Saturday, October 19, 2024

అయ్యవారు లేకపోతే! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 20 అక్టోబరు 2024

మా కర్నూలు జిల్లాలో ఒక సామెత ఉందిలెండి, "అయ్యవారు లేకపోతే అమావాస్య ఆగుతుందా?" అని! అమావాస్య ఆగదు, పున్నమ ఆగదు! ఎవరు లేకపోయినా, ప్రపంచం నడుస్తూనే ఉంటుందని దానర్థం. ఒక పెద్ద నాయకుడు చనిపోయినప్పుడు, 'అయ్యో! ఈ దేశం ఏమయిపోతుంది?' అనుకుంటారు. ఏమీ అయిపోదు. ఎంచక్కా సాగిపోతూ ఉంటుంది. 'టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్' అన్నాడు ఇంగ్లీషు వాడు. కాలము, అలలు ఎవరి కోసమూ ఆగవట.
దేశం స్థాయిలో కాకపోయినా, కుటుంబస్థాయిలో, పిల్లలు ఇంకా సెటిల్ కాకముందే, ఇంటిపెద్ద సడన్‌గా మరణిస్తే, ఆ కుటుంబం గతి ఏమయిపోతుందో, పాపం! అని శ్రేయోభిలాషులందరూ ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య దుఃఖానికి అంతం ఉండదు. కానీ, "గ్రీఫ్ ఈజ్ బ్రీఫ్" అన్నారు! 'దుఃఖం క్లుప్తం' అని అనువదించవచ్చు. మరణించిన వెంటనే ఉన్న దుఃఖం అంత్యక్రియల తర్వాత తగ్గుతుంది. “ఈరోజు చస్తే రేపటికి రెండు" అంటుంటారు. ఆ కుటుంబం క్రమంగా కోలుకుంటుంది. అంతవరకు బాధ్యత తెలియకుండా ఉన్న పిల్లలు ఒక్కసారిగా చైతన్యవంతులైపోతారు. 'అసూర్యం పశ్య' (గుమ్మం దాటి బయటకు వెళ్ళని) అయిన ఆ ఇల్లాలు ఏదో ఒక పని చేస్తుంది.
ఒక రాజకీయ పార్టీని స్థాపించి, అచిరకాలంలోనే అధికారంలోకి తెచ్చి, చరిత్ర సృష్టించిన మహానాయకుడుంటాడు. ఆయన మరణిస్తాడు. "ఆ పార్టీ ఆయనతోనే పుట్టింది. ఆయనతోనే పోతుంది" అంటూ నిశ్చయిస్తారు కొందరు ప్రాప్తకాలజ్ఞులు. కానీ దీర్ఘదర్శులు దాన్ని ఒప్పుకోరు. ఎవరో రెండవ తరం నాయకుడు ఆ పార్టీ పగ్గాలు స్వీకరిస్తాడు. పార్టీ మనుగడ సాగిస్తుంది. దట్సల్ యువరానర్!
“మనుషులు మరణిస్తారు కానీ, మనిషి చావడు" అన్నాడొక వేదాంతి. ఇదేమిటి? అంటే, బేసిగ్గా మానవుడు, వాడి ప్రతిభ, నాయకత్వ లక్షణం, సృజనాత్మకత, శాశ్వతంగా ఉంటాయి. వాటికి ప్రాతినిథ్యం వహించే మనుమలు, కాలక్రమాన ఉండరు కాని, వారి స్థానంలో వేరేవాళ్ళు తయారుగా ఉంటారు.
"టైం ఈజ్ ఎ గ్రేట్ హీలర్". కాలం ఎంతటి గాయాన్నైనా మానుపుతుంది. "రెవల్యూషన్ అంటే సడెన్‍గా జరిగేది, ఎవల్యూషన్ అంటే, క్రమంగా పరిణమించేది. మొదటిది రెండో దానిలో భాగమే” అన్నారు జాన్ రస్కిన్. ఇదే ఇతివృత్తంతో రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు ఒక గొప్ప కథ రాశారు. "ఓల్డ్ ఆర్డర్ ఛేంజెత్ ఈల్డింగ్ ప్లేస్ టు ది న్యూ" అంటాడు టెన్నీసన్. దాన్నే మనవాళ్ళు "కొత్తనీరు వచ్చి పాత నీరును తోసేస్తుంది" అంటారు.
ఇక రాచకొండ వారి కథ దానిపేరు ‘ఆఖరి దశ'. 1950లో 'భారతి' మాసపత్రికలో వచ్చింది. దాన్ని ఆయన 'జాస్మిన్' అన్న కలం పేరుతో వ్రాశారు. కథ నాలుగు భాగాలు. మొదట, భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుని తొడల మీద కొట్టి చంపాడనీ, కృష్ణుడే చంపించాడనీ, అధర్మం ప్రబలిందనీ, ప్రపంచానికి పోయేకాలం దాపురించిందనీ ఇద్దరు మాట్లాడుకుంటారు. రెండవది, శంకరాచార్యులు బౌద్ధమతాన్ని ఓడించి, వైదికమత స్థాపన చేస్తున్నప్పుడు, బౌద్ధ భిక్షులు ఇద్దరు “ఇంకేముంది, బౌద్ధం లేకపోతే, సర్వనాశనమే” అనుకుంటారు. మూడోది, ఇద్దరు ముస్లిం మాటలు “ఔరంగజేబు పాదుషా చనిపోయినాడు. మొఘల్ సామ్రాజ్యమే ముగిసిపోతే, ఈ ప్రపంచం పనయిపోయినట్టే". చివరగా, ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు "బ్రిటన్ పాలన అంతం అయింది, భారతదేశం ఏమయితుందో ఇదే ఆఖరిదశ" అనుకుంటారు.  రావిశాస్త్రి గారు ఏమీ వివరించరు. ఒకేమాటతో కథను ముగిస్తారు.
"ప్రపంచం సాగుతూనే ఉంది. ఇన్నివేల సంవత్సరాల నుంచీ ఇన్ని యుగాల నుంచీ!" అదీ విషయం.



నేను ఇంటర్ బోర్డులో 'రీడర్'గా పని చేస్తున్నప్పుడు రాములు గారని నావద్ద సీనియర్ అసిస్టెంట్ ఉండేవారు. ఆయన మంచి పనిమంతుడు. నాకు కుడిభుజంలా పనిచేసేవారు. ఇంటర్నల్ ట్రాన్సఫర్స్‌లో ఆయన్ను పి.ఆర్. సెల్‌కు బదిలీ చేశారు. నేను మా కమీషనర్ బలరామయ్య గారి దగ్గరకు వెళ్ళి, ఆయన్ను మార్చవద్దని వేడుకున్నాను. ఆయన నవ్వి, "శర్మగారూ! ఒకరి వల్ల మాత్రమే ఏ యంత్రాంగమూ నడవదు. రేపు మీరూ ఉండరు. నేనూ ఉండను. బోర్డు మాత్రం ఉంటుంది" అన్నారు. నాకు తత్త్వం బోధపడింది. ఆయనకు సారీ చెప్పాను.
వెనకటికెవరో పెద్దామె, ఊరిమీద అలిగి తన కోడిని తీసుకుని ఊరికి దూరంగా వెళ్ళిపోయిందట. 'నా కోడి కూయకపోతే తెల్లవారదు కదా, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం' అనుకుందా అమాయకురాలు! "నేను రెండ్రోజులు ఊరెళితే సరి, కొంప కిష్కింధే" అని విసుక్కొంటుంది ఇల్లాలు. అదంతా ఉత్తుత్తిదేనండోయ్. “మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫరెవర్" అంటారు ఆల్‌ఫ్రెడ్ టెన్నిసన్ తన 'బ్రూక్' (సెలయేరు) అనే కవితలో.
“నేను లేకపోతే ఈ దత్తవాకు ఎవరు రాస్తారు, ఇంత బాగా!” నవ్వుతున్నారెందుకు? ఇదీ ఒక ఉదాహరణేనండీ బాబూ!
సూర్యకాంతం పాత్ర వేసేవారు లేరని 'గుండమ్మ కథ' రీమేక్ చేయలేదని బాలకృష్ణ గారు చెప్పారు కదా!

3 comments:

  1. No one is indispensable అన్న విషయాన్ని నో ఉదాహరణలతో

    ReplyDelete
  2. చక్కగా చెప్పావు

    ReplyDelete
  3. అవును.. ఎవరు ఉన్నా, లేకున్నా కాలచక్రం ఆగదు..👏👏 అయితే సూర్యకాంతగారు లేకున్నా గుండమ్మ కథ మళ్ళీ తీయొచ్చా.. లేదా! 😊

    ReplyDelete