Monday, July 28, 2025

అంతా నేనే చేశాను! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులతో దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. పాక్ కాళ్లబేరానికి వచ్చి “నీవే తప్ప నితః పరం బెరుగ మన్నింపందగన్ దీనునిన్, రావే ఈశ్వర, కావవే వరద, సంరంక్షించు భద్రాత్మకా!” అని గజేంద్రమోక్షంలో ఏనుగు శ్రీహరిని వేడుకున్న చందంగా, మన దేశాన్ని వేడుకుంది. అంతం కాదిది ఆరంభం అని మరీ స్పష్టం చేసి భారత్ ఊరుకుంది.
తనను తాను ఆమ్నిపొటెంట్ అని, ఆమ్నిసైంట్ అని, అదేనండీ, సర్వసమర్థుడిననీ, సర్వజ్ఞుడిననీ భావించుకుని, అదే భ్రమలో ఉండే ట్రంపు, ప్రారంభించాడు - “ఇండియా పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా!” అని డంబాలు కుంభాలతో పోయడం మొదలెట్టాడు. “మధ్యన నీ బోడి పెత్తనమేమిటోయ్!” అని మోడీ స్పష్టం చేశాడు. ఐనా వినడే! “ట్రంపు గారి సొంపు ఇంతింత గాదయా” అని, “పాడిన పాటే పాడకురా, పాచిపళ్ల వాడా!” అని గడ్డి పెడితే, చివరకు ఒప్పుకున్నాడు! తాను కాదని! అందుకే బద్దెన గారన్నారు “వెనుకటి గుణ మేల మాను, వినరా సుమతీ!” అని. పూర్తి పద్యం ఈయనకు రాదా? కొంపతీసి! అనుకుంటున్నారా? వచ్చు. కాని పూర్తిగా రాస్తే, ట్రంప్ అభిమానులు, ముఖ్యంగా మన దేశంలో, బాధపడతారని మానేశాను. “స్వభావో దురతిక్రమః” అన్నాడు రావణాసురుడు, తన మాతామహుడు, మంత్రి ఐన మాల్యవంతునితో. ఇక్కడ పూర్తి శ్లోకం వ్రాస్తాను.
ద్విధా భజ్యేయమాప్యేవం న నమేయం తు కస్యచిత్। 
ఏష మే సహజో దోషః స్వభావో దురతిక్రమః॥ (యుద్ధకాండ 36.11)
“నాయనా! రామునితో యుద్ధం వద్దు, నా మాట వినురా!” అని మాల్యవంతుడు చెబితే, రావణుడు, “అబ్బే! వీల్లేదు. గ్రాండ్ పా! నన్ను రెండు ముక్కలుగా కోసినా, నేనెవరికి లొంగను. ఇది నాలోని సహజ దోషం!” అన్నాడు (అందుకే దుర్యోధనున్నీ, రావణున్నీ తెలిసిన మూరులన్నారండోయ్). చివర్లో తన బలహీనతను జనరలైజ్ చేశాడు (చేసింది వాల్మీకి సార్!) “స్వభావాన్ని అధిగమించడం కుదరదు కదా మరి!”.
ఇది ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో కూడ బయటపడింది. ఇరాన్‌ను బెదిరించాడు. గడ్డపాయన, పెద్దాయన, ఆయతొల్లా ఖొమైనీ, “ఐ కేర్ ఎ పిన్” అన్నాడు. “పో బే!” అన్నాడు కూడా! ట్రంప్ ఇరాన్‌పై క్షిపణులు ప్రయోగించినా ఇరాన్ బెదరలేదు. పైగా అమెరికా మీదే ప్రతిదాడులు చేసింది.
ఇక కె.ఎ. పాల్ గారు ఉండనే ఉన్నారు. తానే ఇండో- పాక్ యుద్ధాన్ని ఆపానని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంతకుముందు కూడా చాలా యుద్ధాలను ఇలాగే ఆపాడట. ఆయన ప్రజ్ఞలు వింటే ఉత్తరకుమారుడు కూడా తల దించుకోవలసిందే.


గొప్ప గొప్ప కార్యాలు సాధించిన వారు కూడా తామే కర్తలమని చెప్పుకోరు. అది వారి వినయశీలం. మన భారతీయ వేదాంతంలో అదొక ఉదాత్త భావన! ‘అహంకారం’ నుండి విముక్తుడయితే తప్ప, మనిషి మహనీయుడు కాలేడు.
టి.టి.డి. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ పి. వి. ఆర్. కె. పసాద్ గారు వెంకటేశ్వరస్వామి సేవలలో తాను సాధించిన విజయాలను, పొందిన అనుభవాలను, వినమ్రంగా, ‘నాహం కర్తా, హరిః కర్తా’ అనే శీర్షికతో ‘సర్వ సంభవమ్’ పుస్తకంలో వ్రాసుకున్నారు.
శ్రీనాధకవి “చిన్నారి పొన్నారి చిరుత కూకటనాడు రచియించితి మరుత్తరాట్ చరిత్ర” అని ప్రారంభించి గొప్పలు చెప్పుకున్నారు. చివరికేమయింది?
మాకు వరుసకు పెదనాన్నగారు, పాణ్యం భైరవ శర్మగారు. ఆయన ట్రంప్ కంటే నాలుగాకులు ఎక్కువ చదివినవాడు. ఆయన ధోరణి ఇలా ఉంది. “ఒరేయ్ దత్తుడూ (అంటే నేనన్నమాట!) ఢిల్లీకి వెళ్లాను కదా ఆ మధ్య! ఇందిరాగాంధీని ఎడాపెడా దులిపేసి వచ్చాను. ‘ఏమిటమ్మాయ్? ఎమర్జెన్సీ ఇంకా ఎన్నాళ్లు పెడతావు? ఎత్తెయ్యి! అర్ఘ్యాల్లోకి పిండాల్లోకి లేకుండా పోతావు జాగ్రత్త!’ అని తిట్టానురా. కిక్కురుమంటే ఒట్టు”. నేను అనుమానంగా చూస్తూంటే, “ఒరేయ్, నీకబద్ధం నాకు నిజం” అనేవాడు. ఆయన మద్రాసుకు వెళితే దిగేది ఎక్కడో తెలుసా మీకు? కరుణానిధి గారింట్లోనే! లేకపోతే ఆయన ఒప్పుకోడు మరి! ఈ టైపు గొప్పల వల్ల, పెద్దగా ప్రమాదం లేదు లెండి.
ఇంతకూ, ట్రంప్ అంత సీన్ నాకు లేదుగానీ, ఈ బనకచర్ల డ్యాం వివాదాన్ని మీరే పరిష్కరించాలని అటు చంద్రబాబు గారు, ఇటు రేవంత్ రెడ్డి నన్ను బ్రతిమాలుతున్నారండీ బాబు! నవ్వుతున్నారెందుకు? అదన్నమాట!



2 comments:

  1. ఇది శ్రీ నారంశెట్టి ఉమా మహేశ్వర రావు గారి అభిప్రాయం: అంతా నేనే చేసాను, మీ దత్తవాక్కు ఈ రోజు వచ్చింది చదివాను. అద్భుతంగా రాసారు.
    హాస్యబ్రహ్మ శంకరనారాయణ గారు గుర్తొచ్చారు. ఇదే కాదు, మీ రచనలన్నీ ఆహ్లాదకరంగా ఉంటూ అలరిస్తున్నాయి. హృదయపూర్వక అభినందనలు సార్.

    ReplyDelete
  2. ఇది శ్రీ యల్లాప్రగడ సుదర్శన్ రావు గారి వ్యాఖ్య: *శ్రీ పాణ్యం దత్త శర్మ గారు... వారి చేత మహాకావ్యం, వారి మాట మహాభాష్యం, వారి పాట దృశ్యకావ్యం, వారి శైలి నవభక్తి ప్రబోధం. వారికి అనేక నమస్కారములు..*

    ReplyDelete