ఇదేమిటి? సంస్కృతం... అంటున్నారా? యూ ట్యూబ్‍ని సంస్కృతీకరించానన్నమాట! ముఖం అదోలా పెట్టారేమిటి? బాగులేదా? నిజమేలెండి! కొన్ని ఇంగ్లీషులోనే ఉంటే బాగుంటాయి. అనువాదం చేస్తే అదోలా ఉంటాయి. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వర కూ సుందోపసుందుల్లా, నివాతకవచుల్లా మనల్ని పట్టి పీడించేవి ఈ రెండూ నండోయ్! అవే త్వం-నాళం, ముఖ పుస్తకం! అంటే, యూ ట్యూబు, ఫేస్‍బుక్కు అన్న మాట. ఆహార నిద్రా భయ మైథునముల తర్వాత అత్యంత అవసరమైనవి అయి కూర్చున్నాయివి. మళ్ళీ మాట్లాడితే వాటికంటే ఎక్కువ అవసరమైనవి!
ఇంతకీ ఈ యూ ట్యూబ్ కథాకమామిషూ (దీనర్థం నాకు తెలియదు బాబోయ్!) ఏమిటిష? గూగుల్ తల్లి సంతానమేనట ఈ గొట్టం! ఆన్‍లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారం అన్న మాట. ఫిబ్రవరి 14, 2005 నాడు దీన్ని మొదలెట్టారు కాలిఫోర్నియాలో. దీన్ని రూపొందించిన స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావెద్ కరీమ్ గారలు ఎంత పనిచేశారండీ బాబూ! దానికి అడిక్ట్ అయిపోయి, మాకంటూ సొంత అభిప్రాయం లేకుండా అయిపోయాం! గూగుల్ సెర్చ్ తర్వాత అధిక సంఖ్యాకులు దర్శించేది ఈ గొట్టమే. 2.5 మిలియన్ల ఉత్సాహవంతులు, రోజూ ఒక బిలియన్ గంటల పాటు దీన్నే చూ....స్తూ ఉంటారట. నిమిషానికి 500-600 గంటల కంటెంట్ వీడియోల రూపంలో అప్‌లోడ్ అవుతూందట. మళ్ళీ దీనిలో యూ ట్యూబ్ కిడ్స్, యూ ట్యూబ్ మ్యూజిక్, యూ ట్యూబ్ ప్రీమియం, ఇలా దాని పిల్లలు.
మనం పైసా కట్టక్కర్లేదు కదా. ఆ గొట్టం వాళ్లకు (వేరే ఉద్దేశ్యం లేదండీ బాబు) ఆదాయం ఎలా? అంటే ప్రకటనల ద్వారా. అబ్బే! మాకు ప్రకటనలు లేకుండా గొట్టాన్ని ప్రదర్శించండి అన్నామనుకోండి. దానికి వేరే రుసుము వసూలు చేస్తారు.
యూ ట్యూబులో 'అన్నీ' ఉంటాయి. రాజకీయాల నుంచి రాసలీలల వరకు. వీడియో పెట్టిన వారికి, దాన్ని ఎంతమంది చూస్తే అన్ని డబ్బులొస్తాయట. రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు యూ ట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని వారి వారి సొంత అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఎవరిది కరెక్టో తెలియక జుట్టు పీక్కోవాల్సింది మనం. ఎన్నికల ఫలితాలప్పుడు చూడాలి... 'మచ్ అడో అబౌట్ నథింగ్' అన్న సామెత గుర్తొస్తుంది. నాకు. ఢంకా భజాయించి, బల్లగుద్ది ఫలానా పార్టీకి ఇన్నిసీట్లు వస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ ఉంటారు. ఫలితాలు వచ్చిన తర్వాత చేపలు బయటపడి వీరి విశ్వరూపాలు వికృతరూపాలని తెలిసి పోతుంది మనకు.
యూ ట్యూబ్ వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు హాయిగా పైసా ఖర్చులేకుండా చూసేయవచ్చు. స్మార్ట్ టీవీ ఉంటే చక్కగా పెద్ద తెర మీదే యూ ట్యూబ్‍ను చూడొచ్చు. శాస్త్రీయ సంగీతం, పాత సినిమా పాటల వీడియోలు చూడవచ్చు. యూ ట్యూబ్‍లో లేనిది లేదు. 'కలడంబోధి, కలండు గాలి, కలడాకాశంబునన్, కుంభినన్' అని ప్రహ్లాదకుమారుడు హరిని గురించి తన తండ్రితో చెప్పినట్టు సర్వం ఉంటాయి. మనం సెర్చ్ స్పెల్లింగ్ తప్పుగా టైప్ చేసినా, దానికి సంబంధించింది ఒకటి ప్రత్యక్షమవుతుంది.
'అపియరెన్సెస్ ఆర్ ది డిసెప్టివ్' అన్నాడు మహాకవి షేక్‌స్పియర్. 'మెరిసేదంతా మేలిమి కాదు' అన్నది దీనికి అనువాదం. పైన 'ముఖ్యమంత్రిపై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు...' అని ఉంటుంది. మనకు ముందే జిజ్ఞాస ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ కదా! ఓపెన్ చేస్తే ఆ మహేష్‍బాబు ముఖ్యమంత్రిని ఏదో రొటీన్‌గా పొగిడి ఉంటాడు. 'బాగా పేరున్న నటుడు అకాల మరణం, షాక్ లో టాలీవుడ్...' అని ఉంటుంది. తీరా చూస్తే, ఆయన మనం అనుకున్నవాడయి ఉండడు. అదే పేరు కొంత కలిసిఉన్న ఒక అనామక నటుడు. ఇక మా ఉద్యోగ పెన్షనర్ల సంఘాల వాళ్ళు పెట్టే క్యాప్షన్లు మరీ టూమచ్! 40 శాతం ఫిట్‌మెంట్‍కు సిఎం అంగీకారం? చివర ఆ క్వశ్చన్ మార్కులోనే ఉంటుంది కీలకం. తీరా ఓపెన్ చేసి చూస్తే అది ఆ యూట్యూబ్‌దారుని సొంత పైత్యం. సుప్రీంకోర్టు ఇవ్వని తీర్పులు కూడా ఇచ్చేస్తారు వీళ్ళు.
యూ ట్యూబ్‍లో వంటలు చేసి చూపించేవాళ్ళే పాపం నిజాయితీపరులనిపిస్తుంది నాకు. వాళ్ళల్లో లక్షలు సంపాదించే వాళ్ళున్నారట. పళని స్వామి అనే ఆయన దట్టంగా వీభూతి రేకలు, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని కందా బచ్చలికూర, శివంగి పులుసు, ఉప్పుడు పిండి లాంటి వంటలు చేసి చూపిస్తుంటాడు. ఆయన భాష శిష్టవ్యావహారికం. ఆయనకు లక్షల్లో వ్యూస్! ఒంగోలు గంగాళం ఉప్మా ఎలా చేయాలో ఓ అమ్మడు వివరిస్తుంది. కడప కారం దోసె ఎలా వేయాలో ఓ కుర్రవాడు నేర్పిస్తాడు. ఉరవకొండ ఉగ్గాని బజ్జి, ఇలా... ఎన్నో. ఇంతకీ నాకో డౌటనుమానం... ఇవన్నీ చూసి మనం ఇంట్లో చేస్తే అలాగే కుదురుతాయంటారా?
యూ ట్యూబ్ సోషల్ మీడియాలో ఒక భాగమే. అది రెండు వైపులా పదునున్న కత్తి. మంచి, చెడు రెండూ ఉన్నాయి. యూ ట్యూబ్ కిడ్స్‌లో పరమ పాశవికమైన, హ్యూమన్ ఎలిమెంట్ అసలు లేని జుగుప్సాకర వీడియోలుంటాయి. పిల్లలు అవి చూస్తుంటారు. వారిని నియంత్రించే టైము తల్లితండ్రులకు ఉండదు. యూ ట్యూబ్ విశ్లేషణలను ఏకపక్షంగా చూసి చూసి, వీరాభిమానాలు, వీరావేశాలు పెంచుకుని, బంధు మిత్రులతో వైరాలు తెచ్చుకున్న వారున్నారు! అంత సీను అవసరమా చెప్పండి!
సమాచారం సదాచారం కావాలి కానీ, అనాచారం కాకూడదండి. ఏ ట్యూబయితే ఏమి తలపగల గొట్టుకోవడానికి అన్నట్టు... అతీతంగా ఉండాలి. అదన్న మాట.
యూట్యూబ్ పుట్టుపూర్వోత్తరాలు,లాభ నష్టాలూ, జాగ్రత్తలు చమత్కారంగా చెప్పబడినవి
ReplyDeleteత్వం నాళంకి అతీతంగా ఉండగలమా? నావల్ల అయితే కాదు.
ReplyDelete