‘జస్టిస్ చౌదరి’ సినిమా చూశారా? చూసే ఉంటారు! అందులో వేటూరిగారు ఒక అద్భుతమైన పాట రాశారు. ‘చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో...’ అన్న పల్లవితో ప్రారంభమవుతుంది. చరణాలు తూటాల్లా పేలతాయి. ‘కఠినమైనదీ ధర్మం, కన్నులేనిదీ న్యాయం, మనసు లేనిదీ చట్టం’ అంటారు వేటూరి. “ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపుతీపికి కట్టబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిదీ తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా?” అని ఆవేశంగా ప్రశ్నిస్తారు మహా నటులు ఎన్.టి.ఆర్. అప్పుడు థియేటర్‍లో ప్రేక్షకులకు ‘గూస్‌బంప్స్’ వస్తాయి! వేటూరిగారి అభిప్రాయం, చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు అనిపిస్తుంది నాకు. హరిశ్చంద్రుని ప్రస్తావన కూడా ఈ పాటలో తెచ్చారు రచయిత. బీటు పాటల చక్రవర్తి గారు స్వరపరచిన చక్కని పాటల్లో ఇది ఒకటి. బహు కంఠస్వర గాన గంధర్వులు బాలు గారి గాత్రం, సాహిత్యానికి ప్రాణం పోసింది.
అప్పట్లో, అంటే ‘గుడ్ ఓల్డ్ డేస్’లో, సినిమాలు అలా ఉండేవి. ‘భారతీయుడు’ సినిమాలో సీనియర్ కమలహాసన్ తన అవినీతి కొడుకు చిన్న కమల్‌ను చంపడానికి కూడా వెనుదీయడు. ఈ మధ్య వచ్చిన ‘దేవర’లో హింస ఎక్కువైనా, మెయిన్ థీమ్, సముద్రంలో జరిగే స్మగ్లింగ్‌ను నాయకుడు ఎదుర్కొని నిలవరించడమే. కాని చాలా సినిమాల్లో స్మగ్లర్‌లను, డాన్‌లను హీరోలను చేసి చూపిస్తున్నారు. అదే మన దౌర్భాగ్యం. “పత్రములు గాని సాక్ష్యములు గాని లేని అప్పు కోసం భార్యను అమ్ముకుంటున్నావా? అమాయకుడా!” అని అంటాడు కాలకౌశికుడు. “మా యిరువురి హృదయములే పత్రములు, అంతరంగములే సాక్ష్యములు” అంటాడు సత్యశీలుడైన హరిశ్చంద్రుడు. కాలకౌశికుడి పాయింట్‌లో ‘చట్టం’ ఉంటే, హరిశ్చంద్ర చక్రవర్తి పాయింట్‌లో ‘ధర్మం’ ఉంది.
సాహిత్యంలో ‘పొయటిక్ జస్టిస్’ అనే అమూల్యమైన సిద్ధాంతం ఉంది. Virtue is rewarded and misdeeds are punished (సద్గుణాలు గౌరవింపబడాలి, తప్పులు శిక్షింపబడాలి) సాహిత్యం నైతికవిలువలను పునరుద్ధరించాలని దానర్థం. ఈ మాట తొలిసారి వాడినవారు, 17వ శతాబ్దంలో, థామస్ రైమర్ అనే సాహిత్య విమర్శకుడు. ఇదే పేరుతో 1993లో ఒక అమెరికన్ రొమాంటిక్ డ్రామా గల సినిమా వచ్చింది. దాని దర్శకుడు జాన్ సింగిల్టన్. జానెట్ జాక్సన్ కథానాయకుదు. గన్ వయొలెన్స్‌లో మరణించిన తన స్నేహితుడి కేసులో న్యాయం కోసం పోరాటమే ఈ సినిమా. మంచివారు సంతోషంగా ఉండాలి. చెడ్డవారు శిక్ష అనుభవించాలి. చట్టం ప్రకారం న్యాయం జరగనప్పుడు, న్యాయానికి అన్యాయం జరుగుతుందని ఆవేదనతో, చట్టాన్ని తమ ‘చేతుల్లోకి తీసుకొని’ (ఈ మాట సినిమావాళ్ళదే) తామే దోషులను, రక్త సంబంధాన్ని కూడా చూడకుండా, కొందరు చంపేయడం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం.
ఇటీవలే నేను ‘ఆపరేషన్ రెడ్’ అన్న సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్ నవల వ్రాశాను. ‘మీలో ఈ కళ కూడా ఉందా మహాశయా?’ అని అనుకొంటున్నారా? అన్వీక్షికి పబ్లిషర్స్ వారు నిర్వహించిన 2024 ఉగాది నవలల పోటీలో దానికి బహుమతి వచ్చింది. దాన్ని వారే ప్రచురించారు. ‘అమెజాన్’లో దొరుకుతుంది. మాన్యులు తనికెళ్ల భరణి, దర్శకులు వంశీ గార్ల చేతుల మీదుగా ఆ పురస్కారం అందుకున్నా. ‘స్వోత్కర్ష’ చాలు గానీ, ఇక విషయానికి రండి అంటున్నారా? సారీ! వస్తున్నా. మన భారతీయ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ, దానిపై విషప్రచారం చేసే కుహనా మేధావులను, సూడో సెక్యులరిస్టులను, తెలివిగా వ్యూహం పన్ని, ఒక పెన్నుతో చంపేస్తుంటాడు నా హీరో, ‘కాశినాయన’. ఆ పెన్ను అలాంటిది. నవల తెప్పించుకొని చదవండి ప్లీజ్!
నేను శ్రీకాకుళం జిల్లాలో పని చేస్తున్నాను అప్పుడు, ‘కోటబొమ్మాళి’ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా! టెక్కలి రెవెన్యూ డివిజనల్ హెడ్ క్యార్టర్స్. అక్కడ ఒక మెజిస్ట్రీటు గారుండేవారు. ఒక కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించడానికి వెళ్లాము. ఆయన సున్నితంగా తిరస్కరించారు. “నేను, నా కుటుంబసభ్యులు కూడా, వ్యక్తిగత బంధాలకు, సమాజంతో క్లోజ్‌గా ఉండకపోవడానికీ ప్రాధాన్యత ఇస్తాము. అవి నా తీర్పులను ప్రభావితం చేస్తాయని...” అన్నారా న్యాయమూర్తి. న్యాయం మూర్తీభవిస్తే ఆయనలా ఉంటుంది మరి! పదవి దిగిపోయింతర్వాత, ప్రభుత్వంలో ఇంకో పదవి స్వీకరించేవారిని ఇప్పుడు చూస్తున్నాం!
ఇక, కథలు, నవలలు, కవితల పోటీల్లో విజేతలను ఎంపిక చేసే వాళ్లను న్యాయనిర్ణేతలంటారు! ఆయా పోటీల నిర్వాహణలకు వారు ప్రామాణికులు కావచ్చు. కొంతకాలంగా బహుమతులు పొందుతున్నవారు ప్రతి జాబితాలో కొందరే ఉంటున్నారు. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు తొమ్మిదో కవిని రానివ్వకుండా ఉండేవారట! ప్రతి పోటీలో వీళ్లే విజేతలు! అదెలా సాధ్యమో మరి! న్యాయనిర్ణేతల whims and fancies కొన్నిసార్లు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఒక పోటీలో రిజెక్ట్ అయిన రచనకు వేరొక పోటీలో బహుమతి వస్తుంది! నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది. క్రింది కోర్టు తీర్పును పై కోర్టు కొట్టేసినట్లన్నమాట! మా గురువుగారు, సహస్రకథానికా చక్రవర్తి ‘వాణిశ్రీ’ గారు (సి.హెచ్. శివరాంప్రసాద్ గారు) “బహుమతులు వస్తే మంచిదే, రాకపోతే మరీ మంచిది. రాయడమే మన పని!” అని సెలవిచ్చారు. వాట్సాప్ గ్రూపులు వచ్చాక ఈ బహుమతుల విషయంలో వాదోపవాదాలు కూడా మొదలయ్యాయి. “న్యాయం వెంటనే జరగాలి. ఆలస్యమైతే, న్యాయం జరగనట్లే!” అన్నారు ఒకప్పటి బ్రిటిష్ ప్రధాని విలియమ్ గ్లాడ్‌స్టోన్. ఎంత గొప్ప మాట! అదన్న మాట!
సాహిత్యం నైతిక విలువలను పునరుద్ధరించేదిగా ఉండాలి అని చెప్పడం గొప్ప విషయం సాహిత్య ప్రయోజనాన్ని కవులకు చెప్పినట్టు అయింది హరిశ్చంద్ర ఘట్టంలోని కాలకృసికుడు హరిశ్చంద్రుని సంభాషణను చట్టం ధర్మం తేడాలను చూపించడం ఎంతో లౌక్యంగా ఉంది
ReplyDelete