Sunday, December 22, 2024

దంతసిరి - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

బాగా తిని జీర్ణించుకోగల శక్తి ఉన్నవారిని, వీడికి ‘దంతసిరి’ దండిగా ఉందంటారు ఉత్తరాంధ్రలో. అన్ని చోట్లా దీనికి ‘తిండిపుష్టి’ అని పేరు. ఇంగ్లీషులో వీళ్లను ఫుడీ (Foody) లంటారు. అలా అంటే నాకు ‘ఫెడీల్మని’ అన్న మాట గుర్తుకొస్తుంది. దానికి దీనికి సంబంధం లేదనుకోండి. పదాల సౌండ్‌లో సామ్యం! అంతేనండి మాస్టారు!
‘ఆహార నిద్రాభయ మైథునం చ సామాన్యమే తత్పశుభిర్న రాణాం’ అంటున్నది సుభాషితం. శ్లోకం ఇంకా ఉంది కాని, మన టాపిక్‌కు ఇంత వరకు చాలండోయ్! తిండి, నిద్ర, భయం, శృంగారం, పశువులకు మనుషులకు సమానమైన లక్షణాలంటున్నాడు సుభాషితకర్త. కాని నేనొప్పుకోనంటే ఒప్పుకోను! మిగతావి ఇప్పుడొద్దు గాని, ఆహారాన్నే తీసుకుందాం. జంతువులు ఆకలి వేస్తేనే తింటాయి. కడుపులో అనీజీగా ఉంటే తినడం మానేస్తాయి. మరి మనమో! ఆలోచించండొకసారి! ‘కడుపు నిండిన అమ్మకు గారెలు చేదు’ అని సామెత. ఆమె ఎవరో, ఆమెకెందుకు చేదో గాని, నా మటుకు నాకు అలా లేదండి. కడుపు నిండినా, మాంఛి కరకరలాడే అలసంద (బొబ్లర్లు) వడలు, ఎవరయినా బలవంతం చేస్తే, రెండు తినేస్తా!
దీనినే ‘కక్కుర్తి’ అంటారండి! ఇది మంచిది కాదని తెలిసినా, ‘జిహ్వచాపల్యం’ అనేదొకటుంది కదండి! దాన్ని గెలవడం మహామహులకే చేతకాదు. మనమెంత? విశ్వామిత్రుడంతటివాడు ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్నాడని ఐతిహ్యం. ‘క్షుద్బాధ’ ఎంతో భయంకరమైనది. ‘జఠరాగ్ని’ అని ఒకటుంది. అదీ ఆకలి అనే అగ్ని. అది నిరంతరం పొట్టలో ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.


తిన్నది అరగడం ఒక గొప్ప వరం. జీర్ణశక్తి లోపిస్తే తినడాన్ని ఎంజాయ్ చెయ్యలేము. ఎంజైములు ఊరకపోతే ఎంజాయిలుండవండోయ్! కొందరికి జీర్ణశక్తి అద్భుతం. నేను పలాసలో పనిచేసేటప్పుడు మా కొలీగ్, ఫిజికల్ డైరెక్టర్, మల్లికార్జున అని ఉండేవాడు. ఆయన మంచి తిండిపుష్టి గలవాడు. ఆయనకు మా సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ తుంబనాధం గారు ‘దంతసిరి వస్తాదు’ అని పేరుపెట్టారు. యస్.వి. యూనివర్సిటీ వాలీబాల్ ఛాంపియన్. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ చేసి, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా వెళ్లాడు. నాకు మంచి మిత్రుడు. పాపం చిన్నవయసులో చనిపోయాడు. అజీర్ణం వల్ల కాదులెండి, హార్ట్ ఎటాక్. ఒకసారి మా ఇంకో కొలీగ్, ఇతనితో పందెం కట్టగా మా పి.డి.గారు యాభై అరటికాయ బజ్జీలు అవలీలగా తిని, వంద రూపాయలు గెల్చుకొన్నాడు. 1984లో నండి! వందంటే మాటలా? మా జీతాలే వందల్లో ఉండేవి! ఆ అరటికాయ బజ్జీలు నిలువుగా తరిగి చేసేవారు. పెద్దవి!
‘దంతసిరి’ అనేసరికి నాకు మా నాన్నగారి మిత్రులు తిమ్మాభొట్లుగారు గుర్తొస్తారు. ఆయనను మేం ‘పెదనాన్నా’ అనేవాళ్లం. సన్నగా ఉండి కడుపు లోపలికి అంటుకుపోయి ఉండేది. నాకప్పుడు పదేళ్లుండొచ్చు. నాన్న ఆయనను ‘వృకోదరా’ అనేవారు. ‘వృకం’ అంటే ‘కడుపులో రగిలే అగ్ని’ అని ప్రముఖ భాషాశాస్త్ర పరిశోధకులు తిరుమల రామచంద్రగారు చెప్పారు. మా తిమ్మాభొట్లు పెదనాన్న గారికి పొట్టలో వృకం ఉంది. ఆయన లైఫ్ స్టైల్ కూడా విభిన్నం. భీమసేనుడికి ఆ పేరుంది. కానీ శారీరికంగా ఆయనెక్కడ? ఈయనెక్కడ? మా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో రామళ్లకోట అనే ఊర్లో ఆయన నివాసం. మధ్యలో బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అక్కడ లలితా పరమేశ్వరి గుడిలో ఆయన అర్చకులు. చుట్టు పక్కల ఊర్లలో పౌరోహిత్యం. అంతా నడకే, చెప్పులు వేసుకునేవాడు కాదు.
మా ఊరు (వెల్దుర్తి)లో ఏదైన పౌరోహిత్యం పని ఉంటే, ముందు మా యింటికి వచ్చి, మా అమ్మతో, “లక్ష్మీనర్సు తల్లీ! ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంట్లోనే చేయి కడుగుతా, అమ్మా!” అని చెప్పి వెళ్లేవారు. చేయి కడగటం అంటే భోంచేయడం. అమ్మకు ఆయన భోజన పరాక్రమం తెలుసు కాబట్టి ‘తగినంత’ వండేది. ఆయన నన్ను ‘దత్తప్రభూ’ అని పిలిచేవారు ప్రేమగా. నేనూ, మా తమ్ముళ్ళు, చెల్లి ఆయన తింటుంటే చూడడానికి చేరేవాళ్లం. ముగ్గురు నలుగురు తినేంత భోజనం కావాలి. తద్దినాలకు ఆయన భోక్తగా వస్తే వడలు ఎక్కువ చేయాలి. నెయ్యి అరచేతి నిండా పోయాలి. పప్పు, వంకాయకూర కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి తినేవారు మా తిమ్మాబొట్లు పెదనాన్న. అలా తిన్నా కొంచెమైనా పొట్ట రాలేదు. రోజూ 16 కిలోమీటర్లు నడిస్తే ఇంకేం వస్తుంది చెప్పండి? భోంచేసి, కాసేపు కునికి, మళ్లీ నడుచుకుంటూ రామళ్లకోటకు వెళ్ళేవారు. ధన్యజీవి మా పెదనాన్నగారు.
ఇప్పటి తరానికి నాజూకుతనం, తిండిలో! రెండిడ్లీ, సింగిల్ వడ తింటే ఆపసోపాలు! మా చిన్నతనంలో ‘సింగిలిడ్లీ బకెట్ సాంబార్’ అనే నానుడి ఉండేది. అదేదో సినిమాలో సునీల్ కోసం బేసిన్ నిండా రెండు డజన్ల ఇడ్లీలు తెస్తాడు సర్వర్ సుందరం. “మనిషన్న వాడెవడయినా అన్ని యిడ్లీలు తింటాడా? ఒకటి తీసెయ్!” అంటాడు సునీల్! “తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్!” అన్నారు కదా గురజాడ! కాబట్టి కామ్రేడ్స్, బాగా తినండి! తర్వాత పడుకోకుండా కష్టపడండి. ‘ఈసురోమని’ ఉండద్దు! అదన్న మాట!


No comments:

Post a Comment