Saturday, August 24, 2024

యావత్ తైలం, తావత్ వ్యాఖ్యానం! - దత్తవాక్కు - ఆంద్రప్రభ 25 ఆగస్టు 2024

వెనకటికి ఒక పౌరాణికుడు ప్రవచనం చెబుతున్నాడట. రాత్రి, చాలా పొద్దుపోయింది. ఈయన ఆపడం లేదు. శ్రోతలకు ఆవలింతలు వస్తున్నాయి. కొందరైతే మెల్లిగా జారుకున్నారు కూడా. ఉండబట్టలేక ఒక భక్తుడు పండితుల వారిని అడిగాడు "స్వామీ ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని. ఆయన ఇలా అన్నాడు - "నాయనా! యావత్ తైలం, తావత్ వ్యాఖ్యానం" అంటే, దీపంలో నూనె ఉన్నంత వరకు చెబుతానని. నూనె అయిపోయి, దీపం ఆరిపోతే ప్రవచనం ఆపేస్తాడు. అంతవరకు వినక తప్పడు.
సాధ్యమైనంత వరకు లాగడం మంచిదే కాని, ఇతరులకు అది సౌకర్యంగా ఉందో, లేదో చూసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. కొంచెం తేడాతో, ఉదా. 'పిండి కొద్దీ రొట్టె'. ఉన్న వనరులను బట్టే ఫలితముంటుందని ఈ నానుడి సూచిస్తుంది. 'మంచం పొడుగును బట్టే కాళ్ళు చాపుకోవాలి' - ఏదైనా ఒక పరిమితికి లోబడి ఉంటుంది. ఇంగ్లీషులో 'మేక్ హే వైల్ ది సన్ సైన్స్' అనే సామెత ఉంది. 'హే' అంటే పశుగ్రాసం, పంట నూర్పిడి ఐన తర్వాత, ఆ గడ్డిని ఎండ ఉన్నప్పుడే అరబెట్టాలట. 'దీపముండగానే యిల్లు చక్కబెట్టుకోవడం' కూడా ఇలాంటిదే. 

 


ఇప్పుడంటే కరెంటు, అది పోయినపుడు ఇన్వర్టర్లు వచ్చాయి గానీ, మా చిన్నప్పుడు కరెంటు ఉండేది కాదు. లాంతర్లే. సాయంత్రం లాంతరు చిమ్నీని, మెత్తని ముగ్గు పొడితో తోమి, వత్తిని బయటకు తీసి, చివర నలిచి, కట్ చేసి, ట్యాంకులో గుడ్డనూనె (కిరోసిన్) పోసి, వెలిగించి చురుకున్న వంపు కడ్డీకి తగిలించేవారు. ఇంట్లో కిరసనాయిలు నిండుకుంటే అంతే సంగతులు. ఈలోపే ఇంటి పనులు పూర్తి చేసుకోవాలి.
ఈ విషయానికి సమయ పాలనకు (టైం మేనేజ్మెంట్) సంబంధం ఉందేమో అనిపిస్తుంది నాకు. మోకాలికి బోడిగుండుకీ ముడి వేసినట్లుందంటారా? సభల్లో చూస్తూంటాం. కొందరు మైకు పట్టుకుంటే వదలరు. అధ్యక్షుడు క్లుప్తంగా రెండు మూడు నిముషాలలో ముగించాలని కోరినా, సదరు మైకాశ్రయుల వారు పట్టించుకోరు. వేదిక మీది అతిథులందరినీ పేరు పేరునా చెప్పడానికే ఐదు నిముషాలు, అసలు సభ ఎందుకు జరుగుతుందనే దానికి రెలెవెన్స్(పొందిక) లేకుండా ఏదేదో చెబుతారు. దీనిని 'బీటింగ్ అబౌట్ ది బుష్' అన్నారు. అంటే, పొద లోపల ఏముందో తెలియకుండా దాన్ని అదే పనిగా బాదడం.
ఒకసారి, బెంగళూరు సి.పి. బ్రౌన్ సేవా సమితి వారు నాకు ఎన్.టి.ఆర్. స్మారక పురస్కారం ఇచ్చారు. వక్తల్లో ఒకాయన "ఎన్.టి.ఆర్. గారి సినిమాలు చూడలేదు, 'లవకుశ' ఒక్కటి చూశానంతే", అని మొదలు పెట్టి, అరికెలు, కొర్రలు, సామలు తినాలని, బియ్యం అసలు తినకూడదని, ఆడపిల్లలు సముర్తాడడం లేట్ కాకూడదంటే ఏం చేయాలో, ఇలా ఏకరువు పెడుతున్నాడు. ఇవన్నీ ఎన్.టి.ఆర్. శత జయంతి ఉత్సవాలకు అవసరమా? నిర్వాహకుడొకాయన ఆయన దగ్గరకు వెళ్ళి, చెవిలో ఏదో చెప్పాడు. ఆయన తన గంభీరోపన్యాసం ఆపాడు. "చెప్పింది చాలు, ఇక వచ్చేయండి" అని చెప్పి ఉంటాడు. అసెంబ్లీలో ఐతే ఇలాంటి వారికి స్పీకరు మైకు కట్ చేస్తాడు. సాహిత్య, ఇతర సభల్లో ఆ అవకాశం లేదే!
కాలం చాలా విలువైనది. దాన్ని పనికిమాలిన విషయాల కోసం వృథా చేయకూడదు. "అవకాశం ఉన్నంత వరకు అందర్నీ సతాయిస్తా" అంటే ఎలా? నేను విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేసేటపుడు, మాకొక ప్రిన్సిపాల్ గారుండేవారు. ఆయన ఉపన్యాస కేసరి. ప్రతిరోజూ ఉదయం పదిగంటలకు ప్రేయర్. పిల్లలందరూ సమావేశమయ్యేవారు. ఈయన గంభీరోపన్యాసం, ఎండలో నిలబడలేక కొందరు అర్భకులు సొమ్మసిల్లి పడిపోయినా ఆయన ఆపడు. మొదట పీరియడ్‍లో పావుగంట ఆయనే తినేసేవాడు.
కామ్రేడ్స్, సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. డబ్బును వృథా చేసినా పరవాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలాన్ని వృథా చేస్తే అది క్షమించరాని నేరం. "కాలోహిత దురతిక్రమః" అని కదా ఆర్యోక్తి. "యు మే డిలే, బట్ టైం విల్ నాట్" అన్నారు. అబ్రహం లింకన్ ఇలా అన్నారు, "నాకు చెట్టు కొమ్మలను ముక్కలుగా నరకడానికి ఆరు గంటలు టైం ఇస్తే మొదటి గంట అంతా, నా గొడ్డలికి పదును పెడతా". ఇందులో ఎంత భావం ఉందో మీరే ఆలోచించండి!
బద్దెన గారు ఇలా అన్నారు.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికామాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!
అదీ సరైన విధానం. కొందరు ప్రయాణాల్లో ఎంతకీ తెమలరు. ఆఖరికి ఆ రైలో, బస్సో వెళ్ళిపోతుంది. అయినా వారికా ధ్యాస ఉండదు. 'ఇన్ టైం' అంటే 'ముందే' అని, 'ఆన్ టైం' అంటే సరిగ్గా సమయానికని, 'బిహైండ్ టైం' ఆలస్యం కావడమని! అదన్నమాట!

1 comment:

  1. సందర్భశుద్ధి టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడం చాలా బాగుంది

    ReplyDelete