Saturday, June 22, 2024

వాస్తు, జ్యోతిష్యం.. మనం! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 23 జూన్ 2024

మనందరికీ జరగబోయేది తెలుసుకోవాలని 'ఎంతో కొంత' నుంచి 'ఎంతో' వరకు ఉంటుంది. అది సహజం. నేను చెప్పబోయేది ఈ మన బలహీనతను సదరు కుహనా వాస్తు, జ్యోతిష్య పండితులు ఎలా క్యాష్ చేసుకుంటున్నారనే తప్ప, నిజమైన పండితులను విమర్శించడం కాదు.
'ఎవ్వెరీ టుమారో మస్ట్ బి ఎ సస్పెన్స్' అన్నాడు హెన్రీ ఫీల్డింగ్. అంటే ప్రతి రేపూ ఉత్కంఠభరితంగా ఉండాలన్నాడు. అప్పుడే లైఫ్‌లో థ్రిల్ ఉంటుందట. అలా కాకుండా అన్నీ ముందే తెలిసిపోతే. ఇంకేముంది చెప్పండి?
మా నాన్నగారు నాకు తొమ్మిదవ ఏటనే ఉపనయనం చేసి వాస్తు కాదు కానీ, జ్యోతిష్యం నేర్పారు. అంశ చక్రం, రాశి చక్రాలు వేయడం గ్రహస్థితులను బట్టి జాతకాన్నీ, భవిష్యత్ను చెప్పడం.. అలా నాకెందుకో ఆయన నేర్పిన సాహిత్యం పట్టుబడినంతగా జ్యోతిష్యం పట్టుబడలేదు. అందువల్ల ఆయనకు నా మీద కోపం కూడా ఉండేది. ఒకసారి నాన్న లేనప్పుడు కొందరు గ్రామీణులు మంచి రోజు చెప్పించుకోవడానికి మా ఇంటికి వచ్చారు. నాన్న లేరంటే నన్ను చెప్పమన్నారు. ముందే మిడిమిడి జ్ఞానం! ఇంట్లో ముహూర్త దర్పణం, జ్యోతిష్య మార్తాండం వంటి గ్రంథాలు ఉండేవి. ముహూర్త దర్పణం తెచ్చుకుని కూర్చున్నా. శుభకార్యం ఏమిటని అడిగా. "నిసేక మూర్తం పెట్టు సామి" అన్నారు వాళ్ళు.
నిషేక ముహూర్తం అన్న మాట. వధూవరుల నామనక్షత్రాలను లెక్కగట్టి వారం రోజుల్లో ఫలానా రోజున పగలు 11 గంటలకు.. అనబోతున్నాను, వాళ్ళు ఆశ్చర్యానికీ, అయోమయానికీ లోనై చూస్తున్నారు. ఇంతలోమా అమ్మ నన్ను లోపలికి పిలిచి "ఇంగితం లేదేమిరా నీకు? నిషేకం పగలు పెడతారా ఎవరైనా?" అని తిట్టింది. దాని అర్థం తొలిరాత్రి అని చెప్పింది. నాలుక్కరుచుకుని వెళ్లి "రాత్రి 11 గంటలకు" అని చెప్పి మ్యానేజ్ చేశా. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు. మరి ఇప్పుడు అంటున్నారా? దానికి ఒక అర్థ శతాబ్దం మీద ఐదు కలపండి. ఇదెందుకు చెప్పానంటే, నా జ్యోతిష్య పరిజ్ఞానం అప్పుడెంతో ఇప్పుడూ అంతే!
జ్యోతిష్యంలో కొన్ని మంచి నియమాలు ఉన్నాయి. చెడు పరిణామాలు చెప్పకూడదని... అలా! అయ్యా తమరికి 42 సంవత్సరాల వయసులో ద్వితీయ కళత్రయోగం ఉంది (అంటే రెండో భార్య వస్తుందని) అని జ్యోతిష్కుడు చెప్పగానే, సదరు జాతకుడు ప్రథమ కళత్రం పరమపదించడానికి ఇంకా ఎంత కాలముంది? అని లెక్కలు వేసుకుంటాడు. తమరికి ముప్పై ఏడేళ్ళు వచ్చే వరకూ ఏ ఉద్యోగమూ రాదు, ఏ వ్యాపారమూ కలిసి రాదు,
అసలు పెళ్ళే కాదు అని చెప్పారనుకోండి. మన వాడు ఇక ఏ పనీ చేయడు. ఇలాంటి జ్యోతిష్యాలు మనకవసరమా? చెప్పండి.
జ్యోతిష్యం ఫలించకపోవడానికి పార్వతీదేవి శాపం అని ఒక కారణం చెబుతూ ఉంటారు. అమ్మవారు ఎందుకలా శాపం పెట్టారో నాకు తెలియదు కానీ, జ్యోతిష్యులు తప్పించుకోవడానికి ఇదో చక్కని మార్గం. వెనకటికి ఒకాయన ఇలా చెప్పాడట - "ఖచ్చితంగా మగపిల్లవాడే పుడతాడు. ఒకవేళ తప్పితే ఆడపిల్ల!" ఇదీ జ్యోతిష్యమేనంటారా? రోడ్డు పక్కన కూర్చుని చిలకజోస్యం చెప్పేవారిని చూస్తే నాకు జాలేస్తుంది. పేదరికం వారి ముఖాల్లో తాండవిస్తూ ఉంటుంది. చిలుక పంజరంలోంచి బయటికి వచ్చి ఒక కార్డు తీసి మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం! అది క్రమశిక్షణా? లేక బానిసత్వమా? నాకు అర్థం కాదు. వాస్తులో వాస్తవం ఎంత? అద్దె ఇంటికి కూడా వాస్తు చూడాలా? యజమానికి ఏ సమస్య వచ్చినా, దానిని వాస్తుతో ముడిపెట్టి ఇల్లును అటూఇటూ మార్పులు, కొండకచో కూలగొట్టడాలు చేయించి అప్పులు పాలు చేస్తుంటారు. గుడ్డిగా నమ్మినవారిదే తప్పంటాను నేను. విదేశాల్లో వారికి వాస్తు తెలియదు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా! అని ఒక వాదన. వారికీ కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి. శుక్రవారం 13వ తేదీ కలిసిరాదనీ, అరచేయి దురద పెడితే అదృష్టమని, గోడకానించి వేసిన నిచ్చెన కిందుగా వెళ్తే అరిష్టమని, అద్దం పగిలిపోతే మంచిది కాదని.. ఇలా ఎన్నో ఉన్నాయి. సైన్స్ పరంగా ఇవేమీ నిలబడవు. శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం, లాజిక్ (తర్కాన్ని) ని అనుసరించడం.

 


 ఇప్పుడున్న సమాజం పూర్తిగా కమర్షియలైజ్ అయిఉన్నది. ప్రతి వారు తమ వృత్తిని ఇతరులను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికే ఉపయోగిస్తారు. 'కాదేదీ దోపిడీకి అనర్హం' అనవచ్చేమో? ఎవరో అరుదుగా మంచివాళ్ళుండచ్చు. వారికి నా పాదాభివందనం. తమాషా ఏమిటంటే - వాళ్ళకు నో డిమాండ్. ఒకసారి హైదరాబాద్, చిక్కడపల్లిలో ఒక సిద్ధాంతిగారి వద్దకు మా మిత్రుడితో వెళ్ళాను. అతని కూతురి వివాహం నిమిత్తం. పంతులు గారు ఎనభైవ పడిలో ఉన్నారు. మానవ రూపం దాల్చిన వాణీదేవీలా ఉన్నారు. ఆయన ఫలానా టైమ్ లోగా పెళ్ళి అవుతుందనీ, రుక్మిణీ కల్యాణం పారాయణం చేయమని చెప్పారు. సంభావన ఇవ్వబోతే, "ద్రవ్యం పుచ్చుకుంటే శాస్త్రం ఫలించదని తెలియదా?" అని కోప్పడ్డారు.
ఆర్ నారాయణ్ గారి హాస్య కథ 'యాన్ అస్ట్రాలజర్స్ డే' చదివే ఉంటారు. పొట్టపోసుకోవడానికి జ్యోతిష్కుని అవతారమెత్తి ఉంటాడు ఒకడు. వాడి దగ్గరకు ఒకడొచ్చి జ్యోతిష్యం చెప్పమంటాడు. వీడిని వాడు(రెండో వాడు) గుర్తించడు. జ్యోతిష్కుడు వీడిని కొట్టి పాడుబడిన బావిలో వేసి వచ్చిఉంటాడు. ఇద్దరిదీ ఒక ఊరే. వాడు బతికినట్టు వీడికి తెలియదు. ఈ గతమంతా వాడికి చెప్పి బ్రహ్మాండంగా చెప్పావనిపించుకుని డబ్బు తీసుకుంటాడు.
వాస్తు, జ్యోతిష్యాలు ఖచ్చితంగా శాస్త్రాలే! కానీ వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే నా బాధ! అదన్న మాట!

1 comment: