Saturday, November 9, 2024

అబ్బే! తీరికెక్కడిది...? - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 10 నవంబర్ 2024

నిన్నగాక మొన్న, డా. అక్కినేని శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఒకాయన ‘దేవదాసు’ గురించి చక్కని పోస్టు పెట్టాడు, ముఖ పుస్తకంలో. దాన్ని చదివింతర్వాత, మళ్లీ ఒకసారి ఆ కళాఖండాన్ని చూడాలనిపించి, మా స్మార్ట్ టివిలో, యూట్యూబ్‌లో ఆ సినిమా వేసుకొని చూస్తూ ఆనందిస్తున్నాను. అక్కినేని గారు చివరిక్షణాల్లో చూపిన నటన, అరిస్టాటిల్ మహాశయుడు చెప్పిన ‘ట్రాజిక్ ప్లెషర్’ను నాకందించింది.
సరిగ్గా అప్పుడొచ్చాడు మా దగ్గరి బంధువొకాయన - “అన్నయ్యా, ఏం చేస్తున్నావు..?” అంటూ. “ఏమిటి, ‘దేవదాసు’ సినిమా చూస్తున్నావా?, ఎంత ఓపిక నీకు?” అని ఆశ్చర్యపోయాడు! “ఏం? నీవు చూడవా? నేను ఎఫ్.బి. రెవ్యూలు చదివి, ఓ.టి.టి లో తమిళ, మళయాల హిందీ సినిమాలు కూడా చూస్తాను. దీనికి ఓపిక కాదు కావలసింది, ఆసక్తి” అన్నా. “సరేగాని బాగా లావెక్కుతున్నావే మధ్య? వాకింగ్‌కు వెళ్లడం లేదేమిరా?” అంటే “అబ్బే! తీరికెక్కడుంది?  ఇబ్రహీంపట్నం దగ్గర మరో వెంచర్ ప్లాన్ చేస్తున్నాం. పొద్దున్నించీ ఒకటే ఫోన్లు. ఇక పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని కదా! ఆ పనులు..”
మావాడు నాలాగే, రిటైరై ఆరేళ్లు దాటాయి. రియల్ ఎస్టేట్, పెన్షనర్స్ సంఘం, ఇలా బిజీ(?) గా ఉంటాడు. ఏమడిగినా, “అబ్బే! తీరికెక్కడిది?” అనేది అతని స్టాక్ డైలాగ్. వాడు వెళ్లిపోయింతర్వాత నాకు, నేను ముఫై సంవత్సరాల క్రిందట ఇంటర్ పిల్లలకు బోధించిన ఒక పద్యం గుర్తొచ్చింది. దాని పేరు ‘లీజర్’. దాన్ని డబ్ల్యు. హెచ్.డేవిస్ అన్న కవి రాశారు. ఆది ఇలా మొదలవుతుంది. “వాట్ ఈజ్ దిస్ లైఫ్ ఇఫ్, ఫుల్ ఆఫ్ కేర్, వుయ్ హావ్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్?”. ఏమిటి జీవితం? ఎప్పుడూ ఆందోళన! నిలబడి చుట్టూ చూడటానికి కూడ టైమ్ లేదే”. ఇంకా ఇలా రాశాడాయన. “ఆవులు, గొర్రెలు కూడ, మేత మేసిన తర్వాత, నింపాదిగా నెమరువేస్తూ నిల్చుంటాయే? పచ్చని చెట్ల మధ్య, గడ్డిలో ఉడతలు కాయలను దాచుకునే అపురూప దృశ్యం చూడటానికి మనకు టైమ్ లేదే? సూర్యకిరణాలు సెలయేటిపై పడి, నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటే, ప్రకృతి అందంగా నృత్యం చేస్తూంటే..” ఇలా సాగుతుందా పద్యం. చివర్లో, కళ్లలో ప్రారంభమైన చిరునవ్వు పెదవులను సుసంపన్నం చేసే లోపు ఉరుకులు పరుగుల ఈ జీవితం ఎందుకు? ఇలాంటి జీవితం ఎంత బీదది?”. ఆయనకు ఉన్నంత సున్నితత్వం, సౌందర్య స్పృహ మనకు లేకపోతే మానె, కనీసం, నిదానంగా, తినే తిండిని కూడా ఆస్వాదించనీయని తీరికే లేని బ్రతుకు బతుకుతున్నాం. పళ్లెం ముందు కూర్చుని, పక్కనే సెల్ ఫోన్ గెలుకుతుంటారు. “కందిపచ్చడి నచ్చిందా నాన్నా?” అని అమ్మ అదిగితే, “కంది పచ్చడా? నేను గమనించలేదు మమ్మీ”. అది జవాబు. కారణం, సెల్ ఫోన్ చూస్తూ తినడమే. సెల్ రహిత (అవినీతి రహిత లాగా) సమాజం కోసం కృషి చేయాలని నా కనిపిస్తూ ఉంటుంది. కాని, కుందేటి కొమ్ము సాధించడం దానికంటే సులభం!
మేం స్కూల్లో చదువుకొనేటప్పుడు, టైమ్‌టేబుల్‌లో ‘లీజర్ పీరియడ్’ అని ఉండేది. గడిలో ‘యల్’ అక్షరం రాసుకొని మురిసిపోయేవాళ్లం. గ్రవుండ్‌కు వెళ్లి కేరింతలు కొడుతూ ఆటలాడుకునేవాళ్లం. నిజంగా బాల్యాన్ని మా తరం అనుభవించినంత గొప్పగా ఈ తరం పిల్లలు ఎంజాయ్ చేయడం లేదనిపిస్తుంది. మొన్న మా మనవడి స్కూల్లో పి.టి.ఎమ్.లో చెప్పారట - “త్వరలో నాలుగో తరగతి పిల్లలకు ఎ.ఐ. (కృత్రిమ మేధ) క్లాసులు ప్రారంభిస్తాం” అని. సహజ మేధకే అవకాశం లేక చస్తూ ఉంటే ఈ కృత్రిమ మేధ ఒకటి! 



తీరుబాటు, తీరిక, ఆటవిడుపు ఇవన్నీ సమానార్థకాలే సుమండీ! ‘తీరి కూర్చుని’ ఏం చేస్తున్నావిక్కడ? ఇలాంటి ప్రశ్నలిప్పుడు వినబడడంలేదు. సెలవులొస్తే పిల్లలకు రకరకాల విద్యలు నేర్పిస్తుంటారు. వారికి వాటిలో అభిరుచి ఉందా లేదా అని చూడరు. లలిక కళలు నేర్పించడం ఒక స్టేటస్ సింబల్ అయి కూర్చుంది. స్టేటస్ కోసం నేర్చుకునే కళ ఎంత అందంగా అఘోరిస్తుందో వేరే చెప్పాలా మాస్టారు!
‘లీజర్‌’ను ‘నాన్ ప్రొడక్టివ్ కన్సంప్షన్ ఆఫ్ టైమ్’ అని నిర్వచించారు ధార్‌స్టీన్ వెబ్లెన్ (1899). అంటే అనుత్పాదకమైన కాలహరణం. లీజర్ ఎందుకు? అంటే దాని కోసమే (for its own sake) అన్నాడాయన. అల్లసాని పెద్దన గారు, కవిత్వం రాయడానికి “నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురపు విడెంబు”, ఇంకా ‘తూగుటుయ్యాల’, ‘ఆత్మ కింపయిన భోజనం’, రసజ్ఞులు, ఇవన్నీ కావాలన్నారు. అంత తీరుబాటు ఆయనకు!
మంచి సంగీతం వినడానికి, మంచి సినిమాలు చూడడానికి, మంచి పుస్తకాలు చదువుకోడానికి, కుటుంబ సభ్యులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడానికి తీరిక లేని బతుకెందుకు చెప్పండి? తీరిక అదంతట అది ఏర్పడదు. మనం కల్పించుకోవాలి. సరైన ప్లానింగ్ ఉంటే తీరుబాటును కూడా మనం మన టైమ్ మేనేజ్‌మెంట్‌లో చేర్చుకోవచ్చు. డాబా మీదికి వెళ్లి సూర్యోదయాన్ని చూద్దాం. వర్షం పడుతుంటే ట్రెయిన్ కిటికీలు మూయకుండా చూసి ఎంజాయ్ చేద్దాం. డిసెంబరులో స్వెట్టరు, మంకీ క్యాప్ వేసుకొని, ఆ చలిలో వాకింగ్‌కు వెళితే, పవన్ కల్యాణ్ గారు చెప్పినట్లు ఆ కిక్కే వేరబ్బా! మధ్యాన్నం వరకూ నిద్రపోతానంటే ఎలా? చల్లని వాతావరణంలో మెయిన్ రోడ్ వరకు వెళ్ళి బండి మీద వేడి పునుగులు తిని రావడానికి మీకేం ప్రాబ్లం? తీరిక లేదా?
ఐ పిటీ యు! అదన్నమాట!

2 comments:

  1. ఇది శ్రీ సి. ఎస్. సుకుమార్ రెడ్డి గారి వ్యాఖ్య: *మీ ఆలోచనామృత సందేశము నిజంగా ప్రశంసనీయము శ్రీమాన్.
    అందులోనూ ప్రారంభమే దేవదాసు నట ప్రభంజనమును మరియు నాగేశ్వరరావుగారి నట వైదుష్యమును ఉటంకిస్తూ రచన సాగడం ఓ విధంగా నాలాంటి వారికి సౌజన్యాత్మకమైన ప్రేరణ
    హృదయపూర్వక అభినందనలు.*

    ReplyDelete
  2. తీరుబాటు లేకుండా ఏదో హడావుడిగా తిరిగే మనుషుల గురించి డేవిస్ గారి పద్యం లేజర్ తో పోల్చడం చాలా బాగుంది

    ReplyDelete