Sunday, August 18, 2024

పెరటి చెట్టు వైద్యం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ - 18 ఆగస్టు 2024

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు! ఎందుకంటే, అది మన పెరట్లోనే ఉండడం వల్ల, దాన్ని అంతగా పట్టించుకోము. అదే చెట్టు గురించి ఏ ప్రకృతి వైద్యుడో యూట్యూబ్‌లో వచ్చి, దాని గొప్పతనం గురించి చెప్పి, అది క్యాన్సర్లను కరిగిస్తుందనీ, డయాబెటీస్‌ను ఢమాల్ చేస్తుందనీ, బీపీని అయిపు లేకుండా చేస్తుందనీ, ఊదర గొట్టాడనుకోండి, మనకు దాని మీద ఎక్కడ లేని గౌరవం కలుగుతుంది.
"స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అంటారు కాని, అదంత వీజీ కాదండోయ్! "ఇంట్లో ఈగల మోత, బైట పల్లకీ మోత" అన్నట్లు, "విద్వాన్ స్వగృహే న పూజ్యతే" అంటాను నేను. ఘనత వహించిన రచయితల రచనలు వాళ్లింట్లో వాళ్లు చదవరని, ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే ఎవరు చేశారు. ఎప్పుడు చేశారు? అనే డౌటనుమానం వచ్చేసిందా, అప్పుడే మీకు? "సంశయాత్మా వినశ్యతి" కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పాడు! అదేదో సినిమాలో రావు గోపాలరావంటూ ఉంటాడు, “చరిత్ర అడక్కు, చెప్పింది విను!”


కళారంగాలలో రాణిస్తున్న వారి భార్యలకు వారిపై 'అంత' గొప్ప అభిప్రాయం ఉండదట. మా స్నేహితుడొకాయన బాగా పేరున్న కవి, విమర్శకుడు. ఒకసారి వాళ్లింటికి వెళ్లాను (పిలిస్తేనే లెండి!). ఆయన భార్య, కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. "అమ్మా, మావాడు గొప్ప సృజన గల కవి. ఇతడు నాకు స్నేహితుడవడం నాకు గర్వంగా ఉంటుంది" అన్నా. అందులో వంద శాతం నిజముంది కూడా! అప్పుడా ధర్మపత్ని అంది కదా, "ఏమిటో అన్నయ్య గారు! జోగీ జోగీ రాసుకొంటే బూడిద రాలుతుందని, (ఆ రెండో జోగి నేనేనని నాకర్థమయింది లెండి). కవిత్వాలు, ఆవిష్కరణలు, సమీక్షలు అని ఉన్నదంతా తగలేశారు మీ ఫ్రెండు! మా మరిది గారయితే రియల్ ఎస్టేటు చేసి లక్షలు గడించాడు. ఈయన కంటే పదేళ్ళు చిన్నవాడు. అయినా, ఇప్పడను కొని ఏం లాభం? ఖర్మ!" మా ఫ్రెండు కోపగించుకోలేదు! నవ్వుతూ ఆమె వైపు చూశాడు! స్థితప్రజ్ఞుడు!
సోక్రటీసు గొప్ప వేదాంతి. వేల సంఖ్యలో శిష్యులుండే వారాయనకు. ఆయన భార్య పేరు 'జాంతిపీ' (xanthippe). ఆయన ఆమెను తన యాభయ్యవ ఏట పెండ్లి చేసుకొన్నాడట. ఆయన కురూపి. బండ ముక్కు. లావు పెదవులు. రోజూ స్నానం చేయడట. ఒక చిరిగిన కోటుతో తిరుగుతాడంట. ఆయన భార్య గయ్యాళి అని అంటారు. ఆయన్ను నిత్యం సాధించి, అగౌరవ పరచేదట. కానీ ఆయన పట్టించుకొనేవాడు కాదట. ఆయనే ఇలా అన్నాడట "ప్రతి మగవాడు పెండ్లి చేసుకోవాలి. పెళ్లాం అనుకూలవతి ఐతే సుఖపడతాడు. గయ్యాళి అయితే, ఇదిగో, నాలాగా 'వేదాంతి' అవుతాడు!". ఆయనలా అన్నాడు గాని, పెళ్లి కాకముందే ఆయన వేదాంతేనండీ బాబూ!
మీ దగ్గర దాచడం ఎందుకు? నా 'దత్తవాక్కు' మా యింట్లో వాళ్లు ఎవరూ చదవరు, నిజం! నమ్మండి! నాకు వచ్చే బహుమతులు, అవార్డులు, సన్మానాలను సీరియస్‌గా తీసుకోరు. నేను చెప్పబోతే 'అదోలా' చూస్తారు! పెరటి చెట్టు సూత్రం..!
"అతి పరిచయాత్ అవజ్ఞా సంతతగమనాత్ అనాదరో భవతి" అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. బాగా పరిచయం ఎక్కువయి, సాన్నిహిత్యం పెరిగితే అంత గౌరవం ఉండదట. రోజూ వెళితే ఆదరణ తగ్గుతుందట.
నిజమే! ఒక సూపర్ స్టార్ ఉన్నాడనుకోండి, ఆయన్ను తెరమీద చూస్తే అభిమానులు గంగవెర్రులెత్తిపోతారు. కానీ, రోజూ ఆయనతో ఉండే ఆయన కారు డ్రైవర్‍కు అంత 'ఎక్సయిట్‌మెంట్' ఎందుకుంటుంది. 'సరేలే, మన సారే కదా!' అనుకుంటాడంతే! ఆయన భార్యకు ఆయన పట్ల అంత 'హీరో వర్షిప్' ఉంటుందా చెప్పండి? దే టేక్ హిం ఫర్ గ్రాంటెడ్! (దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో జుట్టు పీక్కున్నా తోచి చావలేదు. సారీ!)
కొడుకో, కూతురో ఎంత ఎత్తుకు ఎదిగినా, తల్లిదండ్రులకు 'అంత' అనిపించదు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా! కాని పెరటి చెట్టు ఫార్ములా ఇక్కడ పనికిరాదు.
"పొరుగింటి పుల్లకూర చాలా రుచి'. పక్కింటామె ఇచ్చిన కూరను మెచ్చుకొంటే... ఆ మగనికి మూడినట్లే!
మా యింట్లో నా రచనలు చదవరన్నానని నవ్వుకోకండి! ప్రతి కళాకారుడికి, ఇది తప్పదండోయ్! కానీ, మా పెరట్లో డాబా మీద, మా ఆవిడ బోలెడు మొక్కలు కుండీల్లో పెంచుతుంది. వాము మొక్కలున్నాయి. వామాకు వాడతాం. 'రణపాల' ఆకు ఒక కుండీలో పెరుగుతుంది. అది అద్భుతమైన పెయిన్ కిల్లర్. 'అలొవెరా' కూడా పెంచుతుంది. ఆకుకూరలు సరే సరి. ఈ లెక్కన “పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదు" అంటే కుదరదు. నా రచనలు పనికి రాకపోవచ్చు. కానీ ఇవన్నీ చక్కగా పనికి వస్తాయి.
'మీ గురించి అలా చెప్పుకుంటారేం?' అనుకుని ఆశ్చర్యపోకండి! దీన్నే 'సెల్ప్ మాకరీ' (self mockery) అంటారు. నిజానికి, ఇంట్లోవాళ్ళు, రోజూ పొగడుతూ ఉంటారేమిటి? మనసులో ఉంటుంది లెండి, పాపం! గొప్ప సైకాలజిస్టు, హ్యూమర్ రీసర్చర్ డా. ఆర్నీ క్యాన్ గారు “వన్ హూ కెన్ లాఫ్ అట్ వన్‌సెల్ప్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ" అన్నారు. తన మీద తానే జోకులు వేసుకొనేవాడు ఆరోగ్యంగా ఉంటాడట. ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు, చార్లీ చాప్లిన్ ఇలా అన్నాడు, "క్లోజప్‌లో చూస్తే జీవితం ట్రాజెడీ! కాని లాంగ్ షాట్లో అది కామెడీ!" సో, దూషణ భూషణలకతీతంగా, సరదాగా, తనను చూసి తానే నవ్వుకుంటూ ముందుకు వెళితే సరి! అదన్నమాట!

No comments:

Post a Comment