నినాదాలు కూడ భాషలో, సాహిత్యంలో ఒక భాగమే అంటాను నేను. మీరేమంటారు? ఒక నినాదం, ఒక విధానానికి ‘షార్ట్ ఫాం’ అంటే మీరు ఒప్పుకుంటారా? నినాదం అంటే.. “ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క విశేష ఉద్దేశం”. సాహిత్యపరంగా చూస్తే, ఆ ఉద్దేశానికి, అది పరిచయ వ్యాఖ్య లేదా సంక్షిప్త రూపం.
మన భారతదేశ జాతీయ నినాదంతో మొదలుపెడదాం. ‘సత్యమేవ జయతే’! ‘ఏవ’ అంటే సంస్కృతంలో ‘కేవలం’, ‘అది మాత్రమే’ అని అర్థం. ‘సత్యం మాత్రమే జయిస్తుంది’. ఎంత గొప్ప నినాదం! నిజానికి దీన్ని ముండకోపనిషత్ లోని ఒక మంత్రం నుంచి తీసుకున్నారు. భారత జాతీయ నినాదంగా 1950 జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఆమోదించారు. జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ కింద ఇది ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఒక సూక్తి ఉంటుంది. ‘నస్‌రుమ్ మినల్లాహి వఫతహ్ ఉన్ ఖరీబ్’ - అంటే సత్యం యొక్క జయం (అల్లాహ్ జయం) అతి దగ్గరలో ఉంటుందని. చెక్ రిపబ్లిక్ దేశం నినాదం ‘ప్రావ్ దావిటేజీ’ (సత్యం మాత్రమే ఉంటుంది).
దురదృష్టం ఏమిటంటే రానురాను సోషియల్ మీడియా పుణ్యమా అని, సత్యం కనుమరుగైపోయి ‘గాసిప్’గా మారింది. జి.ఆర్. మహర్షి ‘పురాగానం’ అన్న ఒక గొప్ప కథను వ్రాశారు. “కోతి నుండి మనిషి పుట్టాడంటారు. నిజమేనా?” అని ఒక పిల్లకోతి, కోతి బాబాగారిని అడిగితే, (కోతుల్లో కూడా బాబాలుంటారండోయ్!) ఆయన చిద్విలాసంగా నవ్వి “ఎవరి జ్ఞానం కొద్దీ వారు రాసుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ మనం నమ్మాల్సిన పనిలేదు” అంటారు. ఈ చురక ఇప్పటి ట్రెండ్‌కు సరిగ్గా సరిపోతుంది!
కొన్ని నినాదాలు ఎంత శక్తివంతమైనవంటే, ప్రభుత్వాలను (పార్టీలను) అధికారంలోకి తెచ్చేస్తాయి. ఉదాహరణకు ‘గరీబీ హటావో’ తీసుకుందాం. దీనిని ఇందిరాగాంధీ గారు 1971లో తన ఎన్నికల ప్రచారంలో పేల్చారు. అది 5వ పంచవర్ష ప్రణాళికలో ఒక భాగం. ప్రతిపక్షాలు దాన్ని ‘గరీబోం కో హటావో’ అని ఎగతాళి చేసేవారనుకోండి, అది వేరే విషయం. 2004 ఎన్నికల్లో, పాలక బి.జె.పి, ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) అని ఒక మార్కెటింగ్ నినాదాన్ని వదిలింది. అయినా, వాజపేయి ప్రభుత్వం ఓడిపోయింది! అంటే అంత వెలిగిపోలేదన్నమాట! ఎన్.టి.ఆర్. గారి ‘ఆత్మగౌరవ’ నినాదం బ్రహ్మాండంగా పనిచేసి, టి.డి.పి.ని అధికారం లోకి తెచ్చింది 1983లో! ‘తెలంగాణ వచ్చుడో, చచ్చుడో!’ అన్న టి.ఆర్.ఎస్ నినాదం, మాండలీక పరిమళాలను వెదజల్లటంతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏ విజయమూ శాశ్వతం కాదు సార్! నచ్చకపోతే ఎవరినైనా ప్రజలు మార్చేస్తారు మరి. దటీజ్ ది పవర్ ఆఫ్ పీపుల్! ది డెమోక్రసీ! మళ్లీ పవరిచ్చినా, సీట్లు తగ్గించి, హెచ్చరిస్తారు ఓటర్లు! అందరినీ వింటారు, చెయ్యల్సింది చేస్తారు.
స్వాతంత్య్ర సమరంలో ‘నినాదాలు’ తమ సత్తా చూపాయి! ఆయుధం చేయలేని పనిని నిదానాలు చేయగలవని నిరూపించాయి! నినాదాన్ని సృష్టించడం ఒక అద్భుత సృజనాత్మక ప్రక్రియ. నినాదాలు కూడా సాహిత్యంలో భాగమే! 1942లో ‘క్విట్ ఇండియా’ నినాదం అలాంటిదే! మొదట ఒకరు ‘గెట్ అవుట్’ అని సూచించారట. రాజగోపాలాచారి గారు ‘రిట్రీట్ ఆర్ విత్‌డ్రా’ అయితే బాగుంటుందన్నారట. ఈ రెండూ గాంధీజీకి అంతగా నచ్చలేదట. చివరికి ‘క్విట్ ఇండియా’ నచ్చి దాన్ని ఆయన ఖరారు చేశారట. దాన్ని సూచించిన వారు యూసుఫ్ మొహర్ అలీ. ‘జైహింద్’ నినాదాన్ని సృష్టించినవారు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ అబిద్ హసన్ సఫ్రానీ గారు. నేతాజీకి ఆ నినాదమంటే చాలా ఇష్టం. ప్రతి సభలో, సమావేశంలో అది భరతవాక్యంగా ఇప్పటికీ నిలిచిపోయింది. ‘కాకా బాప్టిస్టా’ అనే ఆయన మేధోపుత్రిక (అదేనండీ బ్రెయిన్ చైల్డ్!) యొక్క ఒక పదబంధాన్ని, లోకమాన్య తిలక్, ‘స్వరాజ్యం నా జన్మహక్కు’గా అనుసృజన చేశారు.
‘రణన్నినాదం’ అని కొందరు వాడుతుంటారు. నాకెందుకో అది తప్పేమో అనిపిస్తుంది. రణత్+నినాదం. యుద్ధ స్ఫూర్తిని కలిగించే నినాదమనా? కావచ్చు కాని ‘ని’ కి వత్తు ఎందుకో? రణనినాదం అంటే సరిపోదూ? దానిలో నాకు తెలియని వ్యాకరణ రహస్యం ఉందేమో? మీకు తెలిస్తే చెప్పరూ ప్లీజ్? దీన్ని చూస్తే ‘సత్యనారాయణ’ను కొందరు ‘సత్యన్నారాయణ’ అనడం గుర్తొస్తుంది నాకు. ఒత్తు పెడితే ‘ఎఫెక్టివ్’గా ఉంటుందనో ఏమో? అన్నీ ‘ఏమోలే’!
కొన్ని నినాదాలు వ్యక్తిగత అహంకారాన్ని సూచిస్తాయి. పధ్నాలుగవ లూయీ చక్రవర్తి ‘నేనే రాజ్యాన్ని!’ అని నినదించాడు. ఆయన పిచ్చిగాని, ఆయనే రాజ్యం ఎలా అవుతాడు? రాజ్యం శాశ్వతం. రాజు నాలుగు నాళ్లుండి పోతాడు.
నినాదం వల్ల ఒక విధానం ఆవిష్కరించబడాలి. అది ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. అప్పుడే అది సార్థకం అవుతుంది. కొన్ని అంత పాపులర్ కాకపోయినా, బాగుంటాయి. ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అన్నారు గాంధీ. ‘ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు’ అన్నారు నెహ్రూ. ‘చిన్న లక్ష్యం ఒక నేరం’ అన్నారు అబ్దుల్ కలాం. లాల్ బహదూర్ శాస్త్రిగారి ‘జై జవాన్, జై కిసాన్’ గొప్ప నినాదం. సైనికులను, రైతులను అది గ్లోరిఫై చేసింది! ‘కళ, కళ కోసం కాదు, ప్రజల కోసం’ అన్నారు బళ్లారి రాఘవ! ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న భగత్‌సింగ్ నినాదం పోరాట పటిమకు స్ఫూర్తినిచ్చింది. ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ అన్నారు పి.వి. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు దాశరథి. కవిత్వం పరిమళించే నినాదం!
‘అమర్ హై’కు, ‘జిందాబాద్’కు తేడా తెలియకుండా డబ్బు తీసుకునో, బిర్యానీ పాకెట్ కోసమో నినాదాలు చేసే వారిని చూస్తే నాకు కోపం రాదు, జాలేస్తుంది. అవి చేయించే వారంటేనే నాకు ఒళ్ళు మంట! ఒక వ్యక్తి అమరుడు కావాలంటే మాటలా? ‘జిందాబాద్’ పర్షియన్ మూలాలు కల మాట. ‘లాంగ్ లివ్’ అన్న మాట. ఎవరంటే వారి కోసం నినాదాలు ఇవ్వకూడదు. అదన్నమాట!
No comments:
Post a Comment