Saturday, August 31, 2024

మేధో ప్రదర్శన - దత్తవాక్కు - 01 సెప్టెంబరు 2024

మనిషి తన మేధస్సును ఎన్నో రకాలుగా ప్రదర్శిస్తాడు. అష్టావధానులు, శతావధానుల జ్ఞాపకశక్తి, పాండిత్యం చూస్తే అబ్బురం అనిపిస్తుంది. క్రికెట్లో వంద పరుగులు చేసి, ఔట్ కాకుండా నిలిచిన క్రీడాకారుడు కూడా మేధావే. ఉపగ్రహాలను అవలీలగా అంతరిక్షంలోకి పంపే శాస్త్రవేత్తలు, తమ నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమా నటులు, రాజకీయాలను ఒక మలుపు తిప్పి, ప్రజలకు మేలు చేసే నాయకులు, చివరికి యూట్యూబ్‌లో వంటలు చూపేవారు, వీళ్ళంతా తమ తమ రంగాల్లో మేధావులే.
అయితే ఏమిటిష? అంటున్నారా? వీళ్ళందరితో నాకేమీ పేచీ లేదు మిత్రమా! మిడిమిడి జ్ఞానంతో, తనకేమీ తెలియకపోయినా, అవాకులు, చవాకులు (వీటి అర్థం మాత్రం నాకు తెలియదు మహాశయా!) వాగుతుంటారు, చూడండి, వాళ్ళతోనే నాకు పేచీ!
పూర్వం 'పిట్టలదొర'లని వచ్చేవారు.. ఒక పాత కోటు ధరించి, టోపీతో, అనర్గళంగా అతిశయోక్తులను చెప్పేవారు. “పోయిన వారం ముఖ్యమంత్రి ఇంటికి భోజనానికి వెళ్ళాను. మహేశ్ బాబు నిన్న ఫోన్ చేసి, తన సినిమా ఎలా ఉందని అడిగాడు. కార్లో వెళ్ళేటపుడు వినడానికి మంచి పాటల కలెక్షన్ రెడీగా ఉంచా. ఇక కారు కొనడమే లేటు!" ఇదీ మేధో ప్రదర్శనే గాని, ప్రమాదకరం కాదండోయ్! అందంగా, వినోదం కోసం అల్లిన అబద్ధాలివి. అదీ పొట్టకూటి కోసం కాబట్టి.



ఒకసారి పలాసలో మా కాలేజీలో గురుపూజోత్సవం జరుగుతూంది. కమిటీ వారు నియమించుకొన్న ఒక తెలుగు లెక్చరర్ ఇలా ప్రసంగించాడు. “ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే కారణం మా గురువులే! (అంతవరకు బాగుంది) వాళ్ళకూ గురువులుంటారు, 'గుగ్గురువులు'. (ఇదెక్కడి దిక్కుమాలిన ప్రయోగం?) 'తేజస్వినావధీ తమస్తు!' అంటే తెలుసా? తేజస్వి అనే నావ ఎప్పుడూ మునగదు!" - 'ఓరి అవివేకశిఖామణీ, వేదోక్తిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వివరించావేమిరా అజ్ఞాన చూడామణీ!' అనుకొన్నాను. తర్వాత అతనితో, “తేజస్వినౌ+అవధీతమస్తు కదా మాస్టారు, ఈ 'నావ' ఎక్కడిది?" అంటే, "మీ సబ్జెక్టు ఇంగ్లీషు కదా మాష్టారు. పిల్లలకర్థం కావాలని సింపుల్‌గా చెప్పాను, అయినా, యూనివర్శిటీలో మాకు ఈ విషయాన్ని మా ప్రొఫెసర్ నాగభైరవ కోటేశ్వర రావు గారే చెప్పారు" అన్నాడు. ఔరా! వీడి తెలివితక్కువతనాన్ని ఎంత బాగా సమర్థించుకున్నాడు! పైగా మహా పండితుడు, ఆయన్ను కూడా లాగాడు! ఇలాంటి మేధో ప్రదర్శనంటే నాకు చిరాకు!
మనం ఏదైనా కొత్త చోట, దారి వెతుక్కుంటూ "ఎలా వెళ్ళాలి?" అని అడిగితే, సదరు మేధావి, తనకు తెలియకపోయినా, ఏదో ఒకటి చెప్పి తప్పుదారి పట్టిస్తాడు. కొందరు గొప్పవారి సూక్తులను, వేరే వారు చెప్పి నట్లు 'మిస్ కోట్' చేస్తారు. ఆ మధ్య రవీంద్రభారతిలో ఒక పుస్తకావిష్కరణ సభకు విశిష్ట అతిథిగా వెళ్ళాను. ప్రత్యేక అతిథి, ఆత్మీయ అతిథి, వీళ్ళంతా మాట్లాడిన తర్వాత, అనుకోని అతిథి ఒకాయన వేదికనెక్కి, “దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు మన గురజాడ!” అన్నాడు. ఇంకోసారి ఒకాయన విశ్వనాథ వారికి జ్ఞానపీఠ్ వచ్చింది, వేయిపడగలకు అంటాడు. "జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసి" అన్నది దాసరి గారంటాడు ఇంకో మేధావి!
మన బంధుమిత్రుల్లో కూడ చిత్రమైన మేధావులుంటారు. సామాజిక, రాజకీయ విషయాలపై వారి 'వాగుడు' వింటుంటే మనకు మతిపోతుంది. మా బంధువొకాయన, “మెట్రో రైలు వేస్టు, పైకి వెళ్ళి రైలు ఎక్కడం పెద్ద పని. మామూలు రైలు నేలమీద ఉంటుంది. యాక్సిడెంట్ అయినా, ఫరవాలేదు. అదే మెట్రో రైలు? అంతెత్తు నుంచి క్రిందపడితే ఇంకేమైనా ఉందా?” అన్నాడు. ఇంజినీరింగ్ చదివి, టెక్కీలుగా పని చేస్తుంటారు కొందరు. వారికి లోకజ్ఞానం ఉండదు. పేపరు చదవరు. న్యూస్ చూడరు. ఒకసారి మా అమ్మాయి ఫ్రెండ్ అన్నదట “నరేంద్ర మోడీ మన రాష్ట్రపతి అయింతర్వాత బాగుంది” అని.  బాగుంది కాని తల్లీ, రాష్ట్రపతికీ ప్రధానికీ తేడా తెలియని నీవు.. ఇంజినీరింగ్ ఇవన్నీ ఉంటాయా నా పిచ్చిగాని.
"తెలిసినవానికి తెలుపందగు
తెలియనివానికిని గూడ తెలుపగ వచ్చున్
తెలిసీ తెలియని మూర్ఖుని
తెలుపగ వివరింప బ్రహ్మదేవుని వశమే!”
అన్నారు పెద్దలు.
“సైలెన్స్ ఈజ్ పూలిష్ ఇఫ్ యు ఆర్ వైజ్, అండ్ వైజ్, ఇఫ్ యూ ఆర్ పూలిష్" (నీవు తెలివైన వాడివైతే నిశ్శబ్దంగా ఉండడం తెలివితక్కువతనం, కాని తెలివితక్కువ వాడివైతే నిశ్శబ్ధంగా ఉండడం తెలివైన పని). మాటలతో ఆడుకోవడం అంటే ఇదే. దీన్ని మనం సదరు మేధో శిఖామణులకు చెప్పామనుకోండి. వెంటనే “అవును నాకెందుకు తెలియదు? దీన్ని చెప్పింది షేక్‌స్పియరే కదా!” అంటారు. "దాన్ని చెప్పింది షేక్‌స్పియర్ కాదురా మొద్దూ, 'చార్లెస్ క్యాలెబ్ కాల్టన్' అన్న రచయితరా", అని వాడికి చెప్పగలమా? కుందేటి కొమ్మునైనా సాధించ వచ్చు గాని, మూర్ఖుల మనసును రంజింపలేమన్నారు కదా!
ఇక యూట్యూబ్, వాట్సాప్‍లలో మేధావులు చేసే మేధో ప్రదర్శన, బాబోయ్, దాన్ని తట్టుకోలేం. దానికి రుజువులు, ప్రమాణాలు ఉండవు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై నోటికొచ్చినట్టు పేలతారు. దీన్ని నియంత్రించలేమా? ఏమయినా అంటే భావప్రకటన స్వేచ్ఛ అంటారు. వేంకటేశ్వర సుప్రభాతంలో అశ్లీలముందని ఒకడు, మిస్ ఇండియా పోటీల్లో రిజర్వేషన్లుండాలని ఇంకొకడు, ఇదే అమెరికాలో అయితేనా.. అని మరొకడు, చచ్చిపోతున్నామండీ బాబు! ఓ గాడ్! సేవ్ మై కంట్రీ ఫ్రమ్ ది సోకాల్డ్ మేధావులు! అదన్నమాట!

శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-5 లింక్

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 5వ భాగం. 🙏
~
గోపాలరావు ఆలోచనల లోని పరస్పర విరుద్ధమైన ఉభయ పార్యాలను మన ముందుంచడం ద్వారా రచయిత్రి, ఉద్యమ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఉన్న తేడాను చూపారు. ఒక ఉద్యమం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసేవారెవరికైనా ఈ మానసిక సంఘర్షణ తప్పదు.


శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-5

‘మహాప్రవాహం’ 42వ భాగం లింక్

మర్నాడు పొద్దున కేదారను పిలిచి, “నిశ్చలానంద మహారాజ్ గారూ!” అని సంబోధించినాడు. కేదార ఆశ్చర్యపోలేదు. తండ్రి మానసిక పరిపక్వత అతనికి తెలుసు. తల్లి కూడ అంగీకరించింది. తానిక అపరాధభావన అనేది లేకుండా తానెన్నుకున్న పథములో సాగిపోవచ్చు. తల్లిదండ్రుల పాదాలకు ప్రణమల్లి ఇల్లు దాటినాడు కేదార. కాదు, కాదు, నిశ్చలానంద మహరాజ్! మమత్వాన్ని దాటినాడు!
#
కేదార సన్యాసం స్వీకరించి 'నిశ్చలానంద మహరాజ్'గా ఆధ్యాత్మిక పథంలో ప్రవేశించడం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.


‘మహాప్రవాహం’ 42వ భాగం లింక్

 

 



మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ – శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు – నివేదిక - లింక్

29 ఆగస్టు 2024న మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు పాల్గొని శర్మగారి ఆంగ్ల రచన 'The First Book of Apologues' పై పత్రసమర్పణ చేశాను. వివరాలు శంకర్ కుమార్ నివేదిక సంచికలో చదవండి.


మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ – శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు – నివేదిక

చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభ - నివేదిక లింక్

29 ఆగస్టు 2024న చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభలో ముఖ్య అతిథిగా ప్రధానోపన్యాసం చేశాను. ఆ వివరాలు గోట్ల యోగానంద స్వామి నివేదిక సంచికలో చదవండి.


చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభ - నివేదిక

 

Wednesday, August 28, 2024

టి.ఆర్.ఎస్. శర్మ - సాహిత్యం: అవలోకనం - జాతీయ సదస్సు

తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నేడు నిర్వహిస్తున్న 'టి.ఆర్.ఎస్. శర్మ - సాహిత్యం: అవలోకనం' అనే జాతీయ సదస్సులో మూడవ సమావేశంలో (మ. 2. గం నుండి 3 గం.) నా ప్రసంగం, పత్రసమర్పణ ఉంటాయి.
వివరాలకు ఈ లింక్ చూడగలరు.

'టి.ఆర్.ఎస్. శర్మ - సాహిత్యం: అవలోకనం' జాతీయ సదస్సు కార్యక్రమం 

సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన - స్వాధ్యాయ ఛానెల్‍లో- యూట్యూబ్ లింక్

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను గానం చేసిన సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన
స్వాధ్యాయ ఛానెల్‍లో.