Sunday, April 28, 2024

గుంపులో చేరి అరుద్దాం! - దత్తవాక్కు - ఆదివారం ఆంద్రప్రభ 28 ఏప్రిల్ 2024

 ఈ మధ్య జరుగుతూన్న ఎలక్షన్ల హడావిడి, ప్రచారార్భాటం, వాగ్దాన వాగాడంబరాలు చూస్తుంటే నాకెందుకో ఛార్లెస్ డికెన్స్ గుర్తుకు వచ్చాడు. బోడి గుండుకు, మోకాలికి ముడిపెడుతున్నాడేమిటా అని మీ కనుబొమలు ముడిపెట్టకండి... నాయకులారా,
ఓటరు మహాశయులారా. ఈ 'మహాశయులు' అనే పదం ఎవరు కనిపెట్టారో కానీ ఇది నేతి బీరకాయలో నెయ్యి! కరిమింగిన వెలగపండు! ఇక చాలా... సరే సరే... ఎందుకన్నానంటే అటు వారికీ, ఇటు వీరికీ, అంత 'మహా' ఆశయాలు లేవు. ఉన్నాయని గుండెలమీద
చేతులు వేసుకుని చెప్పమనండి.
ఇంతకీ ఛార్లెస్ డికెన్స్‌ను అలా వదిలేశాం. 'అలివర్ ట్విస్ట్' లాంటి కరుణ రసాత్మకమైన నవలలే కాకుండా, సమాజంలోని కొన్ని అంశాలపై సున్నితమైన, వ్యంగ్య శరాలను కూడా సంధించాడాయన, ఆయన రాసిన సెటైర్ (వ్యంగ్య విమర్శ) ‘పిక్‌విక్ పేపర్స్'. ఇది నవల అనే చెప్పవచ్చు. డికెన్స్ 'బాజ్' అనే పేరు తో దీనిని ఎడిట్ చేశాడు. 1837లో ఇది పుస్తక రూపంలో వచ్చింది. డికెన్స్ తన 24 ఏళ్ల వయసులోనే ఒక పార్లమెంటరీ రిపోర్టర్‍గా పనిచేశాడు. ఇప్పటికీ ఇంగ్లాండులో 'పిక్‌విక్ క్లబ్' ఉందండోయ్.
ఆయన సృష్టించిన మిస్టర్ పిక్‍విక్‌ను మనం మన జంఘాలశాస్త్రితో, బారిస్టర్ పార్వతీశంతో, సత్యరాజాతో కొంతవరకు పోల్చవచ్చు. మన ఎన్నికల ప్రహసనాన్ని డికెన్స్... 13వ అధ్యాయంలో ప్రస్తావించాడు. అది ఒక వ్యంగ్యపు విందు, హాస్యపు చిందు, చురుక్కున తగిలే మందు, వెరసి మనసుకు పసందు! ఎలా ఉంది నా అనుప్రాస? అదేమిటి మొహమలా పెట్టారు? సరే... విషయానికి వస్తా.
ఈటన్స్ విల్ అనే ఊర్లో ఎన్నికలు జరుగుతుంటాయి. మిస్టర్ పిక్‍విక్ తన స్నేహితులు కొందరితో అక్కడికి వెళతాడు. రెండు పార్టీలు... హోరాహోరీ, కచాకచీ, ముష్టాముష్టీ, బాహాబాహీ పోరాడుతుంటాయి. వాటి పేర్లు బ్లూస్, బఫ్స్! రెండూ ఒక దాని మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటుంటాయి. అంత దుమ్మెక్కడిది? అంటున్నారా, తెప్పించుకుంటారండీ బాబూ! రెండు పార్టీల ఊరేగింపు ఒక చోట ఎదురవుతుంది. నినాదాలు నింగికెగిసేలా అరుస్తుంటారు. పిక్‍విక్ మిత్రులతో అంటాడు.

 


 " 'షౌంటింగ్ కంటెస్ట్' (కేకల పోటీ) నడుస్తున్నట్లుంది... ఎందుకైనా మంచిది... yell with the largest mob.. అంటే గుంపులో చేరి కేకలేద్దాం పదండి"
ఈ మాటకెంత ప్రాచుర్యం వచ్చిందంటే... అది ఒక సామెతై కూర్చుంది. ఇప్పటి రాజకీయ వలసలు చూస్తుంటే, ఆయన చెప్పింది నిత్యనూతనం. పార్టీల పేర్లు చూడండి ఎలా పెట్టాడో. బ్లూస్ అంటే 'ఏడుపుగొట్టు పాట' అనీ, ఈసురోమని ఉండటం అనీ అర్థం. బఫ్స్ అంటే కండబలం మెండుగా ఉండటం. మొత్తానికి ఇరు వర్గాలకూ బుర్రలేదని డికెన్స్ వారి అభిప్రాయం. ఈయన కొంటెతనం చూస్తే నాకు డి.వి.నరసరాజు గారు గుర్తొస్తారు. ఆయనా వ్యంగ్య ధురీణుడే!
బ్లూస్ పార్టీకి ఎన్నికల సలహాదారు 'పెర్కర్'. వారికి సొంత న్యూస్ పేపర్ కూడా ఉందం డోయ్. దాని ఎడిటర్ మిస్టర్ పాట్. ఆయనను pompous wind bag అంటాడు రచయిత. అంటే స్థూలకాయడని. ఆయనింట్లోనే వీరి బస. వీళ్లు మర్నాడు బ్లూస్ పార్టీ ఊరేగింపులో ఉంటారు. బఫ్స్ వారి ఊరేగింపు వీరిని అటకాయిస్తుంది. బ్లూస్ వారి అభ్యర్థి 'శామ్యుయల్ స్లమ్‍కీ’ ప్రచారానికి బయల్దేరేముందు తన సహాయకునితో ఇలా అంటాడు. "షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఒక పేద యువకుడిని, పాదాభివందనం చేయడానికి ఒక పెద్దాయనను, కౌగిలించుకో డానికొక వికలాంగుని, అక్కున చేర్చుకోవడానికొక ముసలవ్వను, ఎత్తుకుని ముద్దాడటానికొక పసి పాపను రెడీగా ఉంచారా లేదా". అమ్మ డికెనూ! దాదాపు 180 ఏళ్ల క్రిందటే మా నాయకులు ప్రజలతో మమేకం కావడంలోని మర్మాన్ని బయటపెట్టేశావే! శబ్బాసురా శంకరా.
బఫ్స్ పార్టీ అభ్యర్థి హొరేషియోగారు. ఓట్ల లెక్కింపులో 'టై' ఏర్పడి సమీయే గెలుస్తాడు. పెర్కర్ ఆయన గెలవడానికి తగిన 'లంచాలను' పెద్ద ఎత్తున ఓటర్లకిచ్చి ఉంటాడు. అయ్యా... అదీ సంగతి. ఏమంటే... అప్పటికింకా వ్యక్తిగత దూషణలున్నట్లు లేదు. ఎవరు గెలుస్తారు? ఏముద్ధరిస్తారు... అనేది పక్కన బెడితే... ఈ ప్రహసనమంతా చక్కని వ్యంగ్య వినోదంగా మలచిన డికెన్స్‌కు ఆయన సృష్టించిన మిస్టర్ పిక్‍విక్‌కు జై! మనలాంటి మధ్య తరగతి మందహాసాలకు ఎన్నికలు ఒక చక్కని వినోదం! ఆ మందహాసంలో ఒక నిస్సహాయ విషాదం కూడా ఉంది! కానివ్వండి! అదన్నమాట.

సరస్వతీ పుత్రుని సాహిత్య దీప్తి

నేడు శ్రీ పుట్టపర్తి నారాయాణాచార్యుల జయంతి. ఈ సందర్భంగా నేను ఆంద్రప్రభలో వ్రాసిన వ్యాసం చదవండి.
~
ఆయనది ధిషణాహంకారమేగాని వ్యక్తిగత గర్వం కాదు. అవసరమైతే ఏ సవాలునైనా స్వీకరించేవారు. “ఆయనకు అన్ని భాషలు రావు. కేవలం ప్రచారమే” అని ఒక లబ్దప్రతిష్ఠుడు ఆక్షేపిస్తే, "14 భాషల్లో ఎవరు ఏ ప్రశ్న ఐనా వేయవచ్చు. వాటిలో ఆశు కవిత్వం చెబుతాను” అన్న ధీశాలి ఆయన. ఈయన అహంకారం ఎంతైనా సముచితం. పుట్టపర్తి వారి వంటి వారికి జననమే కాని మరణం ఉండదు.


 



'మహాప్రవాహం!'-24

మొదట్లో కస్టమర్ల కాల్లకు చెప్పలు తొడిగి, సైజులు చూస్తాంటే ఒక రకంగా అనిపించేది. తర్వాత అలవాటయి పోయినాది. బతుకు తెరువు నడిపేది వాండ్లే గదా అనిపించేది.
~
కాలమా! మజాకా! ఎవుర్ని యాడకు దీస్కపోతాదో! మాదవ కుటుంబమును తన ఎంటన గుంజుకొనిపోయింది! దానిస్టమే గాని మనిస్టం గాదు కద!


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-24/

 


Thursday, April 25, 2024

డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు పంపిన ఆశీస్సులు

డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు నన్నూ, తమ్ముడు కోవెల సంతోష్ కుమార్‍ను దీవిస్తూ పంపిన పద్యాలు:


 


విశేష బహుమతి పొందిన నా 'బాలల నాటకం'

బాలబాట మాసపత్రిక ఇటీవల నిర్వహించిన బాలల నాటక రచనా పోటీలో నేను రచించిన 'పరధర్మో భయావహః'  అనే బాలల నాటకానికి ప్రత్యేక బహుమతి లభించింది. ఈ మేరకు బాలబాట నిర్వాహకురాలు కొల్లూరి స్వరాజ్యం వేంకట రమణమ్మ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 


 


Sunday, April 21, 2024

గ్రాంఫోన్... టేప్ రికార్డర్.. సెల్‍ఫోన్! - దత్తవాక్కు - ఆంద్రప్రభ - ఆదివారం - 21 ఏప్రిల్ 2024

1887 లోనండీ... ఎమిల్ బెర్లినర్ అనే ఆయన గ్రామోఫోన్‌ను కనిపెట్టాడు. ఎలక్ట్రిక్ రికార్డు ప్లేయర్‌కిది పూర్వీకుడు. నవ్వుతున్నారెందుకు? మనుషులకే కాదు... యంత్రాలకూ పూర్వీకులుంటారు. తేడా ఏమంటే, యంత్రాలకు తద్దినాల సమస్య లేదు. అది తొలి కార్బన్ మైక్రో ఫోన్. దాని పేటెంట్‌ను ఆయన అలెగ్జాండర్ గ్రాహంబెల్‌కి అమ్మేశాడు. అదే థామస్ అల్వా ఎడిసన్‌కి ప్రేరణ. ఆయన విజయవంతంగా మానవుని గొంతును, రికార్డు చేసి స్టోర్ చేయగలిగాడు. టిన్ ఫాయిల్ ఫోనోగ్రాఫ్ ద్వారా దానిని ప్లే చేయగలిగాడు.
1900లో గ్రామోఫోన్‍కు ట్రేడ్‍మార్క్ 'హిజ్ మాస్టర్స్ వాయిస్'ను సంపాదించాడు ఎడిసన్. అదే హెచ్ఎంవీ కంపెనీగా తర్వాత పేరుపొందింది. వెడల్పుగా బ్యాండుమేళం మూతిలా ఉన్న దాని దగ్గర ఒక కుక్క కూర్చుని వింటూ ఉంటుంది. దానిపేరు నిప్పర్, కుక్క తన యజమాని గొంతును ఎలా గుర్తిస్తుందో... అంత క్లారిటీగా అన్న మాట,
తయారైన తర్వాత ఎడిసన్ తన తొలి రికార్డును ఎవరైనా గొప్పవాడి గొంతుతో చేయిద్దామనుకుని జర్మన్ వేదాంతి, విద్యావేత్త, మాక్స్ ముల్లర్‌ని సంప్రదిస్తే... ఆయన సరేనన్నాడట.
ఆయన గొంతులో ఒక విషయాన్ని రికార్డు చేసి ఒక సభలో వినిపిస్తే, అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట. కారా మరి? కొందరు భయస్తులు ఇది దయ్యాల పనే అని తేల్చేశారట.
కానీ, మాక్స్ ముల్లర్ చెప్పినది ఏదో వేరే భాష, 'ఇదేమిటో తెలుసా?' అని అడిగి 'ఇది సంస్కృతం... భారతీయ పురాతన సనాతన భాష. గ్రాంఫోన్‍లో నేను చదివింది ఋగ్వేదంలోని అగ్నిమీళే పురోహితం అన్న మంత్రం. అగ్నిని ఆరాధించే ప్రార్థన.. సమస్త జ్ఞానానికి ఆద్యులు భారతీయులే' అని చెప్పాడట ముల్లర్. సభికులు చప్పట్లు. 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయి!' అని ఎగతాళి చేసేవారు తెలుసుకోవాలి మరి.
తర్వాత టేపు రికార్డర్లు వచ్చాయి. ధ్వనులను ఒక నల్లని, ఒక సెంటిమీటర్ వెడల్పున్న చిన్న రిబ్బను లాంటి టేపులో రికార్డు చేసి, ఒక ప్లాస్టిక్ డొక్కులో చుట్టేవారు. దానిని క్యాసెట్ అని అనేవారు, టేపు రికార్డర్లో దాన్ని అమర్చి ప్లే అనే స్విచ్ నొక్కితే టేపు తిరుగుతూ, ప్రీ రికార్డెడ్ పాటలు, ఇంకా ఎన్నో చక్కగా వినిపించేవి. 80వ దశకంలో ఇంట్లో టేపు రికార్డర్ ఉంటే ఒక ప్రిస్టేజ్‌గా భావించేవారు, చౌక రకం టేప్ రికార్డర్లలో టేపు స్ట్రక్ అయితే, దాన్ని బయటకు తీసి పెన్సిల్‍తో చుట్టడానికి నానా అవస్థపడే వాళ్ళం.
ఇప్పుడు సెల్ ఫోన్ షాపులున్నట్టు ఎక్కడ చూసినా క్యాసెట్లు, రికార్డింగ్ దుకాణాలుండేవి అప్పుడు. అబ్బో ఎప్పటి మాట నలభై ఏళ్ళ కిందట. ఎన్నో ప్రముఖ క్యాసెట్ కంపెనీలు చక్కని సంగీతాన్ని రికార్డు చేసి అమ్మేవి. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ గారు వ్యాపారాన్ని అటుంచితే ఈ రంగంలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మనకు నచ్చిన సినిమా పాటలను, కీర్తనలను సెలక్టు చేసి ఇస్తే క్యాసెట్ షాపాయన వాటన్నింటినీ ఒకే క్యాసెట్లో రికార్డు చేసి ఇచ్చేవాడు. 60 నిమిషాల క్యాసెట్లు, 90 నిమిషాల క్యాసెట్లు ఉండేవి. ధర రూ.35 నుండి ప్రారంభం. 90లలో పుట్టిన వారికి ఈ విషయాలు తెలియవు పాపం. (పాపం ఎందుకో).


తర్వాత వచ్చేశాయి బాబోయ్... సెల్‍ఫోన్‍లనే మాయాజాలాలు! అన్నింటినీ తుడిచిపెట్టి పారేశాయి. 'బస్సొచ్చి బండోడి కడుపు కొట్టిండోయ్!' అన్నట్టు, సెల్లొచ్చి సమస్తమూ తొలగ దోసిందోయ్ అనాలి ఇప్పుడు. సెల్‍ఫోన్ స్మార్ట్ ఫోన్‍గా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అదొక అద్భుత ప్రపంచాన్ని మన అరచేతిలో ఇమిడ్చే పరికరం, ఆడియో, వీడియో దేన్నయినా ఇట్టే రికార్డు చేస్తుంది. దాన్ని క్షణాల్లో కావలసిన వారికి షేర్ చేయవచ్చు. యూ-ట్యూబ్‍లో నా ప్రసంగాలు, పద్యాలు, పాటలు వస్తుంటాయి. మా కోడలు ప్రత్యూష కొన్ని ఇంట్లోనే రికార్డు చేస్తుంది. ఒకసారి ఆ అమ్మాయి బయటికి వెళ్తే మా మనవడు ఏడేళ్ళ వాడు 'నేను తీస్తాలే తాతా' అని చక్కగా నా పద్యాలను వీడియో తీసి చూపించాడు. ఇంతకు ముందు మా కాలంలో 'పుస్తకం హస్త భూషణం' అనేవారు, ఇప్పుడది 'సెల్ఫోన్ చేతికి అందం'గా మారింది. మహాప్రభూ! కెమెరాలను, చేతివాచీలను, టేపు రికార్డర్లను, అలారం టైమ్‍పీస్‍లను సర్వేసమస్తాలను దెబ్బతీసింది సెల్ ఫోన్! మీరు మెయిన్ రోడ్డు మీద వెళుతూంటే ప్రతి ఐదు షోరూమ్‍లలోనూ ఒకటి సెల్ ఫోన్‍లది అయిఉంటుంది.
సౌలభ్యం సంగతటుంచితే ఆ కాలంలో గ్రాంఫోన్, టేపు రికార్డుల ఆనందం అనుభవించిన వారికే తెలుసు. గ్రామఫోన్ ప్లేటు కొంతకాలానికి అరిగిపోయి, దాని పిస్ ఒక చోట చిక్కుకుని అక్కడ ఉన్న పాట భాగాన్ని పదే పదే వినిపిస్తుంటే నవ్వుకునే వాళ్ళం కాని, విసుక్కునే వాళ్ళం కాదు. 'జగమే మాయ' అనే దేవదాసు పాటలో పిన్ను ఇరుక్కున్న చోట వేదాలలో, దాలలో, దాలలో... ఇలా పిన్ తీసేవరకు రిపీట్ అయ్యేది. ప్రతి గుడిలో ఒక గ్రాంఫోన్, టూరింగ్ టాకీస్ కూడా. ఘంటసాల వారి 'వాతాపి గణపతిం భజే', 'దినకరా శుభకరా' వినీ వినీ అవి నోటికి వచ్చేవి. రికార్డింగ్లు శృతి మించి, రహస్యంగా వాయిస్ రికార్డు చేసే సాక్ష్యాలుగా ఇస్తున్నారు. దొరికితే మాత్రం సోషల్ మీడియాలో అవి వైరల్! ఇంతకూ వైరల్ అంటే ఏమిటో? వైరస్‍లాగా పాకిపోయేదనో ఏమో ఖర్మ, ఇంతకూ వైరల్ కానిదేదైనా ఉందాఅని? అదన్నమాట!..

'మహాప్రవాహం!'-23

“ఏం చేస్తాము తల్లీ! కొడుకు మనోడు గాని, కోడలు మనది కాదు గదా, ఆ యమ్మకి నా పోడంటేనే గిట్టకపాయె. మా వాండ్లు (భార్య) సచ్చిపోయేంత వరుకు బాగనే ఉండె. ఆడికి రమ్మంటారుగాని, ఆ మాటలు కడుపు లోనించి రావు, పెదిమెల మించి వస్తాయి. సేద్దెం జెయ్యలేక మానేస్తి. ఇదో ఈ బండి, ఈ నోరు లేని జీవాలు మిగిలినాయి. బస్టాండు కాడ సూపెట్టుకోని, యావయినా సరుకులు తీసుకుపోనీకె ఎవరయినా పిలుస్తే పోతా. ఇవిటి మ్యాతకు, నా తిండికి లోటు లేదు తల్లీ! పైన శగిలి ఉన్నంత కాడికి జేస్తా. మూలబడినంక వానికీ తప్పదు, వాని పెండ్లానికి తప్పదు.”

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-23/