్లీషు కంటే తెలుగు బాగా వచ్చటకదా! నాక్కొన్ని డౌట్స్ ఉన్నాయి తీరుస్తారా?" అని అడిగారు. 'చెప్పండి గురువుగారు' అని అన్నా. "'పులిహోర' ఉంది కానీ, 'సింహం హోర' ఎందుకు లేదు?, 'పెరుగు పచ్చడి' ఉంది కానీ, 'పాలపచ్చడి' ఎందుకు లేదు?" అన్నారు. నేను పిచ్చి మొగం వేసి, నాకు తెలియదన్నాను. "మీరే చెప్పండి మాస్టారు" అన్నాను. "నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా కుర్ర మాస్టారు?" అని నన్నే దబాయించారు. నియోగి బ్రాహ్మణుడాయన. పొట్టనిండా ఇలాంటి ఐడియాలే!



నర్సీపట్నం బాలుర కాలేజీ... మా లెక్కల మాస్టారు బండారు రామకృష్ణగారు. ఇద్దరం బావా అంటే బావా అని పిలుచుకునేంత చనువు. ఆయనా హ్యూమరిజాన్ని ఔపోసన పట్టినవాడే. మామూలుగా ఏదీ చెప్పడు. అంతా హ్యాస్యప్లావితమే. ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తుంటాడు మా బావ. ఒకసారి "బావా! వెళ్ళి పాలప్యాకెట్ తెచ్చుకోపో" అన్నాడు. "ఎందుకు బావా?" అని అడిగితే, "మన పెన్షన్ పడింది, ముఖ్యమంత్రిగారి ఫోటోకు పాలాభిషేకం చేయవా?" అంటాడు. నా రచనకు ఉత్తమ పురస్కారం వచ్చిందని చెబితే "బావా! నీ వొక్క విషయం మాత్రం మరువకు. నేను రాయడం లేదు కాబట్టి నీకు అవార్డులు వస్తున్నాయి!" అన్నాడు. "నిజమే బావా" అన్నాను నవ్వుతూ.
నాంపల్లి ఇంటర్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీగా పని చేసే రోజులు. బషీర్ అహ్మద్ గారని స్పెషల్ ఆఫీసర్. ఉర్దూ హాస్య చతురుడు. ఆయనను అందరం బషీరన్న అనేవాళ్ళం. ఆయన మాత్రం నన్ను దత్తన్నా అని పిలిచేవాడు. పబ్లిక్ రిలేషన్స్, ప్రెస్ రిలేషన్స్, సమాచార హక్కు చట్టం... ఇవన్నీ నేను చూసేవాడిని. "దత్తన్నా అని పిలిస్తే చాలు ఒత్తన్నా అని వచ్చేస్తాడు" అని అనేవాడు నన్ను. మా కమిషనర్ చక్రపాణి గారు హాస్య ప్రియులు. అప్పుడు కమిషనరేటు బోర్డుకు వేర్వేరు -ఐఏఎస్ అధికారులు ఉండేవారు. ఒక సమావేశంలో చక్రపాణిగా రన్నారు. వేదికపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా ఉన్నారు. "మా కమిషనరేట్ శివాలయం, బోర్డు విష్ణాలయం". ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. బోర్డు ప్రైవేటు కాలేజీలను, పరీక్షలను ఫలితాలను పర్యవేక్షిస్తుంది కనుక కాసులు గలగల! కానీ కమిషనరేట్ కేవలం ప్రభుత్వ కాలేజీలనే పర్యవేక్షిస్తుంది. డబ్బులుండవు. చక్రపాణి గారు ఆ విషయం వివరించేసరికి సభలో నవ్వులు. 'వైభోగ ప్రియో విష్ణుః వైరాగ్య ప్రియో శివః' అన్నారు కదా!
బారువ కళాశాలలో పని చేసేటప్పుడు గున్నరాజుగారు మా ప్రిన్సిపాల్. ఫిజిక్స్ ఆయన సబ్జెక్టు. అప్పుడు హైస్కూలు, జూనియర్ కాలేజీ కొన్ని చోట్ల కలిసి ఉండేవి. సహజంగానే ప్రిన్సిపాల్ గారు మా లెక్చరర్లకు కొంత మినహాయింపులిచ్చేవారు. స్కూలు టీచర్లకు అది నచ్చేది కాదు. బెహరా అనే తెలుగు టీచరు టీచర్స్ డే నాడు ప్రసంగిస్తూ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. ఆయనకు వినత కంటే కద్రువ అంటే ఎక్కువిష్టం అన్నారు. అర్ధం అయింది కదా! ప్రిన్సిపాల్ గారి మీద చెణుకు.
పలాసలో మా ప్రిన్సిపాల్ నిష్ఠల సుబ్బారావుగారు డిసిప్లినేరియన్. ప్రేయర్లో ఒక పిల్లవాడు అల్లరి చేస్తుంటే మందలించారు గట్టిగా. వెనుక నుంచి ఒక కుర్రవాడు "సుబ్బారావుకు కోపం వచ్చింది!” అని అరిచాడు. సరిగ్గా అదే పేరుతో ఉన్న సినిమా ఆడుతోంది టౌన్
లో. ఆశ్చర్యం! ప్రిన్సిపాల్ గారికి కోపం రాలేదు సరిగదా హాయిగా నవ్వేశారు. దటీజ్ ది స్పిరిట్! కాబట్టి కామ్రేడ్స్! హ్యూమరిజంలో చేరండి. సంతోషం సగం బలం! అదన్నమాట!

2 comments:

  1. బాబూ.....ఇది పులిహోర, సింహం హోరా కాదూ. పుళి (చింతపండు )హార .

    పెరుగులో ఉప్పు , మిరప కారం ఏదన్నా కాయగూరో, ఉల్లిపాయో వేస్తే పెరుగు పచ్చడి .
    పాలలో... ఉప్పు , కారం వేస్తే అవి విరిగిపోతాయి కదా... పచ్చడి చేయలేము కదా .

    ReplyDelete
  2. అనుభవం రంగరించి మదించి వెలికి తీసిన హాస్యం దత్తవక్కులో చక్కగా పండింది

    ReplyDelete