Wednesday, February 12, 2025

కారాగారహాసం! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ

అవును మిత్రమా! మీరు సరిగ్గానే చదివారు। కారాగార‘హాసమే’, ‘వాసం’ కాదు. ఎందుకలా శీర్షిక పెట్టానని మీకనుమానం రావొచ్చు. ఎందుకంటే జైలుకు వెళ్లడం వల్ల బోలెడు లాభాలున్నాయని ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే ఎవరు చేశారు? ఎప్పుడు? ఇంకెవరు? నేనే! ఇటీవలే! కొన్నిపరిణామాలను గమనిస్తే, రాజకీయ ప్రత్యర్థులను అవినీతి ఆరోపణల మీద, అధికారంలో ఉన్నవారు, జైలుకు పంపితే, అది పంపబడిన వారికి ప్లస్ పాయింట్ అయి కూర్చుంటుంది.
సదరు నాయకుడు అవినీతికి పాల్పడ్డాడా లేదా అనేది కోటిరూపాయల ప్రశ్న! దాన్ని పక్కన పెడితే, ఆయనపై ప్రజలకు సానుభూతి వెల్లువెత్తుతుంది. ఆయన జైల్లో ఉన్నన్ని రోజులూ, యూట్యూబర్లు; నెటిజన్లకు పండగే! జైల్లో ఆయనను దోమలు కుడుతున్నాయని, కుట్టడం లేదని; షుగర్ లెవెల్స్ పెరిగాయని, ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని; ఈ రోజు వాళ్లావిడ ఆయనకిష్టమైన ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, మజ్జిగపులుసు పంపిదని, ఆయన గదిలో ఫ్యాన్ పాడయిందని.. ఇలా కావలసినన్ని కబుర్లు! ఎలాగో బెయిల్ మీద విడులయింతర్వాత, ఆయనకు ఘన స్వాగతం ఏ రేంజ్‌లో ఉంటుందంటే - ‘శ్రీ కృష్ణపాండవీయం’ సినిమాలో రారాజు దుర్యోధనుడు మయసభకు వెళ్లినపుడు పాండవులు అరేంజ్ చేసిన లెవెల్లో ఉంటుంది. సి.నా.రె.  గారి అంత గొప్పగా - ‘స్వాగతం! సుస్వాగతం! స్వాగతం కురుసార్వభౌమ!’ అని కాకపోయినా, ఆ నాయకుని అభిమానించే కవులు ఉండి ఉంటారు కదా! ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే, ఏదో ఒక ‘పద్మ’ అవార్డు ఇప్పించడకపోతాడా అని సదరు కవిగారు ఆశపడే ఉంటారు. జైలుకెళ్లివచ్చిన నాయకుడు మళ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తాడు.
అందుకేనేమో, ప్రక్క రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాయకుడు “దమ్ముంటే నన్ను జైలుకు పంపమను చూద్దాం! నన్ను వీళ్ళు జైలుకు పంపిస్తారు, చూడండి” అంటూ అధికారంలో ఉన్నవాళ్లకు సవాలు విసురుతూ ఉంటాడు, చిరునవ్వుతో! కారాగారహాసం అంటే అదే! నాకు తెలియకడుగుతానండీ, బెయిల్ ఇవ్వడమంటే నిర్దోషి అని తీర్మానించడం కాదనుకుంటా - దానికి అంత విజయోత్సవాలెందుకో?
లార్డ్ శ్రీకృష్ణ, జైల్లో పుట్టి, బోలెడు సానుభూతిని సంపాదించుకున్నాడండోయ్! అందుకీ జైలును ‘శ్రీకృష్ణ జన్మస్థానం’ అంటారని మీకు తెలుసని నాకు తెలుసు. ఇది ఇప్పటికీ ‘మధుర’ అనే ఊర్లో ఉంది. దీన్ని ‘గర్భగృహ’ అంటారు. క్రమంగా ఇది అందమైన మందిరంగా రూపుదిద్దుకుంది. మధురా నగరం యమునానది ఒడ్డున ఉంటుంది. ఎక్కడ పుట్టినా దేవుడు దేవుడే కదండి! నా అనుమానం ఏమిటంటే, (నాకన్నీ అనుమానాలే! ఎందుకంటే ‘సంశయాత్మా వినశ్యతి’ అని శ్రీకృష్ణుడే చెప్పాడు నాకు. నాకంటే డైరెక్ట్‌గా నాకు కాదనుకోండి, అర్జునికో ఎవరికో మరి, చెబుతుంటే విన్నా. ‘అప్పుడు నీవెక్కడున్నావు? మా చెవిలో కాలీఫ్లవర్ పెట్టొద్దు’ అంటున్నారా? ఏం, చాగంటాయన చెబితే విన్నా. సరేనా?) జైలుకు వెళ్లివచ్చి, అధికారంలోకి వచ్చినవారో, వారి వీరాభిమానులో, వారు ఉండిన జైలుగదిని సుందర స్మారకచిహ్నంగా మారుస్తారేమోనని! మారిస్తే మార్చనీ, నీ సొమ్మేం పోయిందీ అంటారా! సరే.


గొప్ప గొప్ప రచనలన్నీ జైల్లోనే రాశారటండోయ్. అత్యంత ప్రసిద్ధిగాంచిన ‘డాన్ క్విగ్జోట్‌’ నవలను ఆ రచయిత సేర్వాంటేస్ (Cervantes), స్పెయిన్ లోని జైల్లో వ్రాశారు. అప్పు కట్టలేదని ఆయన్ను జైల్లో పెట్టారట. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అనుమతి లేకుండా నిరసన తెలియచేసినందుకు గాను జైలుకు వెళ్లాడు. అక్కడ ఆయన ‘ది లెటర్ ఫ్రం బర్మింగ్‌హామ్ జైల్’ (The Letter from Birmingham Jail) అన్న గొప్ప పుస్తకం రాశాడు, ప్రజా హక్కుల రక్షణపై. పూణే లోని యెరవాడ జైల్లో ఉన్నపుడే కదా, మహాత్మాగాంధీ, తన స్వీయచరిత్ర ‘మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ వ్రాశారు! ఇలాంటి వాటిని ‘జైలు సాహిత్యం’ అంటారు (ట). జాన్ బన్యన్ వ్యాసిన ‘ది పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్’ జైలు రచనే. నెపోలియన్, సెయింట్ హెలీనా ద్వీపం జైలు నుండి రాసిన మెమోయిర్ (Memoir) అప్పట్లో వేడి వేడి పకోడీల్లాగా అమ్ముడుపోయిందట. నెహ్రూ గారు 1930, 1933లలో జైల్లోనుండి వ్రాసిన ఉత్తరాలు ‘గ్లింప్లెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’గా పేరుపొందాయి. మరి సమకాలీన, అదేనండీ బాబూ, మన కాలీన నాయకులు జైళ్లలో ఉన్నపుడు పెద్దగా పుస్తకాలు రాసినట్లు కనబడదు. అలా ఏవైనా ఉంటే చెబుదురు, ప్లీజ్! ‘ద్వీపాంతరవాస శిక్ష’ విధిస్తే, బ్రిటీష్ వారు అండమాన్ లోని ‘కాలాపానీ’ అన్న భయంకర కారాగారానికి స్వాతంత్య్ర వీరులను పంపేవారు. దాన్ని ‘సెల్యులార్ జెయిల్’ అంటారు అందులో చిత్రహింసలు, బలవంతపు చాకిరీ, మరణానికి దారితీసే పరిస్థితులుండేవట. వినాయక్ సావర్కార్, యోగేంద్ర శుక్లా, లాంటి గొప్పవారు ఆ జైల్లో మగ్గారు. భగత్ సింగ్ కూడా లాహోరు కుట్ర కేసులో ఆ జైలులో ఉన్నారు.
అమెరికా లోని అత్యంత భయంకరమైన జైలు ‘గ్వాంటనామో బే’. అక్రమ వలసదారులను 30 వేలమందిని అందులోకి కుక్కేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడట. అయినా, మీరూ నేనూ జైలుకెళ్తే ఏమొస్తుందండీ? “ఏ జైలు కెళ్ళినా ఏమున్నది గర్వకారణం, చిప్పకూడు తప్ప!” అని పాడుకుంటాం మహా అయితే! ‘కారాగారహాస యోగం’ పట్టాలంటే ఒక స్థాయి ఉండాలి బ్రదర్! అప్పుడే జైలుకు నవ్వుతూ వెళతారు, తిరిగి వచ్చి చరిత్ర సృష్టిస్తారు. పుస్తకాలవీ రాయరయితే! అదన్నమాట!



No comments:

Post a Comment