“చింటూ! ఎక్కడున్నావు నాన్నా!” అని పిలిస్తే వస్తాడు బుడి బుడి నడకల సంవత్సరంన్నర పిల్లవాడు. వాడి పేరు ‘శిఖివాహన్’ అని పెట్టారు, నామనక్షత్రం ప్రకారం. కానీ ముద్దు పేరు ‘చింటూ!’. ‘చింటూ’కు అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు! మన తెలుగులో ముద్దు పేర్లు చలామణీలో ఉంటాయి, అసలు పేరు మరిచిపోయేటంతగా! కొన్ని వినోదాన్ని కల్గిస్తే, మరికొన్ని విస్మయాన్ని కలిగిస్తాయి. మా ఊర్లో నా చిన్ననాటి మిత్రుడు నజీర్ అహమ్మద్ ఉన్నాడు. తరతరాలుగా వాళ్లకు సోడాల షాపే జీవనం. ఎలా వచ్చిందో తెలియదు గాని, వాడిని మేమంతా ‘పిట్టపిడుగు’ అనేవాళ్లం. ఆ పదానికి వ్యుత్పత్తి మాత్రం నన్ను అడక్కండేం! ముద్దు పేర్లకు మూలాలు వెతుకుతామంటే ఎలా బ్రదర్? ఏమో, ఈ అంశం మీద అల్లాటప్పా విశ్వవిద్యాలయానికి థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ ఎవరైనా పొందినా ఆశ్చర్యం లేదు!
మా నాన్నగారు శతావధాని, పౌరాణిక రత్న, పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రిగారు. కోట్ల విజయ భాస్కరరెడ్డి గారికి ఆయన గురువు. కాని, ఆ పేరు చెబితే మా జిల్లాలో తెలియదు. అందరూ నాన్నను ‘గుండయ్యస్వామి’ అంటారు. అదెలా అంటే.. మా ఊరు వెల్దుర్తి దగ్గర బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఉంది. ధర్మాంగద మహారాజుకు సర్ప రూపం పోయి నిజరూపం వచ్చింది, అక్కడ పుష్కరిణిలో మునిగిన తర్వాతనే అని ఐతిహ్యం. మా నాయనమ్మ, నాన్న చిన్నపుడే చనిపోతే, ఆయన పిన్నమ్మ ఆయన్ను పెంచింది. ఆమె ఆయనను ప్రేమగా ‘ఒరే! గుండయ్యా!’ అని పిలిచేదట. బ్రహ్మగుండేశ్వరుని పేరు. అదే స్థిరపడింది. బంధువులు కూడ ఆయనను వరసను బట్టి “గుండు మామ, గుండు తాత, గుండన్న” అనే పిలిచేవారు. నన్ను ఆయన, “ఒరేయి, పెద్ద వెధవా!” అని పిలిచేవారు. నేను పెద్ద కొడుకును. సరే. అది వేరే!
ముద్దుపేర్లను ఇంగ్లీషులో ‘నిక్ నిమ్స్’ లేదా సింపుల్‌గా ‘నిక్’ అంటారని మీకు తెలుసు. నేను చెప్పే విషయాలన్నీ మీకు తెలిసినవేనని నాకు తెలుసని మీకు తెలుసు మాస్టారు! అయినా, మీరు నా కాలమ్ చదువుతున్నారంటే, నా ‘కాలం’ బాగుందన్నట్లు!
‘నిక్ నేమ్’, 1303లోనే ‘అదనపు పేరు’గా అటెస్ట్ చేశారు సారు. దీనికి ఓల్డ్ ఇంగ్లీషు పదం ‘eac’ మూలం. దీని అర్థం `కూడా’ (also) అని. 15 శతాబ్దానికల్లా అది ‘నిక్ నేమ్’ అయ్యిందంట. మన దేశంలో, బెంగాలీ సమాజంలో, చాలామందికి రెండు పేర్లుంటాయి. ఒకటి ‘దక్ నామ్’, కుటుంబం, స్నేహితుల కోసం. రెండు ‘భలో నామ్’, అంటే వ్యవహార నామం. ఇంగ్లీష్ సమాజంలో, వారి వృత్తి, లేదా ఇంటిపేరును బట్టి, ‘నాచీ’, ‘డస్టీ’, బన్నీ, చాకీ, ప్యాడీ (ఐరిష్), మిక్ (రోమన్) లాంటి పేర్లుంటాయి. అమెరికన్ ప్రెసిడెంట్ (మాజీ) జిమ్మీ కార్టర్ పేరులో జిమ్మీ ముద్దు పేరేనట. కొన్ని అసలు పేర్లను కొంచెం కురచ చేసి ముద్దు పేర్లుగా మారుస్తారు. ఉదా: మార్గరెట్.. గ్రేటా. దీనికి సంస్కృతంలో ఒక సూత్రం ఉంది. ‘నామైక దేశే నామగ్రహణం’ (పేరులోని ఒక భాగాన్ని పేరుగా). కవిసమ్రాట్ విశ్వనాథవారు ఈ విధానాన్ని ఒక నవలలో పరిహసించారు. సత్యభామను శ్రీకృష్ణులవారు ‘ సత్యా’ అనేవారో లేదో గానీ, మన వెండితెర కృష్ణుడు యన్‌టిఆర్ గారు మాత్రం అలాగే పిల్చేవారు. ‘రుక్మిణి’ని ‘రుక్కూ’ అని అనలేదు మరి! ఆమె అలాంటివి ఇష్టపడదేమో!
మా ఇంట్లో నా శ్రీమతి పేరు హిరణ్మయి. మా మామగారికి ఎనిమిదిమంది ఆడపిల్లలు! నిజం సుమండీ! మీరు ఆశ్చర్యం నుంచి తేరుకుంటే విషయానికి వస్తా. అష్టలక్ష్ములను కన్నది మా మేనత్త. అందరికీ అమ్మవారి పేర్లే. మా ఆవిడ నంబర్ 8. కాబట్టి ఆమెను ‘చిన్నీ’ అనేవారు. అది స్థిరపడి, నేను కూడా, ఈ వయసులో.. ఆమెను ‘చిన్నీ’ అని పిలుస్తా, ముద్దుగా! ఆమె పలుకుతుంది! నవ్వుతున్నారా? ‘కాకి భార్య కాకికి ముద్దు’, తెలుసాండీ! ఇక బంధువులు ఆమెను ‘చిన్ని పిన్ని’, ‘చిన్ని బామ్మ’, ‘చిన్నక్క’ అనీ అంటారు. అరవైనాలుగేళ్ల ‘చిన్ని’ భార్య నాది!
నా బాల్యమిత్రుడు ఉమామహేశ్వరశర్మ. మా గురువుగారు తాటిచెర్ల కృష్ణశర్మగారి కొడుకు. వాళ్ళు మాకు బంధువులు. అతన్ని మేమంతా ఇప్పటికీ ‘ఉమ్మచ్చి’ అని పిలుస్తాం. సినిమా నటులకు కూడా ముద్దు పేర్లుంటాయి కదా! అల్లు అర్జున్‌కు ‘బన్నీ’ అని, ప్రభాస్‌కు ‘డార్లింగ్’ అనీ.. కానీ బిరుదులు వేరండోయ్! ‘మెగాస్టార్’ అనేది ముద్దు పేరు కాదు.
నక్సలైట్లకు వేరే పేర్లుంటాయి. దాని ముందు ‘అలియాస్’ అని చేరుస్తారు. రాఘవరావు అలియాస్ రఘన్న.. కవులకు రచయితలకు కలంపేర్లుంటాయి. “మీ కలంపేరు ఏమిటండీ?” అనడిగాడు ఒకాయన నన్ను. “రెనాల్డ్ రేసర్ జెల్ సార్!” అన్నా. ఆయన బిత్తరపోయాడు. ఆరుద్ర, ఆత్రేయ, నగ్నముని, శేషేన్,.. ఈ మహనీయుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. రాజమౌళి గారిని ఆప్యాయంగా ‘జక్కన్న’ అని అంటారని విన్నా. బండారు దత్తాత్రేయ గారిని అందరూ ‘దత్తన్న’ అంటారు. ‘దత్తన్నా!’ అని పిలిస్తే చాలు ‘వత్తన్నా’ అంటూ వస్తాడట ఆయన.
ఇప్పుడంటే భార్యాభర్తలు పేరు పెట్టి పిలుచుకొంటున్నారు కాని, ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువయితే, ‘స్వీటీ’, ‘హనీ’, ‘బేబీ’, ‘డియర్’! పాతకాలంలో పెళ్లాన్ని, ‘ఇదిగో.., ‘ఏమేవ్?’, ‘ఒసేయ్’ అనీ, మొగుణ్ని, ‘కాదు...’, ‘విన్నారా...’ అనీ పిలిచేవాళ్లు. అంతమాత్రాన వీళ్ళు పురుషాధిక్యత గలవారనీ, వాళ్లు భార్యావిధేయులనీ అనుకోకండేం! లాల్ బహదూర్ శాస్త్రి గారిని చిన్నప్పుడు ‘నన్హే’ అని అనేవారట. నరేంద్ర మోడీ గారిని ‘నమో’ అంటారు. శారీరికమైన లోపాలను ‘నిక్ నేమ్స్’గా వాడటం క్షమించరాని తప్పు. ‘మున్నీ’, ‘మున్నా’ అనేవి హిందీలో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఇక చాలంటారా? సరే సరే! అదన్నమాట!
Nick names యొక్క పుట్టుపూర్వోత్తరాలు వదులుకొని నేటి వరకు సాధికారికంగా ప్రస్తావించావు చాలా సంతోషం
ReplyDelete