Sunday, July 7, 2024

అంత అవసరమా? - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 07 జూలై 2024

అవసరం అంటే కావాల్సింది అని అర్థం కదండీ! దీన్ని నేను మూడు భాగాలుగా విభజించాను. అవసరం, అత్యవసరం, అనవసరం! ఒకరికి అవసరం అయినది ఇంకొకరికి అనవసరం కావచ్చు. మరొకరికి అత్యవసరం కావచ్చు. ఈ కాన్సెప్ట్ మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటుంది. మన కావ్యాల్లో, ప్రబంధాలలో దీన్ని 'సమయం' అనే అర్థంలో వాడుతుంటారు కవులు. శ్రీకృష్ణుడు తన చెలికాండ్రతో చల్దులారగించునవసరమున అంటే ఆరగించే సమయంలో అని.
ఈ అవసరాలు వస్తువులకే గాదు, మనం మాట్లాడే మాటలకు, చేతలకు... వేయేల? అన్నింటికీ వర్తిస్తాయి. 'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికామాటలాడి' అన్న పద్యం పైకి అవకాశవాదంలా కనిపించినా అందులో ఎంతో నిజముంది. అవసరాన్ని ఇంగ్లీషులో నీడ్ అనీ, నెసిసిటీ అనీ అంటారు. అవసరమే పరిశోధనకు కారణం. 'నెసిసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్'. ఈ సామెత అందరికీ తెలిసినదే. బీసీఈ 6వ శతాబ్దం మధ్యలోనే ఈసప్ అనే మహానుభావుడు ఫేబుల్స్ (చిన్న నీతి కథలు) రాసాడు. 'కాకి ఒకటి నీళ్లకు, కావుకావుమనుచును' అన్న పాట తెలుసుకదా!
'ది క్రౌ అండ్ ది పిచ్చర్' (కాకి, కుండ) అనే ఈసఫ్ ఫేబుల్లో ఉంది ఈ మాట. కుండ అడుగున ఉన్న నీళ్ళు తాగాలి కాకి, దానికి చాలా దాహంగా ఉంది. నీరు అత్యవసరం కానీ అది అందదే? సో దానికి ఒక సూపర్ ఐడియా వచ్చింది. గులక రాళ్ళను ముక్కుతో తెచ్చి కుండలో వేసి నీరు పైకి వచ్చేలా చేసి, తాగింది! అమ్మ కాకిశ్రీ! నీకెంత తెలివే? కాబట్టి మనకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి మార్గాలు వెతుకుతాం. అదే పరిశోధనకు దారితీస్తుంది. ప్రపంచంలో కనిపెట్టబడినవన్నీ అలాంటివే! ప్రఖ్యాత గ్రీకు వేదాంతి ప్లేటో 'రిపబ్లిక్' అనే గొప్ప గ్రంథం రాశారు. దాంట్లో ఆయన 'అవర్ నీడ్ విల్ బి ది రియల్ క్రియేటర్' అంటాడు. మనం కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు గానీ, మన అవసరాలు మాత్రం రానురాను చిత్రాతిచిత్రంగా మారుతున్నాయి. ఉదాహరణకు తిండినే తీసుకుందాం. 'ఈట్ టు లివ్, లివ్ టు ఈట్' అన్న మాట చూడండి. బతకడానికి తినడం, తినడానికే బతకడం. కడుపు నిండా తిండి దొరకని నిర్భాగ్యులు ఎందరో ఉన్నారు. వారికి తిండి అత్యవసరం. 'కడుపు నిండినమ్మకు గారెలు చేదు' అన్నట్టు ఫంక్షన్లలో అవసరం లేనివన్నీ వడ్డించుకుని తిన్నంత తిని ఎంతో ఆహారాన్ని వృథాగా పారేస్తుంటారు. అది అవసరమా? చెప్పండి!



అవసరం ఒక్కోసారి వ్యసనంగా మారొచ్చు. 'ఆహార నిద్రా భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం' అంటాడు హితోపదేశ కర్త. ఆధునిక సమాజం వీటిని అవసరానికి మించి వాడుకుంటున్నది. మాటలు మన స్పందన కంటే అనవసరం ఐనవి కాకూడదు. ఈ మధ్య ఒక వాట్సప్ గ్రూప్‌లో ఒకామె (టీచర్) తనకు వేరే స్కూలుకు బదిలీ అయిందని పెట్టింది. ఇక చూడండి ఆమె బంధువులు, ఫ్రెండ్స్, రెచ్చిపోయి అభినందనలు తెలిపారు. ఆమెకేం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రాలేదు కదా! బదిలీ అనేది ప్రభుత్వోద్యోగికి తప్పనిది. అదేదో ఘన విజయంలాగా దానికి అభినందనలెందుకు? కనీసం ప్రమోషన్ ఐనా కాదు! సోషల్ మీడియాలోని జాడ్యాల్లో ఇదొకటి! అనవసరంగా, అతిగా స్పందించడం.
కొన్నేళ్ళ క్రిందటి సంగతి. మా బంధువు ఒకామె వచ్చింది. ఏసీ లేకుండా ఎలా బ్రతుకుతున్నారని తెగ హాశ్చర్యపోయింది. చెప్పాను కదా! మన విలాసాలను కనీసావసరాలుగా చూపిస్తూ, ఇతరులను కించపర్చకూడదు. ఒకప్పుడు మా పల్లెల్లో సైకిల్ ఒక స్టేటస్ సింబల్. మరి ఇప్పుడు? 'సెకెండ్ ఏసీ కోచ్‍లో గానీ మేం ప్రయాణం చేయలేమండీ' అంటూంటారు గొప్పగా. డబ్బు అవసరాలను పెంచుతుంది. వాటికి అంతేలేదు. కానీ, డబ్బుందని బంగారం బిస్కెట్లను తినలేం కదా! 'లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారుమ్ము మ్రింగబోడు' అన్నాడు కదా శేషప్ప! ‘గొంతెమ్మ కోరికలు' అన్న మాట వినే ఉంటారు. ఇక్కడ గొంతెమ్మ అంటే కుంతీ దేవండోయ్! కర్ణుడిని పాండవుల వైపు వచ్చేలా చేయమని ఆమె కృష్ణుణ్ణి కోరుతుంది. అది సాధ్యమయ్యే పనికాదు. 'ఆకలి తీరడం' అనేది అవసరం. రోడ్డు పక్క టిఫిన్ బండివాడు మన కళ్ళ ఎదురుగా ఇడ్లీ వాయ తీసి పొగలు కక్కే ఇడ్లీలు, రెండు చట్నీలతో ఇస్తాడు, ముఫై రూపాయిలతో మహాదానందం! అలా తినాలంటే కొందరికి నామోషీ. పేరున్న హోటళ్లకు వెళ్లి రెండు ఇడ్లీలకు 150 రూపాయిలు ఖర్చు పెట్టి ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ క్రీమ్ లాంటి చద్ది చట్నీతో తింటే గానీ వారికి రుచించదు. ఫాల్స్ ప్రిస్టేజ్ ఒక్కోసారి అవసరాన్ని విలాసంగా మార్చి అభాసు పాలు చేస్తుంది. ఇక 'ఎమర్జెన్సీ' అంటే అత్యవసర పరిస్థితి. అలాంటివి ఎలా ఉంటాయో చూశాం. 'ఎమర్జెన్సీ కేర్' అని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా దోచుకుంటాయో అందరికీ తెలుసు. నార్మల్ డెలివరీ అవసరం. సిజేరియన్ అత్యవసరం అని అనవసరంగా చేసి డబ్బు దండుకుంటున్న సందర్భాలను చూస్తున్నాం. చిన్న పిల్లలకు 'ఐఐటి ఓరియంటేషన్' అనే అనవసరమైనది తగిలించి వారిని సతాయిస్తూ ఉంటారు. ముళ్ళపూడి వారి అప్పారావు 'ఓ ఫైవుంటే కొట్టుగురూ!' అంటుంటాడు. ఐదు రూపాయలు అతడికి అవసరం. నెలవారీ కంతులు కడితే విమానాన్నైనా కొనవచ్చు. అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా డబ్బుంటే దాని మీద థ్రిల్ పోతుంది. ఇక రాజకీయాల్లోకి రావాలనిపిస్తుంది. అవసరాన్ని ఉప్పులా వాడాలి. లేకపోతే ఇంతే సంగతులు! చిత్తగించవలెను! అదన్న మాట.

1 comment:

  1. కనువిప్పు కలిగించే రచన

    ReplyDelete