‘ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!”
అన్నారు బద్దెన, సుమతీ శతకకర్త.
ఈయన కాకతీయ సామ్రాజ్యంలో ఒక సామంతరాజు. తిక్కనకు శిష్యుడంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులకు వేలకు వేలు తగలేసి, పాశ్చాత్య దృక్పథాలను నేర్చుకునే యువతరం, మన తెలుగు శతకాలను బాగా స్టడీ చేస్తే, వ్యక్తిత్వ వికాసం బ్రహ్మాండంగా కలుగుతుంది.
ఈ పద్యంలో, 'తప్పించుకు తిరగడం' అంటే 'ఎస్కేపిజం' కాదు మిత్రమా! అవకాశవాదం అసలు కానే కాదు. ఏది అప్పటి కవసరమవుతుందో, దాన్నే మాట్లాడాలి. ఇతరుల మనస్సు నొప్పించకూడదు. తాను కూడ నొచ్చుకోకూడదు. ఇదో స్ట్రాటజీ!
'కమ్యూనికేషన్ స్కిల్స్' ఎలా ఉండాలో ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు? ఈ పద్యాన్ని ఒక కొంటె కవి ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. సరదాగా!
“వాటీజ్ నీడెడ్ నౌ అది
దట్ ఓన్లీ టాకుటాకి అఫెండవకన్
హర్ట్ చేయక హర్టవ్వక
ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతీ!
(దీంట్లో యతి ప్రాసలు సరిగా ఉన్నాయా, లేదా వెతక్కండి ప్లీజ్)
యుక్తితో బయటపడడం అంత సులువు కాదు. బోలెడు సమయస్ఫూర్తి, బొచ్చెడు లోకజ్ఞానం కావాలి. పానుగంటి వారి 'సాక్షి' వ్యాసాల్లో, ఇంగ్లీషులో 'ది డిక్టేటర్' అనే పత్రికలో వ్యాసాలుండేవి. హాస్యపు గుళికలవి. కానీ, ప్రాపంచిక జ్ఞానాన్ని అద్భుతంగా పంచాయి. వాటిని రాసిన వారు 'అడిసన్ అండ్ స్టీల్' అనే ప్రఖ్యాత రచయిత. అందులో, “సర్ రోగర్ డి కవర్లీ" అనే పెద్దాయన ఉంటాడు. చిలిపితనం, వ్యంగ్యం, హాస్యం, ఎత్తిపొడుపు, ఎగతాళి, ఇవన్నీ కలిస్తే ఆయనవుతాడు. 'ప్రాబ్లం సాల్వింగ్'లో
ఆయన దిట్ట. తన పరిష్కారాన్ని సూచించే ముందు ఆయన ఇలా అనేవాడు. “మచ్ మైట్ బీ సెడ్ ఆన్ బోత్ సైడ్స్!" (ఇరువైపులా ఎంతో చెప్పొచ్చు). నొప్పింపక తానొవ్వక తప్పించుకోవడమంటే ఇదేనండి!
మా కర్నూలు జిల్లాలో 'సిమెంట్ నగర్' అనే ఊరుంది. దాని రైల్వే స్టేషన్ పేరు “బుగ్గా నిపల్లె" గుంతకల్, గుంటూరు లైన్, డోన్, నంధ్యాల మధ్య. ఇదెందుకు చెబుతున్నా నంటే, అక్కడ తగవులు తీర్చే పెద్దలున్నారు. 'కర్ర విరగకుండా, పాము చావకుండా' రాజీ కుదురుస్తారు. ఈ వ్యవహారానికి 'బుగ్గానిపల్లె పంచాయితీ' అని పేరు. బద్దెన గారు బహుశ వారికి ఆదర్శమేమో మరి!
శ్రీకృష్ణ తులాభార నాటకంలో శ్రీకృష్ణునికి ధర్మసంకటం వస్తుంది. రుక్మిణీదేవి బర్త్ డే. ఆమె తన మందిరానికి రమ్మంటుంది. సత్యభామ వెంటనే మెట్టినదినం తనదని తయారు. కుళ్ళుబోతు. 'నారీనారీ నడుమ మురారీ' అయ్యింది అయ్య గారి పని. అప్పుడాయన తెలివిగా, అక్కడికొచ్చిన నారదుల వారిపై తన సమస్య తోసేస్తాడు!
'మెట్టిన దినమని సత్యయు
పుట్టిన దినమంచు భీష్మ పుత్రియున
న్నీ పట్టున బిలుతురు విందుకు”
అని, "నేను ఎటు బోవలయునో దిట్టముగా దెల్పుమయ్య దేవమునీంద్రా!" అంటాడు పరమాత్మ.
తెలివిగా ఎదుటివాడి మీదకు తోసేయడం అంటే ఇదే. ఆయనకు రుక్మిణీదేవే కరెక్టని తెలుసు. కాని నారదుడితో చెప్పిస్తే బెటరు కదా! తర్వాత కావాలంటే "అలిగితివా సఖీ ప్రియా" అని పాట పాడి సత్యాదేవిని ప్రసన్నురాలిని చేసుకోవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి, మోదీ గారి వరకు మన దేశం 'అలీన విధానాన్ని' అనుసరిస్తూ వస్తూ ఉంది. దీన్ని ఎన్.ఎ.ఎం (నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్) అంటారు. దీనిలో 120 దేశాలుంటాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన పవర్ కేంద్రాలలో దేనిలో ఇవి చేరవు. (అలీన-లీనం కాని) తటస్థ విధానాన్ని అవలంబిస్తాయి. మనం అందరికీ యుద్ధం వద్దనే చెబుతాం. శాంతికాముకులం. అందుకే మనకు అంతర్జాతీయ సమాజంలో ‘పెద్దన్న' అనే పేరుంది. ఇది 'స్ట్రాటజీ' కాదండోయ్! మన పాలసీ!
కానీ, ఎవ్వర్నీ నొప్పించకుండా, తాను నొవ్వకుండా వ్యవహ రించడం అంత వీజీ కాదు. అది కత్తిమీద సామే! ఇద్దరు భార్యలుంటే మరీ కష్టం. 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' క్రింద మంచినే సపోర్ట్ చేద్దామంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నం161 లాగా, మన జీవితాల్లో కుదరదు మాస్టారు! ఒక్కోసారి ఇది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఇతరులు 'హర్ట్' అవడమో, లేదా మనమే 'హర్ట్' అవడమో జరుగవచ్చు. దీనికి 'టాక్ట్' అవసరం.
బయటకు వెళ్తూ, మా ఆవిడను, "వర్షం వస్తుందేమో, గొడుగు తీసుకెళ్ళమంటావా?” అని అడిగాను. "మీరు గొడుగు తీసుకెళితే వర్షం రాదు. ఖచ్చితంగా దాన్ని ఎక్కడో మర్చిపోయి వస్తారు! పోనీ తీసుకోకుండా వెళితే, వర్షం వస్తుంది. చూడండి మరి! తీసు కెళ్తారో, వద్దో!" అన్నదా బద్దెన గారి శిష్యురాలు! ఇంతకూ తీసుకెళ్ళమన్నట్లా, వద్దన్నట్లా? అందుకే, “ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే" అన్నారు పింగళివారు మిస్సమ్మ సినిమాలో.
"నాయనా! ఈరోజు శనివారం. మేమంతా ఉపవాసం. నీవు మామిడిపండు తిని మజ్జిగ తాగుతావా, లేదా కొంచెం ఉప్పుడుపిండి చేయమంటావా?” అనడిగిందట ఒక అత్తగారు అల్లుడిని. "ఉప్పుడుపిండి చేయండత్తయ్యా, అందులోకి వంకాయ కాల్చి బజ్జీ చేయండి. తర్వాత మామిడిపండు తిని మజ్జిగ తాగుతా!"
అదన్నమాట!!
నొప్పింపక తానొవ్వక. పద్యానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తమాషాగా ఉంది. నొప్పింపక తానవ్వక అని మొదలై అలీన దేశాల వరకు వెళ్లడం చాలా బాగుంది
ReplyDelete