సంస్కృత భాషలోని సూక్తుల్లో ఇది ఎంతో గొప్పది. బ్రతకడం అనేది ఎంత విలువైందో తెలియచేస్తుంది. ఇది ‘శ్రీమద్రామాయణం’ లో వాల్మీకి మహర్షి, ఆంజనేయస్వామి వారి చేత చెప్పిస్తాడు. సుందరకాండలోని 13వ సర్గలో వస్తుంది. సీతాన్వేషణలో తాను విఫలమైనానని మారుతి తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ‘అమ్మవారు దొరకలేదని శ్రీరామచంద్రునితో ఎలా చెప్పగలను? ఆ మహనీయునికి నా ముఖం ఎలా చూపించగలను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అనుకుంటాడు పవనపుత్రుడు. కాని వెంటనే తనను తాను సంబాళించుకొని, ఈ శ్లోకం చెబుతాడు. శ్లోకం లోని ఒక భాగమే యథాప్రకారం ప్రసిద్ధం. మిగతాది..
శ్లో: వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, ధృవో జీవిత సంగమః
సాక్షాత్తు శివాంశ సంభూతుడు అమిత బలపరాక్రమసంపన్నుడు, మహాజ్ఞాని, హనుమంతుల వారినే ‘వైఫల్యం’ క్రుంగదీసి ఆత్మహత్యకు పురికొల్పిందే, ఇక సామాన్యుల సంగతేమిటి?
టెంత్, ఇంటర్ పరీక్షా ఫలితాల తర్వాత, పిల్లలు, తాము ఫెయిల్ అయినామనో, ఎమ్‍సెట్, నీట్ లాంటి ప్రవేశపరీక్షల్లో, తామాశించిన ర్యాంక్ రాలేదనో, ఆత్మహత్యలు చేసుకొంటుంటారు. ఆ మేరకు వార్తలు చూస్తుంటాం. వాళ్లు దుర్బలమనస్కులని మనస్తత్వ శాస్త్రవేత్తలు సెలవిస్తుంటారు. మళ్లీ, డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి పరీక్షా ఫలితాల తర్వాత ఈ ధోరణి అంతగా కనబడదు. అంటే దౌర్బల్యం తగ్గినట్లా? లేక, వయోపరిపాకం వల్ల కొంత రియలైజేషన్ వచ్చినందుకా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు చూస్తే విస్తుపోయేలా ఉన్నాయి! 15-29 వయస్సుగల వారిలో ఈ టెండెన్సీ అధికమట. ప్రతి సంవత్సరం 7,20,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఆత్యహత్యలు చేసుకొంటున్నారట. 73 శాతం మధ్య తరగతి వారే ఇందులో ఉన్నారట.
తమ పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చేయాలని, యు.ఎస్.లో ఎం.ఎస్. చేసి, అమెరికాలో ఆకుపచ్చ కార్డు పొందాలని, తల్లితండ్రులు మొదట్నించి వారి చిన్న బ్రెయిన్‌లో ‘స్లో పాయిజన్’లా ఎక్కిస్తుంటారు. దాన్ని సాధించలేకపోతే వారి, వీరి జీవితాలు వ్యర్థం అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితం నెగెటివ్ అయితే సూయిసైడ్ లకు దారితీస్తుంది. ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అన్న గీతావాక్యం వీళ్ల తలకెక్కదు.
కేవలం పిరికివాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారంటే నేనసలు ఒప్పుకోను. తనను తాను చంపుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? పాతాళ భైరవి సినిమాలో, ‘రాణిగారి తమ్ముడు’ రేలంగి, తనను రాకుమారి పెళ్లాడకుండా తోటరాముడిని పెళ్లాడుతూందని, అడవికి వచ్చి, ఒక చెట్టుకొమ్మకు ఉరివేసుకోబోతాడు. ఉరితాడు మెడకు గుచ్చుకుంటుంటే, మెడకు తాడుకు మధ్య ఒక మెత్తని వస్త్రం పెట్టుకొని ట్రై చేస్తాడు. అప్పుడు చూడాలి రేలంగి గారి హావభావాలు. “చావడం అంటే ఇంత కష్టమనుకోలేదు! చచ్చే చావులా ఉంది!” అంటాడు.
ఏదయినా ఒక అకృత్యాన్ని చేయబూనినపుడు ‘అది ఆత్మహత్యా సదృశ్యం’ (సూయిసైడల్) అంటారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటామని ఊరికే బెదిరిస్తుంటారు. కాని చావరు! దాన్నే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అంటారు. తెలుగులో ఏమంటారో మరి? ‘భావోద్వేగ బెదిరింపు’ సరిపోతుందా? ఒక జోక్ చూడండి.
“నేనిక భరించలేను, రైలు కింద పడి చచ్చిపోతా” అని మగడు బయలుదేరుతుంటాడు. భార్య “ఇప్పుడు బొకారో ఎక్స్‌ప్రెస్సేగా ఉంది? అదెప్పుడు కరెక్టు టైమ్‍కి వచ్చి చచ్చింది? ఒకవేళ లేటుంటే, రెండు కట్టలు కొత్తిమీర, పావుకిలో మిర్చి, వంద గ్రాముల అల్లం, మన రైతు బజార్లో తెచ్చి ఇచ్చి వెళ్ళండి. గోపాలపట్నం దగ్గర చావకండి. కష్టం. జనాలు తిరుగుతుంటారు. కొత్తవలస దగ్గరైతే బెటరేమో ఆలోచించండి” అంటూ ఉంటుంది నవ్వుతూ! ఆయన ఎలాగూ చావడని ఆమెకు తెలుసు! ‘లైట్’ తీసుకొందని అర్థం.
‘ఇద్దరు అమ్మాయిలు’ సినిమాలో అనుకుంటాను, డి.వి నరసరాజుగారు సంభాషణలు. ఆయన చాలా హాస్యచతురుడు. సూర్యకాంతం “నేను నూతిలో దూకి చచ్చిపోతా” అంటుంది. ఆమె కూతురు రమాప్రభ. “అమ్మా! నీవు నూతిలో దూకి చావద్దే!” అంటుంది గోముగా. “నా తల్లే, నా తల్లే! నేనంటే ఎంత ప్రేమో?” అంటుంది సూర్యకాంతమ్మగారు. “అదేం కాదే! నీవు దూకితే, నూతిలోని కప్పలన్నీ చచ్చిపోతాయే!” అంటుంది రమాప్రభ. ఇలాంటి జోక్‌లు ఎందుకు రాశానంటే ‘ఆత్మహత్య’ అన్న భయంకర కాన్సెప్ట్‌ను హాస్యం కలిపి పలుచన చేద్దామని.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం చాగంటి కోటేశ్వరరావు గారిని, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సంస్కారం లాంటివి చెబుతారట. చక్కని ఆలోచన. ఆయనంతటి జ్ఞాన సంపన్నులు చెపితే, పిల్లలు తప్పక వింటారు. ఈ ఆత్మహత్యలు ఎంతటి అర్థం లేనివో ఆయన పిల్లలకు వివరించాలని నా సవినయ మనవి. చెప్పేవారిని బట్టి కదా ఆచరణ ఉంటుంది! ఆ విషయంలో, చాగంటి వారిని మించిన వారెవరు?
ప్రజాఉద్యమాల్లో పాల్గొని, నిరాశతోనో, ఉద్యమానికి మరింత స్ఫూర్తి నివ్వాలనో, కొందరు ‘ఆత్మాహుతి’ చేసుకుంటుంటారు. వారు నిజంగా గొప్పవారు. కాని, అది ఉద్యమ విజయానికి దోహదం చేయదని వారికి చెప్పేవారెవరు? గర్ల్ ఫ్రెండ్ తనను ప్రేమిస్తానని చెప్పకపోతే, వాటర్ ట్యాంక్‌పై నుండి దూకి చస్తానని బెదిరిస్తుంటారు, భావి భారత యువకులు! ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోసేవారి కంటే, కత్తితో గొంతు కోసేవారి కంటే వీరు చాలా చాలా బెటర్. ‘వద్దు దూకవద్ద’ని పోలీసులు, హ్యాండ్ మైకులో అరుస్తూ సదరు అమరప్రేమికుడిని కాపాడి జాగ్రత్తగా క్రిందికి దింపి తీసుకు రావాలని నానాపాట్లు పడుతుంటారు పాపం! ఏమొచ్చినా, పోలీసుల చావుకే వస్తుంది. ‘బ్రతికి యుండిన శుభములబడయవచ్చు’ కదా! “బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చు” అన్నారు! ఈ బలుసాకును రైతుబజారులో ఎప్పడూ చూడలేదు. సి.పి. బ్రౌన్ గారు దీన్ని ‘రెచ్చెడ్ డైట్’ అన్నారు. దరిద్రపు తిండి! కనీసం దాన్నైనా తిని బ్రతకమని! అదన్నమాట.
No comments:
Post a Comment