‘ప్రసంగం’ అంటే ‘ఉపన్యాసం’ మాత్రమే కాదు, మామూలుగా మాట్లాడడం కూడా నండి. అధికంగా మాట్లాడడం, అవసరానికి మించి చెప్పడం, ఎదుటవాడికి విసుగును కలిగిస్తుంది. కొండొకచో కోపాన్ని కూడా. అధిక ప్రసంగం రెండు రకాలని మనవి చేస్తున్నా. ఒకటి స్వీయ పాండిత్య ప్రదర్శన కోసం చేసేది. రెండు కేవలం అజ్ఞానంతో చేసేది. రెండింటినీ భరించడం కష్టమే.
అష్టావధానాల్లో ఎనిమిది మంది పృచ్ఛకులుంటారు. అది మీకూ తెలుసు. వారిలో ఒకరు ‘అప్రస్తుత ప్రశంస’ చేస్తుంటారు. వీరిని ‘అధిక ప్రసంగులు’ అనవచ్చు. సందర్భ శుద్ధి లేకుండా, ఏదో ఒకటి అవధానిని అడిగి, ఆయన ఏకాగ్రతను మళ్లించడమే వారి పని. వీరు కూడా పండితులై ఉంటారు. వీరి మాటలు హస్యస్ఫోరకంగా ఉండి, సమకాలీన సమస్యలను వ్యంగ్యంగా ఎత్తి చూపుతాయి. పృచ్ఛకులలో వీరు కీలకం సుమండీ! అవధానంలో అప్రస్తుత ప్రశంస చేయడం అంత వీజీ కాదు మాస్టారు!
ఈ పేరున ఒక అలంకారం కూడా ఉంది సాహిత్యంలో. దాని లక్షణం, ‘ప్రస్తుతాన్ని ఆశ్రయించి, అప్రస్తుతాన్ని తలచుకోవడం’. దీంతో మనకు పేచీ లేదు. నేను చెబుతున్నది ‘అధిక ప్రసంగం’. ఇది అలంకారం కాదు మహాశయా! ఇదొక జబ్బు. ‘ఎక్స్‌ట్రా వాగుడు’ అని దీనిని తెలుగులోకి అనువాదం చేయవచ్చు.
శ్రీ రామానుజాచార్యుల వారు ‘భక్తి’ తత్త్వమును ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంతం, మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఎదుర్కుని నిలిచింది. దీనికీ, అధిక ప్రసంగానికీ సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? లేక ఇది నా అధిక ప్రసంగం అనుకుంటున్నారా? కాదు బాబోయ్! ఆ మధ్య ఒకాయన, రామానుజాచార్యుల వారి మీద సినిమా తీస్తానన్నాడు. ఆయనే ఆ పాత్రలో నటిస్తాడట. ఆయన డబ్బులు, ఆయనిష్టం. కానీ ఆయన ఏమని సెలవిచ్చారంటే, “రామానుజులు సాక్షాత్ వేంకటేశ్వర స్వామికే గురువు!” అని. ఇదీ అధిక ప్రసంగం అంటే! అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు, ఏడు కొండల వెంకన్న బాబు - పరమాత్మ! ఆయనకు గురువేంటండీ బాబూ! ఇంకా తీయని సినిమా కోసం, దాన్ని ఇలా ప్రమోట్ చేసుకోవచ్చా? వికటించిందంటే డబ్బాలు రెండో రోజే తిరిగొస్తాయి! జాగ్రత్త! అన్నట్లు ఇప్పుడు బాక్స్‌లు ఎక్కడివి? శాటిలైట్ నుంచి తెర మీదికి డవిరెక్ట్‌గా ఎలిపొస్తుంటేను!
సోషియల్ మీడియా పరిఢవిల్లుతూన్న కొద్దీ (పదం బాగుందని వాడాను లెండి) అధిక ప్రసంగాలు ఎక్కువైపోతున్నాయి. రామేశ్వరంలో శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించనే లేదంటాడొకాయన. లంక నుంచి డైరెక్ట ఫ్లయిట్లో భరద్వాజాశ్రమానికి వెళ్ళిపోయాడంటాడు. అలా కాదు కామ్రేడ్, వారధి కట్టేముందే శివలింగ ప్రతిష్ఠ జరిగిందంటే వినడే! ససేమిరా అంటుంటే! అసలు విషయం, శివుడంటే ఆయనకు గిట్టదు! అయినా, నాకు తెలియక అడుగుతానండీ, శివకేశవులకు అభేదమన్న సత్యం తెలియని వాడూ జ్ఞానేనా? అదీ నా డౌటానుమానం!
‘ఇంట్లో దీపం ఎవరు వెలిగిస్తే ఎక్కువ మంచి జరుగుతుంది?’ అని క్యాప్షన్! దాని గురించి అధిక ప్రసంగం. దీపం వెలిగించడం ముఖ్యం కాని, ఎవరు వెలిగిస్తేనేం, వాడి పిచ్చి గాని. రాజకీయాల్లో అధిక ప్రసంగాలకు లాజిక్కులుండవు. ఏదైనా పెద్ద కంపెనీ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందనుకోండి. ఎగస్పార్టీ ఆయన, “అవును, మూడేళ్ళ క్రిందట, మేం పవర్లో ఉన్నపుడు మాట్లాడేశాం! దాని ఫలితమే ఇది!” అని చెబుతాడు గొప్పగా. మరి అప్పుడే ఎందుకు రాలేదు బంగారూ?
‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమా చూశారు కదా! కళాఖండమది. అందులో చివరి సీనులో శిశుపాలుడు, శ్రీకృష్ణపరమాత్మకు అగ్రస్థానం ఎందుకు ఇవ్యాలని సుదీర్ఘ అధిక ప్రసంగం చేస్తాడు. చక్రాయుధంతో చస్తాడు. ఆ పాత్రను ‘రాజనాల’ గారు అద్భుతంగా పోషించారు. ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఉచ్చారణ, సింప్లీ సుపర్బ్! ఇలా చెప్పగలిగిన వారిప్పుడేరి? నంగిరి నంగిరిగా మాట్లాడేవారే ఇప్పుడు మహానటులు! సీను ముగిసిన తర్వాత యన్టీఆర్ రాజనాలను కౌగిలించుకోని, “మామా! నీవు తప్ప ఈ పాత్రను ఇంత గొప్పగా వేరెవరూ పోషించలేరు” అని ప్రశంసించారట. దటీజ్ ది స్పిరిట్.
“ఎప్పటి కెయ్యది ప్రస్తుత/మప్పటికా మాటలాడి అన్యుల మనముల్/ నొప్పింపక తానొవ్వక/తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!” అన్నారు బద్దెన అని పిలువబడే భద్ర భూపాలుడు. అంటే “అధిక ప్రసంగం చేయకండిరా!” అని మొత్తుకున్నాడు పాపం! కానీ వినరే! “అధికస్య అధికం ఫలం” అన్నారు మన పెద్దలు. “ఎక్కువైతే మరీ మంచిది”. సరే. కానీ అతివాగుడికిది వర్తించదు సోదరా!
శూద్రకుని ‘మృచ్ఛకటికం’లో శకారుడు, ‘పాతాళభైరవి’ సినిమాలో రాణీ గారి తమ్ముడు రేలంగి, షేక్స్‌స్పియర్ హెన్రీ ఫోర్ నాటకంతో ఫాల్స్ స్టాఫ్, ఉత్తర కుమారుడు - వీళ్ళంతా అధిక ప్రసంగానికి బ్రాండ్ అంబాసడర్స్. ఈ మధ్య ‘స్టాండప్ కమెడియన్స్’ అని కొందరు తయారైనారు. వారి హస్య ప్రదర్శనల్లో వివాదాస్పద విషయాలు వాగి చిక్కుల్లో పడుతుంటారు. ‘కునాల్ కమ్రా’ అనే నిలబడే కేతిగాడు, ఆ మధ్య, ‘హమ్ హోంగే కంగల్’ అన్న పాటను పేరడీ చేస్తూ పాడాడు. అది భారతదేశాన్ని, ప్రధానిని, సుప్రీంకోర్టును కించపరచేలా ఉందని, ఆయన మీద కేసులు పెట్టారు. హాస్యమైనా శ్రుతి మించితే, అధికమైతే..! అదన్నమాట!
No comments:
Post a Comment