చరిత్రలో ఎంతో మంది కారణజన్ములుంటారని మీకు తెలుసు. వారంతా ఆయా రంగాలను సుసంపన్నం చేసి, ప్రజల జీవితాలలో వెలుగు నింపి, అమరులవుతారు. జీవించి ఉన్నవారిలో కూడా ఎంతోమంది కారణజన్ములుంటారు. వారందరినీ తల్చుకోవడం నా ఉద్దేశ్యం కాదు. తల్చుకున్నా తల్చుకోకపోయినా, వారి యశస్సుకేమీ లోటు లేదు. కానీ సమాజంలో కొందరుంటారు. కొందరేమిటి, చాలామందే ఉంటారు సుమండీ! వారు నిష్కారణజన్ములు. వారే ఈ వ్యాసానికి ప్రేరణ.
నా ఉద్దేశ్యంలో, నిష్కారణజన్ములు అంటే జీవితంలో ఒక లక్ష్యం (purpose) లేకుండా, బాధ్యత లేకుండా నిష్పూచీగా బ్రతికేసేవారు. వారి వల్ల వారి కుటుంబానికిగాని, ఊరికిగాని ప్రయోజనం ఉండదు. ఇక సమాజం గురించి అడగనేల? లేశమైనా ఉపయోగం లేకపోగా, గుదిబండలవుతారు.
మా బంధువు ఒకామె చాలా మంచిది. కష్టపడి చదువుకుని బ్యాంక్ ఉద్యోగిని అయ్యింది. ఖర్మ కాలి పెళ్లి కూడా అయింది. ‘ఖర్మ కాలి’ అని ఎందుకన్నానంటే, దాపురించిన పతిదేవుడు నిష్కారణజన్ముడు! ఏదో బిజినెస్ చేస్తున్నాడని చెప్పి (అబద్ధమే), పెళ్లి చేశారు. ఆ బంగారుతల్లి జీవితాన్ని నవ్వులపాలు చేశాడా గ్రేట్ హస్బండ్. భర్త అంటే భరించేవాడని ఎవరు చెప్పారో గాని, వారికి ఈయన గురించి తెలియదు! ఆమె పేరు చెప్పి, ఊరంతా అప్పులు! ఈ సోకు చాలదని, ఒక బైకు కూడా! పూవుకు తావి అబ్బినట్లు, తాగుడు కూడా (నీచోపమకు మన్నించండి). గుడ్దిలో మెల్ల. ఏమిటంటే తాగొచ్చి ఆమెను తన్నడు! ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో, ఏదైనా ఫంక్షన్‍కు వచ్చినపుడు, గొడవలు పెట్టుకొని ఆమె పరువు తీసేవాడు. తాగి లివర్ చెడింది. సిగరెట్లు, తాగుడు శిగపట్లు పట్టుకొని, రెండూ గెలిచాయి! అదేమిటి? అనుకుంటున్నారా మాస్టారు? వన్ ఫైన్ మార్నింగ్ ఆ నిష్కారణజన్ముడు మరణించాడు! తర్వాత కొన్ని రోజులకు ఆమెను ఒక ఫంక్షన్‌లో చూశాను. మునుపు ఆమెలో ఉన్న నిస్తేజం పోయి, ముఖంలో కళ వచ్చింది! నవ్వుతూ అందరితో మాట్లాడుతూంది! నిష్కారణజన్ముడు చనిపోయినందు వల్ల, ఆమె బైటికి చెప్పుకోకపోయినా, హ్యపీస్.
సంస్కృతంలో ‘అజాగళస్తనములు’ అని ఒక మాట ఉంది. అంటే మేక మెడలో రెండు వేలాడుతుంటాయి. అవి ఎందుకున్నాయో, ఏం పనికొస్తాయో? నిశ్చయంగా అవి నిరుపయోగాలు! నిష్కారణజన్ములను వీటితో పోల్చవచ్చు. మా ఊర్లో ఒకాయన ఉండేవాడు. చేత్తో ‘ద హిందూ’ పేపరు పట్టుకొని ఊరంతా తిరుగుతూ, మేధావిగా బిల్డప్ ఇచ్చేవాడు. ప్రజ్ఞలు పలకడంలో ఉత్తరకుమారుడు, అబ్బే! వేస్టు! ఇతని ముందు! ఇందిరాగాంధీ కర్నూలుకు వచ్చినపుడు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిందట. జగ్గయ్యగారు తనను మద్రాసుకు రమ్మన్నారట. ఇప్పటికీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారు తనను సంప్రదించకుండా ఏ పనీ చేయడట! ఇలా వీర లెవెల్‍లో ఉండేది బిల్డప్! ఏ టైలర్ షాప్ వద్దో బైఠాయించి, టీ తాగించమనో, టిఫిన్ పెట్టించమనో డిగ్నిఫైడ్‌గా ఆంగ్లభాషలో అడిగేవాడు. కాని ఈ పల్లకి మోత అంతా బైటే! ఇంట్లో ఈగల మోత! ఆయన ఇల్లాలు పొగాకు బేళ్ళు చుట్టే పనికి పోయి ఈయనను పోషించేది పాపం! పిల్లలు ఈయనతో విసిగిపోయి, వారివారి దారి వారు చూసుకొన్నారు. ఆయన చనిపోతే ఎవ్వరూ బాధపడలేదు! నిష్కారణజన్ముడు కదా మరి!
రాజకీయ విదూషకులు కొందర్ని చూస్తూంటాం. పార్టీలో వారికి ఏ పదవీ ఉండదు. అన్నిచోట్లా దర్శనం ఇస్తారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయాలను గురించి అవగాహన లేకుండా మాట్లాడతారు. వేదికల మీద వారిని కాదనలేరు పాపం! ఒక్కోసారి వారి స్టేట్‌మెంట్‌ల వల్ల పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. వీరిని ‘చరిత్రహీనులు’ అనవచ్చు.
ఏ సాహిత్య సభ జరిగినా పిలవకుండానే కొందరు తయారవుతారు. ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, ఆత్మీయ అతిథి సరే ఎలాగూ ఉంటారు. వీరు అనుకోని అతిథులు. ప్రసంగం కూడా చేస్తారు. ఫోటోలలో తప్పనిసరిగా ఉండాల్సిందే! వీరిని ప్రెస్ వాళ్లు కూడా కవర్ చేస్తారు. వీరి పేర్లు కూడా మేధోజనకంగా ఉంటాయి!
పెళ్లిళ్లలో చూడాలి! ఎవరికి బంధువో తెలియని ఒకాయన తెగ హడావిడి చేస్తుంటాడు. అందరిపైనా అజమాయిషీ! ‘మచ్ అడో అబవుట్ నథింగ్’ (ఏవీ లేని దానికోసం ఎంతో ఆరాటం) అని షేక్‌స్పియర్ గారన్నట్లుంటుంది వీరి విన్యాసం. “నీ వెవరయ్యా బాబూ?” అని ఎవరడుగుతారు చెప్పండి. ఒక్కసారి ఎవరిదో నగో, పర్సో కనబడదు. ఈయనా కనపడడు. ఈయన నిష్కారణజన్ముడు కాదంటారా?
పురాణాల్లో రాక్షసులు వరాలు పొంది, భగవంతునితో నిష్కారణ వైరం కొనసాగిస్తుంటారు. విశ్వనాథవారు తమ ‘పురాణవైర గ్రంథమాల’లో ‘భగవంతుని మీద పగ’ అని ఒక గొప్ప నవల వ్రాశారు. ఈ నిష్కారణ వైరం, నిష్కారణ కోపం, కొంతవరకు ఓకే. “నిష్కారణజన్ముల వల్ల సమాజానికేమీ ప్రమాదం లేదు కదా!” అని మీరనవచ్చు. కానీ బాధ్యత లేకుండా బతికెయ్యడం, భార్య ఉసురుపోసుకోవడం, అన్ని చోట్లా దూరి అసౌకర్యాన్ని కలిగించడం, ఇవన్నీ క్షంతవ్యాలు కావు కామ్రేడ్స్! అలాంటి వారు ఉండిననేమి? ఊడిననేమి? పైగా దాన్నొక ప్రివిలేజ్‌గా భావిస్తూ తిరగడం. నాకు నచ్చదు సుమండీ!
“మనుగడందు లక్ష్యమనునది లేకుండ/గమ్యహీనుడగుచు గడపువాడు/ఇంటికి ఊరికి ఇలకైన బరువురా/కారణంబు లేక కలుగు జన్మ!”. ఇదీ వ్యక్తిత్వ వికాస పాఠమే! అదన్నమాట!
నిష్ప్రయోజన మైన జీవితం గడిపేవారు చాలా ఇండ్లలో కనబడతారు. చక్కటి హాస్యం వ్యంగ్యం ఉట్టిపడుతూ సాగిన రచన చాలా బాగుంది
ReplyDelete