Sunday, September 29, 2024

ఏడో ఏడు ఏడుపు - దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ ఆదివారం 29 సెప్టెంబర్ 2024

'మొహం మొత్తడం' అని మన తెలుగులో ఒక ప్రయోగం ఉందిలెండి. పెళ్ళయిన కొంత కాలానికి, భార్యకు భర్త మీద మొహం మొత్తుతుందట. అంటే, మోజు తగ్గి, అయిష్టత మొదలవడం! ఇది అందరికీ వర్తించదులెండి! ఆదర్శ దంపతులు నన్ను కోపగించుకోకండేం! అలా అని అందరూ 'బడిపంతులు' సినిమాలో ఎన్.టీ.ఆర్. అంజలీ దేవిలాగా "నీ నగు మోము నా కనులార.. కననిండు!" అని పాడుకుంటూ పరవశిస్తూ ఉండరండోయ్!
ఈ మొహం మొత్తడాన్నే ఇంగ్లీషువాళ్ళు "సెవెన్ యియర్స్ ఇచ్” అన్నారు. 'ఇచ్' అంటే ఇరిటేషన్. పిల్లి అంటే మార్జాలం అన్నట్లుంది కదూ! ఒక విధమైన తీట! సరేనా? పెళ్ళయిన ఏడేళ్ళకు సరిగ్గా ఇది మొదలవుతుందట వాళ్ళకు. కరెక్ట్‌గా అంత 'టైమ్ ఫ్రేమ్' ఎందుకో? మనకలా ఉండదు. మన సనాతన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదంటే, ఎంత అయిష్టత ఉన్నా, ఎన్ని గొడవలు పడినా, వివాహ బంధానికి కట్టుబడి, కలిసే ఉంటాము. విడాకుల వరకు అసలు వెళ్ళం! కానీ, ఈమధ్య మన యువతరం కొంచెం ముందడుగు వేసి, వ్యక్తిత్వం అని, ఇగో అని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకుంటున్నారనుకోండి. వారి సంఖ్య చాలా తక్కువ సుమండీ! ఇదంతా ఎందుకని కొందరు ఔత్సాహికులు 'సహజీవనం' అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. మరింత సుందరంగా ఆంగ్లంలో... “లివ్ ఇన్ రిలేషన్‌షిప్". పిల్లల్ని కనరట. ఎప్పుడు పడితే అప్పుడు నీ జట్టు కటీఫ్! ఎవరి సంపాదన వారిదే! 'ఈవెంట్సు' ఏవయినా ఉంటే ఖర్చు చెరి సగం! పెళ్ళిమంత్రాల్లో 'నాతి చరామి', 'నాతిచరితవ్యా'లు వీళ్ళకు వర్తించవు. ‘సెవెన్ యియర్స్ ఇచ్' వీళ్ళకు సెవెన్ మంత్స్‌కే వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర లేదు.


ఈ 'ఏడేళ్ళ ఏడుపు'కు కొంత సైకలాజికల్ బ్యాకింగ్ ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ 'సెవెన్ యియర్స్ ఇచ్' అన్న పద బంధాన్ని మొట్టమొదట తన నాటకానికి శీర్షికగా వాడుకొన్నవాడు 'జార్జ్ యాక్సెల్ రాడ్' అన్న
రచయిత. దానినే 1955లో సినిమాగా తీశారు. మార్లిన్ మన్రో అందులో హీరోయిన్. టామ్ ఎవెల్ హీరో, మార్లిన్ మన్రో 1950లలో, తొలి 1960లలో వచ్చిన శృంగార విప్లవానికి ఆద్యురాలు. ఆమెను సెక్స్ సింబల్ అని పిలిచేవారు. పాపం 36 ఏళ్ళకే ఆ శృంగార రసాధిదేవత మరణించింది. ఆమె చేసుకున్న పెళ్ళిళ్ళు విఫలమై, విడాకులయ్యాయి. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆమె జీవించింది. జీవించదూ మరి? ఏడేళ్ళ వరకు సంసారం సజావుగానే సాగుతుందట. తొలి సంవత్సరాలలో శృంగారం పరస్పర అవగాహనను డామినేట్ చేస్తుందంటారు 'బొనామీ
డొబ్రీ' అన్న విమర్శకుడు. తర్వాత ఒకరి బలహీనతలను ఒకరు గుర్తించడం మొదలవుతుంది. అసూయా, అసహనం, అహంకారం వివాహ బంధాన్ని తూట్లు పొడిచే కత్తులు. ఇదంతా ఖచ్చితంగా 7 సంవత్సరాలకు జరుగుతుందని అనడానికి, నాకు తెలిసి, శాస్త్రీయ ప్రమాణత ఏమీ లేదు.
రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు 'దావత్' అనే కథ రాశాడు. పెళ్ళి విందులో తనకు పలావు ముక్కలు అసలు పడలేదని ఆ ఇంటల్లుడు తన భార్యను, ఆ యింటి ఆడ పడుచును, పెళ్ళి పందిట్లోనే బూతులు తిడుతూ చావబాదుతాడు! ఆమె కిక్కురుమనదు! "ఏడుస్తూనే సూటుకేసు తీసుకుని బిడ్డను చంకనెత్తుకుని అతడి వెంట నడిచింది" అంటాడు ఖదీర్. అబీదా భర్త మీద మనకు కోపం వచ్చినా, ఆమె సహనం పట్ల మనకు జాలి, గౌరవం కలుగుతాయి. అన్ని మతాలూ భార్యాభర్తల అన్యోన్య తను అనుబంధాన్ని గ్లోరిఫై చేస్తాయి.
"ఖుర్-ఆన్, సూర4 (ఆన్. సీసీ) ఆయ4"లో ఇలా ఉంది. "ప్రేమ దయ అనేవి నిక్కాలో భాగాలు కావాలి. భార్యకు భర్త ఒక ఆభరణము. భర్తకు భార్య కూడ అంతే ఆభరణము!"
భీష్మ పితామహుడు ధర్మరాజుతో భార్యాభర్తల బంధాన్ని గురించి ఇలా చెపుతున్నాడు. “నాస్తి భార్యాసమోబంధుః నాస్తి భార్యాసమం సుఖం, నాస్తి భార్యాసమంలోకే, నరస్య అర్తస్య ఔషధం” “సంతుష్టో భార్యయా భద్రార్యాతదైవచ” 'ప్రేమ దేశం' అనే సినిమాలో హీరోయిన్ ఇలా అంటుంది - “స్నేహితుడు భర్త అయితే ఎంత హ్యాప్పీ!". నేనంటాను, పెళ్ళయింత ర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా మారాలి! "బి డివోటెడ్ టు వన్ అనదర్ ఇన్ లవ్. ఆనర్ వన్ ఆనదర్ ఎ అబోవ్ యువర్ సెల్ఫ్" (రొమాన్స్-12-10) అంటున్నది బైబిలు. (ప్రేమలో ఒకరికి ఒకరు అంకితమవండి. మీకంటే ఎక్కువగా మీ భాగస్వామిని గౌరవించండి")
కాబట్టి కామ్రేడ్స్, "సెవెన్ యియర్స్ ఇచ్‌లు ఫైవ్ యియర్స్ పిచ్‌లు మనకు వద్దు. సమాజంలోని ఒక అత్యున్నత కౌటింబిక వ్యవస్థ వివాహం. బంధాన్ని నిలబెట్టుకు
ఉంచుకోవడం కష్టం. తెగతెంపులు చేసుకోవడం ఎంతసేపు? భార్యాభర్తలు దేవతలు కాదు. అన్ని బలహీనతలున్న మనుష్యులు. వాటిని పరస్పరం సహిస్తే, హ్యాప్పీస్!
అదన్నమాట!!


No comments:

Post a Comment