వ్యాపార ప్రకటనలు జనాల్ని ఎలా ముంచెత్తుతున్నాయంటే వాళ్లు ఉక్కిరిబిక్కిరై ఏది కొనాలో, ఏది కొనకూడదో తెలియక సతమతమవుతున్నారు. ప్రకటన నిర్వచనం 'ఒక ఉత్పత్తిని గాని, ఒక బ్రాండ్‌ని గాని, సేవను గాని ప్రమోట్ చేసే భావ వ్యక్తీకరణ సాధనం.' దాని ద్వారా వీక్షకులకు, పాఠకులకు దగ్గరయ్యే సులభమార్గం. వారిలో ఆసక్తిని రేకెత్తించి యాడ్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నదాన్ని కొనాలనిపింప చేసే మార్గం. ఓకేనండీ... అంత వరకు బాగానే ఉంది. అడ్వర్టయిజ్‍మెంట్‌ను కుదించి యాడ్ అంటున్నారు. వేల కోట్ల రూపాయలతో వ్యవహారం ఇది. దాంతో నాకేమీ పేచీ లేదు మాస్టారు. వాటిల్లో మనకు కాస్త వినోదం దొరుకుతుందేమో చూద్దామని..
ఒకప్పటి ఋతురాగాలు, అంతరంగాలు, మొగలిరేకులు, చక్రవాకం లాంటి బహుళ జనాదరణ పొందిన సీరియల్స్ నుండి ఈనాటి కార్తీకదీపం, ఎన్నెన్నో జన్మల బంధం వరకు అసలు కంటెంట్ కంటే యాడ్స్ కంటెంట్ ఎక్కువై వీక్షకులకు విసుగు కలిగిస్తోంది. ఇప్పుడు ఓటీటీల్లో వాటిని కొంతవరకు స్కిప్ చేసే ఆప్షన్ ఉంటున్నది. కానీ రెగ్యులర్ టీవీ ఛానళ్లలో మటుకు చచ్చినట్టు యాడ్స్‌ని భరించాల్సిందే. మా అబ్బాయి ప్రహ్లాద్ ఏడాది పిల్లవాడిగా ఉన్నపుడు... టీవీలో యాడ్స్ వస్తున్నట్టు వాడికి ఎలా తెలిసిపోయేదో గానీ, పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడి మరీ వాటిని అతి శ్రద్ధగా చూసేవాడు. ఛానల్ మారుస్తే ఏడ్చేవాడు. మళ్లీ సీరియల్ రాగానే ఆడుకోడానికి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు వాడు 'ఫ్రాంచైజీ ఇండియా'కు చీఫ్ కన్సల్టెంటు. మార్కెటింగ్ స్ట్రేటజిస్టు కూడా. 'పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది' అంటే ఇదేనేమో. సర్లెండి... కాకిపిల్ల కాకికి ముద్దు!
'మీ టూత్ పేస్టులో ఉప్పుందా' అని అడుగుతూ మైక్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది ఒక అందమైన చిన్నది. ఎక్కడలేని మూలికలన్నీ వాళ్ల పేస్టులో కలిపేశామని కొందరు ఊదరగొడుతుంటారు. మా చిన్నపుడు సుమండీ... నీళ్లు కాచుకునే హండా (గంగాళం) కింద వరిపొట్టు బూడిదగా మారితే దానికి కొంచెం ఉప్పును, కొంచెం పచ్చ కర్పూరాన్ని కలిపి టూత్ పౌడర్‌గా వాడే వాళ్లం. బ్రష్‌లంటే మాకు తెలియదు. వేలితో పళ్లు తోముకోవడమే. ఇలా పాతకాలం టెక్నిక్ లను ఆధునీకరించి, సొమ్ము చేసుకుంటున్నారు. అన్నం వార్చిన గంజిని, చల్లార్చిన తర్వాత ముఖానికి మసాజ్ చేసుకుంటే ముఖానికి కాంతి వస్తుంది. దాన్ని 'రైస్ వాటర్' అని, జెల్‍గా మార్చి ఊరికే దొరికేదానికి వందల్లో వసూలు చేస్తారు, యాడ్స్ ప్రమోట్ చేసి.
ఒకామె ఎలక్ట్రానిక్ కుక్కర్ యాడ్‍లో 'క్యారట్ హల్వా... అరగంటలో' అని గొప్పగా చెబుతుంది. క్యారట్ హల్వాను బయట పొయ్యిమీద చేసినా పది నిముషాలకంటే పట్టదు! యాడ్స్ వాళ్లు కనిపెట్టిన విశ్వసత్యాలు కొన్ని ఉన్నాయి. 'మరక మంచిదే' అంటారు. ఎందుకంటే మంచిపని చేసేటప్పుడు పడింది కాబట్టి. నిజమే కదా... ఇంకొకరు సంస్కారవంతమైన సోప్ అంటూ వస్తారు. సోపని వాడేవారు సంస్కారవంతులవుతారని చెప్పాలి గాని, సోపే సంస్కారవంతురాలు ఎలా అవుతుందో మరి. ఇంట్లో దూరి టాయిలెట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తుంటారు. నాకు తెలిసి అలా ఇంటికి ఎవరూ రారు. వాక్యూం క్లీనర్ సేల్స్‌మెన్ మాత్రం అలా వస్తుంటారు. వాళ్లను ఒక సినిమాలో ఆటపట్టించారు. శుభలేఖ సుధాకర్ ఆ పాత్రలో వచ్చి ఇల్లంతా చెత్తపోసి క్షణంలో దీన్నంతా క్లీన్ చేస్తా చూడండని వాక్యూం క్లీనర్ని ఆన్ చేస్తాడు. కానీ అది కిమ్మనదు. ఎందుకంటే కరెంట్ పోయింది!
యాడ్స్ కొండొకచో కవితాత్మకంగా కూడా ఉంటాయి సారు. చాలాకాలం క్రిందటి సంగతి. 'విల్స్' అనే సిగరెట్ కంపెనీవారు పెద్ద పెద్ద హోర్డింగులను పెట్టేవారు. దానిమీద మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని పెద్ద అక్షరాలతో ఉండేది. ఒక అందమైన జంట నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది. ఇంతకీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్లు కాదండీ బాబూ... ‘టొబాకో అండ్ ఫిల్టర్ పర్ఫెక్ట్ మ్యాచ్డ్'. అదీ సంగతి. హోర్డింగ్ కింద కనీకనబడకుండా 'సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్' అని ఉండేది. 'అశ్వత్థామ హతః' అని గట్టిగా అని 'కుంజరః' అని ఎవరికీ వినబడకుండా ధర్మరాజు అన్నట్లు. ప్రకటనల్లో నటించే నటీనటుల్లో కూడా కొంతమంది ప్రతిభావంతులు ఉంటారు. కొందరు వెర్రి మొహాలేసుకుని ఏ భావమూ పలకకుండా ఉంటారు. 'సెన్సిటివ్ టీత్' యాడ్‌లో ఒకాయన ఐస్‍క్రీం తిని పళ్లు జివ్వుమనటాన్ని అభినయించడం చూస్తే మనకు ముచ్చటేస్తుంది. మీకు వెయ్యదా? సరే... నాకు!
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
Sunday, July 28, 2024
ప్రకటనల ప్రహసనం - దత్తవాక్కు - 28 జూలై 2024 ఆదివారం ఆంధ్రప్రభ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment