ఇంతకు ముందు ఈ శీర్షికన చదివినట్లు అనిపిస్తుంది కదూ! నిజమేనండోయ్! కానీ, ప్రక్కనే ‘2’ పెట్టాను కదా! అలా చూస్తారేంటి? బాహుబలి-2, పుష్ప-2 లు ఉన్నప్పుడు... ఇది ఎందుకుండకూడదు? చెప్పండి!
అప్పుడు, ధర్మరాజు తమ్ముళ్లందర్నీ యక్షుడు బంధించి, వాళ్లను విడిపించుకోడానికి ఆయన్ను కొన్ని ప్రశ్నలడిగాడు. ధర్మరాజుకు తెలియని విషయాలుండవు కదా! అవలీలగా సమాధానాలు చెప్పేసి, తమ్ముళ్ళను వెంటబెట్టుకొని చక్కాపోయాడు! తర్వాత ‘ఏండ్లును పూండ్లును గడిచె’. పూండ్లంటే ఏమిటని మాత్రం అడక్కండేం! భారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు కౌరవ సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రతీహారి వచ్చి, “ఎవరో పెద్దాయన, మహా తేజశ్శాలి, మీ దర్శనం కోసం వచ్చియున్నారు, ప్రభూ!” అని విన్నవించాడు.
‘ఎవరై ఉంటారబ్బా!’ అని ఆలోచించాడు అజాతశత్రువు. ఆయన్నలా అంటారు గాని, కౌరవులంతా ఆయన శత్రువులే గదండి! ఏమంటే భీమసేన మహారాజులాగా భీషణ ప్రతిజ్ఞలు చెయ్యడు. కామ్‌గా చేయాల్సింది చేస్తాడు. అందుకే సంజయుడు ఆయనను “మెత్తని పులి ధర్మజుండు” అన్నాడు. పెద్దాయన వచ్చి రాజుగారికి నమస్కరించి, “నన్ను గుర్తుపట్టావా ధర్మజా?” అని అడిగాడు.
“పట్టకేం మహాశయా! తమరు యక్షవర్యులు కదా! చాలాకాలం క్రిందట మా తమ్ముళ్లను...”.
యక్షుడన్నాడు “అవును కుంతీ సుతాగ్రజా! అప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో పెను మార్పులు! నాకు ఎన్నో సందేహాలు! తీరుస్తావా?”.
“అవశ్యం! అడగండి మరి! చెప్పలేకపోతే తల పగిలిపోవడం లాంటి కండిషన్స్ ఏవీ లేవు కదా యక్షహర్యక్షా?”.
“అబ్బే! లేవులే! కేవలం కుతూహలం” అని చెప్పి, “రచనలను మదింపు చేయడం, వడపోత, న్యాయనిర్ణేతలు, ప్రచురణ, బహుమతులు ఇలాంటి జంజాటం ఏమీ లేకుండా, ఎవరైనా, ఏదైనా రాసుకొని వేసుకొనే వెసులుబాటు?”.
“దాన్ని ఫేస్‌బుక్ అంటారు. వేదాంతం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు, కవిత్వం నుంచి కథల వరకు, అతి చౌకబారు బూతు పురాణాల వరకు, ఏదైనా ఓ.కె. నో ప్లాబ్లం”.
“గుడ్. అయాచితంగా బోలెడు శుభాకాంక్షలు మోసుకొచ్చేది, గ్రూపులుగా ఏర్పడి, స్వోత్కర్షలు, పరవిమర్శలు చేసుకునేది?”.
“ఇంకేది? వాట్సాప్! మనకొచ్చేవి డిలీట్ చేయడానికి ఈ జీవిత కాలం చాలదు!”.
“ఎవరి గొట్టం వారు ఊదుకుంటా, ప్రామాణికత లేని అవాకులూ చవాకులూ వాగే అవకాశం ఇస్తున్న అద్భుత మాధ్యమం?”
“మీ ప్రశ్న లోనే ఉంది జవాబు! యూట్యాబ్! నీ గొట్టం! రాజకీయ విశ్లేషణల దగ్గర్నుంచి వంటల వరకు, రైలు ప్రయణాలు, వాస్తు, జోతిష్యం, పండుగల వివాదాలు, వైద్యం - మనకు తెలియకపోయినా తెలిసినట్లు ఎవరి గొట్టంలో వాళ్ళు చెప్పొచ్చు”.
“ఏమి సెపితిరి? ఏమి సెపితిరి? ఒకరి మీద ఒకరు బురద చల్లుకోడానికని, పోస్టులు, కౌంటర్ పోస్టులు పెట్టుకుంటారు. ఎవరిది కరెక్టో అర్థమై చావదు. ఏమిటది?”.
“ఇంకేమిటి? ట్విట్టర్! నోటికొచ్చింది పెట్టేయవచ్చు యక్షరాజా!”
“శుక్రాచార్యుల వారు సప్తమ వ్యసనాలను పేర్కొన్నారు. ఇప్పుడు ఏదో అష్టమ వ్యసనమట?”.
“ఆహా! భేషుగ్గా! స్మార్ట్‌ఫోన్ ఆ ఎనిమిదో దురలవాటు. అది లేనిదే మానవ జీవితం లేదు”.
“రాత్రంతా హాయిగా పడుకోని వెళ్లడానికి నాలుగు వందల రూపాయలయితే, ఎనిమిది గంటలు కూర్చోబెట్టి, పిచ్చిపిచ్చి స్నాక్స్ ఇచ్చి, తెల్లవారుజామున స్టేషన్ చేరడానికి, అర్ధరాత్రి ఇంటికి చేరడానికి అష్టకష్టాలు పడేలా చేసి, నాలుగింతలు, అంటే 1600 రూపాయలు వసూలు చేసే ప్రయాణ సాధనం. ఉష్ కాకి మన ధనం, నడుంనొప్పి అదనం! ఏమిటి అది?”
ధర్మరాజు నవ్వాడు! “మీదాకా వచ్చిందీ? అదే వందే భారత్ రైలు!”
“ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థలో అందని మానిపండ్లు ఏవి?”
“జనరల్ కంపార్టుమెంట్లు. ప్యాసెంజర్ రైళ్ళు! ప్రయాణాలు సామాన్యులకు పెను వ్రణాలు!”
“ముష్టాముష్టీ, బాహాబాహీ! కచాకచీ.. దీనికి ప్రత్యక్ష నిదర్శనం చెప్పు భూవరా?”
“ఇంతకు ముందు యుద్ధాలు! ఇప్పుడు చట్టసభలు!”
“అడగకపోయినా వచ్చి వాలేది?”
“ప్రభుత్వ సలహాదారు పదవి”
“మూడో ప్రపంచయుద్ధం వస్తుందంటావా, పాండవాగ్రజా!”
“చచ్చినా రాదు! ఎందుకంటే అందరూ ఛస్తారు! కాబట్టి ధైర్యం చేయరు..”
“ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తిహీనమైన సంస్థ?”
“ఐక్యరాజ్యసమితి!”
“అదేమిటి అంత మాట అనేశావు?”
“అవును మరి! అది ఉద్ధరిస్తూన్నదేముంది చెప్పండి?”
“మానవుడికి అందరికంటె, అన్నింటికంటె ప్రియతమమైనది?”
“తానే! తన తర్వాతి ఎవరైనా, ఏదైనా! సర్వేస్వార్థం సమీహతీ!”
“శభాష్! మనుషుల కడుపుకొట్టి, అభివృద్ధి పేర ముంచుకొస్తూన్నది..?”
“కృత్రిమ మేధ! కావలసినన్ని మానవ వనరులను ఉపయోగించకుండా, సహజ మేధను తొక్కేయబోతోంది! ఆల్‌రెడీ తొక్కేసింది!”
“చివరి ప్రశ్న! బ్రహ్మపదార్థం కంటే గహనతరమైన సిద్ధాంతం?”
“భారతదేశంలో లౌకికవాదం. ఎవరిష్టమొచ్చినట్లు వారు దాన్ని నిర్వచించుకోవచ్చు. చిన్న డిస్‌క్లెయిమర్. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే! కొంపదీసి ఈ వ్యవహారాన్నంతా మీ ‘యక్షలోకం’ ఈ-మ్యాగజైన్‌లో ‘ధర్మరాజుతో ముఖాముఖి’ అని ప్రచురించరు కదా; కొంపలంటుకుంటాయి!”
యక్షుడు నవ్వాడు! “లేదులే ధర్మ స్వరూపా! నావి కూడ వ్యక్తిగత సందేహాలే! అయినా, భావప్రకటనా స్వేచ్ఛ అంటూ ఒకటి ఏడ్చింది కదా! మరేం ఫర్వాలేదు! నీ జ్ఞానం అపారం!”
“అదేం లేదు! ఇవన్నీ అందరికీ తెలిసినవే!”
అదన్నమాట!
ఇది ఆచంట సూర్య నారాయణ మూర్తి గారి స్పందన: శ్రీ పాణ్యందత్త శర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన"దత్తవాక్కు"ఆధు నికయక్షప్రశ్నలు-2, లో శ్రీ శర్మగారు ఫేస్బుక్, స్మార్ట్ ఫోన్, గూర్చిహాస్యరసస్ఫోరకంగా, వివరిస్తూ ప్రస్తుతం సమాజం ఎటు పోతోందోతెలియని పరిస్థితుల్లో "తస్మాత్ జాగ్రత్త" అని సున్నితంగా హెచ్చరించారు.అట్లేసామన్యులకుఅందుబాటులోలేని జనరల్కంపార్టుమెంట్లు, పాసింజర్ రైలు ప్రయాణం ఇవి అందనిద్రాక్షపండ్లని, సామాన్య ప్రజలకందుబాటులోలేనివందేభారత్ రైలు ప్రయాణం, అభివృద్ధి పేరుతో కృత్రిమమేథతోసహజమేథనుచంపుకొనేపరిస్థితిదాపురించటం, లౌకిక వాదం పేరుతో ఆత్మవంచన కు దిగజారడం.యక్షప్రశ్నలకు ధర్మరాజుసమాధానమిచ్చినట్లుగావ్రాయుట కవిచమత్కృతికిఅద్దంపడుతోంది.సామాజికదృక్కోణంతోరచించుట,ఆయనశైలి.శ్రీ దత్త శర్మగారు గొప్ప దార్శనికుడనిచెప్పకతప్పదు.కవి సగటుమనిషియొక్కపక్షపాతి.ఈవిధమైనరచనలురచించిసామాన్యజనుల ఇబ్బందులు తెలియజేయుటరచయిత ప్రత్యేకత.ఆయనకుమనఃపూర్వకధన్యవాదములు. ఆచంట సూర్య నారాయణ మూర్తి రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సీపట్నం.💐💐💐👌
ReplyDelete